మెయిన్ ఫీచర్

బడి నుంచి ఇంటికి ప్రయాణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదేం పెద్ద విశేషం.. స్కూలు నుంచి ఇంటికి పోవడం కూడా వింతేనా? అని అనుకుంటున్నారు కదూ.. మామూలుగా అయితే రోజూ పదికిలోమీటర్లు ప్రయాణం చేసి స్కూలుకు వెళ్లేవారిని చూస్తూనే ఉంటాం. అంతకుమించి పిల్లలను ఎక్కువ దూరం ప్రయాణం చేయనివ్వం. ఇక పల్లెటూర్లలో అయితే పిల్లలు చదువుకోసం కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. కొద్దిదూరం బస్సులో వెళ్లో, కొద్దిదూరం నడిచో వెళుతుంటారు. అయితే స్కూలు నుంచి ఇంటికెళ్లాలంటే మాత్రం రెండు విమానాలు మారడం, ఐదు రోజులపాటు కొండలు ఎక్కడం ఎక్కడైనా చూశారా? అంతేకాదు ఆ పిల్లలు చదువుకోడానికి పట్టణానికి వెళ్లి పనె్నండేళ్ల పాటు ఇంటి ముఖం కూడా చూడకుండా అక్కడే ఉండిపోతారు. పూర్వకాలం పిల్లలను చదివించేందుకు ఆశ్రమాల్లో ఉంచేవారు. సకల విద్యలూ నేర్చుకునేంత వరకు వారు ఇంటి ముఖం కూడా చూసేవారు కాదు. నేటి చిన్నారులు అంతకాలం దూరంగా ఉంటే తల్లిదండ్రులు బతకగలరా? అసలు అన్ని సంవత్సరాల పాటు వారిని ఇంటికి దూరంగా, ఒక్కసారి కూడా చూడకుండా పంపుతారా? అనే ప్రశ్నకు లేదనే సమాధానమే వస్తుంది. కానీ నేపాల్‌లోని మారుమూల గ్రామాల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకోసం అలాంటి క్షోభను భరించక తప్పడం లేదు. పిల్లలకు నాలుగు సంవత్సరాలు రాగానే వారిని సుదూర ప్రాంతంలోని పట్టణంలో చదువుకోసం పంపుతారు. వారు 12 సంవత్సరాల వరకు ఇంటిముఖం చూడరు. పనె్నండు సంవత్సరాల తరువాత ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుంటారు. ఇటీవల కొంతమంది టీనేజీ విద్యార్థులు తమ చదువును పూర్తిచేసుకుని పనె్నండు సంవత్సరాల తర్వాత ఇటీవల సొంతూరికి చేరుకునే ప్రయాణం అద్భుతమైన, గొప్ప డాక్యుమెంటరీగా మారింది.
హిమాలయాల్లోని మారుమూల గ్రామానికి చెందిన కొందరు టీనేజీ కుర్రాళ్లు నేపాల్ రాజధాని కఠ్మాండూలో చదువుకున్నారు. పనె్నండు సంవత్సరాల తర్వాత తల్లిదండ్రుల్ని చూసేందుకు సొంతూరికి వెళ్లారు. తమను విడిచేటప్పుడు పెదవులపై చిరునవ్వు, కళ్లల్లో నీళ్లతో పంపిన తల్లిదండ్రుల్ని చూడటానికి ఆ టీనేజర్లు పెద్ద సాహసాలే చేశారు.. నేపాల్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న కొన్ని మారుమూల గ్రామాలకు ఏమాత్రం రవాణా సదుపాయాలు లేవు. అక్కడి నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్లాలంటే సాహస యాత్ర చేయాల్సిందే. ఆ గ్రామాల్లోని కొందరు తల్లిదండ్రులు చదువుకోసం తమ పిల్లలను పట్టణాలకు పంపుతున్నారు. కఠ్మాండూలో స్నోలాండ్ అనే స్కూలును ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది. పేద, గ్రామీణ పిల్లలకు ఈ పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తారు. అత్యంత పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు అక్కడే ఉండి చదువుకుంటున్నారు. వీరు తమ సొంతూరికి వెళ్లాలంటే రెండు విమానాలు మారాలి. దాదాపు ఐదు రోజులపాటు కొండలు ఎక్కాలి. ఈ టీనేజర్లు స్కూలుకు వెళ్లేటప్పుడు వారి ఊరి పరిస్థితి ఎలా ఉందో నేడూ అలాగే ఉందట. మరో విషయం ఏమిటంటే ఆ టీనేజర్లు వారి తల్లిదండ్రుల్ని గుర్తుపట్టలేకపోయారట. కానీ అక్కడి పరిస్థితులను చూసిన ఆ టీనేజర్లు ఇలా అంటున్నారు. ‘స్నోలాండ్ స్కూల్లో చేరినప్పుడు మా వయసు నాలుగు సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మా కుటుంబంతో ఎన్నడూ మాట్లాడలేదు. ఎందుకంటే మా ఊర్లో కమ్యూనికేషన్ సదుపాయం లేదు. మేం ఇక్కడి వచ్చేముందు మా ఊరు కూడా కఠ్మాండూలా మారి ఉంటుందనుకున్నాం. కానీ ఇక్కడ చూశాక అర్థమైంది. మా ఊరు అసలు ఏమీ మారలేదు. ఇక్కడ పారిశుధ్యం గురించి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా అమ్మానాన్నల్ని మేం గుర్తుపట్టలేకపోయాం. కానీ వారు మమ్మల్ని చూసి ఎంతో సంతోషపడ్డారు. ఇక నుంచి ఇక్కడే ఉండి మా తల్లిదండ్రులకు మెరుగైన జీవితం ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే మా చదువుకోసం వాళ్లు పనె్నండు సంవత్సరాలకుపైగా కష్టపడుతూనే ఉన్నారు. కాబట్టి మేం మా ఊరిని అభివృద్ధి చేసుకుంటాం’ అని చెబుతున్నారు ముక్తకంఠంతో.. ఇప్పుడు ఈ టీనేజర్ల కథ అద్భుతమైన డాక్యుమెంటరీగా మారింది.

- సన్నిధి