మెయన్ ఫీచర్

మావోలపై ‘వ్యూహం లేని’ పోరు ఎన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ కార్మిక దినోత్సవం రక్తసిక్తమైంది. శ్రామికవర్గం ప్రతినిధులమని చెప్పుకునే మావోయిస్టులు గడ్చిరోలి (మహారాష్ట్ర) జిల్లాలో మందుపాతర పేల్చి, 16 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను హతమార్చారు. ఈ జవాన్లు దేశభద్రత కోసం పోరాడుతున్న శ్రామికులు. ఈ సంఘటనను చూస్తే- పోలీసులు, పారా మిలటరీ విభాగం వారు గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోలేదనిపిస్తోంది. ఆంధ్ర, తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు, సివిల్ పోలీసులు 20 ఏళ్ల పాటు పోరాడి మావోలకు స్థానం లేకుండా చేశారు. గడ్చిరోలి ఘటనతో మన భద్రతా వ్యవస్థలో లొసుగులు బహిర్గతమయ్యాయి. గత నెలలో భాజపా ఎమ్మెల్యే సహా నలుగురు కార్యకర్తలు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్యకు బలయ్యారు.
ఎన్నికల వేళ గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లో 30 కంపెనీల సెంట్రల్ రిజర్వు పోలీసులను, 13 కంపెనీల రాష్ట్ర రిజర్వు పోలీసులను, 5,500 మంది పోలీసులను భద్రత నిమిత్తం నియమించారు. మే 1వ తేదీకి ముందు రోజు గడ్చిరోలి జిల్లా దాదాపూర్ వద్ద మావోలు 25 వాహనాలను కాల్చివేశారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటన ప్రాంతానికి వెళుతుండగా- మావోలు అమర్చిన మందుపాతరకు నేలకొరిగారు.
తమ స్థావరాల వైపు లేదా తామనుకున్న ప్రాంతానికి పోలీసులు వచ్చేలా మావోలు ముందుగానే విధ్వంసానికి దిగుతారు. దీంతో పోలీసు బలగాలు ముందూ వెనకా చూసుకోకుండా సంఘటన ప్రాంతానికి చేరుకుంటాయి. అదే అదనుగా భావించి మావోలు దాడి చేస్తారు. గతంలో ఇదే వ్యూహంతో పలుసార్లు వారు నరమేధానికి పాల్పడ్డారు. గడ్చిరోలి జిల్లాలోనూ మావోలు ఇదే ఎత్తుగడ వేసి అనుకున్నది సాధించారు. ఎన్నికల ప్రక్రియను మావోలు భగ్నం చేస్తారనే విషయం పోలీసులకు తెలుసు. అయినా విధ్వంసం జరిగిన చోటకు భద్రతా బలగాలు ఏ మాత్రం ఆలోచించకుండా చేరుకోవడం తప్పిదమే.
దేశంలో నక్సలైట్ల హింస ప్రారంభమై 51 ఏళ్లు గడిచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995- 2010 మధ్య వారి కార్యకలాపాలు తారస్థాయికి చేరుకోగా, ప్రభుత్వం గ్రేహౌండ్స్‌ను ఏర్పాటు చేసి వారిని నిర్మూలించింది. ఈ సందర్భంగా విశేష అధికారాలను పోలీసులు తీసుకుంటూ ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డారనే అభియోగాలున్నాయి. ఇరువర్గాల పోరులో వందలాది మంది పౌరులు, నక్సలైట్లు, పోలీసులు మరణించారు. గ్రేహౌండ్స్ బలగాలకు స్థానిక పోలీసుల తోడ్పాటు, పటిష్టమైన నిఘా వర్గం, ఆదివాసీలకు ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, రాష్ట్రాల మధ్య సమన్వయం కారణంగా ఆంధ్ర, తెలంగాణల్లో నక్సల్స్ తుడిచిపెట్టుకుపోయారు. 2005లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరడం సాహసోపేతమైన చర్య నిలిచింది. ఆ చర్చల వల్ల పుట్టుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలే ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్ వంటి పథకాలు.
దండకారణ్యంలో రెడ్ టెర్రర్‌కు ముగింపు పలకాలంటే ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ పద్ధతి పనికిరాదు. కొంతమంది ‘విశ్రాంత’ మేధావులు, టీవీ చర్చల్లో పాల్గొనే వారు మావోలపైనా సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేయకూడదనే ప్రశ్నను లేవనెత్తారు. ఇదే జరిగితే రేపు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నేతల ఇళ్లపైనా వైమానిక దాడులు జరగవా? మావోల స్థావరాలను గుర్తించేందుకు గగనతల విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకోవచ్చు. మావోలను నిర్మూలించేందుకు పోలీసు బలగాలకు ఆధునిక యుద్ధతంత్రంలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడి మావోయిస్టులు శత్రు దేశస్థులు కారు. కాలదోషం పట్టిన సైద్ధాంతిక వాదంతో పెడత్రోవ పట్టిన వారు మాత్రమే. జనజీవన స్రవంతిలోకి వారిని తీసుకురావడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి.
సీఆర్‌పీఎఫ్ జవాన్లు, పోలీసులు తమ కమాండర్ ఆదేశాల మేరకు నడుచుకుంటారు. ఆ కమాండర్లు స్థానికులు లేదా స్థానికేతరులు కావచ్చు. వారికి స్థానిక పోలీసుల నుంచి సమాచారం ఉండాలి. గడ్చిరోలిలో తాజా ఘటనను విశే్లషిస్తే మందుపాతరకు బలైన పోలీసులు అంతవేగంగా ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏరియల్ సర్వే చేశారా? వాహనాలను కాల్చివేసిన ఘటనపై ఉన్నత స్థాయిలో పోలీసుల సమీక్ష జరిగిందా? మహారాష్ట్ర రాజధాని ముంబయికి 950 కి.మీ దూరంలో ఉన్న మారుమూల దండకారణ్యంలో మావోల హింస, పోలీసుల గాలింపు చర్యల గురించి అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా పట్టించుకుంటుందా? పోలీసు ఉన్నతాధికారుల్లో ఇటీవల నిర్లిప్తత బాగా పెరిగింది. కిందిస్థాయిలో పోలీసులు అమరులైతే ప్రధాని నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రకటనలు చేస్తారు. వీటి వల్ల ప్రయోజనం ఉందా ?
మావోలపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు స్పష్టమైన అజెండా లేదు. దండకారణ్యం కేంద్రంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్న మావోయిస్టులు ఆయుధాలు పట్టుకుని ఎందుకు అడవుల్లో తిరుగుతున్నారు. వీరిని నిర్మూలించేందుకు ప్రభుత్వాల వద్ద సరైన వ్యూహం లేదనిపిస్తుంది. బతుకు తెరువుకోసం మిలటరీ బలగాల్లో, పోలీసు శాఖలో చేరే యువకులు మావోల హింసకు బలవుతున్నారు. మరణానికి సిద్ధపడే వారే పోలీసు శాఖలో చేరుతారనే విషయం స్పష్టం. కాని ఈ మరణాలను అరికట్టే అవకాశం కూడా ఉంది. ఆంధ్రా, తెలంగాణల్లో ఇపుడు మావోల ఉనికి నామమాత్రమే.
1999 నుంచి 2019 వరకు రెడ్ టెర్రర్ హింసాకాండలో 14 వేల మందికిపైగా పోలీసులు, పౌరులు, నక్సలైట్లు మరణించారు. ‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం’ అనే మావోల నినాదానికి కాలం చెల్లింది. 1960-1990 ప్రాంతాల్లో విద్యావంతులు మావోయిజం వైపు మొగ్గు చూపారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఒక ఘటనలో 74 మంది పోలీసులు మరణించారు. ఆ తర్వాత ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో వామపక్ష తీవ్రవాదం ప్రభావం ఉన్న జిల్లాలు 60 వరకు ఉన్నాయి. ఈ జిల్లాల్లో సంక్షేమ కార్యక్రమాలకు కోట్లాది రూపాయల నిధులను ఖర్చుపెట్టినట్లు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చెబుతుంటాయి. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా, ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం వెళ్లేందుకు ఇంద్రావతిపైన, మహారాష్టల్రో శిరోంచ వద్ద ప్రాణహితపైన వంతెనలు నిర్మించలేదు. జగదల్పూర్ పట్టణాన్ని హైదరాబాద్, విశాఖ, భువనేశ్వర్, ముంబయిలతో అనుసంధానం చేసేందుకు తగిన రోడ్లు లేవు. ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ప్రయాణాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల నదులను దాటుతుంటారు.
మావోయిస్టులను అంతం చేయాలంటే సామాజిక మూలాల్లోకి వెళ్లాలి. గిరిజనులకు సంక్షేమ ఫలాలు దక్కాలి. వారికి అభివృద్ధిని చూపెట్టాలి. విద్య, వైద్యం, రవాణా తదితర వౌలిక సౌకర్యాలు కల్పించాలి. టీవీ చర్చల్లో ఆవేశంగా మాట్లాడుతూ- సర్జికల్ దాడులతో మావోలను అంతం చేయాలనే వారికి దండకారణ్యంలో పరిస్థితులేమిటో తెలుసా? 2022 నాటికి మావోలను నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన దుందుడుకు ప్రకటనల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వమైనా మావోలపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. రాష్ట్రాలు సొంతంగా మావోలతో పోరాడలేవు. వారితో చర్చలు జరిపేందుకు జాతీయ స్థాయిలో ఒక వేదికను ఏర్పాటు చేయాలి. అటు మావోలు, ఇటు ప్రభుత్వం దాడులను నిలిపివేయాలి. దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకుని మావోలను జనజీవన స్రవంతిలోకి తెచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. అప్పుడే- అడవుల్లో శాంతిసుమాలు వికసిస్తాయి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097