మెయన్ ఫీచర్

మమత పీఠమెక్కితే.. ‘మధ్యంతరం’ తథ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా కారణం చేత తాను తిరిగి ప్రధాని పదవిని చేపట్టలేని పక్షంలో భాజపాలో మరెవ్వరూ ఆ పదవిని చేపట్టడానికి నరేంద్ర మోదీ సుముఖంగా లేరని- ఆయన గురించి తెలిసిన వారందరికీ స్పష్టం అవుతుంది. కేంద్రంలో భాజపా రహిత, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడితే- అది ఒకటి, రెండేళ్లలోనే కూలిపోతుందని, అప్పుడు భారీ ఆధిక్యతతో తాను ప్రధాని పదవి చేపట్టవచ్చని మోదీ ఆలోచిస్తున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో బీజేపీయేతర పక్షాలలో పలువురు నేతలు ప్రధాని పదవిని చేపట్టడానికి ఆతృత చెందుతున్నారు. వారందరిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అయితే భవిష్యత్‌లో తనకు, భాజపాకు ఇబ్బంది ఉండక పోవచ్చని మోదీ భావి స్తున్నట్లు ఓ అంచనా. పశ్చిమ బెంగాల్‌లో ప్రతి దశ పోలింగ్ పూర్తయ్యే సరికి ఎన్నికల రంగం తీవ్ర ఉద్రిక్తలకు దారితీయడం ఈ అంశానికి బలం చేకూరుస్తోంది.
చివరి దశ వచ్చేసరికి భాజపా అధ్యక్షుడు అమిత్ షా కోల్‌కతలో జరిపిన రోడ్ షోలో హింస చెలరేగడం, తీవ్రమైన ఉద్రిక్తలు నెలకొనడం జరిగింది. ప్రస్తుత ఎన్నికల సందర్భంగా దేశంలో మరెక్కడా ఇటువంటి ఉద్రిక్తతలు ఏర్పడ లేదు. చివరకు అతి తక్కువగా పోలింగ్ శాతం నమోదైన కాశ్మీర్ లోయలో సైతం ఇటువంటి పరిస్థితులు నెలకొనలేదు. తమ హోదాలను, స్థాయిలను మరచి పోయి, రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి పరస్పరం విద్వేష పూర్వక ప్రసంగాలు చేసుకోవడంలో మోదీ, మమతలకు కలిపి బహుమతి ఇవ్వవలసి వస్తుంది.
పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్యెల్యేలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని, ప్రస్తుత ఎన్నికలు పూర్తి కాగానే మమత ప్రభుత్వం కూలిపోతుందని ప్రధాని మోదీ ప్రకటిం చినప్పటి నుండి మాటల యుద్ధం ఇద్దరు నేతల మధ్య ప్రారంభమైంది. మమత మరింత దిగజారి- భార్యనే చూడని వ్యక్తి దేశ ప్రజలను ఏవిధంగా చూసుకొంటారో.. అంటూ మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. బెంగాల్ అభివృద్ధికి మమత స్పీడ్ బ్రేకర్‌లా మారారని ప్రధాని పేర్కొనడం, భాజపా నేతల ప్రచారానికి మమత ప్రభుత్వం ఆటంకాలు కల్పించడం, ఫోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ప్రధాని పర్యటనను ఆమె ప్రభుత్వం అడ్డుకోవడం, కనీసం కేంద్ర అధికారుల సమీక్షకు కూడా నిరాకరించడం.. ఇట్లా ఇద్దరి మధ్య విద్వేషం పెరుగుతూ వచ్చింది. సోషల్ మీడియా పోస్ట్ పేరుతో భాజపా యువమోర్చా నాయకురాలిని జైలు పాలు చేయడం వరకు కక్షసాధింపు రాజకీయాలకు దిగడం మొత్తం ఎన్నికల ప్రక్రియనే కలుషితం చేసింది.
దేశం అంతటా ఎన్నికల కమిషన్ భాజపా చెప్పిన్నట్లు వ్యవహరిస్తున్నదని మిగిలిన రాజకీయ పక్షాలు ధ్వజమెత్తుతూ ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం మమత నిరంకుశ పోకడల పట్ల ఈసీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నదని భాజపా అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు కురిపించడం గమనార్హం. ఈ విమర్శలు చేసిన వెంటనే అమిత్ షా పర్యటనలో హింస చోటుచేసుకోవడం, ఆ వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ఒకరోజుకు కుదిస్తూ ఎన్నికల కమిషన్ అసాధారణ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఎన్నికల ఫలితాలు రావడానికి వారం రోజులు ముందుగా జరిగిన ఈ సంఘటన జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేక పక్షాలకు మమత కేంద్ర బిందువుగా మారడానికి దారితీసింది. కాంగ్రెస్‌తో పాటు చంద్రబాబు, మాయావతి, అఖిలేశ్ యాదవ్, ఎంకే స్టాలిన్ వంటి వారు ఆమెకు సంఘీభావం తెలిపారు. ఎన్నికల ఫలితాలు రాగానే ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తులో భాగంగా మే 23 సాయంత్రమే ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటుకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సన్నాహాలు చేస్తున్న సమయంలో మమత కేంద్ర బిం దువుగా మారడం గమనార్హం.
కాంగ్రెస్‌కు ప్రస్తుత లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఆ పార్టీ ఈ మధ్య మూడు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేశాక- మిగిలిన పార్టీల కన్నా కాంగ్రెస్ అంటేనే ప్రధాని ఆందోళన చెందు తున్నారని.. ఆ పార్టీపై ఆయన చేస్తున్న విమర్శలే స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, భాజపా బలాబలాలకు నేరుగా సంబంధం ఉంది. ఒక పార్టీ బలం తగ్గితే. మరో పార్టీ బలం పెరుగుతుంది. అందుకనే మిగిలిన రాజకీయ పక్షాలకన్నా కాంగ్రెస్ తలెత్తుకొని తిరగడాన్ని భాజపా నేతలు సహించలేక పోతున్నారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ 162 సీట్లను కోల్పోతే, భాజపాకు 163 సీట్లు అదనంగా వచ్చాయి. ఈ రెండు పార్టీల బలాబలాలు ఏవిధంగా పరస్పరం ప్రభావం చూపుతాయో అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఎట్టి పరిస్థితులలో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని భాజపా సహించలేదు. భాజపాకు కీలకమైన ఉత్తరాది రాష్ట్రాలలో అఖిలేశ్ యాదవ్, మాయావతి వంటి వారు బలం పుంజుకోవడం కూడా భాజపా స్వాగతించ లేదు.
ఇటువంటి అనివార్య పరిస్థితులలో మమత ప్రధాని పదవి చేపట్టినా ఆమె ప్రభావం పశ్చిమ బెంగాల్ కే పరిమితమై కీలకమైన హిందీ ప్రాంతాలలో భాజపా ప్రాబల్యాన్ని అడ్డుకోలేదు. అందుకనే ఒక విధంగా ఆమెకు స్నేహహస్తం అందించే ప్రయత్నం ప్రధాని మోదీ చేశారు. సినీనటుడు అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన రాజ కీయేతర ఇంటర్వ్యూలో ప్రతిపక్షాల్లో తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని ఇద్దరి పేర్లు మాత్రమే ప్రస్తావించారు. వారిలో ప్రముఖంగా మమతా బెనర్జీ పేరు చెప్పారు. మాటవరసకు మాత్రం గులాబీ నబీ ఆజాద్ పేరును ప్రస్తావించారు. మమత ఏటా తనకు రెండు కుర్తాలు, మిఠాయిలు పంపిస్తూ ఉంటారని మోదీ తెలిపారు. ఆ విధంగా అవసరమైతే ఆమె మద్దతు కూడదీసుకొనే ప్రయత్నం చేశారు. అయితే, ఈ ప్రస్తావనను ఘాటైన పదజాలంతో మమత తిప్పి కొట్టడంతో అంతటితో అది ఆగిపోయింది. వాస్తవానికి ప్రధానితో లోపాయికారీ సంబంధాలు ఏర్పర్చుకున్న కె.చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి నేతలు ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు పలువురు కాంగ్రెస్ నేతలతో అవగాహన ఏర్పాటు చేసుకొని, కాంగ్రెస్ నుండి తనకు బలమైన పోటీ రాకుండా చేసుకోగలిగారు. అయితే వారెవరి పేర్లను ఈ సందర్భంగా ప్రధాని బైట పెట్టక పోవడం గమనార్హం.
కాగా, గత మూడు నెలలుగా ప్రతిపక్షాలకు చెందిన ప్రతి ప్రముఖ నేతతో మమత సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకొంటున్నది. ఒక వంక రాహుల్ గాంధీతో వేదిక పంచుకోవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నది. శరద్ పవార్, చంద్రబాబు, మాయావతి, అఖిలేశ్ యాదవ్, ఎంకే స్టాలిన్, తేజస్వి యాదవ్, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్, శరద్ యాదవ్, దేవెగౌడ, కుమారస్వామి వంటి వార్లతో సంబంధాలు ఏర్పర్చుకొంటూ ఇప్పుడు దేశంలో ప్రతిపక్షాలకు ఆమె కేంద్ర బిందువుగా మారారు. ఈ నాయకుల్లో ఎవరికీ బెంగాల్‌లో రాజకీయంగా ఎటువంటి సంబంధాలు లేక పోవడం గమనించాలి. అందుకు ఒక విధంగా ప్రధాని మోదీ పరోక్షంగా సహకారం అందిస్తున్నారా? అనే అనుమానం కలుగుతున్నది. మోదీ తిరిగి అధికారంలోకి రాలేని పక్షంలో కాంగ్రెస్ బయట నుండి మద్దతు ఇస్తే, ప్రాంతీయ పక్షాల సహకారంతో ప్రధాని పదవి చేపట్టాలన్నది మమత ఎత్తుగడ. అయితే- అలా జరగాలంటే కాంగ్రెస్‌కు 100కు మించి సీట్లు రాకూడదు. కాంగ్రెస్‌కు 120 నుండి 140 వరకు సీట్లు వస్తే సహజంగానే ప్రధాని పదవి ఆ పార్టీకే దక్కుతుంది.
కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సుస్థిరత సాధ్యం కాదని గతంలోని యునైటెడ్ ఫ్రంట్ అ నుభవాలను శరద్ పవార్, చంద్రబాబు ఇప్పటికే ప్రస్తావించారు. సొంత రాష్ట్రంలో 2014లో కన్నా ఎక్కువ సీట్లు గెల్చుకొంటేనే మమత ప్రధాన మంత్రి అభ్యర్థి అయ్యే అవకాశం ఉంటుంది. స్థానికంగా కాంగ్రెస్, సీపీఎం శ్రేణులు ఆమెకు వ్యతిరేకంగా భాజపాకు మద్దతు ఇస్తున్నట్లు కనబడుతున్నది. భాజపా కూడా బెంగాల్ లో రెండంకెల సీట్లు గెల్చుకొంటామనే ధీమాతో ఉన్నది. అయితే, మాయావతి వలే ఇప్పటివరకు ప్రధాని పదవిపై మమత తన ఆతృతను బహిరంగ పరచుకోలేదు. మమతకు బలమైన రాజకీయ వారసత్వం లేదు. ఆమె కేంద్రంలోకి వస్తే రాష్ట్రంలో తమ బలాన్ని సుస్థిరం చేసుకోవడం భాజపాకు తేలిక కాగలదు. బలమైన ప్రతిపక్షంగా భాజపా ఎదుగుతున్న రాష్ట్రంలో ఆ పార్టీకి తగిన నాయకత్వం లేదు. సరైన అభ్యర్థులు లేక ఇతర పార్టీల నుండి వచ్చిన వారిలో కనీసం డజన్ మందిని అభ్యర్థులుగా నిలబెట్ట వలసి వచ్చింది.
ఏది ఏమైనా క్షేత్రస్థాయిలో ప్రజలతో అనుబంధం గల నేత మమతా బెనర్జీ. అటువంటి నేతలు ఇప్పుడు దేశం మొత్తం మీద ఐదారుమంది కన్నా లేరు. బీజేపీలో ఒక విధంగా శివరాజ్ సింగ్ చౌహన్ తప్ప మరొక్కరు లేరు. అందుకనే మమత వంటి నేత ప్రధాని పదవిలోకి వస్తే రాహుల్ గాంధీ కన్నా భాజపాకు ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ వంటి నేతలు వీలైనంత వరకు ఆమెను ప్రధాని పదవిలోకి రాకుండా అవాంతరాలు కలిగించే అవకాశం లేకపోలేదు. ఇక- కేసీఆర్, జగన్, మాయావతి, అఖిలేశ్ వంటి నేతలు కాంగ్రెస్ లేని ప్రభుత్వాన్ని కోరుకొంటున్నారు. కానీ శరద్ పవార్, కుమారస్వామి, చంద్రబాబు, తేజస్వి యాదవ్, ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ సారథ్యంలోనే ప్రభుత్వం ఏర్పడాలని స్పష్టం చేస్తున్నారు. భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయ లేని పక్షంలోనే ప్రతిపక్షాల ఎత్తుగడలు, పదవీ కాంక్షలు ఒక రూపం తీసుకొనే అవకాశం కల్పి స్తాయి.

-చలసాని నరేంద్ర