మెయిన్ ఫీచర్

మాదిరాజు సాహితీ సమాలోచనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వచ్ఛంద కవిత పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చే పేర్లలో మాదిరాజు రంగారావు పేరు ప్రముఖమైనది. ఈయన ఇప్పటికి 116 గ్రంథాలు రచించి వచన కవితకు నూట పదహార్లు సమర్పించుకున్నాడు. ఆ తరంలో కుందుర్తి ఆరుద్ర శీలావీర్రాజు ఫ్రీవర్స్ ఫ్రంట్ ఉద్యమం నడిపిన మాట నిజమే కాని నిజంగా అవిశ్రాంత ఉద్యమశీలి మాదిరాజు రంగారావు. ఈయన ప్రాచీనతకు భరత వాక్యము ఆధునికతకు నాందీ ప్రస్తావన. ఈయన అంతరంగం విశ్వనాథ బహిరంగం శ్రీశ్రీ. స్ర్తివాదం దళిత వాదం, మైనారిటీ వాదం, ఉప ప్రాంతీయవాదం, శ్రామిక వాదం, అంతర్జాతీయ ఉగ్రవాదం- ఇలా సామాజిక పటలంపై ఏ స్పందన వచ్చినా మాదిరాజువారి లేఖిని ఘోషించవలసిందే!! కవిగా మాదిరాజు రంగారావు ఎంతటి లబ్ధప్రతిష్టుడో విశే్లషకునిగా అంతటి అంతర్ముఖుడు. రంగారావు సాహితీ వ్యాసాలు కూడా వ్రాస్తారా? అని ప్రశ్నించేవారున్నారు. అందుకు సమాధానమే వీరి ‘‘సమాలోచనం’’.
ఇది పరిమాణంలో చిన్నదే అయినా పరిణామంలో మిన్నది. ఏ వ్యాసానికి ఆ వ్యాసం ఆపాతమధురం- ఆలోచనామృతం. రంగారావు సంస్కృతాంధ్రములలో ద్రాఘిష్టమైన వైశారద్యముకలవాడు కాబట్టి అటు స్ఫోటాచార్యుణ్ణి ఇటు రవీంద్రుణ్ణి సమానంగా అనుశీలనం చేయగలడు. వీటిని వ్యాసములు అనటం కన్నా విజ్ఞాన వీచికలు అనటం సమంజసం.
రవీంద్రుని గీతాంజలిలోని దైవము ప్రేమమూర్తి. మానవాళికి రక్షకుడు. When the heart is Hard and parched up come up on me with a shower of mercy అని రవీంద్రుడు ప్రార్థిస్తాడు. బెంగాలీ భాషలో గీతాంజలి నైవేద్య అనే రెండు సంకలనాలు ఆంగ్లంలో అవతరించగా దానిని సాహిత్య విభాగం నోబెల్ బహుమతి లభించింది. ఇందలి మార్మికత, అంతశే్చతన బహిరమైన శబ్దార్థాలకన్నా లోతైనది. మాదిరాజు రంగారావు రవీంద్రుని హృదయాన్ని ఒడిసిపట్టుకున్నారు.
స్ఫోటము అంటే ఏమిటి? ఇది శబ్దము యొక్క నిత్యత్వాన్ని ప్రతిపాదించే ఒక సిద్ధాంతము. భారతీయ తాత్విక చింతనకు శిఖరాయమానమైన సిద్ధాంతమిది. శాస్తమ్రులన్నింటిలోకి వ్యాకరణము గొప్పది. వాటిలో పాణిని గొప్పవాడు. అలంకార గ్రంథములన్నింటిలోనికి రసగంగాధరము గొప్పది- భాషావాదములలో స్ఫోటాచార్యుడు హిమాలయోన్నత శృంగము. దీనికి సాటిరాగలిగినది ఇంతవరకు ప్రాక్పాశ్చాత్య వీధులలో మరొకటి రాలేదు. ఘంటానాదమువలె ప్రవహించే శబ్దస్ఫురణ అక్షరములను పదములను వాక్యములను భావమును దాటి సంస్కార రూపంగా మిగలటమే స్ఫోటము. ఈ అనంత విషయము కేవలము నాలుగు పుటలలో ఎం.ఎ విద్యార్థులకు అవగతం అయ్యేటట్లు ఒక చిన్న వ్యాసంగా రూపొందించారు. రవీంద్రుని సావిత్రి అనుభూతి కళ అయితే అరవిందుని సావిత్రి పూర్ణయోగము. అతి మానసోన్మీలనం. ‘హిరణ్యయేన పాత్రేణ సత్యస్యా పిహితమ్ ముఖమ్’ అంటుంది వేదము. బంగారు తెర వెనుక పరమ సత్యమే సత్యవంతుని ప్రస్థానము. సావిత్రి వలన అతడు మృత్యుంజయుడైనాడు. అశ్వపతి ఊర్ధ్వగత కుండలినీ చైతన్య ప్రతీక. Savitri a legend and a symbol అన్నాఢు కవి. ఆంగ్ల భాషోపాధ్యాయుడు నా మిత్రుడు కుప్పా శ్రీనివాసశాస్ర్తీని ‘సావిత్రికి నోబెల్ ప్రైజ్ ఎందుకు రాలేదు?’ అని ప్రశ్నించాను. ‘ఎందుకంటే అది వారికి అర్థం కాక’ అని జవాబిచ్చాడు. నిజమే! సావిత్రికి సాహిత్యంలో నోబెల్ పురస్కారం, మహాత్మాగాంధీకి శాంతి పురస్కారం రాకపోవటం నోబెల్ సంస్థ చేసుకున్న పాపం. మాదిరాజు రంగారావు మాటల్లో అరవిందుని అనే్వషణ ఇలా ఉంది. ‘‘అరవిందుని సావిత్రి తాత్వికేతిహాస కావ్యం. శక్తి స్వరూపమైన విశ్వమాత అవతార కథలో ఉదాత్తమైన ఉజ్వలమైన స్ర్తి రూపం వర్ణితమైంది. ఇది మానుష రూపంలో దివ్య లక్షణోపేతమయింది. అతీత శక్తి సంపన్నమైంది. అజ్ఞానాన్ని చీకటిని మృత్యువును నిరాకరిస్తూ జ్ఞానానికీ వెలుగుకూ అమృతత్వానికీ దారితీసింది. నిజమైన స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నమైంది. దివ్యమైన స్థాయికి ప్రతీక అయింది.
మానుష శక్తి ఎట్లా ఆత్మసంస్కార పరిణామ వికాస శిఖర దశలను పొందేదీ అసాధ్యమనుకున్నది ఎట్లా సాధ్యం చేయగలిగిందీ, ప్రకటితమయింది. విధి సూత్రాలు మారవచ్చు కాని నా ఆత్మ సంకల్పం మారదు- అన్న మాటల్లో సావిత్రి నిజానికి దివ్యమంత్రంలోని చైతన్య శక్తిని స్ఫూర్తి తెస్తుంది. అహంకార కళ- అభివ్యక్తి శిల్పం గూర్చి మాదిరాజు రంగారావుకు స్పష్టమైన భావాలున్నాయి. ధిషణాహంకారం కవులకు కళాకారులకు సహజం. అహంకారానికి ఆత్మవిశ్వాసానికి మధ్య లక్ష్మణరేఖ ఉంది. దురహంకారం వర్జనీయం. అది పతనహేతువు. అహం ప్రత్యయం నుండి సృజన వస్తే దురహంకారంనుండి భజన వస్తుంది. అమలోదాత్తమనీష నేనుభయ కావ్య ప్రౌఢిపాటించు శిల్పమునన్ పారగుడన్- అనే దశనుండి నానేర్చిన భంగిమ చెప్పి వరణీయుడనయ్యెద భక్తకోటికిన్ అనే దశలో ఒక సాత్విక పరిణామ దశ మనకు గోచరించటం లేదా? ఆధునికులలో విశ్వనాథ ఒక పార్శ్వమైతే, జాషువా మరొక పార్శ్వం. జాషువా గబ్బిలము సామాజిక వైరుధ్యములో దౌత్యము జరిపిన విహంగ ప్రతీక. తన కవిత్వం విని ప్రశంసించిన వారే ఆయన కులము పేరు చెప్పగానే పరాన్ముఖులు కావటం బాకుతో గుచ్చినట్లున్నదని కవి స్వయంగా వ్యక్తీకరించాడు. ఈసడించినంత మాత్రాన నను వరించిన శారద లేచిపోవునా? అని ప్రశ్నించాడు. ‘ఈ అభాగ్యుల రక్తమ్మునా హరించి ఇనుప గజ్జెల తల్లి జీవనము సేయు’నంటాడు జాషువా. ఆర్థిక అసమానతలు ఒక పార్శ్వమైతే సామాజిక వివక్ష ద్వితీయ పార్శ్వం. ఈ రెండూ ఒకటి కాదు. ఐతే జాషువా రెండూ అనుభవించాడు. జాషువాలోని సామాజిక కవితా విశే్లషణ అటుంచితే ఆయనే రస శిల్పంలో మరో అంశం. ఎన్నో యేండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశానమ్ములో కన్నుల్ మూసిన మందభాగ్యుడొకడైనన్ లేచి రాడక్కటా? అంటూ జాషువా వేసిన ప్రశ్నకు బైబిలు, భగవద్గీత, ఖురాను చెప్పిన సమాధానాలు సమగ్రమైనవేనా??
రాయప్రోలు సుబ్బారావు ఆధునిక కవితా ప్రారంభకుడు. ఆయన ప్రత్యేకత ఇంతవరకే పరిమితం కాదు. ప్రబంధ యుగానంతర పరిణామంలో స్ర్తిని ఆరాధ్యమూర్తిగా హృదయేశ్వరిగా, దివ్యసింహాసనాధిష్టితగా, శ్రీమాతగా, శ్రీ మహారాజ్ఞిగా, చిదగ్నికుండ సంభూతగా భావించే ఉపనిషద్భావన రాయప్రోలు వారిలో పునరావిష్కృతమయింది. ఇది భావ కవితా యుగానికి బలమైన పునాదిగా అనాదిగా మారింది. తృణ కంకణము ప్లేటో ప్రేమ సిద్ధాంత పర్యవసానము అనటం బాహిర విశే్లషణ మాత్రమే. రాయప్రోలు వారి హృదయం శ్రుతి శిఖర మూర్ధన్యము- ధన్యము. శివఃశక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితం అన్నాడు శంకరుడు. ఐన్‌స్టిన్ పదార్థం శక్తి కాలము, ఆకాశముల సమన్వయాన్ని వింగడించకముందే సౌందర్య లహరి పుట్టింది కదా!! ప్రధానంగా రంగారావు కవియే కాని పౌరాణికుడు కాదు. ఐనా భగవద్గీతా విశే్లషణను చేయటం గమనార్హం. డెరెక్ వాల్కాట్ నోబెల్ బహూకృతుడైన పాశ్చాత్యుడు. ఆయనను రంగారావు అంచనా వేశారు. పోతన భాగవత భూమికను స్పృశించారు. ‘‘అమృత తత్వం ఆత్మభావన’’ ఇది విశ్వానికి భారతదేశం అందించిన మహోన్నత ఉపాయనము. ఆత్మభావన లేకుంటే మానవాళి సామూహిక ఆత్మహత్య చేసికొని ఉండేదేమో అనిపిస్తుంది.
ప్రొఫెసర్ మాదిరాజు రంగారావు 1935లో ఖమ్మం జిల్లాలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు ఎం.ఎ. సంస్కృతం అభ్యసించి కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. ఆయన ప్రధానంగా అంతర్ముఖుడు కావటంతో కొన్ని దశాబ్దాలుగా హైదరాబాదులోనే ఉంటున్నప్పటికీ వేదికలపై కన్పడాలనే తపన లేదు. ఇతడు నిత్య సభావ్రతుడు కాదు కాని నిత్య లేఖినీవ్రతుడు. లేకుంటే ఇంత రచన అసాధ్యం!!

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్