మెయిన్ ఫీచర్

బామ్మ గెలిచింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడున్న బామ్మ పేరు ప్రమీల బిసోయ్.. వయస్సు 70 సంవత్సరాలు.. ఈమె ఎప్పటిలాగే ఆ రోజు కూడా చెరమరియా అనే తన ఊళ్లో.., ఓ బడిలో.. పిల్లలకు మధ్యాహ్న భోజనం కోసం వంట ఏర్పాట్లు చూస్తున్నది..
అంతలో బీజేడీ లీడర్ హడావుడిగా అక్కడికి వచ్చి.. ఆమెతో "భువనేశ్వర్ నుంచి ఫోన్ వచ్చింది.. మాట్లాడు’’ అన్నాడు.
అందుకు ప్రమీల బిసోయ్ "ఫోన్ ఎవరి నుంచి?’’ అంది.
అప్పుడు అతను ‘‘సీఎం నవీన్ పట్నాయక్ నుంచి.. నువ్వు ముందు ఫోన్ మాట్లాడమ్మా..’’ అన్నాడు.
అంతే..
ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే ఫోన్ అందుకుని ‘‘నమస్తే’’ అంది.
ఫోన్‌లో నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ‘‘మీరు ఒకసారి భువనేశ్వర్‌కి రండమ్మా..’’ అని అన్నాడు.
అంతే ఆమె భువనేశ్వర్‌కు బయల్దేరింది.
అక్కడికి వెళ్లాక నవీన్ పట్నాయక్ ఆమెతో మాట్లాడుతూ.. ‘‘మా పార్టీ తరఫున ‘అస్క’ లోక్‌సభ సీటు మీకు ఇస్తున్నాను’’ అన్నాడు.
అందుకు ఆమె నమస్కరిస్తూ ‘‘మీరు ఎలా చెబితే అలాగే అయ్యా!’’ అని మాత్రమే అంది ఆశ్చర్యపోతూ..
అలా ఆమె నామినేషన్ వేసింది. మొదటిసారి నవీన్ పట్నాయక్‌తో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణం చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్లింది. నవీన్ పట్నాయక్ ప్రచార సభల్లో మాట్లాడుతూ ‘‘నేను 33 శాతం మహిళలకు టికెట్లు ఇస్తాను అన్నాను.. ఇస్తున్నాను.. మహిళలకు సరైన ప్రాతినిధ్యమే కాదు.. చైతన్యానికి, సంఘటిత శక్తికి, గ్రామీణ మహిళా వికాసానికి చోదకశక్తిగా నిలుస్తున్న మన మిషన్ శక్తి పథకానికి ప్రతీకగా ఈమెకు టికెట్ ఇచ్చాను.. ఇక గెలిపించాల్సింది మీరే..’’ అని చెప్పాడు. స్వయంగా ముఖ్యమంత్రే ముందుకు కదిలి.. ఆమెను ఎన్నుకోవడానికి కారణమేంటి? ఆమెలో ఉన్న విశేషమేంటి? తెలుసుకోవాలంటే ముందు ఆమె గురించిన వివరాలు తెలుసుకోవాలి.
ఈమె పేరు ముందే తెలుసుకున్నాం కదా.. ప్రమీలా బిసోయ్ వయస్సు 70 సంవత్సరాలు.. నిరుపేద కుటుంబంలో పుట్టింది. చిన్నప్పుడు అంటే.. ఐదు సంవత్సరాల వయస్సుకే పెళ్లయిపోయింది. తరువాత మూడో తరగతి వరకు చదువుకుంది. ఈమెకు ఒడియా భాష తప్ప మరింకే భాషా రాదు. ఒడియా భాషలోనే బోలెడు పుస్తకాలు చదువుకుంది. ప్రమీల భర్త పేరు బంఛనిధి. ఇతను లిఫ్టు ఇరిగేషన్ కార్పొరేషన్‌లో ఓ దిగువ స్థాయి ఉద్యోగిగా రిటైర్ అయ్యాడు. పింఛన్ వస్తుంది. వీరికి ఇద్దరు కొడుకు, ఇద్దరు కూతుర్లు.. పెద్దకొడుకు టీ స్టాల్ నడిపితే, మరో కొడుకు టూవీలర్ వర్క్‌షాప్ నడుపుతుంటాడు. కూతుర్లిద్దరికీ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. అల్లుళ్లు కూడా చిన్న చిన్న పనులతో పొట్టపోసుకునేవారే. చిన్నవయస్సు నుంచే ఆమె పరిశుద్ధమైన తాగునీరు, పారిశుద్ధ్యం, గర్భిణీ ఆరోగ్యం, ప్రసూతి, బాలింతల ఆరోగ్యం గురించి పనిచేసేది.. అలా నెమ్మది నెమ్మదిగా ఆమె స్థానిక మహిళా పొదుపు సంఘానికి, స్థానిక వన సురక్ష సమితికి నాయకురాలిగా ఎంపికైంది. తమ ప్రాంతంలోని పకిడి హిల్స్‌పై నెమళ్ల సంరక్షణకు ప్రమీల పెద్ద పోరాటమే చేసింది. అందుకుగానూ ఒడిశా ప్రభుత్వం ఆమెకు ప్రకృతి మిత్ర, ప్రకృతి బంధు అవార్డులు ఇచ్చింది.. ఒడిశాలో మిషన్ శక్తి అనే ఓ ప్రోగ్రామ్ ఉంది. పట్నాయక్ ప్రభుత్వం బాగా ప్రాధాన్యం ఇచ్చే పథకం ఇది. ఇది డ్వాక్రా, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల వంటిది.. ఈ మిషన్ శక్తిలో దాదాపు ఆరు లక్షల గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులో మొత్తంగా 70 లక్షల మంది మహిళలున్నారు. అందులో ప్రమీల కూడా ఒకరు. ప్రమీల పోటీ చేసిన అస్క సీటుకు ఓ విశేషముంది. అదేంటంటే.. నవీన్ పట్నాయక్ 1997లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది ఇక్కడి నుంచే.. ప్రమీల తన ప్రచార కార్యక్రమాల్లో స్వచ్ఛమైన ఒడియా రూరల్ యాసలోనే మాట్లాడేది.. ఈమెపై గెలుపు కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. బీజేపీ సోషల్ మీడియా విభాగం ఈమె ఎంపికను అనేక రకాలుగా వెటకారం చేసింది. ఆమె చదువు గురించి, ఆమె పేదరికం గురించి.. ఎన్నో రకాలుగా ఆమెను అవమానకరంగా మాట్లాడింది. ‘ఈ చదువురాని ముసలామె పార్లమెంటుకు పోయి ఏం చేస్తుంది?’2అని ఆ వ్యాఖ్యల సారాంశం.. అందరూ ఇలా ఎగతాళి చేస్తున్నా.. ఆమె పల్లెత్తు మాట అనలేదు. మీడియా వారు ఈ ప్రశ్నను వేసినప్పుడు ఆమె మాట్లాడుతూ ‘‘అంటే అన్నారులే.. అందరికీ అమ్మలాంటి దాన్ని.. బిడ్డలు తప్పుచేస్తే తల్లి నెమ్మదిగా చెప్పాలి కానీ తిట్టాలా? నేను గెలుస్తానా.. లేదా.. అనే టెన్షన్ నాకు లేదు. పట్నాయక్ సార్ మహిళలకు ఇస్తున్న ప్రోత్సాహానికి నేనో ఉదాహరణ.. నన్ను గేలి చేసేవాళ్లు వాళ్ల కుసంస్కారానికి వాళ్లు బాధపడాలి తప్ప నేనెందుకు వారు అన్న మాటల గురించి బాధపడాలి? అవును.. నేను ఇప్పటికీ రేకుల ఇంట్లోనే ఉంటాను. మా ఇంట్లో అందరమూ పనిచేసుకునే బతుకుతాము. మా బతుకు పట్ల నాకేమీ న్యూనత లేదు.. ఎందుకంటే మేము కష్టపడి పనిచేసి కడుపునింపుకుంటున్నాం.. ఎదుటివారి కడుపుకొట్టి మా కడుపులు నింపుకోవడం లేదు. అంతేకాదు మా ఇంట్లో ఎవరికీ పెద్ద పెద్ద కోరికలు లేవు.. ఇప్పుడు నాకు ఓ పెద్ద కుటుంబం దొరికింది.. అది నా నియోజక వర్గం’’ అందామె నవ్వుతూ.. ఆమె నామినేషన్ వేసిన తరువాత ఆస్తుల గురించి ఇచ్చే అఫిడవిట్‌లో ‘2.3 తులాల బంగారం, ఇన్ని సంవత్సరాల ఉద్యోగ జీవితంలో భర్త పొదుపు చేసిన రెండు, మూడు లక్షల బాండ్లు, డిపాజిట్లు.. ఇంకా తాతల కాలం నుంచీ ఆమె ఉంటున్న ఇల్లు’ పొందుపరిచింది. ప్రమీలకు పాన్ కార్డుకూడా లేదు. ఈమెకు స్మార్ట్ ఫోన్ కూడా లేదు. అదెలా వాడాలో కూడా ఆమెకు తెలియదు.
ప్రమీలపై బీజేపీ ఎన్నో అభియోగాలు చేసినా.. ఏమీ లాభం లేకపోయింది. ప్రమీల రెండు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచింది. అలా ఓ గ్రామీణ మహిళ.. మిషన్ శక్తి.. గెలిచింది. మొన్నమొన్నటివరకూ ఆమె ‘అస్క’2 బ్లాక్ స్వయం సహాయ సంఘాలకు కార్యదర్శి.. అంటే 700 వరకూ గ్రూపులున్న బ్లాకుకు కార్యదర్శి.. నేడు 70 లక్షలమందికి ప్రతినిధిగా మారింది. మీకు ఒడియా తప్ప మరే భాషా రాదు కదమ్మా.. హిందీ, ఇంగ్లీషు రాకుండా పార్లమెంటులో ఏం చేస్తావ్? అని మీడియా ప్రశ్నించినప్పుడు ఆమె ఇలా... ‘‘ఏం..? ఒడియా అనేది భాష కాదా..? నేను అదే మాట్లాడుతాను.. ఈ 700 గ్రూపుల కార్యదర్శిగా ఎలా మాట్లాడుతానో.. 70 లక్షల మంది తరఫున కూడా అలాగే మాట్లాడతాను.. వద్దంటారా? నా మాతృభాషలో నేను మాట్లాడటానికి గర్విస్తాను..’’ అని సమాధానం ఇచ్చింది. అంతే.. మీడియానే కాదు.. మరెవ్వరూ నోరెత్తితే ఒట్టు.. ఏమైనా నీతి, నిజాయితీకి ఉన్న గొంతుక అది.. ఎవరైనా ఎదురు నిలవగలరా?

-మహి