మెయిన్ ఫీచర్

రోడ్డెక్కిన మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగ సమానత్వం..
సమాన వేతనం..
గౌరవం..
పనిగంటల తగ్గింపు..
ఈ హక్కులను కోరుతూ స్విట్జర్లాండ్‌లోని మహిళలు రోడెక్కి ఆందోళనకు దిగారు. లింగ సమానత్వం కోసం స్విస్ మహిళలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. దాదాపు ముప్ఫై సంవత్సరాలు దాటిన తరువాత స్విస్ మహిళలు మరోసారి ఉద్యమించారు. సమాన వేతనంపై మరింత పరిశీలన జరగాలని గతేడాది పార్లమెంట్ ప్రకటించినప్పుడే సమ్మెకు దిగాలని మహిళా ఉద్యోగులు నిర్ణయించారు. అప్పటినుంచి దేశంలోని మహిళలంతా ఏకమవుతూ సమ్మెకు సిద్ధమయ్యారు. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. ‘్ఫరెన్‌స్ట్రీక్’ హాష్‌ట్యాగ్ పేరుతో జర్మన్ భాషలో, ‘గ్రీవెదెస్ ఫెమ్మెస్’ హాష్‌ట్యాగ్‌తో ఫ్రెంచ్‌లోనూ మహిళల సమ్మె ట్రెండ్ అవుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన బెర్న్, బసెల్, జ్యూరిచ్ తదితర ప్రాంతాల్లోనూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలందరూ ఒకచోట గుమిగూడి నినాదాలు ఇస్తున్నారు. జెనీవాలో పురుషుల పేరుతో ఉన్న వీధులను చెరిపేసి మహిళల పేర్లను రాస్తున్నారు.
1991లో దాదాపు ఐదు లక్షల మంది మహిళలు హక్కుల కోసం ఇదేవిధంగా రోడ్డెక్కారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1918లో తమకూ ఓటు హక్కు కల్పించాలని లక్షలాదిగా మహిళలు స్విట్జర్లాండ్‌లో ఆందోళనలు నిర్వహించారు కానీ 1971 వరకూ ఆ దేశంలో మహిళలకు ఓటు హక్కు లభించలేదు. 1991 ఉద్యమ సమయంలో స్విస్ ప్రభుత్వంలో మహిళలకు చోటు లేదు. ప్రసూతి సెలవుల ఊసే లేదు. మహిళలకు ఓటు హక్కును నిరాకరించిన చివరి స్విస్ స్టేట్ అప్పెన్‌జెల్ కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తన విధానాన్ని మార్చుకుంది.
సమానత్వం
సమానత్వం దిశగా ఆలోచిస్తే పూర్తిగా రాలేదు కానీ కొన్ని విషయాల్లో మాత్రం మార్పులు వచ్చాయి. ప్రసూతి సెలవుల కోసం ప్రత్యేకంగా చట్టం వచ్చింది. ఇప్పటివరకూ ప్రభుత్వంలో ఎనిమిది మంది మంత్రులుగా పనిచేశారు. కానీ ఇప్పటికీ దేశంలో పురుషులతో పోలిస్తే మహిళలు ఇరవై శాతం తక్కువ వేతనాలను అందుకుంటున్నారు. కీలకస్థాయి పదవుల్లో చాలా తక్కువ సంఖ్యలో మహిళలు ఉంటున్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గత నెల్లో ఒక సర్వే నిర్వహించి స్ర్తి, పురుష వేతనాల వ్యత్యాసంలో స్విట్జర్లాండ్ చివరి స్థానంలో ఉందని తెలిపింది. 1991 సమ్మెలో పాల్గొన్నప్పుడు జర్నలిస్ట్ బీట్‌రైస్ బార్న్ ఆరు నెలల గర్భిణి. ఇప్పుడు ఆమె కూడా నేటి సమ్మెలో పాల్గొంది. ప్రసవం అయ్యాక ఆమె తిరిగి విధుల్లో చేరాలనుకున్నప్పుడు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి పార్ట్ టైం ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించారు. అప్పట్లో సమ్మె చేస్తే తీవ్రంగా అణచివేసేవారని ఆమె అంటున్నారు. 1991 సమ్మెకు నాయకత్వం వహించిన వారిలో ఒకరైన పాయిలో ఫెర్రో కూడా ఇప్పుడు జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొంటున్నారు. గడిచిన 28 సంవత్సరాలు గమనిస్తే కొంత పురోగతి ఉంది కానీ వేతనం, పెన్షన్ చెల్లింపుల్లో ఇంకా చాలా వ్యత్యాసం ఉంది. మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఇప్పటికే వారు చాలాసార్లు చెప్పారు. సమాన వేతనం లేదు. ఇంకా కొన్ని ఉద్యోగాలు పురుషులకే పరిమితమయ్యాయి. అందుకే ఇకపై పనిలోకి వచ్చేది లేదని ఇప్పటికే వేలాదిమంది మహిళా ఉద్యోగులు తమ బాస్‌లకు చెప్పారు. మరికొంతమంది త్వరలోనే సమ్మెలో పాల్గొనబోతున్నారు. మగవారితో పోల్చితే ఇరవై శాతం తక్కువ వేతనం చెల్లిస్తున్న నేపథ్యంలో పనిగంటలు కూడా 20 శాతానికి తగ్గించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఉద్యోగులు సమ్మె చట్ట విరుద్ధం అని అంటున్నారు. పెద్ద కంపెనీలు చాలా వరకు ఈ సమస్యపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. సమ్మె చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోమని దేశంలో దిగ్గజ కంపెనీలే చెబుతున్నాయి. ఒకవేళ సమ్మె చేయాలనుకుంటే ముందే తమకు చెప్పాలని స్విస్ రైల్వే తన ఉద్యోగులను కోరింది. చాలామంది పురుషులు కూడా మహిళల సమ్మెకు మద్దతిస్తున్నారు. వారు సమ్మెలో పాల్గొనేందుకు వీలుగా పిల్లలను చూసుకుంటున్నారు. 1991 నుంచి చూస్తే సమానత్వం దిశగా కొన్నింటిలో విజయం సాధించాం. మాకు ఇప్పుడు ప్రసూతి సెలవులున్నాయి. 1991లో ప్రభుత్వం, పార్లమెంట్ అంతా పురుషాధిపత్యంలోనే ఉండేది. ఈ రోజు రాజకీయాల్లోనూ మహిళలున్నారు. మరి.. ఈ సమ్మె కూడా ఫలించి మహిళలకు సమాన వేతనం, గౌరవం దక్కుతుందని ఆశిద్దాం. *