మెయిన్ ఫీచర్

ముగ్గురూ చీఫ్ సెక్రటరీలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేష్నీ ఆనంద్ 1983 బ్యాచ్ ఐఏఎస్. హరియాణా రాష్ట్రంలో తొలి మహిళా డిప్యూటీ కమీషనర్‌గా ఆమె రికార్డుల్లోకి ఎక్కింది. హరియాణా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత 25 సంవత్సరాలకు ఒక మహిళ డిప్యూటీ కమీషనర్ అయ్యింది. తాజాగా ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా బాధ్యతలు చేపట్టింది. మరో విశేషం ఏంటంటే.. కేష్నీ కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లు చీఫ్ సెక్రటరీలు అయ్యారు. ముగ్గురిలో కేష్నీ అందరికంటే చిన్నది. తన అక్కలు మీనాక్షీ ఆనంద్ చౌదరీ (1969 బ్యాచ్), ఊర్వశీ గులాటీ (1975 బ్యాచ్) ఇద్దరూ ఈ పోస్టులో పనిచేశారు.
కేష్నీ ఆనంద్ సివిల్స్‌లో ఎంపిక ఐఏఎస్ శిక్షణ పొందుతున్న సమయంలో డిప్యూటీ కమీషనర్ విధుల గురించి నేర్చుకుంటుండగా, ఒక సీనియర్ అధికారి వచ్చి ఎగతాళిగా.. ‘ఈ పని ఎందుకు చేస్తున్నావు? నీకెవరూ డిప్యూటీ కమిషనర్ పోస్టు ఇవ్వరులే..’ అని అన్నాడు. అందుకు ఆమె స్పందిస్తూ.. ‘మీరేమీ ఆందోళన చెందకండి. ఏదో ఒకరోజు నేను డిప్యూటీ కమిషనర్ అవుతాను’ అని బదులిచ్చింది. ఈ విజయం గురించి ఆమె మాట్లాడుతూ..
‘ఈ విజయానికి కారణం మా తల్లిదండ్రులు. ముఖ్యంగా మా నాన్నగారు ప్రొఫెసర్ జీసీ ఆనంద్ కారణం. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదగాలన్నది మా అమ్మానాన్నల ఆశయం. అది ఇప్పుడు నెరవేరింది. అమ్మానాన్నలు మేం బాగా చదువుకునేందుకు, మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. మా ఇంట్లో బోలెడు పుస్తకాలు ఉండేవి. అదొక లైబ్రరీలా ఉండేది. ఆ కాలంలో అన్ని వసతులు సమకూర్చడం అంత సులువైన పని కాదు. మా పెద్ద అక్క పదో తరగతి పూర్తిచేయగానే, ఆమెకు పెళ్లి చేయాలంటూ బంధువులు ఒత్తిడి చేశారు. కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. తను బాగా చదువుకుని మంచి స్థాయికి వెళ్లిన తర్వాతే పెళ్లి చేస్తామని తేల్చి చెప్పింది. చదువే మనిషిని సమస్యల నుంచి బయట పడేస్తుందని మా అమ్మ బాగా చెబుతుండేది. బాగా చదువుకోవడం వల్లే మీ నాన్న యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించాడు. మీరు కూడా బాగా చదువుకోవాలి అని ఎప్పుడూ చెబుతుండేది. ఈ విషయాన్ని చిన్ననాటి నుండీ ఎప్పుడూ చెబుతూ ఉండేది. గతంలో మహిళలను ఉన్నత పదవుల్లో చూసేవారు కాదు. నేను డిప్యూటీ కమీషనర్ అంటే చాలామంది నమ్మేవారు కూడా కాదు. నేను ఏదైనా ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లినప్పుడు డిప్యూటీ కమిషనర్ భార్య వచ్చింది అనుకునేవారు. నా ముందే గ్రామ పట్వారీ (వీఆర్వో)ను మీ కూతురిని తీసుకొచ్చారా అని గ్రామస్థులు అడుగుతుండేవారు. పాలనా యంత్రాంగంలోనూ మహిళలకు కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉండేది. నేను తొలుత డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు, నేను పోస్టులో బాగా పనిచేయకపోతే తర్వాత మరే మహిళ ఆ పోస్టు పొందే వీలుండదు అన్నారు. కానీ ఆ తర్వాత ఏడాదికి అధికారుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను చూస్తే ఇద్దరు మహిళలకు డిప్యూటీ కమిషనర్‌గా ప్రమోషన్ వచ్చింది. దాంతో నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక మహిళగా తమ హక్కుల కోసం నిత్యం పోరాడాల్సి వచ్చేది. మమ్మల్ని మహిళలు, పురుషుల్లా కాకుండా అధికారుల్లాగే చూడాలని సీనియర్ అధికారులకు చెప్పాల్సి వస్తుండేది.. ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. అయినా ఇప్పటికీ సమాజం ఆలోచన మారాల్సిన అవసరం ఉంది. మహిళలు తమ హక్కులను వినియోగించుకునే వాతావరణం కల్పిస్తే వాళ్లు ఏదైనా సాధించగలరు అన్న విషయాన్ని అందరూ గ్రహించాలి’’ అని అంటున్నారు.
వీరి కుటుంబ స్వస్థలం పాకిస్తాన్‌లోని రావల్పిండి. 1947 దేశ విభజన సమయంలో ఆ కుటుంబం ఆస్తులన్నింటినీ అక్కడే వదిలేసి భారతదేశం వచ్చేసింది. లింగ నిష్పత్తిలో అసమానత్వం అనగానే గుర్తొచ్చే రాష్ట్రం హరియాణా. గత కొనే్నళ్లుగా ఈ రాష్ట్రంలో బాలికల సంఖ్య కాస్త మెరుగుపడినా, ఇప్పటికీ పురుషుల సంఖ్యతో పోల్చితే బాలికల సంఖ్య తక్కువగానే ఉంది. అలాంటి రాష్ట్రంలో ముగ్గురు సోదరీమణులు సివిల్స్ సాధించి, ప్రధాన కార్యదర్శి స్థాయికి వెళ్లడం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.