మెయిన్ ఫీచర్

మగపిల్లాడి కోసం ఆరాటం తగ్గలేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలుగురు సంతానం కలిగిన ఇళ్లలో సైతం- ఆడపిల్లల కన్నా మగపిల్లల సంఖ్యే ఎక్కువ.. పరిమిత కుటుంబాల సంఖ్య అధికం అవుతుండగా- ఆడశిశువుల సంఖ్య రానురానూ మరింత తగ్గుతోంది.. మగపిల్లాడు పుడితే వంశాంకురమని, ఆడపిల్ల పుడితే అన్నీ అవస్థలేనన్న భావజాలం మన దేశంలో ఇంకా పదిలంగానే ఉంది.. ఆడశిశువుల పట్ల వివక్ష యథేచ్ఛగా కొనసాగుతోంది.. కుటుంబ పరిమితి, లింగనిష్పత్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జనాభా గణాంకాలే ఇందుకు అద్దం పడుతున్నాయి. కాలం ఎంతగా మారుతున్నా, మగపిల్లాడి కోసం దంపతుల్లో ఆరాటం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా మగశిశువుల సంఖ్య పెరగడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా మగపిల్లాడు పుడతాడని తెలుసుకున్నాకే కొందరు మహిళలు కా న్పుకు సిద్ధమవుతున్నారు. మరికొంత మంది- మగపిల్లాడు పుట్టే వరకూ పదే పదే గర్భధారణలకు సుముఖత చూపుతున్నారు. ఇలా ఈ రెండు కారణాలతో ఆడశిశువుల పట్ల వివక్ష వర్ధిల్లుతోంది. లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలతో ఆడశిశువుల రాకను అడ్డుకుంటున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే ఒకరిద్దరు ఆడపిల్లలు పుట్టినా మగశిశువు కోసం ఎదురుచూస్తున్నారు. మగపిల్లాడి కోసం ఎక్కువసార్లు గర్భధారణలకు సిద్ధపడుతున్న మహిళలు పలు అనారోగ్యాలకు దగ్గరవుతున్నారు.
ఏకైక సంతానం ఉన్న కుటుంబాల్లో మగశిశువులదే పైచేయిగా ఉంది. దేశ వ్యాప్తంగా ఏకైక సంతానంగా ఆడశిశువు ఉన్న కుటుంబాల సంఖ్య 22 మిలియన్లు కాగా, ఏకైక సంతానంగా మగశిశువు ఉన్న కుటుంబాల సంఖ్య 28.5 మిలియన్లుగా ఉందని గణాంకాల్లో తేలింది. మగపిల్లల పట్ల దంపతులు ఎంత మమకారం చూపుతున్నారో ఈ గణాంకాలు చెప్పక చెబుతున్నాయి. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సందర్భాల్లో- ఇద్దరూ మగపిల్లలే ఉన్న వారి సంఖ్య 26 మిలియన్లుగా, ఇద్దరూ ఆడపిల్లలున్న వారు 13.3 మిలియన్లుగా ఉంది. ఇక, ముగ్గురు సంతానం ఉన్న కుటుంబాల్లో- ముగ్గురూ లేదా కనీసం ఇద్దరు మగపిల్లలు ఉండడం గమనార్హం. ఇద్దరు మగ, ఒక ఆడపిల్ల ఉన్న కుటుంబాలు సైతం అధిక సంఖ్యలో ఉన్నాయి. ముగ్గురు లేదా ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగశిశువు ఉన్న కుటుంబాలు చాలా అరుదుగా ఉన్నాయి.
పెద్ద కుటుంబాల సంగతి మరోలా ఉంది. ఎక్కడైనా కుటుంబం పెద్దదిగా ఉంటే అందులో ఆడపిల్లల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. లింగ నిర్ధారణ పరీక్షల జోలికి పోకుండా, మగశిశువు కోసం ఎక్కువసార్లు గర్భధారణకు సిద్ధపడుతున్న పరిస్థితి ఈ కుటుంబాల్లో కనిపిస్తోంది. చట్టపరమైన హెచ్చరికలు, కుటుంబ కట్టుబాట్ల కారణంగా కొంతమంది మహిళలు లింగ నిర్ధారణ పరీక్షలకు బదులు వరుసగా గర్భధారణకు సిద్ధపడుతూ మగపిల్లాడి కోసం ఆరాటపడుతున్నారు. ఉదాహరణకు ఆరుగురు సంతానం ఉన్న కుటుంబాల్లో అందరూ ఆడపిల్లలే ఉంటున్నారు తప్ప ఆరుగురూ మగపిల్లలే ఉన్న కుటుంబాలు ఎక్కడా లేవు. అంటే వరుసగా ఒకరిద్దరు మగపిల్లలు పుట్టినా చాలు.. ఇక ఆడశిశువు కావాలని ఎవరూ ఆశించడం లేదు. ఇక, శిశు మరణాల విషయంలోనూ ఓ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. అకాల మరణాల బారిన పడుతున్న ఆడశిశువుల సంఖ్య అధికంగా ఉంటోందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. మగశిశువు ఏకైక సంతానంగా ఉన్న సందర్భాల్లో అకాల మరణాల సంఖ్య తక్కువగా ఉంది. కానీ, ఆడశిశువుల విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. ఒకప్పుడు ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే చాలని దంపతులు భావించేవారు. కానీ, ఏకైక సంతానం.. అదీ మగపిల్లాడు ఉంటే చాలని కోరుకునే వారి సంఖ్య ఇపుడు ఎక్కువైంది. తొలికాన్పులో మగశిశువు జన్మిస్తే ఇక ఆడశిశువు కోసం ఆలోచించడం లేదు. ఆడపిల్ల పుడుతుందని లింగ నిర్ధారణ పరీక్షల వల్ల తెలిస్తే కాన్పు వద్దనుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. పరిమిత కుటుంబం వల్ల జనాభా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుండగా ఆడపిల్లల సంఖ్య మాత్రం తగ్గుముఖం పడుతోంది. ఈ పరిణామాలన్నీ 2001-2011 మధ్య కాలంలో చోటుచేసుకున్నట్లు జనాభా గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. చిన్న కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగినా, లింగ వివక్ష కారణంగా ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. పెద్ద కుటుంబాల్లో ఆడపిల్లలే ఎక్కువగా ఉంటున్నందున భవిష్యత్‌లో వారిపై బరువు, బాధ్యతలు పడే పరిస్థితి నెలకొంటోంది. *