మెయిన్ ఫీచర్

‘పరాధీనత’ను చెండాడిన కలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసుల్ని మెలిపెట్టేలా.. యదార్థ జీవన దృశ్యాలే ఇతివృత్తాలు..
అనుభవాలే అక్షర రూపాలుగా గుండెల్ని కదిలించే బాధాతప్త కథనాలు..
మనసుని కదిలించే మాటల అల్లికలే సంభాషణలు..
చురుక్కుమనే చమక్కుల్ని ఆశువుగా చమత్కరించడం..
అలవోకగా మాట్లాడే ప్రతి మాటా.. తన అనుభవమేమో అన్న భావనను కలిగించడం.. వెరసి ఆమె కథ అవుతుంది. తెలుగుకథలో ఆమెది ఓ విలక్షణ మార్గం.. ప్రేమతో అమ్మలా లాలించినా.. తప్పు చేసినప్పుడు తల్లిలా మెత్తగా దండించేలా ఉంటాయి ఆమె కథలు. స్ర్తి జీవితం చుట్టూ తిరుగుతూ జీవితంలోని విభిన్న పార్శ్వాలను ఆవిష్కరిస్తాయి. పురుషాధిక్య ప్రపంచాన్ని ధిక్కరిస్తూనే అందులోని తాత్త్విక దృక్కోణాన్ని విశదీకరించే దారులను చూపుతాయి. ఎక్కడ కూడా హడావుడి, ఆవేశం కనపడని చక్కనైన శిల్పంలా ఉంటాయి ఆ కథలు. ఇలా.. ఎన్నెన్నో అనుభవాలు, అనుభూతుల్ని నిక్షిప్తం చేసుకున్న జీవితం వారిది.. ఒకరకంగా చెప్పాలంటే..
ఉదారవాదం..
మానవతావాదం..
సంస్కరణ వాదం..
స్ర్తివాదం..
ఇలా తనదికాని, తాను సృజించని వాదమంటూ ఏదీలేని కథా, కథనశిల్పి ఆమె. ఆమె భావాలు పదునైనా మృదు మధురమైనవే..
అబ్బూరి రామకృష్ణ ఆ రోజుల్లోనే మహాకవి శ్రీశ్రీకి గురుతుల్యులు. ఆయన విప్లవానికి ప్రోత్సాహమిచ్చినవారు. వారు ఆమెకు మామగారు.. అబ్బూరి వరదరాజేశ్వరరావు ఆమె భర్త.. అబ్బూరి గోపాలకృష్ణ ఆమెకు మరిది.. అత్తవారింటి నేపథ్యం కంటే ముందు.. అబ్బూరి ఛాయాదేవి తండ్రి మద్దాలి వెంకటాచలం గొప్ప న్యాయవాది. అంతేకాదు సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తి. అటువంటి కుటుంబంలో బయటకు మాట్లాడటానికి, చెప్పడానికి కూడా వణికిపోతూ, వీలైనంతవరకు తండ్రికి దూరంగా, తల్లిచాటునే ఉంటున్న ఒక ఆడపిల్ల.. తన మనసులోని భావాల్ని, మాటల్ని, కోపాన్ని, ఒదుగుదలను చెప్పుకోవడానికి ఒక వేదికని, ఒక తోడుని తయారుచేసుకుంది. ఆ తోడు పేరే రచన..
అబ్బూరి ఛాయాదేవి 1933, అక్టోబర్ 13న రాజమండ్రిలో పుట్టారు. ఆమెకు ఒక అన్నయ్య. ఒక అక్క. ఈసారి కూడా కొడుకు పుట్టాలని ఆమె తండ్రి కోరుకునేవారట. అందుకు రోజూ ‘సూర్య నమస్కారాలు’ కూడా చేసేవారట. కానీ ఆడపిల్ల పుట్టింది. అబ్బాయి పుడితే సూర్యుడి పేరు పెడదామనుకున్నవారు అమ్మాయి పుట్టేసరికి సూర్యభగవానుడి భార్య పేరైన 'ఛాయాదేవి’ పేరు పెట్టారు. చిన్నప్పుడు మాత్రం ఆడపిల్ల ముద్దే అన్నట్లు.. తండ్రి ఆమెను తన గుండెలపై కూర్చోబెట్టుకుని ‘గజేంద్ర మోక్షం’ వంటి పురాణ కథలు, విక్రమార్కుడి జానపద కథలు చెప్పేవారట. ఛాయాదేవి వీరేశలింగం హైస్కూల్లో ఫోర్త్ఫారం చదువుకునేటప్పుడు భమిడిపాటి కామేశ్వరరావు, పిలకా గణపతిశాస్ర్తీ, కృత్తివాస తీర్థులు టీచర్లుగా ఉండేవారట. అప్పుడే ఆమెకు సాహిత్యం పట్ల, హాస్యం పట్లా అభిరుచి కలిగిందట. కానీ వారింట్లో ఆడపిల్ల గట్టిగా నవ్వడం నిషిద్ధం. పధ్నాలుగో సంవత్సరంలో ఉన్నప్పుడు ఆమెకు పెళ్లి చేయాలని చూశారట ఆమె తండ్రి. కానీ ఛాయాదేవి అన్న అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమెను కాలేజీలో చేర్పించారట. బి.ఎ. పరీక్షలైపోగానే ఆమెకు ఓ సంబంధం చూశారట. ఆ పెళ్లికొడుకు తల్లి బలవంతంపై నిశ్చితార్థానికి ఒప్పుకున్నా, తరువాత సింధీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఆ సంబంధం చేజారింది. ఇదే సాకుతో ఛాయాదేవి అన్నయ్య ఆమెను హైదరాబాద్ రప్పించుకుని నిజాం కాలేజీలో ఎం.ఎ.లో చేర్పించారట. అలా ఆమె హైదరాబాద్ వచ్చాక రేడియో ప్రోగ్రామ్స్ వింటూ సాహిత్యాభిలాషను పెంచుకుందట. ఆమె వదిన రుక్మిణీగోపాల్ కూడా కథలు రాసేది. అవి వారపత్రికల్లో అచ్చయ్యేవి. అలా ఛాయాదేవికి కూడా ఉత్సాహం కలిగి మొదటి కథ ‘అనుబంధం’ రాసింది. అది కాలేజీ మేగజైన్ ‘విద్యార్థి’లో అచ్చయింది. అలా ఆమె కథలను రాయడం మొదలుపెట్టారు. సాహిత్యాభిలాషతో రేడియోలో స్ర్తిల కార్యక్రమంలో కూడా ప్రసంగించేవారు ఛాయాదేవి. అలా ఒకరోజు భాస్కరభట్ల, రాయప్రోలు రాజశేఖర్, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ఆమెకు ఒక సంబంధం కుదిర్చారు. వారే అబ్బూరి వరదరాజేశ్వరరావుగారు.
స్ర్తివాదం.. ‘హక్కులు, అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలి. ‘స్ర్తివాదం అంటే అదేపనిగా మగవారిని వ్యతిరేకించడం కాదని, స్ర్తిలపై జరుగుతున్న దాడులు, అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పనిచేయటమే’ అని నమ్ముతారు ఛాయాదేవి. ఆమె రాసిన కథల్లో ఎక్కువ స్ర్తివాద కథలే.. తనను ఎవరైనా ‘ఫెమినిస్టు’గా చెప్పుకునేందుకే ఎక్కువ ఇష్టపడేవారు. నిజానికి తనకు వచ్చిన ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు’ స్ర్తివాదులందరికీ వచ్చిన అవార్డుగా ఆమె చెప్పేవారు. అందుకే ఆమె రాసిన కథలు స్ర్తిల గుండె అరల్లోని వెలుగు నీడల్ని, భావోద్వేగాల్ని అద్భుతంగా చూపుతాయి. సమాజంలో స్ర్తి గృహిణిగా, ఉద్యోగిగా, తల్లిగా.. అనేక చట్రాల్లో తన జీవితాన్ని ఎలా కుదించుకుని నిరాశల మధ్య జీవిస్తుందో తెలుపుతాయి. అసలు స్ర్తి జీవితంలోని వివిధ దశలు పురుషుల కనుసన్నలలోనే నడుస్తున్నాయన్నది వీరి కథల్లోని అంతర్లీన సత్యం. తెలుగు నేలపై స్ర్తివాదం అనే పదం వినపడక ముందే పరాధీనతకు గురైన స్ర్తిల జీవితాలను కథలుగా అందించారు. ఆమె తన మొదటికథలోనూ, మొదటి రేడియో నాటికలో కూడా పురుషాధిక్యతనూ, కుటుంబంలో తండ్రి నియంతృత్వాన్ని సున్నితంగా చూపించారు. అలా ఆమె కథలకి చాలావరకు పుట్టింట్లోను, అత్తింట్లోను, బంధుమిత్రులు, స్నేహితులు, ఉద్యోగరీత్యా గమనించిన విషయాలు, మూలాలను తీసుకుని వాటికి కొంత కల్పనను జోడించి కథలుగా మలిచేవారు. ఆడపిల్లను సాంప్రదాయం పేరుతో ఎదగనీకుండా, ఇతరులపై ఆధారపడేటట్లు చేశారు.. అనే ఇతివృత్తంతో రాసిన కథే ‘బోన్సాయ్ బ్రతుకు’. అలాగే ఆమె అత్తగార్ని దృష్టిలో పెట్టు
కుని ‘ఆయన కీర్తి వెనక’ అనే కథ రాశారు. ‘సుఖాంతం’ అనే కథ తన ఇంట్లోని ఆడవాళ్ల అనుభవాలకు, తన చిన్నప్పటి అనుభవాలకు కొంత కల్పన జోడించి రాశారు. ఇలా ఎన్నో స్ర్తి వాద కథలు.. కానీ ఆమెది స్ర్తివాద దృక్పథం అనేకంటే మానవతాదృక్పథం ఎక్కువ అనడం బాగుంటుందేమో..
అవార్డులు
* 1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహితీ పురస్కారం - తెలుగు విశ్వవిద్యాలయం
* 1996లో సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం
* 1996లో ‘మృత్యుంజయ’ నవలకి ‘రచయిత్రి - ఉత్తమ రచనా పురస్కారం’ - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
* 1997లో అభినందన - దుర్గాబాయి దేశముఖ్ అవార్డు
* 2000లో కళాసాగర్ - పందిరి సాహిత్య పురస్కారం
* 2004లో పులికంటి సాహితీ సత్కృతి పురస్కారం
* 2005లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
* 2006లో పి.వి. నరసింహారావు స్మారక పురస్కారం
* 2009లో కలైంజర్ ఎమ్. కరుణానిధి పోర్షలీ అవార్డు
* 2010లో రంగవల్లి స్మారక - విశిష్ట మహిళా పురస్కారం
* 2011లో సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతిభా పురస్కారం
* 2011లో అజో-విభో-కందాళం ఫౌండేషన్ - జీవితకాల సాధన పురస్కారం.
ఇలా ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. కేవలం పేరు కోసం, డబ్బు కోసం కాకుండా, రచన చేయడం ద్వారా ఆనందాన్ని, ఏదైనా ప్రయోజనాన్ని స్వయంగా ఆశిస్తూ, దాన్ని చదివినవారికి కూడా ఆనందాన్ని, ఆశించిన ప్రయోజనాన్ని పొందాలనే ఉద్దేశంతోనే రాయాలన్నది ఆమె సంకల్పం. ‘జీవితంలో అడుగులు వేసేటప్పుడు అవి తప్పటడుగు అవుతాయేమో, విమర్శలొస్తాయేమో అని సంకోచిస్తూ కూర్చుంటే అడుగు ముందుకు పడదు. ధైర్యంగా అడుగు ముందుకు వేస్తేనే అభివృద్ధి సాధ్యం.. విజయం తథ్యం’ అనేదే ఆమె సిద్దాంతం. 'భాషా జ్ఞానాన్ని, సామాజిక పరిణామాల అవగాహననీ పెంచడానికే కాదు, అజ్ఞానాన్ని తొలగించడానికీ, మూఢవిశ్వాసాలనీ, సంకుచిత భావాలనీ తొలగించడానికి కూడా సాహిత్యం ఉపయోగపడుతుంది. ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం తప్పక ఉంటుంది. కాబట్టి సాహిత్యమే సమాజానికి అత్యంత ఆవశ్యకం’ అనేవారు అబ్బూరి ఛాయాదేవి.

-ఎస్.ఎన్.ఉమామహేశ్వరి