మెయన్ ఫీచర్

ఐదేళ్ల ‘అమావాస్య చంద్ర’ పాలన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదేళ్ల ‘అమావాస్య చంద్రుడి’ అమరావతి పాలన ముగిసింది. ఒక వర్గం మీడియా తప్ప- ఈ విజయాన్ని ప్రజలందరూ ఊహించిందే. తన ఓటమి గురించి చంద్రబాబుకు సైతం ముందే తెలుసు. కానీ అందర్నీ నమ్మించేందుకు, కార్యకర్తలు ఉత్సాహం కోల్పోకుండా చూసేందుకు ఆయన చేసిన గారడీ విద్యలు ఎనె్నన్నో! ‘కొందర్ని కొంతకాలం మోసం చేయగలం- అందర్నీ ఎల్లకాలం మోసం చేయలేం’ ఇది బాబు విషయంలో అక్షరాలా నిజం. చిన్నప్పుడు సంతలో గారడీ వాడి విద్యను చూసే వాళ్ళం. ముంగీస, పాము పోట్లాడుతాయి అంటూ గంటసేపు అందర్నీ ఆకర్షించి చివరికి తుస్సుమనిపించి పాముని, ముంగీసను పెట్టెల్లో పెట్టి పట్టుకుపోతాడు. బాబు కూడా ఈ ఐదేళ్ళూ ఇలానే చేస్తూ, చివరికి తుస్సుమనిపించి ప్రజలతో ‘్ఛ’కొట్టించుకొన్నాడు. అమరావతి ‘భ్రమరావతి’గానే మిగిలిపోయింది. ప్రపంచంలోనే ‘అమరావతి’ మేటి నగరం అవుతుందన్నారు. సినీ దర్శకులు రాజవౌళి, బోయపాటి శీను, రాఘవేంద్రరావు లాంటి వారిని పిలిపించి గ్రాఫిక్స్‌తో కలర్‌ఫుల్ సినిమా చూపించారు. చంద్రబాబు మాటలు నీటిమూటలే అని ఒక్కొక్కటి బయటపడ్డాయి. నిజం నిక్కచ్చిగా ప్రజల్ని నిద్రలేపింది. ఎన్ని తాయిలాలు ప్రకటించినా, ఎన్ని పప్పుబెల్లాలు పెట్టినా ప్రజలు బాబుకు వాత పెట్టారు.
‘నేను నిప్పుని, అవినీతికి నేనంటే భయం.. సత్యహరిశ్చంద్రుడ్ని.. నాపై ఎవరూ ఎలాంటి ఆరోపణలు చేయలేకపోయారు.. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర నాది..’ అని చంద్రబాబు మాట్లాడుతుండగానే హైదరాబాద్‌లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారు. రాతికి రాత్రే హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చేశారు. ‘హైద్రాబాద్ నా కష్టార్జితం.. ఇక్కడ మనకు 10 ఏళ్లపాటు హక్కులున్నాయి.. తెలంగాణలో టీడీపీని అధికారానికి తెచ్చేవరకు హైద్రాబాద్‌లోనే ఉంటా.. పార్టీని బతికిస్తా..’ అన్నారు. చివరికి కేసీఆర్ దెబ్బకి హైద్రాబాద్‌లోని తెలుగు తమ్ముళ్ళకైనా చెప్పకుండా పారిపోయారు. మోసపోయిన తెలుగు తమ్ముళ్ళు నిజం గ్రహించి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించారు. హైద్రాబాద్‌లోనే ఉండాలనుకొన్న ఆయన కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా ఖర్చుచేసి అన్ని సౌకర్యాలు కల్పించుకొన్నారు. సెక్రటేరియట్‌లో చాంబర్, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో క్యాంప్ ఆఫీసుకు ఎంతో ఖర్చు చేశారు.
ఆ తర్వాత ఆరంభమైంది విజయవాడలో ప్రహసనం. నిప్పులాంటి బాబు కరకట్టపై ‘లింగమనేని’కట్టుకొన్న బంగ్లాని ఆక్రమించేసుకొన్నారు. అందుకు ఆ వ్యక్తికి బాగానే సహకరించారు. మంగళగిరిలో 400 ఎకరాలు క్యాపిటల్ సిటీలో పరిధిలోకి రాకుండా అడ్డు చక్రం వేశారు. అలా ఈయన నీతిపాలన ఆరంభమైంది. ఈలోగా పుష్కరాలొచ్చాయి. అవి నిజంగా చంద్రబాబుకి, దేశం నాయకులకే పరిమితం. పుష్కర సినిమాకు ఎన్ని రంగులో, ఎన్ని హంగులో! అక్కడి గుడిసెలు తొలగించారు. పాత దేవాలయాల్ని కూలకొట్టారు. తాను పుష్కర స్నానానికి వెళ్లనపుడు జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది చనిపోతే తనది తప్పు అని ఒప్పుకోక నెపం ఎవరిపైనో వేసేసి హాయిగా వెళ్ళిపోయారు. ఆయన ప్రచార ఆర్భాటం ఫలితంగా అమాయకుల ప్రాణాలు నీటిలో కలసిపోయాయి. ఓటుకు నోటు కేసును తెలుగు తమ్ముళ్ళు, అధికారులు ఆదర్శంగా తీసుకొన్నారు. ఫలితంగా అవినీతి వికృత రూపం దాల్చింది. తేదేపా నేతలు జన్మభూమి కమిటీల పేరున ‘ఇసుక’ను బాగానే మేశారు. అధికారులు సైతం అడ్డదారులు తొక్కారు. ఎక్కడ చూసినా అవినీతి తాండవం ఆడింది. ఇవేవీ చంద్రబాబు దృష్టికి రాలేదు పాపం. ‘సుపరిపాలన’ కావాలంటే నాయకుడికి క్రెడిబిలిటీ అనేది చాలా ముఖ్యం. దానిని చంద్రబాబు క్రమంగా కోల్పోయారు.
తన కులం వారి పట్ల ఆయన అమితమైన ప్రేమ చూపారు. మిగతా కులాలకు దూరమయ్యారు. చివరకు తన చాంబర్‌లో నీళ్ళిచ్చేవారు కూడా తన కులం వారే వుండేవారట! చీరాల మాజీ శాసనసభ్యుడు ఆమంచి క్రిష్ణమోహన్ చేసిన ఆరోపణలు యావత్ ఆంధ్రప్రదేశ్‌ను షేక్ చేశాయి. మొత్తం 40 మందికి సీఐలుగా ప్రమోషన్లు ఇస్తే- అందులో ఆయన కులం వారు 38 మంది ఉండడం ఎవరికైనా విస్మయం కలిగిస్తుంది. ఒక్క కులం వారితోనే ఏ నాయకుడూ సీఎం కాలేడు. చిరంజీవి, పవన్‌కళ్యాణ్ ఎందుకు గెలవలేకపోయారో అందరికీ తెలిసిందే.
ఒకప్పుడు బలహీన వర్గాలవారే తెలుగుదేశం పార్టీకీ వెన్నుదన్ను అని చంద్రబాబు అనేవారు. కేంద్రంలో రెండు మంత్రి పదవులిస్తే వాటికి అగ్ర కులాల్నే ఎంపిక చేయడం ఆయన చేసి పెద్ద తప్పు. రాజ్యసభ సీట్లను అగ్రకులాలకు ఇవ్వడం బలహీనవర్గాలకు నచ్చలేదు. బీసీలను ఆయన కరివేపాకులా వాడుకొన్నారు. ‘ముద్రగడ’ ఎపిసోడ్‌తో కాపులు కూడా చంద్రబాబుకు దూరమయ్యారు. ఇక ఎన్జీవోల సంఘం నాయకుడు అశోక్‌బాబు చంద్రబాబు పంచన చేరి ఉద్యోగులంతా తెదేపా వైపే వున్నట్లు భ్రమింపచేసి తాను మాత్రం లబ్ధిపొందాడు. బ్రాహ్మణ కులానికి చెందిన ఐ.వై.ఆర్.కృష్ణారావును అమర్యాదకరంగా పదవినుంచి తొలగించడం, తిరుమలలో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల్ని అర్చకత్వం నుండి తొలగించడాన్ని ఆ వర్గం వారు జీర్ణించుకోలేకపోయారు. ఎస్‌సిలు, బీసీలు, బ్రాహ్మణులు, ఎన్.జి.ఓలు అందరూ పార్టీకి దూరమయ్యారు. ఎన్నికల్లో వైకాపాకి వచ్చిన వోట్లను చూస్తుంటే- బాబుకు సొంత కులం వారైనా అండగా నిలిచారా? అన్న అనుమానాలు వస్తాయి.
విజయవాడలో దుర్గగుడి ఫ్లై వోవర్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేస్తూ పుష్కరాల్లోగా దాన్ని పూర్తి చేస్తామన్నారు. ఐదేళ్లు గడిచినా అతీగతీ లేదు. అమరావతి కూడా అంతేగా! అని భావించరు ప్రజలు. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి మంచిగానో, బలవంతంగానో తీసుకొన్న భూమిని చంద్రబాబు కారు చౌకగా బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయడం ఆ ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం ఇందుకే భారీ ఓటమి చవిచూసింది.
పసుపు-కుంకుమ, అన్నదాతా సుఖీభవ వంటి పథకాలు తనని ఎలాగైనా గెలుపువైపు తీసుకెళ్తాయని చంద్రబాబు భ్రమపడ్డారు. తన పిలుపుమేరకు ఆడవాళ్ళంతా అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి టీడీపీకి ఓట్లేశారని చెప్పుకొన్నారు. తనకోసం చెన్నై, బెంగుళూరు, కొన్ని విదేశాల నుండి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వచ్చి ఓట్లేశారని చంద్రబాబు ఎంత గొప్పగా చెప్పుకొన్నారో..!
చంద్రబాబు ఎన్నికల సభల్లో మాట్లాడుతూ, ‘మన వాళ్ళు నాలుగు రాళ్ళు సంపాదించి ఎన్నికల్లో పంచేవారు. కానీ మనవాళ్ళపై ఇన్‌కంటాక్స్ దాడులు చేస్తుండడం వల్ల నేనే తెలివిగా ప్రభుత్వ ధనాన్ని పసుపుకుంకుమ, అన్నదాత సుఖీభవ కింద ముందే పంచేశాను’ అన్నారు. ఈ మాటలు తెలివి వున్న ఏ నాయకుడూ బహిరంగంగా చెప్పడు. తాయిలాలిస్తే జనం ఓట్లేసేస్తారనే భ్రమల్లో, ఆనందంలో బాబు తేలిపోయారు.
ఇక తేదేపా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అలంకార ప్రాయమైంది. అందులో ఏ అంశం కూడా బాబుకు గుర్తుకే రాలేదు. మేనిఫెస్టో ప్రజల్ని నమ్మించాలనుకొన్న అస్త్రం. కానీ ప్రజలు తెలివైనవారు గనుక ఎన్నికల్లో తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు.
దుబారా చేయడం అన్నది ఈ ఐదేళ్ళలో అన్ని హద్దుల్ని దాటేసింది. చంద్రబాబు స్పెషల్ ఫైట్లు వేసుకొని ప్రపంచాన్నంతా చుట్టేశారు. ఏ దేశానికి వెళ్లినా ఆ దేశంలా అమరావతిని నిర్మిస్తామన్నారు. విదేశాలకు ఒక బెటాలియన్‌లా ఆపీసర్లతోపాటు, చివరికి అటెండర్‌ను కూడా తీసుకెళ్ళేవారు. అమరావతి శంకుస్థాపనకు, ధర్మపోరాట దీక్షలకు, కోట్లాది రూపాయలు వెదజల్లేశారు. సగం ఖజానా అంతా ఆయన దుబారాలకే ఆహుతి అయింది.
ఎన్నికల వాతావరణం మొదలయ్యాక నిద్ర లేచినది మొదలు పడుకొనే వరకు చంద్రబాబు స్మరించింది ముగ్గుర్నే. ఒకరు మోదీ, రెండు జగన్, మూడు కేసీఆర్. వీరిని బూచిలా చూపి జనం మెప్పు పొందాలని ప్రయత్నించి ఘోరంగా భంగపడ్డారు. ఎన్నికల తేదీ దగ్గర పడినకొద్దీ ఆయనలో అభద్రత, అసహనం పెరిగింది. కొంతమంది అవినీతిపరులను పక్కనే పెట్టుకుని ఇతర పార్టీల అవినీతి గురించి ఆయన చేసిన ప్రసంగాలను జనం నమ్మలేదు. ఓట్లు వేయమని ఆయన ఎంతగా ప్రాధేయపడినా ఫలితం దక్కలేదు.
ఏ నాయకుడైనా తాను చేసిన మంచి పనులు వివరించి ఓటు వేయమనడం సహజం. తుది నిర్ణయం ప్రజలదే. సభకు హాజరైన పిల్లలకు, పెద్దలకు కూడా కాళ్ళకు దండాలు పెట్టడం ప్రజలకే అసహ్యం తెప్పించింది. ప్రజలంతా మనవైపే ఉన్నారని చంద్రబాబును ఆయన అనుచరులు బాగా నమ్మించారు. ఇక, విశాఖ ఎయిర్ పోర్ట్‌లో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యా యత్నం జరిగింది. సీఎంగా వున్న వ్యక్తి అలాంటి ఘటనల్ని తీవ్రంగా ఖండించి, జగన్‌ను ఫోనులోనైనా పరామర్శించాలి. కానీ చంద్రబాబులో అంతటి ఔన్నత్యం కనిపించలేదు. ఈ ఘటనపై బాబు, డీజీపీ చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వైకాపాను ‘కోడికత్తి’ పార్టీగా అవమానించారు.
టీటీడీ వారి శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని, దానికంతటికీ కారకుడు సినీ దర్శకుడు రాఘవేంద్రరావే అని మీడియా కోడైకూసింది. విజిలెన్స్ ఎంక్వయిరీ వేసి ఆరోపణలు అన్నీ నిజమేనని తేల్చారు. మరి ఏం జరిగింది? అదే రాఘవేంద్రరావును కొత్తగా ‘్ఛర్మన్’ పదవి సృష్టించి అందులో కూర్చోపెట్టారు. ప్రజలంతా ముక్కుమీద వేలేసుకొని విడ్డూరంగా చర్చించుకొన్నారు.
కేసీఆర్‌ను తిట్టడం కోసం ‘భద్రాచలం మాదే..’ అనడం మొదలు పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్ జరిగినపుడు పాక్ ప్రధానిని వెనకేసుకొని రావడం కూడా తీవ్ర విమర్శలకు గురిచేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి జోస్యంతో అధఃపాతాళానికి పడిపోయినా, ఏపీ ఎన్నికల్లో కూడా ఆ చిలక జోస్యానే్న నమ్ముకోవడం చంద్రబాబు అజ్ఞానానికి పరాకాష్ఠ.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీ, ఇంటెలిజన్స్ ఐ.జి. వెంకటేశ్వరరావు తొలగింపు వ్యవహారంలో చంద్రబాబు ప్రవర్తించిన తీరు చాలా దారుణం. పరిపక్వమైన నాయకుడు చంద్రబాబు అని అందరూ అనుకొంటారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన తన అపరిపక్వతను పూర్తిగా తేటతెల్లం చేసుకొన్నారు. సిబిఐ పైన, ఎన్‌ఐఎ పైన, ఇన్‌కంట్యాక్స్ దాడుల పైన, ఎలక్షన్ కమిషన్ పైన, నూతన చీఫ్ సెక్రటరీపైన బాబు చేసిన యుద్ధం రాష్ట్రానికే సిగ్గుచేటు. జాతీయ స్థాయిలో మన పరువుపోయింది. చివరికి రాంగోపాలవర్మను విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టకుండా అడ్డుకోవడం కూడా ఈయనలోని అభద్రతా భావానికి నిదర్శనం.
జనసేనతో లోపాయికారీ పొత్తు కూడా టీడీపీ కొంప ముంచింది. ఇద్దరు నేతలూ భారీగా మూల్యం చెల్లించుకొన్నారు. బహిరంగ పొత్తు వుండివుంటే ఇరువురికీ కొంత లాభమైనా చేకూరేదే! తెదేపా పాలనలో పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. ఏకపక్ష దాడులు, అక్రమార్కులకు పోలీసుల వత్తాసు రాష్ట్రాన్ని నాశనం చేశాయి.
కర్ణుడి చావుకు వేయి కారణాలు అంటారు. అలాగే చంద్రబాబు ఓటమికి సవాలక్ష కారణాలున్నాయి. అమరావతి ల్యాండ్ పూలింగ్, పోలవరం, ఇసుక మాఫియా, సెక్రటేరియట్ నిర్మాణం, ఇరిగేషన్ టెండర్స్ ఇలా అన్నింటా అవినీతి రుద్రతాండవం చేసింది. మరోవైపు చంద్రబాబు ఎంత ఎక్కువగా తిడితే మోదీకి అంతలా లాభం కలిగింది. ఓ వర్గం మీడియాను నమ్ముకొనే బదులు ప్రజల్ని నమ్ముకుని ఉంటే చంద్రబాబు గెలిచేవారు. ప్రచార యావకూ కొన్ని హద్దులుంటాయి. పరిధి దాటితే అది వెగటుగా మారుతుంది. ఐదేళ్లూ మీరు ప్రజల్ని మరచిపోయి ‘జగన్, మోదీ, కేసీఆర్’ల నామస్మరణతోనే గడిపేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రవర్తనలో మార్పు రావాలి. సొంత మీడియాపై ఆధరాపడడం మానేసి, అనునిత్యం ప్రజలతో మమేకం కావాలి. ఇపుడు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంది. అందరికీ ఆదర్శంగా ఉంటేనే జనం జేజేలు కొడతారని గ్రహించాలి.

-సమ్మెట 88863 81999