మెయన్ ఫీచర్

కొత్త బంధంతో కోటి ఆశలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్చల ద్వారా చిరకాల సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చు. ముఖాముఖిగా కూర్చుని వివాదాలపై మాట్లాడుకోవడం వల్ల వాతావరణం తేలిక పడుతుంది, ఉద్రిక్తతలు చల్లారుతాయి, అపోహలు అంతరిస్తాయి. చిన్నాచితకా సమస్యలకు చిటికెలో పరిష్కారం లభిస్తుంది. కోర్టుల గుమ్మం ఎక్కడం, కేంద్రం వద్దకు వెళ్లి ఒకరిపై ఒకరు పితూరీలు చేసుకునే పని ఉండదు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల ద్వారా నదీజలాల వివాదాలను పరిష్కరించుకునేందుకు చేసిన ప్రయత్నం మంచి ఫలితాలు ఇస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత నెల 28న కృష్ణా, గోదావరి జలాలను గరిష్టస్థాయిలో వినియోగించుకోవాలని తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈనెల 15లోగా ఇంజినీరింగ్ నిపుణులు గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్లించేందుకు తగిన అవకాశాలపై నివేదిక ఇవ్వనున్నారు.
దేశంలో ఇపుడు కరవు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పొరుగున ఉన్న తమిళనాడు, మహారాష్టల్రోని మరఠ్వాడా ప్రాంతంలో అనావృష్టి, తాగునీటి ఎద్దడిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు సఖ్యతతో ముందడుగు వేస్తే, కొందరు దీన్ని రాజకీయం చేయడాన్ని ప్రజలు క్షమించరు. కొంతమంది ట్వీట్ల ద్వారా కేసీఆర్, జగన్‌ల భేటీని అవహేళన చేస్తూ వ్యాఖ్యానించడం దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పవచ్చు. 2014 నుంచి 2019 మే వరకు తెలుగురాష్ట్రాల పాలకుల మధ్య అనేక కారణాల వల్ల సామరస్యత లోపించింది. గత అయిదేళ్లలో ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ కత్తులు దూసుకున్నారు. అదంతా గతం. రానున్న రోజుల్లో కరవు పరిస్థితులను తట్టుకుని నిలబడాలంటే ఇరు రాష్ట్రాల పాలకులు అనివార్యంగా కలిసి పనిచేయాలి.
కేసీఆర్, జగన్‌లు కలిసి పనిచేసేందుకు రాజకీయ వాతావరణం సహకరిస్తోంది. ఇద్దరు రాజకీయ నాయకులు కలుసుకుంటే రాజకీయాలు మాట్లాడుకుంటారు. జగన్, కేసీఆర్ కలుసుకుంటే రాజకీయాలు తప్పనిసరిగా మాట్లాడుకోకుండా కేవలం అభివృద్ధి అంశాలకు పరిమితం అవుతారనుకుంటే అంత కంటే తెలివి తక్కువతనం మరొకటి ఉండదు. తెలంగాణలో వైకాపా, ఆంధ్రాలో తెరాస లేదు. అంటే రాజ్యాధికారంపై ప్రత్యక్ష, పరోక్ష వైరం జగన్,కేసీఆర్ మధ్య లేదు. దీని వల్ల వ్యక్తిగత వైరుధ్యాలు ఉండవు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారానికి ఇది సానుకూలమైన అంశంగా భావించాలి. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రకటించారు. బీజేపీకి 250 వరకు సీట్లు వచ్చి ఉంటే తమ మద్దతుతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉంటే చక్రం తిప్పవచ్చని, ప్రత్యేక హోదాతో పాటు భారీ ఎత్తున నిధులను తెచ్చుకోవచ్చన్న జగన్ ఆకాంక్షలకు బ్రేకులు పడ్డాయి. బీజేపీకి సొంతంగా 303 సీట్లు రావడంతో కేసీఆర్, జగన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు భాజపా పావులు కదుపుతోంది.
ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నా జగన్, కేసీఆర్‌లకు బీజేపీ ప్రత్యర్థిగానే మారుతుందని ఇటీవలి లోక్‌సభ ఎన్నికలు బలమైన సంకేతాలు ఇచ్చాయి. తాజా పరిస్థితుల వల్ల కూడా జగన్, కేసీఆర్ మధ్య మిత్రత్వం బలపడుతుంది. రెండు రాష్ట్రాల పాలకుల చేతిలో వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఉంటే- కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేసుకోవడం ఎందుకునే ఆలోచనలు ఇద్దరికీ తప్పనిసరిగా వచ్చి ఉన్నాయి. పిట్టపోరును పిల్చి తీర్చినట్లు జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతుడైన నాయకుడు, ప్రధాని నరేంద్ర మోదీకి తమ జుట్టును పనికట్టుకుని వెళ్లి ఇవ్వడం ఎందుకనే నిశ్చితాభిప్రాయానికి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి ఉన్నారు. ఇదేమీ ఊహించేందుకు అతీతమైన విషయమేమీ కాదు. ఇప్పటికిప్పుడు జగన్‌కు బీజేపీ బలమైన సవాళ్లను విసిరే పరిస్థితి లేకపోయినా, వచ్చే ఐదేళ్లలో ఏమి జరుగుతుందో తెలియదు. ఈ విషయంలో ఆంధ్ర రాజకీయాలు తెలంగాణ కంటే భిన్నంగా ఉంటాయి. కానీ ఆంధ్రాలో పాగావేయాలంటే వైకాపా ప్రభుత్వంపై భాజపా పోరాడాల్సిందే.
దేశవ్యాప్తంగా బలంగా ఉన్న బీజేపీ తమ రాష్ట్రాల్లో పాగావేయరాదన్న ఆలోచనతోనే జగన్, కేసీఆర్‌ల మధ్య దోస్తీ రానున్న రోజుల్లో మరింత బలపడుతుంది. రాజకీయాలు క్రూరంగా, విచిత్రంగా ఉంటాయి. శత్రువుకు శత్రువు తమ మిత్రుడనే మార్గంలో ఇద్దరు సీఎంలు ఉన్నారు. రాజకీయంగా నిలదొక్కుకునేందుకు, భవిష్యత్తులో తమకు కేంద్రం నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జగన్, కేసీఆర్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు.
రాజకీయ ప్రతిఫలాపేక్ష లేకుండా ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ పనిని ప్రారంభించడు. ఐదేళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య అనేక అంశాలపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగే పరిస్థితి కనిపిస్తోంది. సామాన్య ప్రజలు ఇదే కోరుకుంటున్నారు. వారికి రాజకీయాలతో పనిలేదు. ఇద్దరు సీఎంలు గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పంతో ఉన్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించడంలో రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఆశించిన స్థాయిలో స్పందించలేదు. ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధిని పట్టించుకోకుండా హైదరాబాద్ అభివృద్ధికి జగన్ పాటుపడుతున్నారంటూ ఒక టీడీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఎబ్బెట్టుగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం టీడీపీ చేయలేని పనిని జగన్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చేసి చూపించారు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో ఓపికపట్టే తీరిక కూడా టీడీపీ నేతలకు లేదు. పొరుగు రాష్ట్రంతో సంబంధాలు బాగుండాలని కోరుకోని వాళ్లు సొంత రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ప్రతిపక్షంగా ఎలా వ్యవహరిస్తారో తెలిసిపోతోంది.
గోదావరి ద్వారా 4వేల టీఎంసీల నీళ్లు వృథాగా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీ ద్వారా సముద్రంలోకి పోతున్నాయి. ఈ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్లించాలి. దీని కోసం అనేక ప్రత్యామ్నాయాలను ఇంజినీరింగ్ నిపుణులు ఆనే్వషిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గరిష్టస్థాయిలో రాయలసీమమ ప్రాంతానికి నీటిని తరలించాలన్న జగన్ సంకల్పం మంచిది. పోలవరం నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీటి సమస్య ఉండదు. కృష్ణా డెల్టా గతంలో వలే నాగార్జునసాగర్‌పై ఆధారపడాల్సిన పనిలేదు. ఆ మేరకు నీళ్లు సాగర్ జలాశయంలో ఉంటాయి. కాని కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గిపోతే నాగార్జునసాగర్‌తో పాటు కృష్ణా నది నీటిపై ఆధారపడి ఉన్న ఉభయ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. రెండు రాష్ట్రాల సీఎంలు సాగునీరు, తాగునీటి అవసరాల కోసం దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మంచి ప్రణాళికలను ఖరారు చేయాలి. గోదావరి జలాలను తక్కువ వ్యవధిలో ఎంత ఖర్చు అయినా వెరవకుండా నాగార్జునసాగర్ లేదా శ్రీశైలంకు మళ్లించే ప్రాజెక్టును నిర్మించాలి.
రైతులకు సాగునీరు కావాలి. ప్రజలకు తాగునీరు కావాలి. వారికి టీఎంసీలు, క్యూసెక్కులు వంటి గణాంకాలు అక్కర్లేదు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల పాలకులకు కావాల్సింది సంకల్ప సిద్ధి. గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించే విధంగా అత్యుత్తమ ప్రణాళికను ఎంపిక చేయాలి. పర్యావరణ అనుమతుల్లో జాప్యం, పెద్దగా భూసేకరణ భారం పడకుండా చూసుకోవాలి. పోలవరం నుంచి శ్రీశైలంకు నీటిని తరలిస్తారా? దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని మళ్లిస్తారా? లేక మరోమార్గమా? అనే విషయమై ఇంజినీరింగ్ నిపుణులు విస్తృ త స్థాయిలో అధ్యయనం చేస్తారు. చరిత్రలో మంచి కాలమనేది అరుదుగా వస్తుంటుంది. ఈ కాలాన్ని అనవసరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలతో వృథా చేస్తే తర్వాత చింతించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. రాష్ట్రం విడిపోయినా, పాత విషయాలకు పాతరేసి, నదీ జలాలను వినియోగించుకోవాలనే పట్టుదల జగన్, కేసీఆర్‌కు ఉండడం ప్రశంసనీయం. రెండు రాష్ట్రాలు నీటి కేటాయింపులను బట్టి నిధులను కేటాయిస్తే ఐదేళ్లలో ప్రాజెక్టులు పూర్తవుతాయి. రాజకీయంగా విమర్శలు ఎటూ ఉంటాయి. ఈ రోజు సొంతంగా అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఆంధ్ర, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు పెద్దగా ఆసక్తిని కలిగించవు. ఇద్దరు సీఎంలు ముందడుగు వేయడాన్ని ప్రజలు మర్చిపోరు.
రెండు రాష్ట్రాల్లో కొన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ వలలో జగన్ చిక్కుకున్నారని అంటే, జగన్ మాయలో కేసీఆర్ పడ్డారనే విమర్శలు చేయడం మంచిది కాదు. ప్రతి రాజకీయ పార్టీ నేత రాజకీయ ప్రయోజనం లేకుండా ఏ పనీ చేయడు. రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే ఒక మంచి ప్రాజెక్టును చేపడితే తప్పనిసరిగా ఆ క్రెడిట్ జగన్, కేసీఆర్‌లకే దక్కుతుంది. గత ఐదేళ్లలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే విధంగా ఎందుకు వ్యవహరించామనే విషయమై టీడీపీ ఇకనైనా సమీక్షించుకోవాలి. జల వివాదాలకు పరిష్కారం లభించడమే ముఖ్యం. మిగతావన్నీ పాలనపరంగా, రాజకీయంగా తీసుకునే నిర్ణయాలే. విద్యుత్ ఉద్యోగుల కేటాయింపు, విద్యుత్ బకాయిలు, 9,10 షెడ్యూళ్లలోని అంశాలు, ఆస్తుల విభజన, ఉద్యోగుల కేటాయింపుసమస్యలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరో సమావేశం నాటికి కొలిక్కి తెస్తే వారి భేటీలకు విశ్వసనీయత పెరుగుతుంది. 58 ఏళ్లపాటు కలిసి ఉండి 2014లో విడిపోయి, ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న వివాదాలకు వీలైనంత తొందరగా పరిష్కారం లభించే దిశగా ఇద్దరు సీఎంలు, ఉన్నతాధికారుల సమావేశాలు కొనసాగాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.

-కె.విజయ శైలేంద్ర 98499 98097