మెయిన్ ఫీచర్

రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగన్నాథుని లీలలు కనుగొనడం ఎవరికీ సాధ్యంకాదు. రూపం, నామం, బంధం ఇవేమీ లేని పరమాత్మ భక్తుల కోసం రూపాన్ని సృజించు కుంటాడు. నామాన్ని ధరిస్తాడు. ఇంకా భక్తులకోసమే బంధాలను కూడా కలిగించుకుంటాడు. కేవలం భార్యాభర్తగానే కాదు అన్నగా, తమ్మునిగా, అక్కగా, చెల్లిగా, మామగా, తాతగా కూడా పరమాత్మ ఎన్నో బంధాలను ఏర్పరుచుకుని వాటిలోని మర్మాన్ని మానవులకు ఎరుకపరుస్తుంటాడు. అంటే
మనుష్యులుగా పుట్టినా సంసార సాగరంలో మునకలు వేస్తున్నా సరే మనిషి మనసు ఎపుడూ భగవంతునిపైనే ఉండమని అదెలా సాధ్యమవుతుందో ఆవిధంగానే మనిషిగా పుట్టిన భగవంతుడు చేసి చూపెడుతాడు. జగత్తును సృష్టించిన జగన్నాథుడు ‘పూరీ’గా వ్యవహరింపబడుతున్న పట్టణం లో పూరీజగన్నాథునిగా పూజలందుకుంటు న్నాడు. ప్రతి రోజు పూజలందుకున్నా ఈ ఆషాఢంలో మొదటిరోజు నుంచి విశేషమైన పూజలను అందుకుంటాడు స్వామి. వైశాఖ తృతీయనాడు కొత్త రథం తయారు చేయడా నికి మొదలుపెట్టిన రథం తయారీ పూర్తి అయ ఆషాఢవిదయ నాడు ఆ రథంపైన స్వామీ వూరేగడానికి బయలుదేరుతారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే జగన్నాథునికి, ఆతని సోదరీ సోదరులకు జ్యేష్ఠ్భాషేకం నిర్వహించి పదిహేను రోజులపాటు ఏకాంతవాసంలో ఉంచుతారు. సాధారణ ప్రజలకు దర్శనం ఉండదు. నిత్య పూజా కార్యక్రమాలను దయితపతులు నిర్వహిస్తుంటారు. అందుకని ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు ‘‘నవయవ్వన దర్శనం’’ పేరిట భక్తులకు స్వామి దర్శనం ఇస్తారు. ఇక ఆ పక్కరోజు నుండి ప్రజల్లోకి స్వామీ బయలు దేరి వెళ్తారు. అంటే ఆషాఢ విదియ నాడు ఈ యాత్రను జగన్నాథుని ‘‘ఘోషయాత్ర’’ పదిరోజుల పాటు జరుగుతుంది. జగన్నాథుడు తన వేసవి విడిదియైన గుండిచా మందిరంలో ఉంటూ భక్తులను అనుగ్రహిస్తాడు.
బలభద్రుడు ఋగ్వేద స్వరూపుడు, జగన్నాథుడు సామవేద స్వరూపుడు, సుభద్ర యజుర్వేదానికి, సుదర్శనుడు అధర్వణ వేదానికీ ప్రతీకలని సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడ’’ని పండితులు చెప్పే ఈ బలభ్రద, సుబద్ర, జగన్నాథునితో కలసి రథయాత్రలో ఉంటారు. జగన్నాథునితో సుదర్శనమూ ఉంటుంది.
రథాయాత్రకు ముందురోజుకు మువ్వురు మూర్తులకు మూడు రథాలను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రధాన మందిరం ముందు సిద్ధంచేసి ఉంచుతారు.
జగన్నాథ ఆలయంనుండి గుండిచా మందిరంవరకు ఉండే వెడల్పైన మార్గాన్ని, ఆ మార్గంలో జరిగే యాత్రను ‘బడాదండా’గా పిలుస్తారు. రత్నీ వేదికనుండి మూలమూర్తులను ఊయల ఊపుతున్నట్లు ముందు వెనుకలకు కదలిస్తూ రథాలపై ఆశీనులను చేస్తారు. ఈ ప్రక్రియను ‘‘పహుండీ’’అని పిలుస్తారు. ఈ కార్యక్రమాన్నంతా పారంపరికులైన దయితపతులే (వండాలు) నిర్వహిస్తారు. రథయాత్ర ప్రారంభానికి ముందు పారంపరిక సాంప్రదాయానుసారం జగన్నాథుని తొలి సేవకుడు పూరీ మహారాజు బంగారు చీపురుతో రథాలను శుభ్రంచేసి, కల్లాపి జల్లుతాడు. అనంతరం అశేష భక్తులు రథాలను గుండిచా మందిరానికి తరలిస్తారు. ఆ సాయంత్రంలోపు చేరినట్లయితే రథాలను మార్గమధ్యంలోనే ఉంచి మరునాటి ఉదయాన తరలిస్తారు. అక్కడ మూలమూర్తులు 9 రోజులు నివాసం ఉంటారు.
ఐదవ రోజున ‘హీరాపంచమి’ ఉత్సవం నిర్వహిస్తారు. తనను విడిచి వచ్చిన భర్తపై శ్రీలక్ష్మి ఆగ్రహించి జగన్నాథుని రథచక్రం యొక్క శీలను తొలగిస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో దీనిని ‘శీల విరుపు’గా పరిగణిస్తారు. 10వ రోజున అనగా ‘హరిశయన ఏకాదశి’నాడు జగన్నాథుడు తిరుగుప్రయాణం చేస్తాడు. దీనినే మారు ‘రథాయాత్ర’గా పిలుస్తారు.
ప్రధాన మందిరం ముందు జగన్నాథుడు సర్వాలంకార భూషితుడై రోజంతా భక్తులకు తన కృపా కటాక్షవీక్షణాలను ప్రసాదిస్తాడు. ఆ మరునాడు జగన్నాథుడు సోదరీసోదరులు, ఇతర మూర్తులతో కలసి రత్నవేదికపై ఆశీనులౌతారు. ‘‘అధర ఫాణాభోగ’అను తీయటి పానీయాలను మూలవిరాట్టులకు సమర్పించడంతో ‘రథయాత్ర’ సంరంభం ముగుస్తుంది. ‘రధేన వామనం దృష్ట్య పునర్జన్మ విద్యతే’’అని శాస్త్రప్రమాణం. రథంలో ఉన్న జగన్నాథుని దర్శనంచేస్తే పునర్జన్మ ఉండదట. జగత్తుకు హితం చేకూర్చే జగన్నాథుని రథయాత్రను ప్రజలందరూ ఎంతో సంబరంగా చూస్తారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ రథయాత్ర చూడడానికి తరలి వస్తారు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు