మెయిన్ ఫీచర్

టాలీవుడ్ ఎండ్‌గేమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తొక వింత. పాతొక రోత -ఈ సామెత టాలీవుడ్‌కు సరిగ్గా సరిపోతుంది. మహేష్‌బాబు కొత్త సినిమా ‘మహర్షి’ కానె్సప్ట్‌ను అందుకునేందుకు పరుగులు తీస్తున్న ప్రభావితులను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. కానె్సప్ట్ గొప్పదైనా -దాన్ని ఆచరించే సిన్సియారిటీ కొరవడితే మొదటికే మోసం రావొచ్చు. మహర్షి చిత్రంలో రైతు ప్రాధాన్యతను ప్రపంచానికి చెబుతూ ‘వీకెండ్ వ్యవసాయం’ కానె్సప్ట్‌ను ప్రజెంట్ చేయడం గొప్ప విషయమే. కానీ, అదొక పాపులార్టీ తీసుకొచ్చే కానె్సప్ట్‌గా వెర్రితలలు వేస్తుండటం చూస్తుంటే -టాలీవుడ్‌లో ఇలాంటి గేమ్‌లు చాలా ఎండ్ అయిపోయాయన్న విషయం గుర్తుకొస్తుంది.
**
ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్ ఎండ్‌గేమ్ చిత్రం సాధిస్తోన్న వసూళ్లను చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. పాత రికార్డులను బద్దలుకొట్టి సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అంతమాత్రం చేత హాలీవుడ్ నుంచి ఎలాంటి హడావుడీ ఉండదు. బీభత్సమైన సక్సెస్‌మీట్‌లు నిర్వహించరు. మనం మాత్రం దీనికి భిన్నం. దెబ్బతిన్న చిత్రాలకూ సక్సెస్‌మీట్‌లు మనమే నిర్వహించుకుంటాం.
**
ఇండస్ట్రీకి ఓ చెడ్డలవాటుంది. ఏదైనా హిట్టయితే -ట్రెండ్ పేరిట అంతా అలాంటి మూసనే పాటిస్తుంటారు. నిర్మాత చేతులు పూర్తిగా కాలేవరకు ట్రెండ్ సినిమాలే ఆడియన్స్‌పై దాడి చేస్తుంటాయి. చివరకు ప్రేక్షకుడు ‘్ఛ’కొట్టాక ట్రెండ్ మాయమవుతుంది.
ఆమధ్య ‘శ్రీమంతుడు’ సినిమా వచ్చింది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరో. దాంతో ‘దత్తత’ కానె్సప్ట్ పురుడుపోసుకుంది. కొరటాల శివ డిజైన్ చేసిన ‘దత్తత’తో పాపులార్టీ కోసం ఎగబడ్డారు. చాలామందే -గ్రామాలను దత్తత తీసేసుకున్నారు. పబ్లిసిటీ చేసుకున్నారు. టీవీ స్క్రీన్లపై గొప్పలుపోయారు. దినపత్రికల్లో కథనాలు కథనాలు రాయించుకున్నారు. అంతే, సీజన్ అయిపోయింది. ‘దత్తత’ మాయమైంది. దత్తత గ్రామాలన్నీ ముందెలా ఉన్నాయో, ఇప్పుడూ అలానే ఉన్నాయి.
కోటానుకోట్లు డబ్బున్నా అందరికీ ‘బిల్‌గేట్స్’, ‘వారన్‌బఫెట్’ ‘జుకర్‌బర్గ్’లా విశాల హృదయం ఉండదుగా. అలాంటి పెద్దమనసు దత్తత వీరులకుందా? దత్తత డబ్బాకొట్టిన వారి ప్రగల్భాలు ఏమైనట్టు? కనీసం ఆ దత్తత గ్రామాలు చూసుంటారా? ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా? నిజానికి స్టార్ ఆర్టిస్టులు, స్టార్ దర్శకులు, కళాకారుల సంఘాలు గ్రామాలనేంటి.. మండలాలనే దత్తత తీసుకోవచ్చు. కానీ, చేయరు. ఎందుకంటే ఆర్థిక వనరులున్నా, విశాల హృదయం ఉండాలిగా. కానీ, ఇప్పటికే దత్తత ఊసెత్తితే అప్పటి స్టేట్‌మెంట్లే గుర్తు చేస్తారు తప్ప, ప్రాక్టికల్‌గా చేసిన అభివృద్ధి ఇదీ అని చూపించే పరిస్థితి లేదు.
**
బయోపిక్‌ల విషయానికి వద్దాం. బయోపిక్ చిత్రాలు తీస్తేనే వారివారి గొప్పతనం, వ్యక్తిత్వం ప్రజలకు, అభిమానులకు తెలుస్తుందా? రాజకీయ నాయకుల, క్రీడాకారుల, సినీ కళాకారుల బయోపిక్‌లు నిర్మించాల్సిన అవసరముందా? నిజానికి బయోపిక్‌ల్లో చూపించే విషయాలకంటే, ఆయా నాయకుల జీవిత చరిత్రలు ప్రజలకే ఎక్కువ తెలుసు. ‘మహానటి’ తీసినా తీయకున్నా సావిత్రి మహానటే. ఆమె జీవితం ప్రజలు చదవని పుస్తకం కాదు. కానీ, సినిమా వచ్చింది. హిట్టయ్యింది. అంతే -పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చాలామంది ట్రెండ్‌ను ఫాలో అయిపోయారు. బయోపిక్‌లు టచ్ చేశారు. చివరకు నవ్వులపాలయ్యారు. ఆ చిత్రాలు పట్టుమని పది రోజులాడకున్నా విజయోత్సవాలు, బ్లాక్‌బస్టర్ అంటూ ఆకాశానికెత్తడాలు మాత్రం మామూలే.
**
మీ టూకి వద్దాం. దొంగతనం జరిగిన ఆర్నెల్లకు పోలీసులు వచ్చారన్న సామెతను పోలివున్నాయి చాలావరకూ మీ టూ అభియోగాలు. ఎప్పుడో ఎదుర్కొన్న సమస్యను ఇప్పుడే జరిగిందన్నట్టు అభియోగాలు చేస్తుంటే -ఏ అభియోగం మాత్రం రుజువవుతుంది. లైంగిక వేధింపుల వ్యవహారాలకు సాధ్యమైనంత వరకు సాక్షాధారాలుండవు. బాధితుల వేదన నిజమే అయినా -రుజువు చేసే పరిస్థితి ఉండదు. నిజానికి సినీరంగంపైనే ప్రజలకు ఒకవిధమైన చిన్న చూపుంది. తళుకులీనే తారల సినిమాలను ఎగబడి చూసినప్పటికీ, ఆయా ఆర్టిస్టుల వ్యక్తిత్వాల దగ్గరకు వచ్చేసరికి తక్కువ చేసి మాట్లాడటమన్నది పరిశ్రమ మోస్తున్న పెద్ద భారం. ఇలాంటి పరిస్థితుల్లో మీ టూపై సీరియస్‌నెస్ కొరవడంతో -ఉద్యమం కాస్తా ఊపిరిలేకుండా పోయింది. ప్రస్తుతం ‘మీ టూ’ చిరునామా ఎక్కడో ఎవ్వరికీ తెలీదు. అటు బాధిత వర్గం, ఇటు అభియోగాలు ఎదుర్కొంటున్న వర్గం కిమ్మనడం లేదు. అప్పుడప్పుడు అక్కడక్కడో ‘మీ టూ’ అని వినిపిస్తోంది. ఇదో జోక్‌లా తయారైంది కూడా.
**
‘డ్రగ్స్’ విషయానికి వద్దాం. దగ్గరదగ్గర మూడేళ్ల క్రిందట డ్రగ్స్ దందాలో సినీ కళాకారుల హస్తముందంటూ మీడియా చెప్పిందే చెబుతూ, టీవి ఛానళ్లు చూపిందే చూపిస్తూ దాదాపు రెండుమాసాలు నానాహంగామా చేశాయి. పిదప డ్రగ్స్ ఎక్కడున్నాయో, విచారణ ఎక్కడ జరిగిందో, కేసులు ఏమయ్యాయో ఎవ్వరికీ తెలీదు. మీడియా సైతం పట్టించుకోవడం మానేసింది.
ఇవన్నీ ఎండ్ గేమ్‌లే.
కామన్ పీపుల్ మైండ్‌సెట్‌లో టాలీవుడ్‌ను విశే్లషించుకుంటే - హీరోయిజం చిత్రాలు నిర్మించక మానరు? స్ర్తి పాత్రలతో అంగాంగ ప్రదర్శన ఆపరు. సాహిత్యం లేని రచనలను తిప్పికొట్టరు. డబ్బాలో గులకరాళ్ల శబ్దాల సంగీతానికి అడ్డుకట్ట వేయరు. పిచ్చిగడ్డంతో బిచ్చగాళ్ల మాదిరి కనిపించే హీరోలను మార్చరు. కీచుగొంతుకల గాత్రధారులను వదలరు. నటనరాని వృధా వారసులను నియంత్రించరు. అలాంటప్పుడు -సినీరంగం బాగుపడుతుందా? పూర్వ వైభవం వస్తుందా? స్వర్ణయుగాన్ని తలపిస్తుందా? పది హిట్లు.. తొంబై ఫట్లు. ఇదేగా నడుస్తున్న ఒరిజినల్ ట్రెండ్. వంద కోట్ల బడ్జెట్లు. కోట్లలో పారితోషికాలు. వేల థియేటర్లలో విడుదల. వంద కోట్ల క్లబ్‌లు. ఓవర్‌సీస్ వసూళ్లు.. ఇలాంటి పదాలు వాడుకుంటూ మనకు మనం మురిసిపోవాల్సిందే. మన దేశంలోవున్న ‘వుడ్స్’లో టాలీవుడ్డుదే చివరి స్థానం అంటే కాదనలేం. మనకు జాతీయ అవార్డులు రావు. అంతర్జాతీయ ప్రదర్శనలకు అర్హత సాధించం. చలన చిత్రోత్సవ ఫెస్టివల్స్‌కు వెళ్లలేం. ఇదీ మన టాలీవుడ్ సత్తా. పెళ్లికానుక, వెలుగునీడలు, డాక్టర్ చక్రవర్తి, విచిత్రబంధం, ప్రేమనగర్, ప్రేమాభిషేకంలా శాశ్వతంగా నిలిచే చిత్రాల ఊసే ఉండదు.
ముక్తాయింపు: ప్రస్తుతం ప్రపంచ సినీ రంగంలో ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ చిత్రం వసూళ్ల తుఫాన్ సృష్టిస్తోంది. అత్యధిక వసూళ్లతో ప్రథమస్థానంలో వున్న ‘అవతార్’, ద్వితీయ స్థానంలోని ‘టైటానిక్’, తృతీయస్థానంలోని ‘స్టార్‌వార్స్’ను తలదన్ని ప్రథమ స్థానానికి చేరుకుంది. అటువంటి చిత్రాలకు హాలీవుడ్ డబ్బాకొట్టదు. అలాంటి గొప్ప విషయాల గురించి మనం ఆలోచించడం మానేశాం. బ్రోకర్, బీరువా, మెంటల్, పైసావసూల్, బిందాస్ లాంటి సినిమాలు నిర్మించుకుంటూ పోతుంటాం. సినిమా విడదలైన రెండో రోజే విజయోత్సవాలు నిర్వహించడం చూస్తుంటేనే విషయం అర్థమైపోతుంది. దీనికి ఎవరు సిగ్గుపడాలి? ఈ పరిస్థితికి ఎవరిని నిందించాలి.

-మురహరి ఆనందరావు