మెయిన్ ఫీచర్
సాహిత్య స్పృహ ఓ కళాత్మక ప్రక్రియ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇపుడు రాజు లేడు. కవి వారి నాశ్రయించి బ్రతుకుటన్నది అంతకంటే లేదు. కృతి చేసి యిమ్మనువాడు అసలుండని ప్రజాస్వామ్యము గదా. కనుక వర్గ ప్రాజకుల ప్రాపు విధిగా పెరుగును. ఒక పథకము ప్రకారమే వారిని ప్రోదిచేయవలెను. ఈలోగా కేటాయింపుల విధి యుక్త ధర్మము ఒకటి ఒళ్ళు విరుచుకొనును. పదవుల పంజారము ప్రారంభముననే పరాకాష్ఠకు చేరుకొనును. పిలిచి పీట వేసి ప్రాశనమున కాహ్వానించగా ‘పీతిముడ్డి’తో వత్తుననెడి నాగరీకుల కాలము కనుక ఆమోదించక తప్పదు. ‘‘కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చెన్’ అనగా నిట్టిదే. వారికేవిధముగానైనను సమ్మానించవలెను. వారి ఆచారము వారిది. ఎట్టివారికైననూ ‘గొప్ప’ ఒకటి ఏడిచినది కదా. ఇట్టి వీరు ఈ ప్రజాస్వామ్యమున సాహిత్య పీఠము మాత్రము ఎందుకు ఎక్కరాదు. వారిని ఏ తీర్థశతావరులో భుజముల మీద మోయవచ్చును. ఇట్టి సాహిత్య ప్పేరంటములు జరుగుచునే వున్నవి కదా. సందు చూసుకొని చంకన చెయ్యి వేయవచ్చును. వీలు కలగనిచో వీలు కల్పింజేయగలిగిన ప్రజాదురంధరులున్నారు. పైకమున్నూ లెక్కవేయబడును. ఇదంతా ప్రస్తుతం తెలుగు కవిత్వానికి పట్టిన భ్రష్టదశ. కొనసాగుతూనే వుంటుందనేది సమాధానం అయితే- సరియైన దారికి చేరగగలిగేది ఎప్పుడనేది కొస చిక్కని కొండవీటిచేంతాడు. కైవారి కొలుపు. నిజానికి కవి విశాల మానవతకు బాధ్యుడు. సమగ్ర మానవ జీవితానికి బాధ్యుడు. ఒక చిన్న రాజకీయ (కులం) భాగానికి మాత్రమే కాదు; భాషలు దాటి రాజకీయ సరిహద్దులు దాటి కుల కులాయాన్నిదాటి కొండలు దాటి సముద్రాలుదాటి అడవులు దాటి ఎక్కడ ఋషులున్నారో అక్కడికల్లా పరుగెత్తే మనస్విత కవిత. అది ఆత్మశిక్షణా తరగతుల్లోంచి బైటికి వచ్చే అభిధ (శబ్దవిద్య).
ఈ ప్రారంభాభ్యుదయ ప్రబోధనమెందుకనగా, కవిత్వం ఏదో రెండో మూడో పదమూడో పొట్టి, పొడుగు వాక్యాల శుష్కవచనమనే కొంపెల్ల కొండముచ్చు బుద్ధి వికారమై చెలరేగుతోంది. తెలుగునాట ఇదే కవిత్వమని ‘ఓట్రాయించే’ జాతి తయారైంది. అంటుజాడ్యమై అలముకుంది. దీనికి సమర్థింపుగా కొందరు తీర్థంకరులు గళం ఎత్తుతున్నారు. ఏకంగా ప్రపంచ ప్రసిద్ధమైన ‘నోబుల్ ప్రైజు’ను అట్టివారికి ఇవ్వవచ్చుననీ, అర్థింపు స్వరంతో ఆజ్ఞాపిస్తున్నారు. ఈ చౌకబారు లేకిచర్యలతో వర్తమానాంధ్ర కవిత్వ స్థితి ఎంతకు దిగజారిందో చదువుకున్నవారికి తెలుసు. బాధపడకుండా వుంటే చెబుతాను- కాదు బాధ పడ్డా చెబుతాను, చెప్పాలి కనుక. పదవులు, బిరుదులు, బహుమతులు కొల్లగొట్టే నేర్పుగల నేటి తెలుగు కవులు ఏమి వ్రాస్తున్నారు? జాగ్రత్తగా గమనించండి. వీరు వ్రాసే కవిత్వానికి, వార్తాపత్రికల్లో వచ్చే వార్తలకు తేడా ఏమన్నావుందా? రెండూ సామాన్య ప్రజల గాథలు, బాధలు సమానంగా ప్రతిబింబిస్తున్నాయి. రెండూ స్పష్టమైన అకృతిమమైన భాషలోనే వ్రాయబడుతున్నాయి. రెంటికీ ప్రజాదరణ మెండుగానే వుంది. ఉండవచ్చు. కాబట్టి ఈ రెంటినీ కవిత్వమనవచ్చునా? అంటే అది కవిత్వం అయిపోతుందా? అసలు విషయం అది కాదు. వ్రాసిందంతా కవిత్వమనే దృఢ విశ్వాసంతో, దాన్ని ఏదో విధంగా ఒక నిచ్చెన చేసుకొని పైకెగబ్రాకాలనే దురద కూడా అరిష్టమే. సుఖాన్నీ- దుఃఖాన్నీ కన్నీటిని, పన్నీటినీ అందంగా, ఆనందంగా చేసే ఇంద్రజాలమే కవిత్వం. తనలోంచి దారాన్ని తీసి తనకే గూడు అల్లుకునే పట్టు పురుగులాంటివాడు కవి. తన ఆలోచనలనుండే ఉత్తమ భావ సూత్రాలను వెలికితీయాలి. ఇది అనుభవ పరిపాకం. కాగితాల్లోనో, పుస్తకాల్లోనో పేరు అచ్చుపడినంత మాత్రాన కవి అయిపోతాడంటే ఎట్లా? మామూలు చూపుకన్నా భిన్నమైన విశిష్టమైన దృగ్విచక్షణ వుండాలి. జ్ఞాన చక్షువు చూచింది చెపుతాడు కవి. చర్మచక్షువు చూచింది చెపుతాడు అకవి. ఈ తేడాను పసిగట్టగలిగినవాడే పాఠకుడు. ఐతే ఇక్కడ మరో అంశం ఇమిడి వుంది. అది ఋషితో ముడిపడ్డది. కవితోపాటు ఋషికి కూడా జ్ఞాన చక్షువు సమాన ధర్మంగా వుంది. అయితే అది ‘తత్త్వదర్శనం’ వరకే’. ఆ తరువాత ఎవరి దారి వారిది. ఈ దర్శనాన్ని సామాన్య భాషలో చెపుతాడు ఋషి. తద్భిన్నమైన విలక్షణ భాషలో చెపుతాడు కవి. కవి శబ్దాల్లో వున్న అసామాన్య శక్తిని కొల్లగొడతాడు. కనుకనే ఒక పెద్ద జాబితాలో కవిని ఋషికంటె ఒక మెట్టు పైస్థానంలోనే పెడుతుంది ‘వేదం’. తైత్తిరీయం పనె్నండవ అనువాకంలో ‘‘బ్రహ్మ దేవానాం ‘పదవీః కవీనాం’ ఋషిర్విప్రాణం మహిషోమృగాణాం శే్యనోగృధ్రాణం’’ అంటుంది. ‘కవుల్లో పదవి’ని గాఢంగా పట్టించుకోవాల్సిన విషయం. ఇట్లా కవిని, ఋషిని సమానంగా చెప్పటం సామాన్యోక్తి అయినా- ఋషికంటె పైన, దేవతల కంటె క్రింద పెట్టే వైదిక వాక్యం తత్త్వవేతృతా మూలకం. కనుకనే కవి కావాల్సినవాడు ముందు ఋషి కావాలనటం. అంటే జ్ఞాన చక్షువును సంపాదించుకోవాలి. అంటే-
‘‘కవిత్వం చూపునుంచే ప్రారంభం అవుతుంది కనుక కవితా విద్యాభాసకుడు; ఈ చూపు జన్మతః లేకపోతే నిజంగా దాన్ని అలవరచుకునే తెలివి కలిగిన స్థితి నుంచే తన విద్యాభ్యాసం ప్రారంభించాలి’’. ఈ మాటే హేమచంద్రుడు తన ‘కావ్యానుశాసనం’లో కొన్ని వందల ఏళ్ళ క్రితమే చెప్పాడు. ‘నానృషి కవి రిత్యుక్తం ఋషిశ్చ కిల దర్శనాత్, విచిత్ర భాష ధర్మాంశ తత్త్వ ప్రఖ్యాత దర్శనం’ కనుక ఋషి కాలేనివాడు కవి కాలేడు. మరి ఈ కానివాడు వ్రాసేది కవిత్వం ఎలా అవుతుంది? అంటే ఇదో ‘వెలిచవి’ చుట్టరికమన్నమాట.
మరి కవితాగ్ని చేతన ఈ విధమైన నీచ స్థాయికి దిగిపోవాల్సిందేనా? అని అనుకున్నపుడు వర్తమాన కవికులమంతా ప్రజాస్వామ్యాన్ని తమ కిరీటంగా తలను ధరిస్తోంది. కనుకనే కవులు పుంఖానుపుంఖంగా ‘పుంజుల వేరువిత్తుల’య్యారు. కవిత్వం భౌతిక జీవన వ్యాఖ్యానమై చట్టుబండ చమరింపుగా తయారైంది. కవిత్వం తన ‘బలం’చేత మనిషిని కార్యోన్ముఖుడ్ని (కర్తవ్యోన్ముఖుడి) చేయాలిగానీ, కవి బలవంతపు కాకి చెమ్మల చేత మాత్రం కాదు. అసలు కవిత్వం తన శక్తిని మనిషిలోని ఆశాజ్యోతిని ఆరనీయకుండా ఉంచటానికే వినియోగిస్తుంది. ఈ పని చెయ్యటానికి కవిత్వం ఏ వస్తువుని (వస్తు రహస్యాన్ని) ఎలా చెప్పాలో ఒక సహజమైన ఆంతరంగిక అవగాహన చేతనే గ్రహిస్తూ పోతుంది. ఇది చెప్పొచ్చు - ఇది చెప్పరాదు అని సూత్రాన్ని ప్రతిపాదించటం కవిత్వం చెయ్యదు. అది కవి మనోధర్మం మీద ఆధారపడి వుంటుంది. ఆ ధర్మాననుసరించే ‘రాక్షసానందం’, ‘అసౌందర్యం’, ‘అపశబ్దచోదకత్వం’ కవిత్వంలో పీట వేసుక్కూర్చున్నాయి. ఏదైనా అంతిమ పరీక్ష యేమంటే కవిత్వం చదువుతున్నప్పుడు పాఠకుడికి చెప్పబడుతున్న విషయంమీద ‘ఆకర్షణ’ కలగాలి. దాని మోహంలో పడాలి. ఈ ఆకర్షణ, మోహం అనే కవిత్వ ప్రభావానికి విఘ్నం కలిగించగలిగిన ఏ విషయాన్ని కవిత్వంలో ప్రస్తావించకపోవటం చేతనే కవి తన విజయాన్ని సాధిస్తాడు. అట్లా కానప్పుడు కవి అనే పేరు పెట్టుకుని కరపత్రాలు వ్రాసుకునే ప్రత్యవరుడే అవుతాడు. సిద్ధాంతం పేరు చేతనో- మతం పేరుమీదనో మూర్ఖావేశం చేతనో- పాఠకుడిలో వైముఖ్యం కలిగించేవాడు తత్సంబంధమైన జ్ఞానం లేనివాడు కవిగా చెలామణి అవటం ఈ జాతి చేసుకున్న దౌర్భాగ్యం. వీళ్లకి భాషే కవిత్వం. భాషే కవిత్వం కాదన్న మహాసత్యం అర్థం కావటానికి వీరికీ జన్మ చాలదు. భాషాస్థాయిని పట్టుకు వేళ్ళాడేది అధమ స్థాయి కవిత్వం. అకవిత్వం కూడాను. లోకంలో అసలు కవిత్వంతో పరిచయంలేని కొన్ని జాతులున్నాయి. వీళ్ళు అవిద్య అజ్ఞానం చేత కాటువేయబడ్డవాళ్ళు. వీరిని గురించి టి.ఎస్.ఇలియట్ చెప్పినట్లు కొన్ని భాషా సౌందర్యాల భ్రాంతుల్ని కవిత్వమనుకుంటారు. వస్తువు చుట్టూ గుడి చుట్లు తిరుగుతారు. చిత్త వికారానికి చిగుళ్ళు నతికించుకుంటారు. వ్యక్తికి సమాజానికి ఉండవలసిన న్యాయ సంగత సమన్యాయం (కవిత్వానికి సంబంధించి) సాధించటానికి కృషి చేయలేని దుర్బల జాతి తెల్ల కాగితాన్ని ‘మకిలి’ చేయటం ప్రారంభించి, దానికి కవిత్వమని నామకరణం చేసింది. ఇలాంటి వెలిచవి సామగ్రితో చలి కాచుకునే జాతి పదవులాక్రమిస్తే ఉత్తమ సాహిత్యం ఎట్లా వస్తుంది? సాహిత్యం ప్రజల సాహస ఔదార్య సంస్కార మిళితమైన సంప్రదాయాన్ననుసరించి (పరంపరాగత జ్ఞానము) వస్తుంది. ఆత్మశిక్షణగల రచయితలనుండి వస్తుంది. నిర్జీవంగా వున్న ప్రజల (కవుల) ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించలేరు. ఆచార వ్యవహారాల్లో మూఢత్వం చూసేవారు- మనఃప్రవృత్తులు విశాలంగాను, నవనవోనే్మషంగాను లేనివారు, ఈర్ష్యాళువులు ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించలేరు. అహంకార పూరితులు- అధికార మత్తులు ఉత్తమ సాహిత్యాన్ని ఆస్వాదించలేరు. దృష్టినిలోనికి మరల్చగలవాడు ‘మహావర్చోమండలా’న్ని దర్శించగలడు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మయూరుడు (సూర్యశతకం). మబ్బు చిచ్చోకవతుల కౌగిళ్ళలోపడి నలిగిపోయిన ఆకాశాన్ని మయూరుడు ఆవిష్కరిస్తాడు. బర్హం విప్పిన శబల మనోహరత్వాన్ని కనిపింపజేస్తాడు. కనుకనే అతడు ‘మయూరు’డు. సూర్య మండల ముగ్ధుడు కదా. సూర్యమండల వ్యామోహితుడికే ఆ మోహానుభవం కలుగుతుంది. దీనినే వస్తురహస్య దర్శనాభిజాత్యమంటారు. మీరూ గమనించండి. మీరెలాగూ కుహనాభ్యుదయ మహాకవులు కారు కనుక. త్రిసంధ్యల్లో తేలియాడే అంతరిక్ష మహార్ణవాన్ని చూడండి. చెట్ల చివళ్లు కదిలించే ఆకుల దోనెలమీద, దూరపుకొండల మీద తెల్లటి మేఘాలు కల్పించే వింత వింత నిర్మాణ వాస్తు శిల్పాల కళలు కల్పించే చోట ఆ సౌందర్యాన్ని భరించగలమా చెప్పండి. కన్నుల గినె్నలతో త్రాగాలి తప్ప. సూర్యకిరణాలు క్రిక్కిరిసిన గోమందల్లా (తెల్లటి ఆవులు) భూమిమీద సంచరించే ఆ మూడు వేళల్లో (త్రిసంధ్యల్లో) సృష్టిలో ప్రతి వస్తువు ఒక విశేష ఆకర్షణతో దర్శనమిస్తుంది. నాకేమి కన్పించటంలేదు. అంతా అగమ్యగోచరంగా వుందనే వాడ్ని వెంటనే వదిలెయ్యండి. తప్పకుండా వాడు ‘కవి’ అనే మూర్ఛబిళ్ళను తగిలించుకొని ఉంటాడు. ఓ రీము తెల్ల కాగితాలు ఓ నాలుగైదు కలాలు వాడి జేబులో వుంటాయి అదీ గుర్తు. అన్ని వస్తువులు కాంతిలో తడిసిపోవటం గమనిస్తాం. కాంతికి చెందిన ఆర్ద్రతలో ఎంత విలక్షణమైన మెరుపు వుంటుందో గమనించాలి. సుఖ దుఃఖాలన్నీ మరిచిపోవాలి. గమనించారో లేదో రోజూ ఉండే ఈ నూతనత్వం ఎక్కడిది? ప్రతిదినం కొనసాగే ఈ ఉత్కంఠ, దర్శన లాలస, ఆ దిదృక్ష- నిన్న చూసిందే కదా! కానేకాదు- ఇవాళ చూచిన ఈ రసాకృతి నిన్న చూసింది కాదు. మళ్లీ కనిపించే రేపటి రసాకృతి వేరు. అదే సంధ్య! మానవ సమాజంలో ఒక్క సామాజిక సమస్యలే కాదు ఎన్నో చిత్ర విచిత్ర సమస్యలున్నాయి. పైగా క్లిష్ట సమస్యలూ ఉన్నాయి. యావత్తు మానవ జాతితోను- మానవ జీవన సామగ్రితోను కవికి తాదాత్మ్యం వుంటుంది. అసలు కీలక స్థానంలో వున్న విషయం, ఈ సామాగ్రినంతా సాహిత్య సామగ్రిగా మార్చుకోగలిగే కళాత్మక ప్రక్రియ ఏదైతే వుందో అది సాహిత్య స్పృహ. ‘్భరతా’దులు హృదయ సంవాదానికి చెప్పిన కారణం కరుణే. అక్కడ్నించే ఇంద్రియ గోచరమైన సమస్త నామరూపాత్మకమైన జగద్వస్తుజాలమూ కవి శరీరంలో ఆపాదమస్తమూ వ్యాపిస్తుంది. ‘శుష్కం కాష్ఠమివ అగ్నినా’ ఈ దహ్యమాన క్రియే రస్యమానావస్థ- అంటే కవి జీవన క్రతుజ్వాలల్లో తానొక సమాధి అయి పడుతున్నాడన్నమాట. బహుశా భరతుడ్ని వైదిక కవిత దహించి వుంటుంది. ఎందుకంటే ఋగ్వేదం ఇట్లా అంటోంది- ‘‘యతర్పురుషేణ హవిషాః దేవాయజ్ఞమత స్వతః వసంత అస్యా సీ దాజ్యం గ్రీష్మ ఇధ్మః శరద్ధవిః’’- దేవతలు పురుషుడనే హవిస్సుతో యజ్ఞం చేశారని- అందులో వసంత ఋతువు ఆజ్యాధార అయిందనీ, గ్రీష్మఋతువు సమిధ అయిందనీ, శరత్తు హవిస్సు అయిందనీ అర్థం. ఇది ఒక మహనీయమైన ప్రతీకాత్మక కవిత్వం. ఇది వేదంలోని కవిత్వమే. ఇక్కడ మంత్రద్రష్టత్వం కావాలి. ఇక్కడ కాలానికి పురుషుడికి (మనిషి) వున్న అవిభాజ్య ఐక్యత చెప్పబడింది. కారణం ఏమంటే ఆ పురుష సూక్తంలోనే ‘పురుష ఏ వేదం సర్వం యద్భూతం యచ్ఛ్భవ్యం’ అనబడింది.
కవి లోకంకోసం జ్వలించాలి అనే మాటని బహువిధాలుగా చెప్పి సమాజంలో కవికి వున్న వైశ్విక స్వరూపాన్ని అర్థం చేసుకునే విధానానికి శంకుస్థాపన చేశాడు. భరతుడి ఈ విధానానికి అంతటికీ కేంద్రంలో శోకమే వుంది. కనుకనే భారతీయులు (అలంకారికులు) పునః పునః శోకతత్త్వ విచారమే చేస్తూ వుంటారు. వారికి ఇవాల్టి కవుల ధోరణి అలవడలేదు. వారు కవిత్వ విషయంలో ఎప్పుడూ అప్రమత్తులే.