మెయిన్ ఫీచర్

‘తలాక్’ పేరిట హక్కుల ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకవైపు తలాక్ చెప్పడం ద్వారా ఏకపక్షంగా విడాకులు ఇవ్వడాన్ని పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు
వ్యతిరేకిస్తున్నట్లు ఒపీనియన్ పోల్స్ ద్వారా తెలుస్తూంటే, మరోవైపు
‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు’ మాత్రం ఈ విషయంలో సంస్కరణలు తీసుకురావడానికి
ఎంతమాత్రం అంగీకరించడం లేదు.

తొలిసారిగా ఎంతోమంది ముస్లిం మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి దేశంలోని ఇతరులందరికీ రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను తమకూ కల్పించాలని 2016లో సుప్రీం కోర్టును కోరారు. ఇస్లాం మతాచారం ప్రకారం భర్త ఎప్పుడైనా ‘తలాక్’ అని మూడుసార్లు చెప్తే ఇక తన భార్యకు విడాకులు ఇచ్చేసినట్లే. ‘తలాక్’ అని చెప్పడం ద్వారా ఏకపక్ష విడాకులు ఇచ్చే పద్ధతి తమపై బలవంతంగా రుద్దారని, ఇలా భర్తలు వదిలేసిన భార్యలు రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు కూడా నోచుకోవడం లేదని భారతీయ ముస్లిం మహిళలు చిరకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సంప్రదాయ ముస్లింలు మాత్రం ఈ విషయంలో న్యాయస్థానాల జోక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి విషయాలలో ప్రభుత్వం, న్యాయస్థానాలు ఏ రకంగానూ జోక్యం చేసుకోరాదన్న కాలం చెల్లిన ఆలోచనలతోనే ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు’ ఒక తీర్మానం చేసింది.
తలాక్ చెప్పే పద్ధతి ఇస్లాంలో మొదటి నుంచీ లేదని ముస్లిం మేధావులు అంటున్నారు. ప్రముఖ ముస్లిం న్యాయవాదులు కూడా ఏకపక్షంగా తలాక్ చెప్పి అతి సులువుగా భార్యకు విడాకులు ఇచ్చి వదిలించుకోవడం అనేది చాలా అసంబద్ధమైన విషయమని అంటున్నారు. అలా విడాకులు పొందిన ముస్లిం మహిళకు తన వాదన వినిపించే అవకాశమే లేకపోవడం, దంపతుల మధ్య సమన్వయానికి ఇతరులెవ్వరికీ ఎలాంటి అవకాశం లేకపోవడం ఏ మాత్రం న్యాయసమ్మతం కాదనీ, దానివల్ల విడాకులు పొందిన ముస్లిం స్ర్తిల జీవితం దుర్భర వౌతుందని ముస్లిం న్యాయకోవిదులు అంటున్నారు.
డా.ఇబ్రహీం బి సయ్యద్, ఇస్లామిక్ రీసెర్చి ఫౌండేషన్ అధ్యక్షుడు ‘ట్రిపుల్ తలాక్’ అన్న పుస్తకంలో ముస్లిం సమాజాలలో విడాకుల పద్ధతికి సంబంధించిన చారిత్రక, తార్కికపరమైన వ్యవహారంలో వస్తున్న ఎన్నో విషయాలను సమగ్రంగా వివరించారు. ఎంతోమంది ఇస్లామిక్ న్యాయశాస్త్ర కోవిదులు ఏకపక్షంగా జరిగే తలాక్ వ్యవహారం ఏ విధంగా చెల్లదని అంటున్నారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా భార్యలను నిర్లక్ష్యం చేస్తూ ఏకపక్షంగా విడాకులు ఇచ్చిన సంఘటనలను మహమ్మద్ ప్రవక్త కూడా అంగీకరించరని ముస్లిం పండితులు అంటున్నారు.
ఏ మాత్రం దయ లేకుండా కేవలం భర్తల నోటిమాటతో విడాకులు పొందిన ముస్లిం స్ర్తిల దౌర్భాగ్య స్థితి సుప్రీం కోర్టు తలుపులను తడుతోంది. అసలు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వడం సరైన పద్ధతా? కాదా? అలా చేయడం ఇస్లాం మత నియమాలకు ఆమోదయోగ్యమేనా? అన్నది ప్రధానం కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే పౌరులందరికీ రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా మహిళల పట్ల లింగ వివక్ష చూపడం సమ్మతమేనా? అన్నది. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో కలిపి 21 ముస్లిం దేశాలు తలాక్ పద్ధతిని నిరాకరిస్తూ, ఏకపక్షంగా విడాకులు ఇచ్చే పద్ధతిని ప్రశ్నించే అవకాశాన్ని మహిళలకు కల్పిస్తూ తమ చట్టాలలో మార్పులు తీసుకువచ్చాయి. భారతదేశంలోని న్యాయస్థానాలు కూడా ముస్లిం సమాజంలోని విడాకులు ఇచ్చే పద్ధతిని రాజ్యాంగంలో చెప్పబడిన ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా చట్టబద్ధం చేస్తూ తగిన మార్పులు తీసుకురావలసి ఉంది.
ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే మతపరమైన అల్పసంఖ్యాకులు మార్పును అంగీకరించరనీ, ఏ చిన్న మార్పు అయినా సరే వాళ్ళ మత అస్తిత్వానే్న దెబ్బతీస్తుందన్న అభిప్రాయం భారతదేశంలోనూ వుంది. కానీ శ్రీలంకకు చెందిన ముస్లింల దక్పథం వేరు. శ్రీలంకకు చెందిన వివాహ, విడాకుల చట్టంలో ఏకపక్షంగా, తక్షణమే ఇచ్చే విడాకులు పరిగణనలోకి తీసుకోరాదంటూ 2006లో సవరణ చేశారు. భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్న భర్త ముందుగా ఖాజీకి (ఇస్లామిక్ జడ్జి) నోటీసు పంపాలి. ఆ తరువాత 30 రోజులలో ఆ భార్యాభర్తల మధ్య సమన్వయం కుదర్చడానికి ఖాజి ప్రయత్నించాలి. అప్పటికీ సమన్వయం కుదరకపోతే భర్త తన భార్యకు తలాక్ చెప్తూ విడాకులు ఇవ్వాలి. అది కూడా ఖాజీ, మరో ఇద్దరు సాక్షుల సమక్షంలో మాత్రమే.
భారతదేశంలోని సున్నీ ముస్లింలు తలాక్ చెప్తూ ఏకపక్షంగా విడాకులు ఇచ్చే పద్ధతిలో సంస్కరణలను స్వాగతిస్తారా? లేదా? అన్నది గత వంద సంవత్సరాలుగా చర్చనీయాంశమైన విషయం. ఇప్పటికీ చాలామంది సున్నీ మత పెద్దలలో ‘ఋతుస్రావం కాని రోజుల్లో భార్యకు తలాక్ చెప్తూ భర్త విడాకులు ఇవ్వడమే అత్యుత్తమమైనది’ అన్న అభిప్రాయం బలంగా ఉంది. అలా తలాక్ ఇచ్చాక మూడు నెలలపాటు వేచి ఉండే ‘ఇద్దతు’ సమయంలో భర్త విడాకులను రద్దు చేసుకోవచ్చు. ఆ తరువాత నిర్ణయించబడిన రోజునే వారు తిరిగి వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో తలాక్‌ని ‘ఆహ్సన్’ అని వ్యవహరిస్తారు. అదే భర్త తన భార్యకు రెండోసారి తలాక్ చెప్తే దానిని ‘హసన్’ అంటారు. ఇపుడు కూడా ఇద్దత్ సమయంలో భర్త తలాక్‌ను వెనక్కి తీసుకోవచ్చు. తరువాత వాళ్ళిద్దరూ తిరిగి వివాహం చేసుకోవచ్చు. ఇలా మూడుసార్లు తలాక్ ఇస్తే ఇక ఆ వివాహబంధం శాశ్వతంగా రద్దయినట్లే. వారిని తిరిగి కలపడానికి ఎలాంటి అవకాశమూ లేదు. అలా మూడుసార్లు విడాకులు పొందిన భార్య మరొకరిని వివాహం చేసుకొని, అతని నుండి విడాకులు తీసుకుంటే తిరిగి మొదటి భర్తను వివాహం చేసుకోవచ్చు. ఇలా జరిగే వివాహాన్ని ‘హాలాలా’ అంటారు. అయితే ఈ వ్యవహారమంతా చాలా సంక్లిష్టమైనది. ఈ పద్ధతి ఎంతో దుర్వినియోగానికి గురౌతున్నది కూడా. ఇది చాలా హాస్యాస్పదంగా తయారైంది కూడా.
భారతదేశంలోని ముస్లిం మత గురువులు మాత్రం- ‘తలాక్ ద్వారా విడిపోయినవారు తిరిగి కలుసుకునే అవకాశమేలేదనీ, ఒకవేళ విడాకులు పొందిన భార్య మరొకరిని వివాహం చేసుకొని అతని నుండి తీసుకున్న పక్షంలో తన పూర్వ భర్తను తిరిగి వివాహం చేసుకోవచ్చ’ని అంటున్నారు.
మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా భర్త ఏకపక్షంగా భార్యకు విడాకులు ఇవ్వడాన్ని భారతీయ న్యాయస్థానాలు నిరాకరించిన సందర్భాలు లేకపోలేదు. 2008లో మస్రూర్ అహ్మద్ వెర్సస్ స్టేట్ అన్న కేసు విషయంలో స్పందిస్తూ ఢిల్లీ హైకోర్టు ముస్లిం జడ్జి బాదర్ డి అహ్మద్ ఒకేసారి మూడు తలాక్‌లు చెప్పడాన్ని ఒక తలాక్‌గానే పరిగణించాలనీ, అలాంటి తలాక్ చెల్లదని అన్నారు. జియావుద్దీన్ అహ్మద్ వెర్సస్ అన్వర్ బేగం కేసు విషయంలో స్పందిస్తూ గౌహతి హైకోర్టు ముస్లిం భర్త తన భార్యకి తలాక్ చెప్పడానికి సరైన కారణం ఉండాలనీ, అలాంటి సందర్భాలలో ఆ భార్యాభర్తలమధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నం జరగాలని పేర్కొంది.
ఒకవైపు తలాక్ చెప్పడం ద్వారా ఏకపక్షంగా విడాకులు ఇవ్వడాన్ని పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు వ్యతిరేకిస్తున్నట్లు ఒపీనియన్ పోల్స్ ద్వారా తెలుస్తూంటే, మరోవైపు ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు’ మాత్రం ఈ విషయంలో సంస్కరణలు తీసుకురావడానికి ఎంతమాత్రం అంగీకరించడం లేదు. అసలు తలాక్‌ని నిషేధించే క్రమంలో పలు ముస్లిం దేశాలు చేపట్టిన వివిధ సంస్కరణలను ముస్లిం బోర్డు అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
జకియా సోమన్ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సహ వ్యవస్థాపకురాలు. ఇస్లాంలో మహిళల స్థితిగతుల గురించి ఆమె పలు సందర్భాల్లో మాట్లాడుతూ- ‘ముస్లిం మహిళలు విద్యాపరంగా, ఆర్థికంగా, న్యాయపరంగా విచక్షణకు గురౌతున్నారు. వ్యక్తిగతమైన న్యాయం విషయంలో ముస్లిం మహిళలకు ఎప్పుడూ నిరాశే ఎదురౌతోంది. నేటికీ ముస్లిం సమాజంలో స్ర్తిలు ఇళ్ళలోనో, పరదాల మాటునో మగ్గిపోతారనే చాలామంది విశ్వసిస్తారు. అలాంటప్పుడు ఖురాన్‌కు విరుద్ధమైన ‘తలాక్’ వంటిది నేటికీ కొనసాగుతున్నాయడంలో ఆశ్చర్యం ఏముంది? ఖురాన్ తలాక్‌ను ఏ రకంగానూ సమర్థించదు. కానీ మన దేశంలో తలాక్ పేరుతో ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోంది. కాబట్టి ఇస్లాం సమాజంలో తలాక్ చెప్తూ భర్త ఏకపక్షంగా విడాకులు ఇచ్చే పద్ధతిని తక్షణం నిషేధించాలి..’ అని అంటున్నారు.

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690