మెయన్ ఫీచర్

‘ఒకే దేశం.. ఒకే భాష’ నినాదమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ తప్పనిసరిగా హిందీ భాషను నేర్చుకోవాలంటూ జాతీయ నూతన విద్యా విధానం ముసాయిదాలో పొందుపరిచిన నిబంధనను సవరించుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించింది. ముసాయిదాను ప్రకటించిన కొద్దిగంటలకే దక్షిణాది రాష్ట్రాల నుండి ముఖ్యంగా తమిళనాడు,కేరళ,కర్నాటక రాష్ట్రాల నుండి నిరసన సెగలు ఢిల్లీని తాకాయి. దాంతో హుటాహుటిన కేంద్రం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఫలితంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ముసాయిదాలో మార్పులు తెచ్చింది. హిందీయేతర రాష్ట్రాల్లోనూ తృతీయ భాషగా హిందీని విద్యార్థులు అభ్యసించాలన్న ప్రతిపాదనపై నిరసనలు రేకెత్తడంతో ఆరు లేదా ఏడు తరగతులలోవిద్యార్థులు తృతీయ భాషను ఎంచుకోవడం లేదా మార్చుకోవడం చేయవచ్చని పేర్కొంది. తొలి ముసాయిదాలో విద్యార్థులు ఏ రాష్ట్రంలో చదువుతున్నా త్రిభాషా విధానాన్ని అనుసరించి హిందీ, ఆంగ్లం తప్పనిసరి కొనసాగాలని కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ సూచించింది. భాషాపరమైన నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ ఆయుధంగా మలుచుకోవడంతో ఉలిక్కిపడిన కేంద్రం తొలిరోజే అప్రమత్తమైంది. ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటామని, ఆ తర్వాతనే ఆమోదం తెలుపుతామని కేంద్రం పేర్కొంది. హిందీని తప్పనిసరిగా నేర్చుకోవల్సిన పనే్లదని, అయితే ఏవైనా మూడు భారతీయ భాషలను మాత్రం తప్పనిసరి నేర్చుకునేలా కొత్త సవరణలను తెరమీదకు తెచ్చింది.
రాజ్యాంగంలోని 17వ విభాగం మొదటి అధ్యాయంలో కేంద్రంలో అధికార భాషల గురించి వివరించారు. అధికరణం 343 ప్రకారం దేవనాగరి లిపిలో ఉన్న హిందీని కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్తించింది. అధికారిక అవసరాలకు ఉపయోగించే అంకెలు మాత్రం అంతర్జాతీయ వాడుకలో ఉన్న భారతీయ అంకెలు మాత్రమే ఉంటాయి. క్లాజు -1లోని ఏ అంశాలు ఉదహరించినా రాజ్యాంగం అమలులోకి రాక ముందు ఉపయోగిస్తున్న విధంగానే రాజ్యాంగం అమలులోకి వచ్చిన 15 ఏళ్ల వరకూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు వ్యవహారాలను ఇంగ్లీషులోనే కొనసాగించాలని పేర్కొంది. అయితే ఆ 15 సంవత్సరాల్లో ఆంగ్లంతో పాటు హిందీని కూడా అధికారిక వ్యవహారాలు నిర్వహించడానికి, అంతర్జాతీయ భారతీయ అంకెలతో పాటు దేవనాగరి అంకెలను కూడా ఉపయోగించడానికి అవకాశం కల్పిస్తూ రాష్టప్రతి ఉత్తర్వులు జారీచేయవచ్చని రాజ్యాంగంలో పేర్కొన్నిరు. అధికరణం 344లో పేర్కొన్న విధంగా అధికార భాషపై పార్లమెంటరీ కమిషన్‌ను, భాషా సంఘాన్ని నియమించేందుకు వీలు కల్పించింది. భాషకు సంబంధించిన అంశాల్లో రాష్టప్రతికి తగిన సలహాలు ఇచ్చేందుకు భాషా సంఘం ఏర్పాటు చేసేందుకు ఈ క్లాజు కింద వీలుకలిగింది. రాజ్యాంగంలోని అధ్యాయం -2లో ప్రాంతీయ భాషల ప్రస్తావన ఉంది. అధికరణం 345లో రాష్ట్రాల అధికారిక భాష లేదా భాషలను ఖరారు చేయవచ్చు. ఈ నిర్ణయాలు అధికరణం 346, 347లకు లోబడి ఉండాలని నిర్ణయించారు. 346లో వివిధ రాష్ట్రాల మధ్య, కేంద్రం- రాష్ట్రాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు గతంలో ఏ భాషలో కొనసాగాయో (అంటే ఆంగ్లం) అదే భాషలో కొనసాగించవచ్చని పేర్కొంది. తమ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు హిందీలో ఉండాలని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు భావిస్తే అంగీకరిస్తే అవి మాత్రం హిందీలో ఉండొచ్చు. ఏదైనా రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు తాము మాట్లాడే భాషను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిందిగా రాష్టప్రతిని కోరవచ్చు. వారి కోరికను రాష్టప్రతి ఆమోదించినట్టయితే ఆ భాష కూడా ఆ రాష్ట్రం అంతా అధికారికంగా గుర్తించే వీలుందని అధికరణం 347లో పేర్కొన్నారు. పనిలో పనిగా సుప్రీం కోర్టు, హైకోర్టుల, శాసనాలకు సంబంధించిన భాష విషయంలోనూ రాజ్యాంగం చాలా స్పష్టంగా పేర్కొంది.
అధికరణం 348 ప్రకారం సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో కొనసాగే న్యాయ ప్రక్రియ మొత్తం ఆంగ్లంలోనే కొనసాగాలని పేర్కొంది. దిగువస్థాయి న్యాయస్థానాల్లో మాత్రం ఆయా రాష్ట్రాల వాడుక భాష లేదా అధికార భాషలో న్యాయవ్యవస్థ కొనసాగే వీలుంది. పార్లమెంటులోని ఉభయ సభల్లో లేదా శాసనసభల్లో ప్రవేశపెట్టే బిల్లులు వాటి సవరణలు అధికారిక పాఠం , శాసనాలు, రాష్టప్రతి, గవర్నర్లు చేసే ఆర్డినెన్స్‌లు, అనుబంధ ఆదేశాలు, రూల్స్, రెగ్యులేషన్స్, బైలాస్ అన్నీ ఆంగ్లంలోనే కొనసాగాలని ఈ అధికరణం పేర్కొంటోంది. హైకోర్టుల్లో న్యాయప్రక్రియకు సంబంధించి ఆయా గవర్నర్లు ఆదేశించే వీలు కల్పించారు. అధికరణం 349 కింద రాష్టప్రతి అనుమతి లేనిదే వాడుక భాషకు సంబంధించి శాసనాలను మార్చే వీలు లేదు. అధికరణం 350 కింద ఆర్జీలు, ఫిర్యాదులను మాత్రం ఏ భాషలోనైనా పంపించే వీలు కల్పించారు. అధికరణం 350ఏ లో భాషాపరమైన మైనార్టీలకు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన కొనసాగించే వీలు, అధికరణం 350బీ కింద భాషాపరమైన మైనార్టీల కోసం ప్రత్యేక అధికారిని నియమించడంపై స్పష్టత ఇచ్చారు. అధికరణం 351లో హిందీ భాషాభివృద్ధికి సూచనలు ఉన్నాయి. విభిన్న సంస్కృతుల మిశ్రమమైన భారతీయుల మధ్య భావ వ్యక్తీకరణ మాధ్యమంగా హిందీని అభివృద్ధి చేయడం కేంద్రం ప్రభుత్వ బాధ్యత. ఆ క్రమంలో అవసరమైన చోట సంస్కృతాన్ని ప్రాథమిక మాధ్యమంగా స్వీకరిస్తూ, ఎనిమిదో షెడ్యూలులోని ఇతర భాషలతో సమ్మిళితం అవుతూ హిందుస్థానీ పదోచ్చరణకు తగిన ప్రాధాన్యత ఇస్తూ హిందీ భాషా వ్యాప్తికి కృషి జరగాలని రాజ్యాంగం పేర్కొంటోంది.
వాస్తవానికి 1949లోనే భారతదేశానికి హిందీ అధికార భాషగా ఉండాలని రాజ్యాంగ సభ తీర్మానించింది. 1952లో హిందీ స్వచ్ఛంద శిక్షణను విద్యాశాఖ చేపట్టింది. గవర్నర్లు, హైకోర్టు, సుప్రీం కోర్టు సైతం హిందీని వాడొచ్చని ఆదేశాలిచ్చింది. 1955లో అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో హిందీ బోధనా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఖేర్ కమిషన్‌ను నియమించి ఆర్టికల్ 343 (2) కింద దేశం అంతా హిందీ వాడాలని ఆదేశించింది. 1960లో హిందీ టైపింగ్, స్టెనోగ్రఫీని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నిర్బంధం చేశారు. హిందీ శబ్దపద కోశాలు, చట్టాల తర్జుమా జరగాలని రాష్టప్రతి ఉత్తర్వులు జారీ చేశారు. 1963లో హిందీని జాతీయ అధికార భాషగా గుర్తిస్తూ చట్టాన్ని తెచ్చారు. 1967లో ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్రీయ హిందీ సమితిని ఏర్పాటుచేశారు. త్రిభాషా సూత్రాన్ని అమలులోకి తెచ్చారు. 1971లో మరో అడుగుముందుకు వేసి కేంద్రీయ అనువాద బోర్డును నెలకొల్పి, 1975లో అధికార భాషా శాఖను స్థాపించారు. 1977లో అప్పటి విదేశాంగ మంత్రి అటల్ బిహారి వాజపేయి ఐక్యరాజ్యసమితిలో హిందీలో మాట్లాడి సంచలనం సృష్టించారు.
1981లో హిందీని అధికారిక భాషగా కేంద్ర సచివాలయ శాఖల్లో ప్రారంభించారు. యంత్రాలు, ఎలక్ట్రానిక్ పరకరాలను హిందీ భాషలో వాడకం పెంచడానికి 1983లో టెక్నికల్ సెల్ ఏర్పాటైంది. మరో పక్క సిబ్బందికి హిందీ టైపింగ్, షార్టు హ్యాండ్ నేర్చించడానికి సెంట్రల్ హిందీ టైపింగ్ ఇనిస్టిట్యూట్ స్థాపించారు. 1986 నుండి రాజభాషా అవార్డులు మొదలయ్యాయి. 1988లో అప్పటి విదేశాంగ మంత్రి పీవీ నర్సింహరావు ఐక్యరాజ్యసమితిలో హిందీలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక రూపంలో హిందీ అభివృద్ధికి అడుగులు వేస్తూ 1999లో హిందీ అధికారిక భాషా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించింది. హిందీలో ఈ-మెయిల్, చాటింగ్ సదుపాయాలతో అధికారిక భాషా పోర్టల్‌ను 2000లో ప్రారంభించారు.
2003లో ఎన్‌డీఎ, సీడీఎస్ పరీక్షా పత్రాలను హిందీలో ముద్రించడం మొదలుపెట్టారు. 2004 నుండి విద్యారంగంలో విరివిగా హిందీ వాడకాన్ని పెంచుతూ శాస్త, సాంకేతిక హిందీ పదాల కమిషన్‌ను నెలకొల్పింది. జాతీయ స్థాయిలో ఒకే దేశం- ఒకే భాష అమలు దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేసినా చివరికి అది వివాదాస్పదంగా తయారైంది. రానున్న కాలంలో ఒకే భాషగా హిందీని సంపూర్ణంగా అమలు చేయాలనే వ్యూహం మొదటి అడుగులోనే బెడిసికొట్టింది. మాతృభాషతో పాటు అదనంగా ఏ భాష నేర్చుకున్నా ఫర్వాలేదనేది భాషా నిపుణుల భావన. కేవలం ఏదో ఒక్క భాషనే నెత్తిమీద రుద్దకుండా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా వారి ఇష్టా ఇష్టాలకు పెద్ద పీట వేసి ముందడుగు వేసే విస్తృత భాషా దృక్పథం కేంద్రప్రభుత్వానికి ఉండాలి. భాష వికాసాన్ని సంస్కృతిని, నాగరికతను ప్రోది చేయాలే తప్ప రాజకీయ మంటలకు ఆజ్యం పోయకూడదు. దేశ ప్రజల్లో తామంతా ఒకటనే భావనను మన భాషలు పెంపొందించాలే తప్ప సరికొత్త వివాదాలకు మార్గం కారాదు.

-బీవీ ప్రసాద్ 98499 98090