మెయిన్ ఫీచర్

తెలుగు యాత్రాత్మకథా పితామహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యంలో ఆత్మకథ అనే దానికి ఎందుకు అంత ప్రాధాన్యమిస్తారూ అంటే, ఏ వ్యక్తియైనా తన గురించి, తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి తానే స్వయంగా చెబుతాడు. అది కూడా అతని గుండె లోతుల్లో ఉండే జ్ఞాపకాల పొరల్లోనుంచి వస్తుంది కాబట్టి.
తన జీవితంలోని నిస్సహాయత గురించి ఒక మహిళ నినదించిన గొంతుకగా రససుందరీ దేవి రాసిన అమార్ జీవన్ అనే ఆత్మకథ భారతదేశంలోనే తొలి ఆత్మకథా గ్రంథం అంటారు. కావలి బొర్రయ్య తన జ్ఞాపకాలను 1810లో ప్రకటించాడు. దీనికి 10 ఏళ్ల తరవాత అంటే 1820లో రాజారామమోహన్‌రాయ్ దినచర్య ప్రచురితమైంది. దీని తరవాత 1873లో సుబ్బారావు ఆత్మకథ వచ్చింది.
ఇక్కడ బొర్రయ్య గురించి కొంత చెప్పాలి. 1776లో జన్మించిన బొర్రయ్య పూర్తిపేరు కావలి వెంకట బొర్రయ్య. మనకు మన స్థానిక రికార్డులను కైఫియత్తుల రూపంలో సేకరించి ఇచ్చిన నాటి కల్నల్ మెకంజీవద్ద ప్రధాన పండితుడు బొర్రయ్య. సంస్కృతం మొదలు ఏడు భాషలలో ప్రజ్ఞ కలిగినవాడు. కావలి సోదరులుగా లోకానికి పరిచయమైన బొర్రయ్య సోదరులు ఐదుమంది. వీరందరూ నాటి బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగులే. 1798లో టిప్పుసుల్తానుపై బ్రిటిష్ దండయాత్ర జరిగినపుడు మెకంజీతోబాటు బొర్రయ్య కూడ వెంబడే ఉండినారు. వారి పూర్తి యాత్రా విశేషాలకు అక్షర రూపాన్నిచ్చారు. ఈ క్రమంలో వారు నైజాములోని చిన్న జమీందారీయైన గాడివాచెంతకు వచ్చినపుడు మెకంజీ ఆఫీసుకు సంబంధించిన పత్రాలు కొన్ని ఎవరో దొంగిలించగా, వాటిని తిరిగి సంపాదించాల్సిన బాధ్యత బొర్రయ్యపై పడింది. ఆ ప్రయత్నంలో జమీందారు ఆగ్రహానికి గురైన బొర్రయ్య కటకటాలపాలై, అష్టకష్టాలు పడ్డారు. ఐతే, తన పాండిత్యప్రతిభతో కొన్ని పద్యాలు రాశారు. వాటిని విన్న జమీందారు ప్రసన్నుడై, మెకంజీ ఆఫీసుకు సంబంధించిన పత్రాలను వెనక్కి ఇచ్చేయడమేకాక, బొర్రయ్యకు క్షమాపణ చెప్పి, బహుమానాలతో సత్కరించి పంపాడు. ఇలా బొర్రయ్య గురించి చెప్పుకుంటూపోతే చాలానే ఉంది. బొర్రయ్య సోదరులలో వెంకటరామస్వామి ప్రత్యేకంగా పేర్కొనదగ్గవారు. వీరు రాసిన ‘ద బయోగ్రాఫికల్ స్కెచెస్ ఆఫ్ దక్కన్ పొయెట్స్’ ప్రాచుర్యం పొందిన గ్రంథం.
తెలుగులో యాత్రా సాహిత్యానికి వనె్నతెచ్చిన వైతాళికుడు ‘కాశీయాత్రా చరిత్ర’ (1838) రాసిన ఏనుగుల వీరాస్వామి. అదీ ఆయన యాత్రచేసిన (వారి కాశీయాత్ర 1830-31 సంవత్సరాల్లో జరిగింది) ఏడెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చింది. వీరాస్వామి కాశీయాత్ర చేయడానికీ, యాత్రా విశేషాలను గ్రంథస్థం చేయడానికి సుబ్బారావు కాశీయాత్రా విశేషాలే ముఖ్య కారణం. వీరాస్వామి తర్వాత కోలా శేషాచల కవిని రెండవ వారిగా చెప్పుకోవాలి. ‘నీలగిరి యాత్ర’ (1854) అనే ఈయన రాసిన గ్రంథం 1846-47 సంవత్సరాల్లో చేసిన తన యాత్రా విశేషాలను చెబుతుంది. అయితే వీరాస్వామి కంటే ఏడు సంవత్సరాల ముందే కాశీయాత్ర (1822-23) చేసిన తెలుగు ప్రముఖుడు, ఒంగోలు వాస్తవ్యుడూ, ఆనాటికే నెల్లూరు ప్రముఖుడూ అయిన వెనె్నలకంటి సుబ్బారావు. ఈ విషయం చాలాకాలం తెలుగు పాఠక లోకానికి తెలియలేదు. రాజారామ్‌మోహన్ రాయ్‌కీ, ప్రముఖ వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామికీ సమకాలికుడు వెనె్నలకంటి సుబ్బారావు. తెలుగు సాహిత్యం ముఖ్యమైన ప్రక్రియల్లో యాత్రా చరిత్ర ఒకటి. మనకు లభించే తెలుగు యాత్రా సాహిత్యం తక్కువేమీ కాదు. 1889లో చెళ్లపిళ్ల వెంకటశాస్ర్తీ ‘కాశీయాత్ర’చేశాక దాని గురించి వివరంగా రాశారు. వీరేశలింగం తమ ఆత్మకథ రాశారు. అలాగే వేంకట రమణయ్య 1956లో ఉత్తర దేశయాత్ర రాశారు. కె.వి.సుబ్బయ్య నవభరత సందర్శనం రాశారు. ఆచార్య నాయని కృష్ణకుమారి కాశ్మీర దీప కళిక రాశారు. పి.వి.మనోహర్ కైలాస దర్శనం, మల్లంపల్లి సోమశేఖరశర్మ నా నెల్లూరు మండల యాత్ర రాస్తే, టంగుటూరు ప్రకాశం పంతులు తమ ఆత్మకథ రాశారు. మునే్నని లక్ష్మీనారాయణ ‘హంపీ విహార యాత్ర’ రాశారు.
భారతదేశ పరిపాలనను ఈస్టిండియా కంపెనీ చేతిలోకి వెళ్లిన తర్వాత, అంటే 19వ శతాబ్దంలో ఇంగ్లీషులో స్వీయ చరిత్రను రాసుకున్న మొదటి భారతీయుడు తెలుగువాడు. ఆయన పేరు వెనె్నలకంటి సుబ్బారావు. తన ఆత్మకథను, తన వివిధ యాత్రాస్మృతులతో జోడించి రాసిన తొలి వ్యక్తి ఆయనే. అదే ‘ద లైఫ్ ఆఫ్ వెనె్నలకంటి సుబ్రావ్’అనే ఆంగ్ల గ్రంథం. వీరాస్వామి, శేషాచల కవి తమ యాత్రలను తెలుగులోనే రాశారు. కాని సుబ్బారావు తన యాత్రానుభవాల్ని విడిగాకాకుండా తన స్వీయ చరిత్రతో జోడించి రాసుకున్నారు. ఈ గ్రంథంలో ఆనాటి భారతదేశపు సాంఘిక జీవన పరిస్థితులు, వివాహాలెలా జరిగేవి, ఉద్యోగుల పరిస్థితులెలా ఉండేవి వంటి ఎన్నో విషయాలు వెలుగులోకొచ్చాయి. అపుడప్పుడే భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ పాలకులు తమ పాలనలో నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు అప్పటి భాషలో, పాలనలో, ఉద్యోగాల్లో, ఆర్థిక లావాదేవీలలో ప్రతిఫలిస్తాయి. భారతీయ సమాజం మీద ఇప్పటికీ బ్రిటిష్ ప్రభావం ఎంతుందో ఈ జీవయాత్రా చరిత్ర చదివితే తెలుస్తుంది.
ఐతే, తన ఆత్మకథాయాత్రకు ఎంతో విలువుందనీ, తెలుగువారికందరికీ అది తెలియాలనీ ఎపుడూ అనుకున్నట్లులేదు. ఎందుకంటే, దానిని ముద్రింపజేద్దామని ఆయన ఆలోచించినట్లు లేదు. దానిని ఆనాటి ఆర్థిక స్థితిగతులూ కారణం అయి ఉండవచ్చు. కానీ, ఆయన తన యాత్ర పూర్తవ్వగానే, రాసిన వెంటనే ముద్రించి వుంటే, తెలుగు యాత్రా సాహిత్యానికి సుబ్బారావే ఆద్యుడయ్యేవాడు. 1873 సంవత్సరంలో, అంటే సుబ్బారావు రాసిన 34 సంవత్సరాల తరువాత, ఆయన కొడుకు గోపాలరావు ఆ ఇంగ్లీషు పుస్తకాన్ని ముద్రించి బంధువులకు పంచిపెట్టాడు. ఈ గోపాలరావు ఆ సమయంలో తిరువళ్లూరు (నేడు తమిళనాడులో ఉంది) జిల్లా మునసబుగా పనిచేసేవాడు. దీనిని నాటి చెన్నపురిలోని సి.్ఫస్టర్ అండ్ కో ముద్రించింది. ఆ సమయానికి వీరాస్వామి ‘కాశీయాత్ర’ రెండవ ముద్రణకు వచ్చింది. 1976దాకా తెలుగువారికి తెలిసింది ఆ ఆంగ్ల గ్రంథమే. 1976వ సంవత్సరంలో అక్కిరాజు రమాపతిరావు ఆ ఇంగ్లీషు గ్రంథాన్ని ‘వెనె్నలకంటి సుబ్బారావు జీవయాత్రా చరిత్ర’ అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేయడం, అది నెల్లూరులో ప్రముఖ పత్రికయైన జమీన్ రైతు ధారావాహికంగా ప్రచురించడంతో అప్పటిదాకా తెలియని ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక నెల్లూరి గొప్పవాడు రాసిన మొట్టమొదటి స్వీయ చరిత్ర మొట్టమొదటి అనువాదంగా దీనిని అభివర్ణించింది జమీన్ రైతు పత్రిక. ఈ వెనె్నలకంటి సుబ్బారావు చాలా ప్రతిభావంతుడు. చిన్నతనంలోనే బందరు వెళ్ళి ఇంగ్లీషు చదువుకొని కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి అక్కడ న్యాయవాద సంబంధిత ఉద్యోగాలలో రాణించారు. ఇంగ్లీషు వారు టిప్పుసుల్తాన్‌ను ఓడించిన సందర్భంలో ఆయన ప్రత్యక్ష సాక్షిగా మైసూరులోనే (1799 మే 4న) ఉన్నట్లు తెలుస్తోంది. వెనె్నలకంటి సుబ్బారావు పూర్వీకులది నెల్లూరు ప్రాంతానికి చెందిన ఇందుకూరుపేట సముద్ర తీరంలోని నిడిముశిలి గ్రామం. 1784, నవంబర్ 28న ప్రకాశం జిల్లాలోని ఓగూరు గ్రామంలో సుబ్బారావు జన్మించారు. తల్లి వెంకమ్మ, తండ్రి జోగన్నగార్లకు ఈయన 12వ సంతానం. 1795లో మేనత్త కుమారుడు ఒంగోలు గోపాలకృష్ణయ్యతో కలసి బందరు పట్టణం చేరారు. ఆసరికే బందరు ఇంగ్లీషువారి ఆధీనంలో ఉండేది. బందరు కలెక్టర్ వద్ద సుబ్బారావు గుమస్తాగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1800లో ఒంగోలు తిరిగి వచ్చారు. తర్వాత కొన్ని రోజులు కంభంలో పనిచేశారు. ఇంగ్లీష్, అకౌంట్స్‌లో సమర్థుడనే పేరు తెచ్చుకున్నారు. పెరియతంబి పిళ్లై సహకారంతో గుంటూరు పే-మాస్టర్ విల్సన్ వద్ద నెలకు ఒక వరహా జీతంతో సర్కారు జాబులు రాసేందుకు చేరారు. ఆ తర్వాత ఆయన దుబాసీ (ద్విభాషి- ఇంటర్ప్రిటర్)గా మారారు. ఆ ఘటన జీవితాన్ని మలుపుతిప్పింది. అప్పట్లో దత్తమండలాలుగా ఉన్న కడప-కర్నూలు- బళ్ళారి జిల్లాల్లో సబ్ కలెక్టరు కార్యాలయాల్లోనూ, ఆ తర్వాత మంగుళూరు కలెక్టర్ కచేరీలోనూ, 1806లో కసరా జిల్లాలోనూ దుబాసీగా పనిచేశారు. మంగళూరులో రిజిస్ట్రార్‌గా ఉన్న మెక్‌రెల్‌కు తెలుగు భాష నేర్పారు. అదే సమయంలో కన్నడ భాషపై పట్టు సాధించారు. శ్రీరంగపట్టణంలోని జిల్లా కోర్టులో హెడ్ ఇంగ్లీషు రైటర్‌గా చేరి ఎంతో దీక్షాదక్షతలతో పనిచేసి మైసూరు మహారాజా సత్కారాలు పొందారు. 1811లో అనారోగ్య కారణాలవల్ల నెల్లూరు చేరుకుని కలెక్టర్ ఫ్రేజర్‌వద్ద ఉద్యోగంలో చేరి చట్టాల గురించి ఆమూలాగ్రం తెలిసిన వ్యక్తిగా పేరొందారు. 1815కే మాతృభాష తెలుగుతోపాటుగా ఆంగ్లం, పార్శీ, హిందుస్థానీ (హిందీ), తమిళం భాషలు నేర్చి మద్రాసు సుప్రీంకోర్టులో 14 సంవత్సరాలపాటు పరభాషల దుబాసీగా పనిచేశారు.
తమ ఉద్యోగులు భారతదేశ భాషలు, ముఖ్యంగా దక్షిణాది భాషల నేర్చుకొని జిల్లా కలెక్టర్లుగా, న్యాయాధికారులుగా దేశాన్ని పరిపాలించటానికి, వాళ్ళకు శిక్షణ ఇచ్చేందుకు 1812లోనే బ్రిటిష్ ప్రభుత్వం మద్రాసు ఫోర్ట్ సెయింట్ జార్జిలో ఒక కళాశాలను స్థాపించింది. ఆ కాలేజీలో చదువుకొనే శిక్షణకల ఉన్నతాధికారులకు పాఠ్య సామగ్రి సమకూర్చటానికి టెక్స్ట్‌బుక్ కమిటీ అని ఒక సంఘాన్ని ప్రభుత్వం నెలకొల్పింది. ఆ సంఘానికి వెనె్నలకంటి సుబ్బారావు సలహాదారు, రచయిత కూడాను. తెలుగు నేర్చుకొనే ఇంగ్లీషు ఉద్యోగులకోసం సుబ్బారావు వినోద కథలు అనే పేరుతో సులభశైలిలో ఒక వాచకాన్ని రచించారు. ఇవాల్టికీ అది లండన్‌లో నాటి ఇండియా హౌస్ లైబ్రరీలో భద్రపరచబడి ఉంది. 1818 సంవత్సరంనుండి 1828 సంవత్సరంవరకూ ఒక్క కలకత్తా నగరంలోనే ఐదువేల మంది వితంతువులు సతీసహగమనం ఆచరించినట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. వంగ రాష్ట్రానికి చెందిన శ్రీ రాజా రామమోహన్‌రాయ్ సతీసహగమన దురాచారానికి వ్యతిరేకంగా పోరాడారు. 1822 సెప్టెంబర్ నెలలో గుంటూరులో తూము పాపయ్య అనే వ్యక్తి చనిపోగా చితిపై ఆయన భార్య సహగమనం చేయడం తాను చూశానని, వెనె్నలకంటి సుబ్బారావు తమ స్వీయ చరిత్రలో పేర్కొన్నారు. ఆంధ్రదేశంలో 1822 ప్రాంతంవరకూ ఈ దురాచారం కొనసాగినట్లు ఈ ఉదంతం ద్వారా తెలుస్తోంది.
1820లో మద్రాసు స్కూలు బుక్ సొసైటీకి సదర్ అదాలత్ కోర్టులో సుబ్బారావు దుబాసీగా పనిచేశారు. అందులో సభ్యుడైన కొంత కాలానికే, ఆయన ప్రభుత్వానికి దేశంలో ఇంగ్లీషు విద్యను వ్యాప్తిచేయాల్సిన అవసరం ఎంతోఉందని ఇంగ్లీష్‌లో ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. 1823లో రాజారామ మోహనరాయ్ కూడా అటువంటి లేఖనే ప్రభుత్వానికి రాశారు. ఆ రెండు లేఖల ప్రభావం వల్లే బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టిందంటే, సుబ్బారావు మాటలకూ, చేతలకీ నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఎంత విలువనిచ్చేదో మనకు తెలుస్తుంది. ఆయన జీవితమంతా అనారోగ్యంగానే గడిపాడు.
సమాజసేవలో కూడా తమవంతు బాధ్యత నిర్వర్తించారు. నెల్లూరు జిల్లాలోని రామాయపట్నానికీ, సింగరాయకొండకూ మధ్య ఉన్న రహదారిలో కనకమ్మ సత్రం కట్టడానికి స్థలాన్ని సేకరించి, ఆరు నెలలపాటు అక్కడే ఉండి, 1832 సంవత్సరంనాటికి ఆ నిర్మాణం పూర్తి చేయించారు. 1833లో విడుదలైన మద్రాసు గెజెట్‌లో సత్రం గురించిన వివరాలు ఉన్నాయి. గాలిమార్పుకోసం దేశమంతా తిరిగినా, చివరికి తన సత్రం పరిసరాలే సుబ్బారావుకి ఆనందాన్ని, ఆరోగ్యాన్నీ ప్రసాదించాయి. అప్పటినుండి కుటుంబ సమేతంగా సత్రంలోనే నివాసం ఏర్పాటుచేసుకుని, వివిధ భాషలు మాట్లాడే యాత్రికులతో స్నేహంచేస్తూ, సముద్ర తీర సౌందర్యాన్ని ఆరాధిస్తూ, పంట పొలాల పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన 55 సంవత్సరాల జీవితాన్ని చాలా విపులంగా గుర్తుకుతెచ్చుకుని తన ఆత్మకథ రాశాడు. ఆ తర్వాత మరో రెండు నెలలపాటు మాత్రమే ఆయన బాటసారులకు కనిపించాడు. 1839 అక్టోబరు 1వ తేదీన ఆయన ఇహలోక యాత్ర చాలించాడు.
ఒక సాహితీ సేవకునిగా, ఒక ఇంగ్లీషు భాషా దుబాసీగా, ప్రజాసేవకునిగా, ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిగా, యాత్రికునిగా సుబ్బారావు వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైంది. ఆదర్శవంతమైనది కూడా. బహుముఖ ప్రజ్ఞాశాలియైన వెనె్నలకంటి సుబ్బారావును తెలుగు సాహిత్యంలో యాత్రాత్మకథా పితామహుడని అనడంలో ఎలాంటి అనౌచిత్యమూ లేదు.

- డా. వి.వి.వేంకటరమణ 9441234429