మెయన్ ఫీచర్

చట్టంలో సంక్లిష్టత.. ‘నిర్ణయం’పై ఉత్కంఠ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదహారు మంది కర్నాటక ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చివరకు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం లేదని ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాజీనామాలు చేసి తాము ప్రజల వద్దకు వెళతామని వారు కోర్టుకు తెలిపారు. రాజీనామాలను ఆమోదించకుండా తమపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని కూడా వారు కోర్టుకు విన్నవించారు. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం సమంజసమా? కాదా? అన్న విషయంలో- సమర్థించేవారు ఒక విధంగా, వ్యతిరేకించేవారు మరో విధంగా వాదనలు వినిపిస్తున్నారు.
సుప్రీం కోర్టు జోక్యంతో వ్యవహారం పలు కీలక మలుపులు తిరిగింది. రాజీనామా చేసిన వారిలో పది మంది ఎమ్మెల్యేలు కోర్టు ఆదేశాలపై ముంబయి నుండి బెంగళూరుకు వచ్చి స్పీకర్ రమేష్‌కుమార్‌ను కలిశారు. తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించినప్పటికీ, మెరుపువేగంతో చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని స్పీకర్ స్పష్టం చేశారు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని, రాజ్యాంగ నిబంధనలను పాటించాలని, రాజీనామాలలో నిజాయితీ ఎంత వుందో ఖరారు చేసుకోవాలని స్పీకర్ చెప్పారు. రాజీనామాలను క్షుణ్ణంగా పరిశీలించాకే చర్యలు చేపడతానని అన్నారు. ఎమ్మెల్యేలు మరోమారు సరైన ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించినప్పటికీ వారు ఆ రాజీనామాలను స్వచ్ఛందంగా చేశారా? లేదా? అనేది తాను నిర్ధారించుకోవాల్సి ఉందన్నారు.
స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిదన్న అంశంపై స్పష్టమైన అవగాహన ఎవరికీ లేదనే అనాలి. దానికి కారణం కూడా లేకపోలేదు. చట్టసభలకు ఎన్నికైన వారు రాజీనామాలు చేసిన సందర్భాలు గతంలో చాలావున్నా కర్నాటక వ్యవహారం కొంత ప్రత్యేకంగా వుంది. ఎవరి మీద కోపంతో వారు రాజీనామా చేశారో, అసలెందుకు చేశారో, వారికి కావాల్సింది ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అలాంటప్పుడు, నిర్ణయం ఎలా వుంటే సరైందన్న విషయంలోను స్పష్టమైన నిబంధనలు కాని, సాంప్రదాయాలు కాని, పద్ధతులు కాని, ప్రక్రియలు కాని వుండే అవకాశం లేదు. కేవలం రాజ్యాంగపరమైన మార్గదర్శకాలుంటే సరిపోదు. ఇంతమంది రాజీనామాలు చేసిన సందర్భాలలో, మన దేశంలో కాని ఇతర దేశాలలో కాని, అందరికీ ఆమోదయోగ్యమైన సంప్రదాయాలేమన్నా వున్నాయేమో అధ్యయనం చేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందేమో!
భారత రాజ్యాంగ నిర్మాణ స్వరూపం చాలావరకు, వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ పద్ధతితోనే రూపుదిద్దుకుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుసరించే భారత, ఇంగ్లాండ్ దేశాలకు దాదాపు ఒకే రకమైన సంప్రదాయాలు, ప్రక్రియలున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్ నిబంధనలు, సంప్రదాయాలు భారతదేశం అనుకరించడం జరుగుతున్నప్పటికీ, ఆ దేశంలో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు పూర్తికాలం పదవిలో కొనసాగకుండా మధ్యలో రాజీనామా చేయాలనుకున్నప్పుడు, రాజ్యాంగ స్ఫూర్తితో స్పీకర్ తీసుకునే నిర్ణయానికి సంబంధించిన ప్రకరణ మన రాజ్యాంగంలో పొందుపరచక పోవడం బహుశా పొరపాటేమో! వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ విధానంలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే విధానం అంతర్లీనంగా వుంటుందనాలి. అలాంటివి ప్రజాస్వామ్యం బలపడ్డానికి దోహదపడతాయి. ఉదాహరణకు ఆ దేశంలో వలే ఇక్కడి లోక్‌సభ, శాసనసభల స్పీకర్లు, చట్టసభల కాలపరిమితి తర్వాత జరిగే ఎన్నికలలో, ఏ పార్టీకి చెందని అభ్యర్థులుగా పోటీచేసే అవకాశం కలిగించాలి.
బ్రిటన్ పార్లమెంటుకు ఒకసారి ఎన్నికైన వ్యక్తికి- పదవీకాలం పూర్తవకుండా లేదా మళ్లీ ఎన్నికలొచ్చేవరకైనా రాజీనామా చేసే అవకాశం లేనే లేదు. పదిహేడవ శతాబ్దంలో రాచరిక వ్యవస్థ నేపథ్యంలో- బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నిక కావడం అరుదైన గౌరవంగా, ప్రజలకు సేవచేసే గొప్ప అవకాశంగా భావించినందున ఎవరూ రాజీనామా చేసేందుకు ఇష్టపడేవారు కాదు. ఆ అవసరం దృష్ట్యా మార్చి 2, 1623న ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు వీలుపడకుండా సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మన దేశం విషయానికొస్తే, ఒక వ్యక్తి ఒకటికి మించిన స్థానాలలో పోటీచేయవచ్చు. గెలిచిన స్థానాల్లో ఒకటి వుంచుకుని మిగతావాటికి రాజీనామా చేయవచ్చు. గెలిచిన అభ్యర్థి తన ఇష్టం వచ్చినప్పుడు రాజీనామా చేసి, ఉప ఎన్నికలొచ్చిందాకా వేచి వుండి తిరిగి పోటీకి దిగవచ్చు. ఈ విధానానికి స్వస్తిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందనాలి.
ఇండియా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో చట్టసభలకు ఎన్నికైనవారు రాజీనామా చేయదల్చుకుంటే ఆ విషయాన్ని ఫార్మాట్‌లో స్పీకర్‌కు తెలియచేస్తే సరిపోతుంది. స్పీకర్ తక్షణం రాజీనామాను ఆమోదించవచ్చు. లేదా నిర్ణయం వాయిదా వేయడమో, రాజీనామాలను తిరస్కరించడమో చేయవచ్చు. ‘ఇలా చేశాం’ అని చెప్పాల్సిన అవసరం లేదు. స్పీకర్ అందుబాటులో లేకపోతే రాజీనామా చేయదల్చుకున్న వ్యక్తి డిప్యూటీ స్పీకర్‌కు కాని, స్పీకర్ కార్యాలయ సిబ్బందికి కాని ఇచ్చిపోవచ్చు. రాజీనామా చేయడం అంత తేలికైన విషయమన్న మాట. ఫ్యాక్స్ ద్వారా రాజీనామాలు పంపిన వారూ వున్నారు. ఎంత వేగంగా వారు రాజీనామాలను సమర్పించుకుంటారో, అంతే మోతాదులో లేదా అత్యంత నెమ్మదిగా నిర్ణయాన్ని వాయిదా వేయవచ్చు.
ఇంగ్లాండులో సభ్యులకు రాజీనామా చేసే అవకాశం లేకపోయినా, సభ్యత్వం నుంచి తొలగడానికి రాజ్యాంగం ఒక వెసులుబాటు కలిగించింది. ‘రాజీనామా’కు బదులుగా ‘పదవీ విరమణ’ చేసే అవకాశం పార్లమెంట్ కలిగించింది. పార్లమెంటు సభ్యులుగా వున్నవారు ‘ఆదాయం లభించే’ పదవులను అంగీకరించరాదన్న నిబంధన వున్నందున, సభ్యులు ఆ నిబంధన ప్రకారం సభ్యత్వాన్ని కోల్పోయేందుకు, ప్రభుత్వపరంగా, ప్రత్యేకంగా దీనికొరకే ఉద్దేశించబడిన ఒక పదవి కావాలంటూ అభ్యర్థన చేసుకోవాలి. దాన్ని మన్నించి బ్రిటన్ రాణి లేదా రాజు, ఆర్థికమంత్రి (్ఛన్సలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్) ద్వారా ఆ పదవిలో వారిని నియమించడం, తక్షణమే సభ్యత్వం రద్దుకావడం జరుగుతుంది. అలాంటివారు తాము ఖాళీచేసిన సీటుకు ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి సాధారణంగా సాహసించరు. పార్టీ టిక్కెట్ కూడా లభించదు. ఆశ్చర్యకరమైన విషయం.. దీని కోసం కేటాయించిన పదవులు కాగితంపై మాత్రమే వుంటాయి. ఎప్పుడో మాంధాతల కాలంలో, రాచరిక వ్యవస్థ పూర్తిగా వేళ్లూనుకున్న రోజుల్లో, ఏర్పాటైన ఆ పదవులు, ప్రస్తుతం ‘‘చట్టపరమైన కల్పితాలు’’గా మిగిలిపోయాయి.
ఈ నేపథ్యంలో, ఆ దేశంలోని వామపక్ష ఐరిష్ రిపబ్లికన్ రాజకీయ పార్టీ నాయకుడు- పార్లమెంటు సభ్యుడు గెర్రీ ఆడమ్స్ ఆమధ్యన, బ్రిటీష్ పార్లమెంటు సభ్యత్వానికి చేసిన రాజీనామా, కొన్ని సమస్యలకు దారితీసింది. ఆయన రాజీనామా చేయడానికి కారణం ఉత్తర ఐర్లాండ్ శాసనసభ స్థానానికి పోటీచేసి, గెలిచి అక్కడ అధికారం పంచుకుంటున్న తన పార్టీ పక్షాన మంత్రివర్గంలో చేరడమే. వాస్తవానికి గెర్రీ ఆడమ్స్ ‘‘ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు ఇష్టపడని’’ (bstentionist)) వెస్ట్ మినిస్టర్ హౌస్ ఆఫ్ కామన్స్ (బ్రిటీష్ పార్లమెంట్ ఎగువ సభ) సభ్యుడుగా 1983నుంచి 1992వరకు, తిరిగి 1997లో ఎన్నికై 2011వరకు కొనసాగుతున్న నేపథ్యంలో రాజీనామా చేశాడు. అలానే ఆయన సహచర పార్టీ అభ్యర్థులు మరికొందరున్నారు. ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారం, తమ బలాన్ని నిరూపించుకోవడానికి పోటీచేసి గెలుస్తారు కాని, సభా కార్యక్రమాల్లో పాల్గొనరు. అలా 19వ శతాబ్దం నుంచి కొనసాగుతోంది.
ఉత్తర ఐర్లాండును యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి వేరుపరచడం వారి నినాదం. ఒకనాటి మిలిటెంట్ ఉద్యమాన్ని ప్రస్తుతం ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా కొనసాగించింది ఆ పార్టీ. పార్లమెంటులో ఆ పార్టీ సభ్యులు అనుసరిస్తున్న విధానాన్ని ఉత్తర ఐర్లాండ్ శాసనసభ విషయంలో పాటించడం లేదు. ఐరిష్ శాసనసభకు పోటీచేసేందుకు జనవరి 2011 ఆడమ్స్ తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సాంప్రదాయం ప్రకారం, రాజీనామాకు ప్రత్యామ్నాయంగా అందుకు కేటాయించిన ప్రభుత్వ కొలువులో ఆయనను నియమిస్తూ ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ ఉత్తర్వులు జారీచేసారు. బ్రిటీష్ రాణి పట్ల ‘విశ్వసనీయత’ ప్రకటించేందుకు అవసరమైన ప్రమాణాన్ని పార్లమెంటు సభ్యుడుగా చేయడానికి అంగీకరించని ఆడమ్స్ ఆ పదవిని ఒప్పుకోలేదు. తాను ఎన్నికలలో ఐర్లాండ్ శాసనసభకు పోటీచేసి తీరాల్సిందేనని పట్టుబట్టాడు.
పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా అంగీకరించకపోతే, ఐరిష్ పార్లమెంటుకు పోటీచేయడానికి వీలుంటుందా? ‘అవును’ అనే సమాధానం యునైటెడ్ కింగ్‌డమ్ రాజ్యాంగ సవరణ లాంటి ‘‘2000 చట్టసభల సభ్యత్వ రద్దు చట్టం’’లో దొరుకుతుంది. ఈ చట్టం ప్రకారం ఐరిష్ శాసనసభకు ఎన్నికైన వారికి, ఆ సభలో సభ్యులుగా వుంటూనే, బ్రిటన్ పార్లమెంటు సభ్యులుగా కొనసాగే అరుదైన ‘హక్కు’ లభించింది. అంటే, ఐరిష్ పార్లమెంటు సభ్యుడుగా పోటీచేసి గెలిచి, అక్కడ సభ్యుడుగా వుంటూ, 2015లో జరగాల్సిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల వరకు, ఆడమ్స్ హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడుగా వుండవచ్చు. ఇంత చక్కటి అవకాశం వున్నప్పటికీ, ఎంపీగా వుండేందుకు తనకు ఇష్టం లేదని బల్లగుద్ది చెప్పాడు ఆడమ్స్. ఇక మిగిలిందొకటే దారి. అంతవరకు సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేయని ఆడమ్స్ సభ్యత్వాన్ని రద్దుచేయడమే పరిష్కారం.
న్యాయశాస్తప్రరమైన నియమ నిబంధనల నేపథ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయస్థానాల తీర్పులు వుండి తీరాలి. సంప్రదాయాలకు ఇతమిత్థమైన నిబంధనంటూ ఏదీ వుండాల్సిన అవసరం లేదు. చట్టప్రకారం నడుచుకోకపోతే దాని పరిణామాలు ఒక విధంగా వుంటాయి. సంప్రదాయాలకు అలాంటి ఇబ్బంది లేదు. చట్టాలను సవరించవచ్చు. సంప్రదాయాలను మెరుగుపర్చవచ్చు. ఎంత మంచి సంప్రదాయమైనా చట్టానికి లోబడితేనే దానికి విలువ వుంటుంది. ఇవన్నీ అధ్యయనం చేస్తే, చట్టసభలకన్నా, ఆ సభలను నడిపించాల్సిన స్పీకర్ అధికులు కారు. చట్టం స్పష్టంగా వుంటే- స్పీకర్‌కు సరైన మార్గదర్శకాలుంటే, ఆయన తీసుకునే నిర్ణయం తిరుగులేనిదే అవుతుంది. ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. చట్టంలో స్పష్టతలేనప్పుడు, సంప్రదాయాల ఆసరా దొరకనప్పుడు, స్పీకర్ అత్యంత జాగ్రత్తతో ముందుకుసాగాలి. తొందరపడి నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదు. ప్రస్తుతం కర్ణాటకలో నెలకొన్న సంక్లిష్ట వాతావరణంలో నిర్ణయాధికారాన్ని చట్టసభలకే వదిలేస్తే మంచిదేమో!
రాష్ట్ర శాసనసభను సమావేశపరిచి, సభ నిర్ణయం ఆధారంగా ముందుకు సాగితే, భవిష్యత్‌లో అవసరమైనప్పుడల్లా, అదే ఒక కొత్త సంప్రదాయం అయ్యే అవకాశం వుంది. రాజీనామా కారణాలను సభాముఖంగా వివరించే అవకాశం కూడా సభ్యులకు ఇచ్చినట్లవుతుంది. రాజీనామాలు ఆమోదించనంత మాత్రాన పదవులను అంటిపెట్టుకుని వుండాల్సిన అవసరం లేదు. శాసనసభ ఎప్పుడు సమావేశమైనా సభా కార్యకలాపాలకు ఆరు నెలలు హాజరుకాకపోతే సభ్యత్వం కోల్పోయినట్లే కదా! ఏదేమైనా కర్నాటక వ్యవహారం క్షణక్షణం మలుపులు తిరుగుతూ అనేక ప్రశ్నలకు కారణమవుతోంది.

-వనం జ్వాలా నరసింహారావు 80081 37012