మెయిన్ ఫీచర్

డీజేగా రాణిస్తోన్న పూజాసేఠ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో మహిళా డిస్క్ జాకీలు చాలా తక్కువ. డిస్క్ జాకీలు అంటే డీజే ఎంతో ఆకర్షణీయమైన వృత్తే అయినప్పటికీ, ఇందులో ఉండే ఇబ్బందులు ఇందులో కూడా ఉన్నాయి. ఇది మహిళల వృత్తి కాదని చాలామంది అంటుంటారు. అదేమో కానీ మహిళలు కూడా ఈ రంగంలో రాణించవచ్చు.. అయితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులను దాటితే చాలు ఈ వృత్తిలో కూడా ఎంచక్కా రాణించవచ్చు అని నిరూపిస్తోంది డీజే పూజాసేఠ్. ఈమెకు 31 సంవత్సరాలు. 2014లో పూజ బెంగళూరులో డీజేగా పనిచేయడం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులో పబ్బులు, బార్ల సంఖ్య బాగా పెరగడంతో.. పూజాసేఠ్ డీజేగా స్థిరపడిపోయింది.. వివరాల్లోకి వెళితే..
పూజాసేఠ్ తూర్పు ప్రాంతంలోని ఒక పల్లెటూరులో సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కుటుంబంలో పుట్టింది. ఈ కుటుంబంలో వారికి కట్టుబాట్లు ఎక్కువ. అమ్మాయిలను ఎక్కువ చదివించడం కానీ, ఉద్యోగం చేయించడం కానీ చేయరు. కాస్త చదువు అబ్బిన తరువాత పెళ్లి చేసేస్తారు. ఉన్నత పాఠశాలలో చదువు పూర్తయిన తర్వాత పూజ ఉద్యోగం చేయాలనుకుంది. కానీ వారి కులంలో మహిళలు ఉద్యోగం చేయడాన్ని, ఏదైనా వృత్తిని చేపట్టడాన్ని ఒప్పుకోరు. చాలామంది మహిళలు పెళ్లయ్యే వరకు ఒంటరిగా బయటకు కూడా రారు. అందుకే ఆమె చదువు పూర్తయిన తరువాత ఇంట్లోంచి బయటకు వచ్చేసి తన కలలను సాకారం చేసుకోవాలనుకుంది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేవారట. పూజ మాత్రం తానెప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదట. అందుకని తనకు తాను నిర్ణయం తీసేసుకుని ఇంట్లోంచి బయటపడింది. అలా ఆమె ఇల్లు వదిలి వచ్చిన తరువాత ఉద్యోగ వేటలో పడింది. తరువాత బెంగళూరులో ఎయిర్ హోస్టెస్‌గా కొద్దిరోజులు ఉద్యోగం చేసింది. అప్పుడే ఒకసారి ఆమె తొలిసారిగా ఒక వేడుకలో పాల్గొనేందుకు వెళ్లింది. వేడుకలో తన దృష్టిని మొదట ఆకర్షించింది డీజేయేనని, తాను ఏం చేయాలకుంటున్నదో తర్వాత ఆమెకు స్పష్టంగా అర్థమైందట. వెంటనే కార్యాచరణకు పూనుకుంది.
బెంగళూరులోని కొందరు డీజేలతో పరిచయం పెంచుకుని వారితో స్నేహం చేసింది. వాళ్లు పూజకు ప్రాథమిక అంశాలను నేర్పించారు. వాటిని ప్రాక్టీస్ చేస్తూ మిగతా విషయాలను యూట్యూబ్ వీడియోలు చేసి నేర్చుకుందట. అంతవరకూ పూజ ఆడవారు మద్యం తాగడం, సిగరెట్టు కాల్చడం చూడలేదట. ఇప్పుడు మాత్రం ఈ రెండు పనులు చేసే ఎంతోమంది మధ్య పూజ స్వేచ్ఛగా సంగీతం వినిపిస్తోంది. వినిపించే సంగీతాన్ని ఎవరైనా ఆస్వాదించడం చూస్తే ఆమెకు చాలా ఇష్టమట. ముందు పూజ క్లబ్బుల్లో డీజేగా సేవలందించేది. తరువాత ఇతర నగరాల నుంచి ప్రదర్శనలు (గిగ్‌లు) ఇచ్చేందుకు బెంగళూరుకు వచ్చే మహిళా డీజేలను తరచూ కలిసేదట. తనకు తెలిసినంత వరకు అప్పట్లో బెంగళూరులోనే ఉండి సేవలందించే మహిళా డీజే ఎవరూ లేరని తను తెలుసుకుంది. బెంగళూరులో కొన్ని ప్రదర్శనలు ఇచ్చిన తరువాత పూజను అందరూ ‘స్థానిక మహిళా డీజే’గా పిలిచేవారు. అది విన్నప్పుడల్లా ఆమె చాలా సంతోషించేది. అలా పూజ డీజేగా 2014లో తన కెరీర్‌ను మొదలుపెట్టింది. ‘సంగీతం వినిపించడం అంటే ఒక రకంగా స్వేచ్ఛను వ్యక్తీకరించడం.. ప్రపంచానికి నన్ను నేను వ్యక్తీకరించుకొనేందుకు సంగీతం వీలు కల్పిస్తుంది’ అని చెబుతూ ఉంటుంది పూజ. అలా పూజ గత ఐదు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 450కి పైగా గిగ్‌లలో పాల్గొనింది.
డీజే వృత్తి గురించి పూజ మాట్లాడుతూ ‘డీజే ఎంతో ఆకర్షణీయమైన వృత్తే అయినప్పటికీ ఇందులో ఉండే ఇబ్బందులు ఇందులోనూ ఉన్నాయి. ఇది మహిళా వృత్తి కాదు.. దీనిని ఎందుకు ఎంచుకున్నావు? అంటూ ఇప్పటికీ అందరూ ప్రశ్నిస్తుంటారు. అంతేకాదు క్లబ్బుల్లో కొందరు మద్యం తాగిన మత్తులో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు ఫోన్ నెంబరు అడుగుతుంటారు. ఇలాంటి వాళ్లను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడం కష్టమవుతుంటుంది. అప్పుడు రక్షణగా ఉన్న బౌన్సర్ల సాయం తీసుకుంటాను. చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా ఉంటాయి. ఇందులో మరికొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అంతే.. కానీ నేను వినిపించే సంగీతానికి శ్రోతలు నృత్యం చేయడం, ఉర్రూతలూగడం ఈ వృత్తిలో నాకు బాగా నచ్చే అంశాలు’ అని నవ్వుతూ చెబుతోంది పూజ. ఏదిఏమైనా మహిళలకు సూటు కానీ డీజే వృత్తిని ఇష్టపడుతూ.. తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటూ.. అందరికీ తన సంగీతంతో ఉర్రూతలూగిస్తూ ముందుకు సాగుతోంది పూజాసేఠ్.

-మహి