మెయిన్ ఫీచర్

అమ్మ ప్రేమ అమృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వందమంది ఆచార్యులు ఒక తండ్రితో సమానం.. వెయ్యిమంది తండ్రులు ఒక తల్లితో సమానం..’ అని చెబుతారు. ఈవిధంగా అమ్మ బిడ్డకు తొలి గురువైంది. ఆమె అందించే నిస్వార్థ ప్రేమే ఓ మనిషిని సమాజంలో ఆదర్శప్రాయునిగా నిలబెడుతుంది. చరిత్రలో మహాత్ములుగా, మహనీయులుగా పేరుతెచ్చుకున్నవారంతా తల్లి ఒడిలో
తొలిపాఠాలు నేర్చుకున్నవారే..

ప్రేమకు ప్రతిరూపం..
మమతకు ఆకారం..
త్యాగానికి నిదర్శనం..
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉపమానాలు..
‘అమ్మ’ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం.. ఇంకా ఎనె్నన్నో.. ఉంటాయి. గర్భం ధరించి నవమాసాలు మోసి, ఎన్నో నొప్పులను పంటి బిగువున భరించి, తన రక్త మాంసాలు పంచి, ప్రాణాలను పణంగా పెట్టి మనకు జన్మనిస్తుంది అమ్మ. ‘అమృతం’ ఎలా ఉంటుందో తెలియదు కానీ.. అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపేనేమో.. ‘అమ్మ’ అనే తియ్యనైన పదానికి అర్థాలు, నిర్వచనాలు చెప్పాలనుకోవడం అర్థరహితమే అవుతుంది. ఎందుకంటే ఆమె ప్రేమ ప్రపంచానే్న మురిపింపజేస్తుంది. ఆ పదానికే అంత మహత్యం ఉంది. పిండం కడుపులో పడడంతోనే తల్లిలో మాతృత్వం పొంగుకొస్తుంది. ఇక బిడ్డ భూమీద పడిన దగ్గరనుంచి కుడి చేయి, ఎడమ చేయి అనే బేధం లేకుండా పిల్లల సేవలో నిమగ్నమై ఉంటుంది అమ్మ. ఆ ప్రేమను చాకిరీ అనుకుంటే పొరబాటే.. ఆ సేవే తల్లికి సంతృప్తినిచ్చేది. కలత నిద్రలో కూడా కనిపెట్టుకుని ఉండేదే అమ్మ. పిల్లలకు బుడిబుడి అడుగులు వేయించడంతోనే తన బాధ్యత తీరిపోతుందని అనుకోదు. పాఠాలు చెప్పకముందే వారి భావిజీవితానికి బంగారుబాట వేస్తుంది. బిడ్డలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దేందుకు తనను తాను పవిత్రంగా మలచుకుంటుంది. అందుకే భారతీయ సంస్కృతి తల్లికి అగ్రస్థానాన్ని ఇచ్చింది. యుగాలతో సంబంధం లేకుండా స్వచ్ఛమైన ప్రేమను అందించడం ఆమెకు మాత్రమే సాధ్యం. అందుకే ఆరుసార్లు భూమి ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో.. పదివేలసార్లు కాశీకి వెళితే ఎంత ఫలమో.. వందసార్లు రామేశ్వరంలో స్నానిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో.. ఆ ఫలమంతా కలిసి ఒక్కసారి తల్లికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తే కలుగుతుందట.. తల్లి ఒడినే బడిగా, గుడిగా చేసుకుని తొలి పాఠాలు నేర్చుకుంటారు పిల్లలు. అందుకే పెద్దలు ‘వందమంది ఆచార్యులు ఒక తండ్రితో సమానం.. వెయ్యిమంది తండ్రులు ఒక తల్లితో సమానం..’ అని చెబుతారు. ఈవిధంగా అమ్మ బిడ్డకు తొలి గురువైంది. ఆమె అందించే నిస్వార్థ ప్రేమే ఓ మనిషిని సమాజంలో ఆదర్శప్రాయునిగా నిలబెడుతుంది. చరిత్రలో మహాత్ములుగా, మహనీయులుగా పేరుతెచ్చుకున్నవారంతా తల్లి ఒడిలో తొలిపాఠాలు నేర్చుకున్నవారే..
బ్రహ్మ సృష్టించిన అత్యద్భుతమైన వాటిలో ‘అమ్మ’ను మించిన అపురూపం మరొకటి లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు. అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? అందుకే పెద్దలు ‘మాతృదేవోభవ’ అంటూ అమ్మకు అగ్రతాంబూలం ఇచ్చారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారచ్చు.. కానీ అమ్మ ప్రేమ మాత్రం మారదు. అందులో ఏమాత్రం కల్మషం ఉండదు. అందుకే ఏ కొద్ది బాధ కలిగినా, దెబ్బ తగిలినా అమ్మనే తలుచుకుంటాం. బిడ్డకు చిన్న బాధ కలిగిందన్న విషయం అందరికంటే ముందు అమ్మకే తెలుస్తుంది. బాధే కాదు బిడ్డకు ఆకలి అవుతుందన్న విషయం కూడా అమ్మే ముందుగా పసిగడుతుంది. తనకు ఎంత ఆకలిగా ఉన్నా సరే ముందు బిడ్డ ఆకలి తీరాలి అనుకుంటుంది. బిడ్డ ఆకలి తీరిన తరువాత తల్లికి తన ఆకలి మొదలవుతుంది. తన బిడ్డ ఏదైనా తప్పు చేసినప్పుడు తండ్రి దండిస్తున్నా.. బిడ్డవైపే నిలబడుతుంది తల్లి. అలాగే బిడ్డ విజయం సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలవుతుంది.. ఆమె ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా బిడ్డలకు దగ్గరగా ఉంటుంది. బిడ్డకు ఆరోగ్యం బాలేదంటే చాలు, విలవిల్లాడిపోతుంది ఆ తల్లిప్రాణం. నిమిషానికోసారి బుగ్గలపై, పొట్టపై చెయ్యిపెట్టి చూస్తూనే ఉంటుంది. ఆ మాత్రం జ్వరానికే వేయిమంది దేవుళ్ళకు మొక్కేసుకుంటుంది. అలాగే నిద్రపుచ్చేముందు అమ్మ పాడే జోలపాట, జోకొట్టడాన్ని మించిన సంగీతం మరొకటి ఉంటుందా? అందుకే ఆమె బిడ్డల పాలిట సంగీత కళానిధి. నాన్నకు, బిడ్డకు మధ్య అమ్మ రాయబారి. పిల్లలకు ఏది కావాలన్నా ముందుగా అమ్మ దగ్గరికే పరుగులు పెడతారు పిల్లలు. పిల్లలు ఇష్టమైన సినిమాకు వెళ్లాలన్నా, ఇష్టమైనవి కొనుక్కోవాలన్నా పోపులపెట్టె నుంచి డబ్బులను తీసి బిడ్డకు ఇచ్చేది అమ్మే.. కబుర్లు పంచుకోవాలన్నా, బాధలు పంచుకోవాలన్నా, సలహాలివ్వాలన్నా.. అమ్మకు మించిన స్నేహితురాలు ఇంకొకరు దొరుకుతారా? బిడ్డ ఎలా ఉన్నా అమ్మ కంటికి మాత్రం ప్రపంచ అందగాడే.. ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అమ్మే బిడ్డకు కంచు కవచం. అందుకే అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి.. ఓ అనుబంధం.. ఓ ఆప్యాయత.. ఓ ఆత్మీయత.. ధనం లేని వాడు బీదవాడు కాదు.. అమ్మ ప్రేమ లేని వాడు బీదవాడు. అమ్మ ప్రేమను పొందినవాడు అత్యంత కోటీశ్వరుడు. అందుకే అమ్మను ఎప్పుడూ బాధపెట్టకూడదు. మనం గర్భస్థశిశువుగా ఉన్నప్పటినుంచీ బిడ్డ అమ్మ ఆలోచనలను, భావాలను, భాషను ఆకళింపు చేసుకుని అమ్మ కడుపులోనే అక్షరాభ్యాసం చేస్తాడు. పిదప అమ్మ ఒడిని చేరి అజ్ఞాన తిమిరం నుంచి జాగృతిని పొంది జ్ఞానకిరణాలను మనసున ఉదయింపజేసుకుంటాడు బిడ్డ. అటువంటి తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. అందుకే మాతృమూర్తిని నిత్యం స్మరించుకోవాలి. మాతృత్వాన్ని సదా గౌరవించాలి. కన్నపేగుకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది. ఇలా తమ కోసం సర్వస్వం ధారపోసి పెంచి పెద్దచేసిన తల్లులను వారి జీవిత చరమాంకంలో కళ్లల్లో పెట్టుకుని కాపాడడం ప్రతి ఒక్కరి ధర్మం.

మాతృదినోత్సవం ఇలా..

ఏటా మే రెండో ఆదివారం నిర్వహిస్తున్న ప్రపంచ మాతృదినోత్సవానికి సుదీర్ఘ చరిత్ర, నేపథ్యం ఉంది. గ్రీస్‌లో ‘రియా’ అనే దేవతను ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. ‘జులియవర్డ్ హోవే’ అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్ అనే మహిళ ‘మదర్స్ ఫ్రెండ్‌షిప్ డే’ జరిపించేందుకు ఎంతో కృషిచేసింది. ఆమె 1905 మే 9న మృతి చెందగా, ఆమె కుమార్తె మిస్ జెర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరపడం మొదలైంది. ఫలితంగా 1914 నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించాడు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటినుంచి ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు అని అంటారు. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే.. కన్నపేగుకు ఏ కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది తల్లి హృదయం. ఇలా బిడ్డల కోసం సర్వస్వం ధారపోసి, పెంచి పెద్ద చేసిన తల్లులను వారి జీవిత చరమాంకంలో కళ్లలో పెట్టుకుని కాపాడటం ప్రతి ఒక్కరి ధర్మం, బాధ్యత కూడా..

విలువను తగ్గించొద్దు..
ప్రపంచ దేశాల్లో పితృపాలన కొనసాగినా.. వేలాది సంవత్సరాల నుంచి భారతదేశం మాతృదేశమే.. అఖండ భారతదేశంగా ఒకప్పుడు పేరొందిన భారత్‌ను కూడా స్ర్తిగా, మాతృమూర్తిగా చూసిన సంస్కృతి మనది. కానీ మధ్యలో పరిస్థితి మారింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా విదేశాలను చూసి పితృపాలనను అరువు తెచ్చుకున్నాం. ఫలితంగా ‘అమ్మ’ విలువ తగ్గింది. నేటికీ అదే పరిస్థితి.. విలువంటే డబ్బులతో మాత్రమే కొలిచేది కాదు.. కానీ నేటి సమాజంలో ఏ శ్రమనైనా, ప్రేమనైనా డబ్బులతో కొలవడం అలవాటు అయిపోయింది కదా.. మాటలురాని పసివాడికి కూడా కరెన్సీ విలువ తెలిసిన కాలం ఇది.. ఇక పెద్దల గురించి చెప్పేదేముంది? అందుకని ఒక్కసారి అమ్మ శ్రమను, ప్రేమను సరదాగా లెక్కకడదాం..
ఆమెది ఇరవై నాలుగు గంటల ఉద్యోగం.. అందులో వారాంతాలు ఉండవు.. పండుగలు లేవు.. ప్రమోషన్లు అందవు.. ఇంక్రిమెంట్ల గురించి ఆలోచనే లేదు.. రిటైర్మెంట్ ఊసే లేదు.. ఆమె శ్రమను కొలిచినా, ఆ స్వేద బిందువులను లెక్కగట్టినా.. చెల్లించలేనంత రుణం ఆమెది. అమ్మ బట్టలుతికినా, ఇల్లు దులిపినా, ముగ్గు వేసినా, వడియాలు పెట్టినా, వంట చేసినా, షాపింగ్ చేసినా, పిల్లలకు స్నానం చేయించినా, భర్త అడిగింది అడిగినట్లుగా ఇచ్చినా, అత్తమామలకు సేవలు చేసినా.. ఏ పని చేసినా అది పరిపూర్ణమే.. అందులో ఏమాత్రం కొదువ కనిపించదు. వంట చేస్తే అమ్మే చేయాలి. ఆమె పెట్టే గోరు ముద్దలు, గుజ్జు ముద్దల్లో ఎంతటి రుచి దాగి ఉంటుందో.. ఆ చేతులతో కలిపే చద్దన్నం కూడా అమృతమైపోతుంది. షెఫ్‌లకూ, చీఫ్ షెఫ్‌లకూ అమ్మ దగ్గరే శిక్షణ ఇప్పించాలి. అమ్మ చదువు చెబితే.. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా పనికిరారు. కారణంలో అందులో అమ్మ లాలన, ప్రేమా ఉంటుంది. అమ్మ ఇల్లు సర్దితే.. ఇంటీరియర్ డిజైనర్లు కూడా దిగదుడుపే.. ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో అమ్మకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో.. శుభ్రతలో ఆమెను మించిన వారు ఎవరూ ఉండరు. కష్టం వచ్చి ఏడుస్తూ ఉంటే ఆమె అందించే ఓదార్పు, తీయనైన మాటలు.. మానసిక నిపుణులకు కూడా తెలియదేమో.. పరాజయం, కష్టం ఎదురైనప్పుడు వ్యక్తిత్వ వికాస నిపుణుడిలా సలహాలిస్తుంది.. ఇలా.. చెప్పుకుంటూ పోతే అమ్మ చేసే పనులు ఎన్నో.. అసలు అమ్మ ఇన్ని డిగ్రీలు ఎప్పుడు చదివిందో.. వీటన్నింటికీ బదులుగా అమ్మకు మనం ఏమిస్తున్నాం? కసుర్లు, విసుర్లు, ఈసడింపులు.. నేటి పిల్లల ధోరణి ఇలాగే ఉంటోంది.. కాసేపు తల్లితో గడపాలంటే సమయం వృథా అనుకుంటున్నారు. కానీ పాతికేళ్ల వరకూ మనమే లోకంగా గడిపింది అమ్మ. సమాజంలో ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన తల్లిని పట్టుకుని.. నువ్వు నాకేమిచ్చావు? అని నిలదీస్తున్న కొడుకులున్న ఈ లోకంలో.. అమ్మ చేసే పనులన్నింటికీ జీతమివ్వాల్సి వస్తే ఆ కొడుకులు ఎంతివ్వాలి? ఎంతిస్తారు? ఇవ్వగలరా? అమ్మ చేసే పనికి జీతమివ్వాలంటే అది అక్షరాలా అనంతమే.. అవుతుంది. అమ్మ శ్రమను అక్షరాల్లోనూ, లెక్కల్లోనూ కొలవలేం.. కానీ అమ్మ ఇవేవీ ఆలోచించకుండా, ఆశించకుండా మాతృమూర్తి హోదాలో వౌనంగా, ప్రేమగా, పిల్లలే లోకంగా బతికిన అమ్మను చూసి ఏం చెప్పగలం? ఏమివ్వగలం? ప్రేమగా, గౌరవంగా మాట్లాడుతూ.. హృదయానికి దగ్గరగా ఉంటూ.. ఒక ముద్దు ఇవ్వడం తప్ప.. ఆ తల్లిప్రాణం అంతకుమించి ఏం కోరుకుంటుంది? అదే ఆమెకు కోట్ల రూపాయలతో సమానం..

రేపు మాతృదినోత్సవం.. ఈ సందర్భంగా మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు..

-ఎస్.ఎన్.ఉమామహేశ్వరి