మెయిన్ ఫీచర్

శేషేంద్ర సాహిత్యం అజరామరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్యంలో శేషేంద్రశర్మగారిని ప్రాచ్య పాశ్చాత్య ఆధునిక భావాల మేలుకలయికగా, యుగీన శ్వాసం ఆవిష్కర్తగా భావించాలి. ముఖ్యంగా సనాతన శాస్త్రాల అధ్యయనం, పాశ్చాత్య కళల్లోని ఆధునికత, సమకాలీనతలు, విప్లవ చైతన్యంతోబాటు ఒక మహత్తర తాత్విక సమావిష్కరణం చేసిన రచనలు చేసారు. గుంటూరు శేషేంద్రశర్మగారిలో విభిన్నకోణాల సమగ్ర దృష్టి అనుశీలనలు సమాజ దార్శనికతల్ని తెలియచెప్పేందుకు చేసిన కృషి ఉన్నది. స్థూలంగా వెయ్యేళ్ళకు పైబడిన తెలుగు సాహిత్యంతోబాటు, పురాణేతిహాసాలు, వివిధ దేశాల సంస్కృతులు, చరిత్రలు, వాటి ప్రభావం ఉన్నది. నిజ సంస్కారవంతమైన హాలికునిగా, నావికునిగా, ప్రయత్న పథికునిగా, అలంకారిక, ప్రతీకాత్మకతల సౌకుమార్య, సౌందర్య భావనలు, లాలనలు కన్పిస్తాయి.
ఈ రెండు పద్యాలను, వాటి నడకను గమనిస్తే శేషేంద్రలోని కళా సౌందర్యాత్మకతల పోహళింపును ఆకళింపు చేసుకోవచ్చును.
చ॥ హసన కిసలయమ్ముల ధరాధర శీధురసా ప్రసారముల్
గుసగుస పిల్లగాలులు లుపగూహన వల్లులు ముల్లసిల్లు మీ
యెస పరి ద్వంద్వజీవిత నహోజ్వలసీమల జందమామ యిం
పెసగ నిరంతరంబు గురియించుత తన్మిహికా వికాసముల్.
పై ప్రతి పదం, పాదంలోనూ ప్రాకృతిక ప్రియంభావుకతలతోబాటు, రెండు జీవితాల ప్రేమాన్విత భావనలు, వాటియొక్క మనోవికాసం కలిగించే జీవన వికాసం ‘‘కానుక’’గా ఆయనే ప్రకటించారు. ఇంకొక మంచి కావ్య రసాత్మకలున్నప్పటి దైవభక్తిని పంచే విధంగా దంపతులకు అక్షర కానుకల్ని అందించారు.
క॥ హిమగిరి శిఖర వనాంతర / రమణీయ సరోవిరాజ రాజమరాళ / భ్రమ గొల్పుతమీ మిథునము / విమలాయుత శ్రీనివాస! వినయ విలాసా!!
-ఇలా, ఉత్తేజకరమైన అనుభూతులను, మధుర జ్ఞాపకాలను తన కావ్యగరిమలో పురిడించిన ప్రౌఢత శ్రీనాథుణ్ణి, పెద్దనను పోలికలోకి తెస్తుంది. యిక ప్రౌఢత విషయంలో ‘ఋతుఘోష’ ఆరు ఋతువుల ప్రాకృతిక సౌందర్యాల వర్ణనలే కాదు- విరహాలు, విప్లవాలు ద్యోతకం చేసినట్లనిపిస్తుంది. సామాన్యుల జీవన విధానానికి ప్రతీకలైన ఋతువులతో సాక్షాత్కారం చేసారు. ఒక రకమైన బాధలే కాకుండా నానారకాల బాధల్నించి ఉపశమనం పొందాలన్న భావనాబలం అక్షరాల్లో దర్శింపచేసారు.
‘‘హితవుగ మేఘమాలిక ద్రవించునుగాక / చిగిర్చి యంతటన్, లతలు సుమించుగాక / పృధులమ్మగు గాక వెలంది వెనె్నలన్ / ఋతువులు మారుగాక, జ్వలించు / క్షుధావ్యధితోగ్రజీవన, క్రతువులు మారెనే / యుగయుగమ్ముల భారమొకింత తీరెనే’’
వీటిని ఒక ప్రతిభావంతుడైన కవి, పండితుడు, విద్వత్ సంపన్నుని కలం నుంచి జాలువారిన అమృతాక్షరాలుగానే భావించాలి. నేడు సాహితీ సమాజంలో ఎన్ని మార్పులో రచించి యాభై ఏళ్ళు పైబడి వచ్చి చేరాయి. కాని ఈ స్వర్ణోత్సవ కావ్యవిశిష్టత మరొకసారి సాహితీవేత్తలను, మేధావులను, మరొకసారి కాళిదాసు ఋతుసంహారాన్ని, మేఘసందేశాన్ని చదవాలనిపించేటట్లు చేస్తుంది. ముఖ్యంగా వసంత వర్ణనలో నవకాంతులు పురులు విప్పాయా అన్న భ్రాంతి కలుగచేస్తారు.
‘‘కాలపు బాటలండి యొకా / నొక తియ్యటి వేళ కోమల / జ్వాలగ వచ్చి నా హృదయ / చారుతరాలయ శాంత కుంభశృం / గాలను మేలుకొల్పిన నవకాంతులతో’’ అన్న స్వాగతాలాపలను, మావి సుపూతల్ని, మమతల మాధుర్యాల్ని అనుభవైకవేద్యం చేస్తారు.
‘పద్యం’ అన్న పదాన్ని శేషేంద్ర విస్తృతార్థంలో వాడారన్నది లాక్షణికుల అభిప్రాయం. ఒక కావ్యలక్షణంలోంచి సమగ్రంగా సుధామయోక్తులు, భావనూత్నతలు, భావాంబుర వీధుల్లో విహరింపచేస్తాయి. శేషేంద్రది అపురూప ప్రజ్ఞల పద్య పటీరవం. ప్రతీకాత్మం తెల్సినట్టి ప్రతిభాన్వితం. ప్రతీకల్ని అద్భుత రసానంద పతాకాలుగా నిల్పిన చతురత్వం అనుభూతిలోకి తెస్తారు. యిది కావ్య గౌరవానికి ఆసాంతం ఒక మనోహరం, గంభీరంతోబాటు ధీరత్వమైన కవిత్వరీతిని తెల్పారు. వైవిధ్యభరితంగా ‘పక్షులు’, ‘సముద్రం నా పేరు’, ‘ఈ నగరం జాబిల్లి’లను వివిధ కాలాల్లో వెలువరించారు. కాని కావ్యాత్మక కథనశైలిని నిర్దేశించారు.
‘‘జీవితంలో లేని కవిత కాగితంలో వస్తుందా?
తునకమబ్బు లేకుండా చినుకు నేలపడుతుందా?’’
ఒక విప్లవకారుని బలమైన భావాలు, అభివ్యక్తులు ‘‘సముద్రం నా పేరు’’లో ప్రత్యక్షరం చేసారు. ఒక ప్రతిభాన్వితుడైన కవిగా తపించిన వాక్యాలు ‘‘సముద్రమంటే నీకేం తెల్సు? సముద్రాలెక్కడ ఆకాశాల్ని పిడికిళ్ళతో పొడుస్తాయో అక్కడికేపోతాను, తుఫానులతో స్నేహంచేస్తాను’’ అంటారు. ఈ కోవలో ‘‘శబ్దాలు-శతాబ్దాలు’’, ‘‘ఈ నగరం జాబిల్లి’’ వచ్చి చేరాయి. ముఖ్యంగా ‘‘ఈ నగరం జాబిల్లి’’లోంచి -
‘‘పిలుపులో నీకంటి మలుపులో ఉందో / తలపులో జాబిల్లి తెలుపులో ఉందో / ఎక్కడుందో వలపు ఎలా వచ్చిందో’’ - (ప్రథమ వీక్షణమనే తొలిచూపు) భావుకత్వం ఆస్వాదించగలం.
‘నేనింత పిడికెడు మట్టే కావచ్చు. కానీ కలమెత్తిన నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది’ అన్న గర్జనా గళంనుంచే ఒకింత కరుణని ఒలికించి ఒప్పిల్లచేయడం, వెంటనే చెలరేగే తుఫాన్లని తన భావాల అలల్లో సర్ఫింగ్ చేయించిన కౌశలం, నేర్పరితనం శేషేంద్రలో గమనించవచ్చును. యిక రామాయణాంతర్గత ‘‘షోడశి’’లో నిత్యనూతనంగా, ఆలోచనామృతంగా సుందరకాండను, శ్రీచక్రార్చనను, వాల్మీకి హృదయాన్ని పట్టుకున్న ద్రష్టగా గాయత్రి మంత్ర విశిష్టత, బ్రహ్మాండ పురాణాల్నించి వివరణలు, ఎవరూ చూపని, చూడని ఆలోచనతో చేసిన వివరణ కవి సమ్రాట్ విశ్వనాథవారినే అబ్బురపరచడం శేషేంద్ర ప్రతిభావిశేషం. మొత్తానికి రామాయణ తత్త్వం సుబోధకం చేసారు. సుందరమైంది శేషేంద్ర రూపం. మంచి వక్త. వ్యాసకర్తగా ఆయన విశ్వమానవ దృష్టిపథికుడైనాడు. 1951లో ‘షానామా’ గ్రంథ స్వేచ్ఛానువాదంనుంచి ‘శేషజ్యోత్స్న’, ‘మండే సూర్యుడు’, ‘ఆధునిక మహాభారతం’, ‘జనవంశం’ కావ్యాలు, ‘నరుడు-నక్షత్రాలు’, ‘విశ్వవివేచన’, ‘కవిసేన మేనిఫెస్టో’లు కూడా విలక్షణమైనాయి. ఒక విశ్వమానవ దృష్టి, నిత్య నైమిత్తిక ఆలోచనలు, సంప్రదాయ, ఆధునిక తత్త్వాల మేళవింపులతో ‘సర్వేజనా స్సుఖినోభవంతు’ అన్న ఆత్మనినాదం ఆలంబనగా చేసుకున్నారు. నిజ సంస్కారవంతమైన ‘కవితా హాలికుని’గా శేషేంద్రని భావించవచ్చును. విశే్లషణలలో వివేచనగల శేషేంద్రని చదివినా, విన్నా, ఆయనలోని తాత్త్విక భూమిక, కర్మాచరణ ప్రేరకంగా ఒక పూనికగా ఉపయోగపడుతుంది. ఆయన కవిత్వ నిర్మాణ భావచైతన్య శక్తి బలీయమైనది. వాడిన భాషలోని ఐక్యరూప గతి, తార్కిక సిద్ధాంతపు రీతి, వైమర్శిక ప్రజ్ఞానత్వం గోచరిస్తాయి.
‘‘నేను జేబులలో / కోకిలలు వేసుకుని రాలేదు / పిడికిళ్ళతో బాంబులతో వచ్చాను / నేను మోకరిల్లి ప్రార్థిస్తున్నాను / ఓ జిందగీ నన్ను సుఖం మీద శిలువ వేయకు’’- యిదీ 1980వ దశకంలో శేషేంద్ర కత్తిలాంటి పదునైన తెలుగు మాటల ప్రభావం, స్థానీయ సంస్కృతిని హైదరాబాద్‌లో స్థిరపడ్డ కవిగారికున్న నిర్భీతిని ప్రకటించడంగా భావించాల్సి ఉంటుంది. మీదుమిక్కిలి సంప్రదాయపుబాటలో ‘కవిసేన’ను నిర్మించి నడిపించిన క(్థ)వనశీలిగా ప్రఖ్యాతుడు. నూతనంగా మానవతను వ్యక్తీకరించడం, మానవతాసూర్యుడిగా, దళిత జీవుల ఒరల్లో ఖడ్గాలుగా ధరించి, దిశాంచలాల్లోకి పయనం సాగించారు శేషేంద్ర. ‘ఆధునిక మహాభారతం’ విశ్వమానవ కథగా భారతంలో పర్వాల సామ్యాన్ని తలపింపచేస్తుంది. ఒక సాహితి ప్రేమికుడిగా కావ్యరూప ద్రష్టగా కొత్తమలుపు తిప్పిన రచనలుగా ‘మండే సూర్యుడు’, ‘గొరిల్లా’, ‘నా దేశం- నా ప్రజలు’ వంటివి పరిశీలిస్తే కవితా ప్రయోగం పద చిత్రాలు విలక్షణతను సంతరించుకున్నాయి. రత్నమంజూషలుగా కవితాలంకారాలు అమర్చారు. శేషేంద్ర మార్కు కవిత్వ నిర్వచనం విస్తృతమైనది కవిత్వ ప్రయోజనంమీద నిశ్చితాభిప్రాయం కలిగి ఉన్నది. అదెలాగంటే, శేషేంద్ర మాటలే దీనికి ఆలంబనలని చెప్పాలి. శేషేంద్ర సాహిత్యంలోంచి కళ్ళల్లోను, కలల్లోను దర్శించిన అక్షరాలు సాదృశ్య విజ్ఞత-విజ్ఞానాత్మకంగా గోచరింపచేయడం వల్లనే ఆయనను యుగకర్తగా మనం ఆపాదించుకుంటున్నాము. అదే కోవలో విలక్షణంగా వైదిక, అలంకారిక శాస్త్రాల శేముషీ విభవునిగా శేషేంద్ర విలక్షణత విశ్వనాథ, శ్రీశ్రీ, తిలక్ మార్గాలనుంచి కూడా మనం అర్థం చేసుకోగలం.
కవిగా చెప్పాలంటే బహుముఖీనతల సారళ్యం, సైద్ధాంతిక నిరూపణల సామ్యం, తన భావనాబలంతో ఇజాల్ని, నిజాల్ని సమతూకంలోనే ప్రకటించారనే చెప్పాలి. కవిత్వాకాశంలో- పాలపుంతలు, సప్తర్షి మండలాలు, స్వాతి మెరుపులు, శేష కౌముదిలోంచి వెలిగే చంద్రికలై సారస్వత రంగంలో విరాజమానమైనాయి. అనువాద ప్రక్రియలో బహుశా శేషేంద్రకొచ్చినంత ప్రశంస మరే తెలుగుకవీ పొందలేదన్నది అధివాస్తవమే అన్పిస్తుంటుంది. ఎందుకంటే ఫ్రెంచ్, గ్రీకు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, తమిళం, కన్నడం, బెంగాలి, నేపాల్ భాషల మూలాల్ని ఎరుక పర్చడంవలన భాషల ఆదానప్రదానాలు జరిగాయి. యిక శేషేంద్ర వస్తువులు వర్తమానపు అంశాలుగా ఉంటాయి. సదా నూతనుడైన కవెప్పుడూ కాలిక స్పృహనం కలిగి ఉండాలన్నది శేషేంద్రజాలంగా కన్పింపచేస్తారు.
‘ఋతుఘోష’ శేషేంద్ర కవిత్వంలో నిండుగా స్నానించిన అనుభూతి నిస్తుంది. యువకవుల కవితా ఆసక్తిని సృష్టించుకోవడానికి సంక్షిప్తత, క్లిష్టత వర్తమాన భాష ఎంపిక చేసుకోవాలన్నది గురూపపేశమే అవుతుంది. పూర్వ కావ్య సువాసనలను, ఆధునిక దళిత స్ర్తివాద ఉద్యమాలు, వాటి నేపథ్యాల్ని ఆకళింపు చేసుకున్నప్పుడే సమాజ దార్శనిక కవిగా పేరుతెచ్చుకోవాలన్నది ఆయన భాష్యం-్భవం. హృదయశాఖే కవి కంటికి విమానాశ్రయమన్న శేషేంద్ర హృదయ పరిశీలన, ఆవిష్కరణలు కోకొల్లలు. సాహితీలోకం శేషేంద్రకు నివాళులర్పిస్తూనే వుంటుంది. రాబోయే తరాలకు శేషేంద్ర కవిత్వస్వరం అమరం, అప్రమేయం. ఆ శిఖరం అంతరాల్లో అగ్నిపర్వత విస్ఫోటనాలుంటాయి. అతి శీతల హిమాలయాలు మేరునగ ధీరతల పార్శ్వాల మేలుసంగమం. తెలుగు సాహిత్యంలోకి ఆయన్ను ఆయనే మహోన్నతంగా ఆవిష్కరింపచేసుకున్నారు.
ప్రాకృతికంగా భూమి, ఆకాశం, సముద్రం ఒకటేమిటి ప్రభాత పుష్పాలను రంగుల్లో స్నానం చేయించడం, పక్షివాలే హృదయంలా తన సాహితీ శాఖలన్నింటా నిశ్శబ్ద సౌందర్యారాధనలో దేవతల్ని దర్శించారు. ఒక్క పాటకోసం బతుకుబతుకంతా కోటి గొంతుకలై సమర్పించారు. అలా శేషేంద్ర సాహిత్యం ఉత్తుంగ శిఖరంలా భావజగత్తులో మనకు మార్గదర్శనం చేసారు.

- వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు 9441148158