ఎడిట్ పేజీ

సంక్షేమ రాజ్యం రూపశిల్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, మన దేశంలోనే దిగవంత నేత డా. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన వినూత్న ఒరవడిని సృష్టించింది, ప్రజల పట్ల పాలకులకు ఉండదగిన కర్తవ్యానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. 2003లో ప్రతిపక్ష నాయకుడిగా 1475 కి.మీ మేరకు మండుటెండలో వైఎస్ జరిపిన చారిత్రాత్మక ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలకు పెద్ద కుదుపు కలిగించింది. ఈ పాదయాత్ర కన్నా ముందే వెనుకబడిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఆయన 80వ దశకంలోనే పాదయాత్ర చేశారు. పాదయాత్ర సందర్భంగా అత్యంత వెనుకబడిన ప్రాంతాలను సందర్శించి, అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకోవడం ద్వారా- తాను అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రజానురంజకరంగా పరిపాలన జరపడానికి ఆయనకు అవకాశం ఏర్పడింది. పేదల పట్ల, ఆపదలో ఉన్న ప్రజల పట్ల వైఎస్ చూపిన ఆదుర్దా, వారిని ఆదుకోవాలన్న పట్టుదల, వారి జీవితాలలో వెలుగులు నింపాలన్న తపనను మరే నాయకుడితో పోల్చలేము.
1949 జులై 8న పులివెందులలో జన్మించిన రాజశేఖర రెడ్డి పిన్న వయస్సులోనే 29 ఏళ్లకు 1978లో శాసన సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత రెండేళ్లకే మంత్రి పదవి చేపట్టారు. ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని అతికొద్దిమంది నాయకులలో ఆయన ఒక్కరిని చెప్పవచ్చు. నాలుగు సార్లు కడప నుండి లోక్‌సభకు, పులివెందుల నుండి అసెంబ్లీకి ఐదు సార్లు ఎన్నికయ్యారు.
వైఎస్‌తో నా 20 సంవత్సరాల జ్ఞాపకాల దొంతర్లు అనేకం. ఆయన జయంతి సందర్భంగా వారితో నాకున్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందే. ఆయనతో ఉన్న అనుబంధం గురించి రాయాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. అయినా కొన్ని విషయాలు పంచుకుంటున్నాను. 1989 నుండి 1996 వరకు ఆయనతో కలిసి పార్లమెంటు సభ్యుడిగా, 2004 నుండి 2009 వరకు ఆయన కేబినెట్‌లో మంత్రిగా పనిచేసే అవకాశం నాకు దక్కింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే నిరంతరం వైఎస్ ఆలోచించేవారు. ఆయన అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో, ఆయన ఆశయాలను నిజం చేయడానికి వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధే ఏకైక అజెండాగా పెట్టుకొని ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఉత్తరాంధ్ర చర్చావేదిక తరఫున పనిచేస్తున్నాను.
1989 నుండి 2009 ఆయన మరణం వరకు నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వైఎస్‌ను కలవకుండా వెళ్లిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఆయన నన్ను ఒక సోదరునిగా, కుటుంబ సభ్యునిగా చూసుకున్నారు. ఇదే సందర్భంలో రాజశేఖరరెడ్డి గారి ఆత్మబంధువైన డా॥ కె.వి.పి. రామచంద్రరావు గురించి కూడా ప్రస్తావించాలి. ఈయన మాకు, వైఎస్‌కి మధ్య వారధి వంటివారు. కేవీపీ కూడా మాకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ మా రాజ కీయ ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డారు.
2004 మే 14 నుండి 2009 సెప్టెంబర్ 2న నల్లమల అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందే వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన వైఎస్ అభివృద్ధి, సంక్షేమ రంగాల పట్ల అనుసరించవలసిన ప్రాధాన్యతల గురించి సరికొత్త ఆదర్శాన్ని ఉంచారు. నేడు దేశంలో దాదాపు అన్ని ప్రభుత్వాలు అన్ని రంగాలలో ఆయనను ఒక ‘రోల్ మోడల్’ గా తీసుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలన్నీ దేశంలో నూతన వరవడి సృష్టించి, దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వైఎస్‌కు ముందు అధికారంలో కొనసాగినవారు మొక్కుబడిగా కొద్దిమందికి, అదీ సొంత పార్టీకి-వర్గానికి చెందిన వారికి మాత్రమే లబ్ది చేకూర్చేలా అరకొర నిధులు కేటాయిస్తూ ఉండేవారు. అయితే ఆయన ఏ పథకం చేపట్టినా అవసరం ఉన్న, అర్హత గల ప్రజలందరికీ, వేరే పార్టీ వారు, వేరే వర్గానికి చెందినవారు అన్న వివక్ష లేకుండా మేలు చేకూర్చేలా చూడటం ఆయనలోని ప్రత్యేకత. అంతకు ముందు పెన్షన్ అందుకుంటున్న వారు మృతి చెందితేనే కొత్తగా మరి కొంత మందికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసేవారు. కానీ ఆయన పాలనలో అర్హులైన అందరికీ పెన్షన్ అందే ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అరకొర సదుపాయాలతో నామమాత్రపు వైద్య సేవలు అందించడం కాకుండా, పేదలందరూ కార్పొరేట్ వైద్యసేవలు పొందేలా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేశారు. ఉచిత అంబులెన్సు సేవలను దేశంలోనే మొదటగా ప్రజలకు అందజేశారు.
డ్వాక్రా మహిళలకు ‘పావలా వడ్డీ’కే ఆర్థిక సహాయం కల్పించి చిన్న చిన్న వ్యాపారాలు, వృత్తుల ద్వారా మహిళా సాధికారికతకు అవకాశం కల్పించారు. పేదలందకీ గూడు కల్పించడానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా భారీ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
అణగారిన వర్గాల విద్యార్థులు సైతం నాణ్యతతో కూడిన వృత్తి విద్యను పొందేలా ఆయన ప్రవేశ పెట్టిన ‘ఫీజు రియింబర్సమెంట్’ పథకం అద్భుత ఫలితాలు ఇచ్చింది. ఇటువంటి పథకం దేశంలో మరెక్కడా లేకపోవడం గమనార్హం. కలలో కూడా ఊహించలేని విధంగా పేద విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, బిజినెస్ మేనేజ్ మెంట్ వంటి కోర్సులు చదువుతున్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పేదలకు అందుబాటులోకి తెచ్చారు. పేదలకు ఉపాధి హామీ కల్పించేలా అప్పట్లో డా॥ సింగ్ ప్రభుత్వం చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పెద్దఎత్తున అమలు చేసింది ఏపీలోనే కావడం గమనార్హం. 2008లో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అమలు చేసేలా ప్రభావితం చేయడంలో వైఎస్ కృషి ఎంతో ఉంది. 2009 ఎన్నికలలో కొత్తగా ఎటువంటి వాగ్దానాలు చేయకుండా కేవలం తన ప్రభుత్వ పనితీరు చూసి ఓటు వేయమని ప్రజలను రాజశేఖరరెడ్డి కోరారు. ‘అభివృద్ధి, సంక్షేమం, విశ్వసనీయత’లకు ప్రతీకగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టి మరోసారి ఎన్నుకున్నారు.
వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రభుత్వాలు ఆ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో రైతుల దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటూ దీనావస్థలో ఉండడాన్ని స్వయంగా తన పాదయాత్ర సందర్భంగా చూసిన రాజశేఖర రెడ్డి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి దేశంలో మరే ప్రభుత్వం చేపట్టలేనన్ని కార్యక్రమాలను చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం రైతులకు ఉచిత విద్యుత్ అందజేసే ఉత్తర్వులపై సంతకం చేశారు. దాంతో మెట్ట ప్రాంతాలలోని రైతులకు ఎంతో వెసులుబాటు కలిగించినట్టు అయింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో కొత్త వెలుగులు నింపే ప్రయత్నం జరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం వైఎస్ ప్రత్యేక ప్రయత్నం చేశారు. నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేశారు. దీంతో వెనుకబడిన ప్రాంతాల పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడానికి వీలు కలిగింది.
కాగా, ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు జరిగిన అన్యాయాలే ఇపుడు అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరుగుతున్నాయి. వైఎస్ వారసుడు, నూతన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఈ విషయాలను దృష్టిలో వుంచుకొని వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ పట్ల ప్రత్యేక శ్రద్ధతో కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే వైఎస్ ఆశయాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల ఆయన కన్న కలలను నిజం చేయవచ్చు.
రాష్ట్రంలో లక్ష ఎకరాలకు అదనంగా సాగు నీటి సదుపాయం కల్పించడానికి వైఎస్ ప్రారంభించిన ‘జలయజ్ఞం’ చారిత్రాత్మకమైనది. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా బీడు భూములు అన్నింటినీ సాగులోకి తీసుకురావడం కోసం దేశ చరిత్రలోనే అంతకు ముందెవ్వరూ చేయనటువంటి ఒక బృహత్తర ప్రయత్నాన్ని ఆయన చేపట్టారు. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటును మెరుగు పరచడం కోసం, రైతులు, రైతు కూలీలకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడానికి ఆయన పలు పథకాలను ప్రారంభించారు.
సాగునీటి సదుపాయాలను పెంపొందించే జలయజ్ఞం కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అమలు చేశారు. వెనుకబడిన ప్రాంతాలు, నిత్యం దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనే ప్రాంతాలను సశ్యశ్యామలం చేయాలని అకుంఠిత దీక్షతో కృషి చేశారు. జలయజ్ఞం క్రింద 32 భారీ, 17 మధ్య తరహా సాగునీటి పథకాలను రూ. 65 వేల కోట్ల వ్యయంతో నిర్మించి 71 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీటి వసతి కల్పించడంతో పాటు 21.32 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి స్థిరీకరించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. లోతుగా ప్రవహించే గోదావరి నది నుండి ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకు వచ్చి నిల్వ చేసే విధంగా పథకాలు తయారు చేశారు. ఈ పథకాలు సాగునీటి సదుపాయంతో పాటు 1.20 కోట్ల మందికి త్రాగునీటిని కల్పించి, 1700 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదనకు సైతం పథకాలు రూపొందించారు.
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించాలనే ఉద్దేశంతో బాబూ జగ్జీవన్‌రాం సుజల స్రవంతి పథకానికి రూపకల్పన చేశారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు లభించడంతోపాటు 12వందల గ్రామాలకు త్రాగునీరు లభిస్తుంది. ఇటువంటి అనేక పథకాలను వెనుకబడిన ప్రాంతాల కోసం వైఎస్ రూపొందించారు. ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ తన తండ్రిఅడుగుజాడల్లో ఆయన నడుస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టి దివంగత నేత కన్న కలలను జగన్ నిజం చేయాలి.
దేశచరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా కేవలం ఐదు సంవత్సరాల నాలుగు నెలల పరిపాలనలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ఘనత కేవలం వైఎస్‌కే దక్కుతుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కాని, లేనప్పుడుకానీ నిత్యం ప్రజల సంక్షేమం కోసమే పరితపించారు. ఆయన 31 సంవత్సరాల ప్రజాజీవితం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికై చేసిన కృషి చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే నీటి వసతులు ఉండాలనే విషయాన్ని గమనించి అందుకు అనుగుణంగా జలయజ్ఞం అనే పవిత్ర కార్యక్రమానికి వైఎస్ శ్రీకారం చుట్టారు. ఆయన స్వచ్ఛమైన మనస్సుతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి పొలానికి కనీసం ఒక పంటకైనా నీటి సౌకర్యం కల్పించాలని ప్రారంభించిన జలయజ్ఞం కార్యక్రమం పూర్తయినప్పుడే ఆయన ఆశలు ఫలించినట్టవుతుంది. ఆ పవిత్ర ఆశయం కోసం రాజకీయాలకు అతీతంగా ఆయన అభిమానులు కృషి చేసినప్పుడే ఆయన నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది. వారే ఆయనకు అసలైన వారసులవుతారు.
*
(రేఫు వైఎస్‌ఆర్ 70వ జయంతి)

-కొణతాల రామకృష్ణ కన్వీనర్, ఉత్తరాంధ్ర చర్చా వేదిక konathalark09@gmail.com