మెయిన్ ఫీచర్

ఆటలో ఆంక్షల సంకెళ్లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవ్యాప్తంగా విభిన్న రంగాల్లో మహిళలు దూసుకుపోతుండగా.. కొన్ని ప్రాంతాల్లో మతాచారాలు, కట్టుబాట్ల పేరిట వారిపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు స్టేడియంలలోకి మహిళలు అడుగుపెట్టడానికి వీల్లేదంటూ సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల్లో ఇప్పటికీ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. ఫ్రాన్స్‌లో ఈనెల ఏడవ తేదీ నుంచి నెలరోజుల పాటు ‘మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్’ పోటీలకు రంగం సిద్ధం కాగా, కొన్ని ముస్లిం దేశాల మహిళలు మాత్రం మ్యాచ్‌లను తిలకించేందుకు నోచుకోవడం లేదు. వరల్డ్ కప్ మ్యాచ్‌లను చూసేందుకు ఫ్రాన్స్‌కు భారీ సంఖ్యలో క్రీడాభిమానులు తరలివస్తున్నారు. అయితే- ఇరాన్, సౌదీ అరేబియా దేశాలకు చెందిన మహిళలు స్టేడియంలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.
ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తిలకించేందుకు తమను అనుమతించాలని ఇరాన్, సౌదీలోని ముస్లిం మహిళలు చాలాకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. గతంలో కొంతమంది యువతులు సాహసం చేసి స్టేడియంల వద్దకు వెళ్లినా, వారిని లోపలికి అనుమతించలేదు. మహిళల ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూసేందుకు పురుషులు ఎగబడి వస్తుంటారు. అయితే, పురుషుల మధ్య కూర్చుని ముస్లిం మహిళలు మ్యాచ్‌లు తిలకించడానికి వీల్లేదని ఇరాన్, సౌదీ ప్రభుత్వాలు ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. ఏళ్ల తరబడి వస్తున్న విజ్ఞప్తుల ఫలితంగా ఇరాన్‌లో తొలిసారిగా 1979లో స్వల్పంగా ఆంక్షలను సడలించి కొద్ది సంఖ్యలో మహిళలను స్టేడియంలోకి అనుమతించారు. స్టేడియంలో ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో పురుషులకు దూరంగా మహిళలు మ్యాచ్‌లు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. అరకొర సడలింపుల సంగతలా ఉన్నా, ఆంక్షలు మాత్రం అధికారికంగా ఇంకా కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలో దేశీయ జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్‌ను చూసేందుకు 2018లో కొద్ది మంది మహిళలకు అవకాశం కల్పించారు. సౌదీ అరేబియా రాజు చేపట్టిన సంస్కరణల్లో భాగంగా కొన్ని ఆటల్లో పాల్గొనేందుకు మహిళలకు అవకాశం దక్కింది. అయితే, స్టేడియంలలో అందరి మధ్య కూర్చుని ముస్లిం మహిళలు మ్యాచ్‌లను తిలకించడానికి వీలు లేదన్న ఆంక్షలు మాత్రం సౌదీలో యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ‘ఇటాలియన్ సూపర్ కప్’ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను తిలకించేందుకు ఎంపిక చేసిన కొద్దిమంది మహిళలకు అవకాశం కల్పించారు. స్టేడియంలో వీరు ముస్లిం మత సంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించారు.
సనాతన సంప్రదాయాలను పాటించాల్సిందేనన్న ముస్లిం మతపెద్దల ఆదేశాల మేరకు ఇరాన్‌లో మహిళలను స్టేడియంలలోకి అనుమతించడం లేదు. పురుషలు అధిక సంఖ్యలో హాజరవుతున్నందున మ్యాచ్‌ల వద్ద మహిళలకు భద్రత కొరవడుతుందని కూడా మతపెద్దలు హెచ్చరిస్తున్నారు. విలువలను పాటించేందుకు మహిళలపై నిషేధం ఉండాల్సిందేనని మతపెద్దలు పాలకులపై వత్తిడి తెస్తున్నారు. మహిళలు ఆందోళనలు చేస్తున్నందున వారిపై ఆంక్షలను ఇరాన్‌లో అప్పుడప్పుడు సడలిస్తున్నారు. ఇటీవల కొన్ని పరిమితులకు లోబడి 850 మహిళలను స్టేడియంలోకి అనుమించేందుకు ఇరాన్ ప్రభుత్వం అంగీకరించింది. పురుషులు రావడానికి ముందే స్టేడియంలోకి ప్రవేశించి, ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలోనే కూర్చుని మహిళలు మ్యాచ్‌లను తిలకించాల్సి ఉంటుంది. మ్యాచ్ ముగిశాక ప్రత్యేక మార్గం ద్వారా బయటకు వెళ్లాలి. గత ఏడాది పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలను చూసేందుకు కొద్దిమంది మహిళలకు స్టేడియంలో భారీ స్కీన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. నిషేధాన్ని స్వల్పంగా సడలించడం కన్నా, ఆంక్షలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని ఇరాన్, సౌదీ మహిళలు తరచూ నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. మ్యాచ్‌లకు వెళ్లి- ‘కురచ దుస్తుల్లో ఉన్న పురుషులను’ మహిళలు వీక్షించడం సంప్రదాయాలకు విరుద్ధమని మత పెద్దలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్, సౌదీ అరేబియా తప్ప పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో మరే దేశంలోనూ మహిళలపై ఇలాంటి ఆంక్షలు లేవు. పురుషులతో పోల్చిచూస్తే ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వీక్షించే మహిళల సంఖ్య తక్కువే. అయినా మతాచారాల పేరిట మహిళలపై నిషేధం విధించడం సరికాదని మానవ హక్కుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
కాగా, మహిళా వీక్షకుల సంఖ్యను పెంచేందుకు కొన్ని దేశాలు ప్రత్యేక చర్యలు చేపట్టడం గమనార్హం. అంతర్జాతీయ మ్యాచ్‌లను వీక్షించేందుకు ట్యునీషియా ప్రభుత్వం మహిళలకు ఉచితంగా టిక్కెట్లను అందజేస్తోంది. మొరాకోలో పురుషులతో కలిసి మ్యాచ్‌లను చూసేందుకు మహిళలు భారీ సంఖ్యలో స్టేడియంలకు తరలివెళ్తున్నారు. ఆంక్షల సంకెళ్లు లేకుంటే తాము కూడా మ్యాచ్‌లను తిలకిస్తూ ఉత్తేజం పొందుతామని ఇరాన్, సౌదీ మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
*