మెయిన్ ఫీచర్

కుటుంబమే సమాజానికి వెన్నెముక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యక్తి సామాజిక జీవనానికి పునాది కుటుంబం. ఈ వ్యవస్థకు పునాది వివాహం. ఇది ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ. మానవ సమూహాలన్నింటిలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక సమూహం కుటుంబం. సమాజంలోని ఏకత్వ భావనకు, సమైక్యతకు కుటుంబం ఒక చిహ్నం. భవనానికి పునాది ఎంత ముఖ్యమో సమాజానికి కటుంబం అంతే ముఖ్యం. వ్యక్తి వికాసంలో, ఎదుగుదలలో కుటుంబం ఎంతో ప్రముఖమైనది. కుటుంబం యొక్క విస్తృత రూపమే సమాజం. భారతీయ సంస్కృతీ సంప్రదాయలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నాగరికతా విస్తరణకు పూర్వమే మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. కుటుంబంలోని వ్యక్తిని తీర్చిదిద్దడంలో కుటుంబ పాత్ర ఎంతో కలదు. కుటుంబంలోని తల్లిదండ్రులు, ఇతర పెద్దలు పిల్లల్ని సక్రమ మార్గంలో నడిపించి చక్కదిద్దడానికి అవకాశం ఉంది. తల్లి, తండ్రి, వారి పిల్లలు- ఇంకా వారి పోషణలో ఉండే తాత, బామ్మలు అందరూ కలిసి కుటుంబం అని చెప్పవచ్చు. కుటుంబంలో పెద్దలు ఒకరి అవసరం ఒకరు చూడటం, ఒకరిపై ఒకరు శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఉమ్మడి కుటుంబాల వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. నేటి కాలంలో కుటుంబాల మధ్య బంధువులమధ్య అనుబంధాలు తగ్గిపోతున్నాయి. జీవనశైలిలో వచ్చిన మార్పులు కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి.
‘‘చల్లని హృదయాలకు చక్కని ప్రతిబింబం / మనసులన్నీ పెనవేసి తలపులన్నీ కలబోసి / మామతలు పండించేవి, మంచితనం పెంచేది కుటుంబం ఉమ్మడి కుటుంబం’’ అన్నారు సి.నారాయణరెడ్డిగారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థవల్ల ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే బలమైన బంధం. అది పిల్లలకు ఒకరకమైన భద్రతా భావనను కలుగజేస్తుంది. చిన్న కుటుంబంలో పెరిగే పిల్లల్లో ఇలాంటి లక్షణాలు చాలా తక్కువ. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది అతి చిన్నతనంలో సమైక్యత అనే బలమైన భావన మనసులో నాటుకునేలా చేస్తుంది. సమాజంలో సాంస్కృతిక, సామాజిక విలువలను కాపాడి, పెంపొందించడంలో ఉమ్మడి కుటుంబంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అనాదినుంచి మన తాత్విక దృక్పథమైన వసుధైక కుటుంబంలో మానవత్వం, ఆర్ద్రత, విశాల హృదయం, సహనం మొదలైన భావనల స్ఫూర్తి ఉన్నది. కులాలు, మతాలు, వర్గాలు ఎన్ని వున్నప్పటికీ మన దేశంలోని ప్రజలందరూ ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు. అందుకే మన దేశాన్ని ‘ఉదార చరితానాతు వసుధైక కుటుంబం’ అన్నారు. ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న, ఒక చెల్లెలు.. వీలైతే తమ్ముడు కలిస్తే ఇది చిన్న కుటుంబం. వీరికితోడు తాతయ్య, బామ్మలు ఉండనే ఉంటారు. చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడం అంటే అందరూ సంతోషంగా ఫీలవుతారు.
కానీ నేడు సమాజంలో చోటుచేసుకుంటున్న అనేక మార్పులు, పెరిగిపోతున్న విడాకులు, గృహహింసల కారణంగా ‘సింగిల్ పేరెంట్’ కుటుంబాలు ఎక్కువయ్యాయి. భారతదేశంలో కుటుంబం అంటే తల్లి తండ్రి, పిల్లలు మాత్రమే కాదు, అత్తయ్యలు, మామయ్యలు, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, బాబాయిలు, పిన్నమ్మలు, తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు- ఇలా పెనవేసుకున్న అనేక బంధాలు. ఉమ్మడి కుటుంబాలు చీలిపోవడానికి ముఖ్యకారణం మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలుగా మారిపోవడం అంటారు సామాజికవేత్తలు. వివాహం ద్వారా స్ర్తి పురుషులిద్దరూ కుటుంబాన్ని ఏర్పరచుకుని సామాజిక ఆమోదయోగ్యమైన వైవాహిక సంబంధం ద్వారా సంతానోత్పత్తి చేసి సమాజం నిరంతరం కొనసాగేలా చేయడం మన వ్యవస్థ ప్రత్యేకత.
పాశ్చాత్య కుటుంబాల్లో వైయక్తిక వాదం ఎక్కువ. ఒక వ్యక్తి తన గురించి మాత్రమే ఆలోచించే వ్యవస్థ పాశ్చాత్య కుటుంబ వ్యవస్థలో కనిపిస్తున్నది. అందుకే పాశ్చాత్య కుటుంబాలు విఘటితమైనంత వేగంగా భారతీయ కుటుంబాలు విఘటితం కావు. సంఘర్షణలు ఉన్నా భారతీయ కుటుంబాలు అలాగే కొనసాగుతాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కుటుంబాలలో వస్తున్న మార్పులు, విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలను కాపాడటమే ముఖ్య లక్ష్యంగా ‘ప్రపంచ కుటుంబ దినోత్సవం’గా మే 15న జరుపుకుంటున్నారు. ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అని చాటి చెప్పడమే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ ముఖ్య లక్ష్యం.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మన దేశం పుట్టిల్లు. ఇపుడు ఆ సంస్కృతి భూతద్దం పెట్టి వెతికినా దొరకదంటే అతిశయోక్తి కాదు. నాటి పరిస్థితులలో నేటి పరిస్థితు
లను పోల్చుకుంటే ఉమ్మడి కుటుంబాలలో వున్న అనుబంధాలు, ప్రేమానురాగాలు, ఆత్మీయత, ఆప్యాయత- ఇవేవీ చిన్న కుటుంబంలో కనిపించవు. ఇరుకుగదుల మధ్య, మనసులను ఇరుకుచేసుకుని జీవించడం తప్ప, ఆత్మీయానురాగాలకు చోటెక్కడ కన్పించడంలేదు. కుటుంబ విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు రూపొందించి, కుటుంబ సమైక్యత, సంతోషాల గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర కుటుంబాలకు దోహదం చేయడం, కుటుంబంలో వున్న విభేదాలను తొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం వంటి లక్ష్యాలలో ‘అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం’ను నెలకొల్పారు.
కుటుంబం అనే పదం ఇంగ్లీష్‌లో ‘్ఫ్యమిలీ’గా పిలుస్తారు. ఈ ఇంగ్లీష్ పదం ‘ఫేములస్’ అనే రోమన్ పదం నుంచి వచ్చింది. ఫేములస్ అంటే ‘సేవకుడు’ అనే భావన వుంది. సమాజ శాస్త్ర పరిభాషలో కుటుంబం అంటే వైవాహిక, రక్తబంధం ద్వారా బంధుత్వాన్ని కలిగి వుండి ఒకే గృహంలో నివసించే వ్యక్తుల సమూహం.
కుటుంబంలో వుంటే యాజమాన్యం, అధికారాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించారు.
1. పితృస్వామ్య కుటుంబం- కుటుంబంపై అధికారం చేతిలో వుంటే అది పితృస్వామ్య కుటుంబం.
2.మాతృస్వామ్య కుటుంబం- కుటుంబంపై అధికారం స్ర్తి చేతుల్లో వుంటే దాన్ని మాతృస్వామ్య కుటుంబం అంటారు. ఈ రెండు కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనివే. కేరళలోని నాయర్ సమూహంలో, మేఘాలయలోని ఖాసీ తెగల్లో కూడా మాతృస్వామిక వ్యవస్థ కనిపిస్తుంది.
ఉమ్మడి కుటుంబ లక్షణాలు / ఉపయోగాలు
కుటుంబం అనగా భార్య, భర్త, పిల్లల సమూహం. ఉమ్మడి కుటుంబం అనగా ఒకే గృహంలో రెండు లేక అంతకంటే ఎక్కువ కుటుంబాల సమూహం.
1.నెలసరి ఖర్చు తగ్గుతుంది. 2. సుఖ సంతోషాలను ఇతరులతో పంచుకోవచ్చు. 3. పెద్దల సలహాలు లభిస్తాయి. 4. బాధల్లో వున్నపుడు ఓదార్పు, అభయం లభిస్తుంది. 5. విడాకులు, ఆత్మహత్యలు ఉండవు. 6.స్ర్తిలకు గౌరవం, హుందాతనం లభిస్తుంది.
నష్టాలు
1. వ్యక్తిగత స్వేచ్ఛ కరువు 2. కష్టం విలువ తెలియకపోవడం.
2011 జనాభా గణన ప్రకారం రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య పెరిగినా జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. పెద్ద కుటుంబాల నుంచి చిన్న కుటుంబాలుగా విడివడడం, అధిక సంతానం వద్దని ప్రజల్లో చైతన్యం బాగా పెరగడం వంటివి. రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణాలు ఒక కుటుంబం మరెన్నో కుటుంబాల సృష్టికి కారణమైనప్పటికీ వంశ వృక్షపు వేళ్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటాయి.
ఉమ్మడి కుటుంబంలోని లోపాల కారణంగా అంటే కొరవడే ఏకాంతం, చొరవ తీసుకోకపోవడం, స్ర్తిల ప్రతిభ వ్యర్థం కావడం, పెద్దవారి అదుపాజ్ఞలో ఉండటానికి ఇష్టపడని నేటి కాలం తరం చిన్న కుటుంబాలకే మొగ్గు చూపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సమిష్టి కుటుంబాలు కనబడటంలేదు. మన కుటుంబ వ్యవస్థను పదిలపర్చుకునేందుకు యువత ముందుకు రావాలి. కుటుంబ వ్యవస్థ బలంగా లేకపోతే సమాజంలో ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో ఐక్యరాజ్యసమితి గ్రహించింది. అందుకే 1993 మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా పరిగణించింది. మనమందరం కూడా కుటుంబ వ్యవస్థలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహిద్దాం.
*
నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
*

-కె.రామ్మోహన్‌రావు 94414 35912