మెయన్ ఫీచర్

‘ఫలితాల’కు ముందు.. రాఫెల్ ప్రకంపనలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందే రాఫెల్ ఒప్పందం ప్రకంపనలు సృష్టించనుందా? ఈ విషయమై దాఖలైన రివ్యూ పిటిషన్లతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టు దిక్కారణ పిటిషన్‌ను కూడా ఒకే రోజు విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటిస్తూ తదుపరి విచారణను మే 10వ తేదీకి వాయిదా వేసింది. అంటే ఈ రెండు అంశాలపై మే 14లోగా విచారణ జరిగే అవకాశం ఉంది. రాఫెల్ ఒ ప్పందం, రాహుల్ వ్యాఖ్యలకు సుప్రీం లంగరు వేయడం వెనుక కారణాలు లేకపోలేదు. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి సుప్రీం ఇచ్చిన తీర్పును రాహుల్ వక్రీకరించారని బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం తీర్పును తాను వక్రీకరించలేదని రాహుల్ న్యాయస్థానానికి తన విచారణ వ్యక్తం చేశారు. విచారణ సరిపోదని, అసత్యం చెప్పానని పేర్కొంటూ లిఖిత పూర్వకంగా పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే రాఫెల్ ఒప్పందానికి సంబంధించి పిటిషన్‌ను కూడా విచారణకు రావడంతో రెండు అంశాలు ఒకే మారు చూస్తామని న్యాయస్థానం పేర్కొంది.
గత ఏడాది డిసెంబర్ 14న రాఫెల్ ఒప్పందంపై సుప్రీం తీర్పు చెప్పింది. తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారిస్తామని ఏప్రిల్‌లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం స్పష్టం చేసింది. రాఫెల్ ఒప్పందంపై కేంద్రం అనేక తప్పులతో కోర్టుకు నివేదిక ఇచ్చిందని, వాటి ఆధారంగా ఇచ్చిన తీర్పును న్యాయస్థానం సమీక్షించాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను గొగొయ్ విచారించారు. ఈ వ్యవహారంపై ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌరి సహా పలువురు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. రాఫెల్ ఒప్పందం ప్రక్రియను సందేహించడానికి ఎలాంటి ప్రాతిపదిక కనిపించడం లేదని గత తీర్పులో సుప్రీం పేర్కొంది. ఆ యుద్ధ విమానాల ఆవశ్యకత, నాణ్యతపై ఎలాంటి అనుమానాలు లేవని, ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. రాఫెల్ ఒప్పందంపై దాఖలైన అన్ని పిటిషన్లను ఆనాడు కోర్టు కొట్టి వేసింది. అయితే, తీర్పును మరోసారి సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్లు దాఖలు కావడంతో సర్వోన్నత న్యాయస్థానం సమీక్షకు సానుకూలంగా స్పందించింది.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించడంపై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ప్రాథమిక అభ్యంతరాలను సుప్రీం తోసిపుచ్చింది. కేసులో కొత్త సాక్ష్యాధారాలను కోర్టు అనుమతించింది. అపహరించిన పత్రాలను పరిగణనలోకి తీసుకోవద్దన్న ప్రభుత్వ అభ్యంతరాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగొయ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కే ఎం జోసఫ్‌లతో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ‘కాగ్’ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేయకపోయినా లోతైన అంశాలను అధ్యయనం చేసినపుడు కొన్ని లోపాలను గుర్తించింది. 2007లో యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో పోలిస్తే- ఎన్‌డీఏ సర్కారు వచ్చాక 2016లో కుదుర్చుకున్న ఒప్పందం ధర 2.86 శాతం తక్కువని ‘కాగ్’ పేర్కొంది. ఈ ఒక్క అంశం మినహాయిస్తే, కొన్ని లోపాలున్నాయని ‘కాగ్’ ఎత్తిచూపింది. ఇంతటి భారీస్థాయి ఒప్పందంలో సార్వభౌమ పూచీకత్తును తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. ఆయుధాల సముపార్జనలో అవలంబిస్తున్న విధానాలు సరిగా లేవని గుర్తించింది. 157 పేజీల కాగ్ నివేదికలో అప్‌సెట్ భాగస్వామ్యం విషయాన్ని మాత్రం కాగ్ ప్రస్తావించకపోవడం విడ్డూరం.
తాజా విచారణతో సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన క్లీన్‌చిట్‌ను చించేసినట్టే. అయితే మరోమారు క్లీన్‌చిట్ ఇచ్చి పిటిషన్లను కోర్టు కొట్టి వేస్తుందా? లేక రాఫెల్‌పై విచారణకు ఆదేశిస్తుందా? అనేది ఎదురుచూడాలి. ఈ ఒ ప్పంద పత్రాలు అత్యంత రహస్యమైనవి, వాటిని బహిర్గతం చేయకూడదంటూ అధికార రహస్యాల చట్టం, సాక్ష్యాధారాల చట్టం, సమాచార హక్కు చట్టం వంటి వాటి కింద కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి ప్రత్యేక పత్రాలు రక్షణ మంత్రిత్వశాఖ నుండి చోరీకి గురయ్యాయని కూడా ఏజీ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. వాస్తవానికి ఈ పత్రాల్లో ఉన్న అంశాలు ఏమిటో ఒక దినపత్రిక ఎత్తి చూపిన తర్వాత- చోరీ అంశాన్ని కేంద్రం తెరమీదకు తెచ్చింది. అంతేకాదు, చోరీకి గురైన పత్రాల్లోని అంశాలను పరిగణించరాదని కోరింది. ఇంకో అడుగు ముందుకు వేసి చోరీకి సంబంధించి, పత్రాల్లో అంశాలకు సంబంధించి బహిరంగ చర్చ జరిగినా, న్యాయస్థానాల్లో విచారణ జరిగినా మిగిలిన దేశాలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ముందుకు రావని, ఇది దేశానికి నష్టమని కూడా ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు.
పత్రాలు చోరీకి గురికావడం కంటే అందులో ఉన్న అంశాలు బయటకు వచ్చాయనే ఆందోళనే కేంద్రానికి ఎక్కువగా ఉంది. పత్రికాస్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛకు పెద్దపీట వేసిన కేంద్రం గత తీర్పులను ఉటంకిస్తూ విచారణకు ముందడుగు వేసింది. పత్రాలను ఎవరో ఎత్తుకుపోయారని తొలుత చెప్పిన ఏజీ తర్వాత వాటిని జిరాక్స్ తీశారని, పత్రాలు అన్నీ భద్రంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. రక్షణ కొనుగోళ్ల వ్యవహారం న్యాయసమీక్షకు అతీతమైనదని పేర్కొనడమేగాక, ఒక దశలో ఫిర్యాదుదారులపైనా, వాటిని బహిర్గతం చేసిన వారిపైనా కేసులు పెడతామని హెచ్చరించడం ద్వారా న్యాయమూర్తులపైనా ఒత్తిడి పెంచారు. పత్రికల్లో వచ్చిన వార్తలను కోర్టులు పరిగణనలోకి తీసుకోరాదని కూడా వాదించారు.
రాఫెల్ ఒప్పందానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా రంగంలోకి దిగి ఫ్రాన్స్ ప్రభుత్వంతో చ ర్చలు జరపడం తద్వారా అనిల్ అంబానీ కంపెనీకి అనుచిత లబ్ది చేకూర్చడంలోనే వ్యవహారం అంతా ఇమిడి ఉంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా అన్ని రహస్యాలను పత్రికలు ఛేదించవచ్చునని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య భవిష్యత్ దిశను నిర్దేశించబోతోంది. రాజ్యాంగంలోని 19(2) అధికరణం కింద ఇలాంటి పత్రాలను ప్రచురించకుండా నిలువరించే అధికారం ప్రభుత్వానికి కట్టబెడుతూ పార్లమెంటు చట్టం చేసినట్టు తమ దృష్టికి రాలేదని సుప్రీం కోర్టు పేర్కొంది. గతంలో కూడా అనేక మార్లు కోర్టు పత్రికా కథనాలకు స్పందించిన సందర్భాలు లేకపోలేదు. కొన్ని మార్లు వాటిని ప్రజాప్రయోజన వ్యాజ్యాలుగా స్వీకరించిన సందర్భమూ లేకపోలేదు.
రాఫెల్ వ్యవహారం ఈనాటిది కాదు, అయితే 2015 ఏప్రిల్‌లో ఫ్రాన్స్ విమాన తయారీ సంస్థ డసో ఏవియేషన్ తయారు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్లను భారత్ కొనుగోలు చేస్తుందని ప్రకటించడంతో ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. భారత వైమానిక దళం అదనపు యుద్ధ విమానాలు కావాలని 2001లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి 2004 నుండే వ్యవహారాలు మొదలయ్యాయి. 126 యుద్ధ విమానాల సరఫరాకు అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచింది. లాక్‌హీడ్ మార్టిన్ ఎఫ్-16, యురోఫైటర్ టైఫూన్లు, రష్యా ఎంఐజీ 35, బోయింగ్ -ఎఫ్‌ఎ -18, స్వీడన్‌కు చెందిన సాబ్స్ గ్రిషబ్, డసాల్ట్ ఏవియేషన్ నుండి రాఫేల్ జెట్ ఫైటర్ బిడ్లను దాఖలు చేశాయి. 2012లో అప్పటి ప్రభుత్వం అమెరికా, రష్యా, యూరప్‌ల నుండి వచ్చిన ప్రతిపాదనల్లో రాఫెల్ జెట్ విమానాలనే ఎంచుకుంది. అప్పటి ప్రతిపాదన ప్రకారం 18 యుద్ధవిమానాలను ఫ్రాన్స్‌లో తయారుచేసి అందించాలి, మిగిలిన 108 యుద్ధవిమానాలను భారత్‌లో ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్ భాగస్వామ్యంతో తయారుచేయాలి. కానీ అది ముందుకు సాగలేదు.
కేంద్రంలో ప్రభుత్వాలు మారాయి. 2015 ఏప్రిల్‌లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినపుడు రాఫెల్ విమానాల కొనుగోలుపై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 2018 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హూలండ్ భారత ప్రభుత్వమే రాఫెల్ డీల్ కోసం రిలయన్స్ డిఫెన్స్ పేరును సూచించిందని, ఆ విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని వ్యాఖ్యానించి కలకలం సృష్టించారు. 2015లో ఒప్పందంపై సంతకాలు జరిగాక, దీనిపై ఎన్నో మార్లు చర్చలు జరిపిన మోదీ ప్రభుత్వం ఇందులో పారదర్శకత ఉందని సమర్ధించుకుంది. దీన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగించుకోవాలన్న విపక్షాల ఎత్తుగడకు సుప్రీం కోర్టు క్లీన్‌చిట్ రూపంలో ఫుల్‌స్టాప్ పెట్టింది. ఐదు దశల ఎన్నికలు ముగిశాక- గత తీర్పును సమీక్షించాలన్న పిటిషన్లపై విచారణకు సిద్ధమైంది. ఎవరు ఎంత బుకాయించినా, రాఫెల్ విమానాల కొనుగోలులో గోల్‌మాల్ జరిగిందనేది బలంగా వినిపిస్తున్న ఆరోపణ. అది ఎంత వరకూ నిజమనేది న్యాయస్థానమే తేల్చాలి. జాతీయ భద్రతపై మోదీ ప్రభుత్వం రాజీ పడిందా? లేదా? అన్నది అపుడే తేలుతుంది. దేశ రక్షణకు సంబంధించిన ఆయుధ సంపత్తి కోనుగోలులో దేశం యావత్తును తప్పుదారి పట్టించిందా? లేదా? అన్నది కూడా స్పష్టం అవుతుంది. ఆశ్రీత పెట్టుబడిదారులకు అనుచిత లబ్ది చేకూర్చారా? లేదా? అన్నది తేలిపోతుంది.

-బీవీ ప్రసాద్ 98499 98090