మెయిన్ ఫీచర్

స్ర్తి విద్యకు ఆద్యుడు.. ‘కందుకూరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(నేడు వీరేశలింగం శత వర్థంతి)
వేదశాస్త్రాలకు పుట్టినిల్లేకాదు రాజమహేంద్రవరం సంఘ సంస్కరణోద్యమాలకు పట్టుగొమ్మ. ఆర్ష సంస్కృతికి ఆటపట్టు. అటువంటి చారిత్రక నగరంలో ప్రభవించిన యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు. నన్నయ్య పుట్టిన నేలమీదే వీరేశలింగం జన్మించడం తెలుగు జాతి చేసుకున్న పుణ్యం. 1848 ఏప్రిల్ 16న జన్మించిన వీరేశలింగం ఏకసంధాగ్రాహి. చదువులో చురుకుగా ఉండేవారు. ఇరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి రెండు శతకాలు రాశారు వీరేశలింగం. మొదట్లో మంత్ర తంత్రాలమీద గట్టి నమ్మకం వున్న వీరేశలింగం క్రమంగా వాటినుంచి బయటపడ్డారు. మూఢనమ్మకాలపై తిరుగుబాటు చేశారు. సాంఘిక సమస్యలపైన సామాజిక అంశాలపైనా దృష్టి పెట్టారు. మహిళలు చదువుకోకూడదనే విషయంపై విభేదించాడు. కాకినాడ సమీప కోరంగిలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన వీరేశలిం అక్కడే శుద్ధాంద్రోత్తర రామాయణం రాశారు. ఇది సీరియల్‌గా బందరు నుంచి వెలువడే పురుషార్థ ప్రదాయినిలో అచ్చయ్యింది. సంగ్రహ వ్యాకరణం పిల్లలకోసం రాశారు. నీతి దీపికను కూర్చారు. తనలోవున్న భావాలను యధేచ్చగా వెల్లడించానికి తనకొక పత్రిక అవసరమని గుర్తించిన వీరేశలింగం 1874 అక్టోబరులో వివేకవర్థని అనే మాసపత్రికను ధవళేశ్వరం నుంచి వెలువరించారు. ఈ పత్రిక చెన్నైలో అచ్చు అయ్యేది. స్ర్తి విద్య ఆవశ్యకతను గూర్చిన అనేక వ్యాసాలు ఈ పత్రికలో ప్రచురించేవారు. ఈ పత్రిక రెండు ఉద్దేశాలతో ప్రారంభించారు. దేశాభివృద్ధి, భాషాభివృద్ధి లక్ష్యంగా వీరేశలింగం ఈ పత్రికను సంధించారు. ఎక్కడ ఏ ఆక్రమం కనబడినా చూసి సహించే స్వభావం కాదు వీరేశలింగంది.
ఈ ప్రయత్నంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా లెక్క చేసేవారు కాదు. 1876 నుంచి వివేకవర్థని రాజమండ్రిలోనే ముద్రించడం ప్రారంభించారు. సమాజంలోని దుర్మార్గాన్ని ఎండగట్టారు. సమాజానికి చెడు చేసే ఏ విషయన్నైనా నిర్మొహమాటంగా రాసేవారు. హాస్య సంజీవిని పేరుతో మరో పత్రిక పెట్టారు. కథలు, కవితలు పుంఖానుపుంఖాలుగా ఈ పత్రికలో అచ్చయ్యేవి. యువకులు ఆసక్తిగా చదివేవారు. ఒకపక్క సంఘ సంస్కరణ దృష్టిలో వ్యాసాలు రాస్తూనే మరోపక్క నవలలు, కథలు, నాటకాలు రచనలతో పాటు అనువాదాలు చేయడం ప్రారంభించారు. రాజశేఖర చరిత్ర, సత్యవతీ చరిత్ర, ప్రహ్లాద నాటకం- ఇలా 100కుపైగా వివిధ సాహిత్య ప్రక్రియల్లో గ్రంథాలు రాసి ముందుతరాలకు ఆదర్శప్రాయులయ్యారు. రచనా వ్యాసంగంతోపాటు సంఘ సంస్కరణ దృష్టితో అనేక కార్యక్రమాలు నిర్వహించేవారు. వీరేశలింగం స్ర్తి విద్య కోసం, వితంతు పునర్వివాహాలకోసం, మూఢ విశ్వాసాలు తొలగించడం కోసం, కులాచారాల నిర్మూలనకు విశేషమైన కృషి చేశారు. 1879 ఆగస్టు 3న వితంతు వివాహం శాస్త్ర సమ్మతమే అంటూ వీరేశలింగం ఉపన్యాసం చేసి సంచలనం సృష్టించారు. సంప్రదాయవాదులు ఈ ప్రసంగంతో కలవరపడ్డారు. వీరేశలింగాన్ని దుర్భాషలాడారు. అయినా చలించలేదు. 1881 డిసెంబరు 11న గౌరమ్మకు గోగులపాటి శ్రీరాములతో మొదటి వితంతు వివాహాన్ని జరిపించి ఛాందసవాదులు నోరు మూయించారు. మొత్తం 40 వితంతు వివాహాలు జరిపించారాయన. వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు, వాటిని వీరేశలింగం ఆచరించి చూపేవారు. వీరేశలింగం స్ర్తి విద్యావ్యాప్తికి పాఠశాలలు నెలకొల్పారు. మహిళకోసం 1883లో సతీహితబోధిని అనే పత్రికను స్థాపించారు. వీరేశలింగానికి వెన్నుదన్నుగా ఉండే మిత్రులు పైడా రామకృష్ణయ్య, బసవరాజు గవర్రాజు మరణంతో వీరేశలింగం చేసే కార్యక్రమాల్లో వేగం తగ్గింది. 1890లో వివేకవర్థని ప్రచురణ ఆగిపోయింది. చింతామణి అనే పత్రికను న్యాపతి సుబ్బారావుతో కలిసి ప్రారంభించారు. రాజమండ్రి ప్రార్థన సమాజం పక్షాన సత్యసంవర్థని అనే పత్రిక ప్రచురణ మొదలుపెట్టారు. 1891లో టౌన్‌హాలు కట్టించారాయన. రాజమండ్రిలోనే కాక మద్రాసు, బెంగుళూరుల్లో ప్రార్థన మందిరాలు కట్టించారు. 1906లో హితకారిణి సమాజం స్థాపించిన వీరేశలింగం 1907లో వితంతువులకోసం రాజమండ్రిలోని గాంధీపురంలో విక్టోరియా వితంతు శరణాలయం స్థాపించారు. అనాధ వితంతువులను చేరదీసివారికి చదువు చెప్పి, సమాజంలో ఆదర్శవంతమైన జీవితాన్ని గడపటానికి ఈ శరణాలయం ఉద్దేశించబడింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఈ శరణాలయం నడుస్తోంది. వీరేశలింగం సతీమణి రాజ్యలక్ష్మి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ భర్త చేసే కార్యక్రమాల్లో సహకరించేది. విక్టోరియా శరణాలయంలో రాజ్యలక్ష్మిగారు వితంతువులకు సంగీతం నేర్పేవారు. ఆమె 1910 ఆగస్టు 12న మరణించగా, 1919 మే 28న వీరేశలింగం తనువు చాలించారు. గోదావరి మండలానికి, తద్వారా యావత్ తెలుగు దేశానికి వనె్నతెచ్చిన వీరేశలింగం సంస్కర్తగా తరతరాలకు చిరస్మరణీయుడుగా మిగులుతారు.

-పుట్టా సోమన్నచౌదరి 94403 39682