మెయన్ ఫీచర్

‘రాగా’ కొత్త రాగం.. ‘సైద్ధాంతిక’ సమరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (రాగా) పార్టీ పదవికి రాజీనామా చేశారు. అదేమంత పెద్ద విషయం కాదు, విశేషం అసలే కాదు. అయినా, ఆ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జరగరానిది ఏదో జరిగిపోయిందన్న రీతిలో చిత్రించి, చింతిస్తున్నారు. అయితే బయటకు ఆవేదన వ్యక్తం చేస్తున్నవారిలో నిజంగా ఎంత మంది అధ్యక్ష పదవిలో రాహుల్ కొనసాగాలని కోరుకుంటున్నారు? అందుకు ఆయన అంగీ కరించనందుకు నిజంగా ఎంత మంది చింతిస్తున్నారు? అనేది అభిజ్ఞ వర్గాలకు సైతం అంతుచిక్కని లోగుట్టని పార్టీ వర్గాల భోగట్టా. రాహుల్ గాంధీ తనతో పాటుగా, ఎన్నికలలో ఓటమికి బాధ్యత వహించి ఇతర సీనియర్ నాయకులు కూడా రాజీనామా చేయాలని అభ్యర్థన లాంటి హుకుం జారీచేసినా ఫలితం లేక పోయింది. ఎవరెవరో రాజీనామాలు సమర్పించారు గానీ, రాహుల్ గాంధీ టార్గెట్ చేసిన సీనియర్లు ఎవరూ స్పందించలేదు. అదలా ఉంటే చివరకు రాహుల్ రాజీనామాను ఒక ఒక ప్రహసనంగా మార్చి పార్టీ ప్రతిష్టను దిగాజరుస్తున్నారనే ఆవేదన, ఆగ్రహం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జనార్దన్ ద్వివేది లాంటి సీనియర్ నాయకులు పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపికకు అనుసరిస్తున్న ప్రక్రియను తప్పు పడుతున్నారు. అలాగే, పార్టీ నూతన అధ్యక్షుని ‘నియామకం’ విషయమై జరుగుతున్న రచ్చ పార్టీలో సంక్షోభానికి దారితీస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణం అంతర్గత కలహాలతో పతనం అంచుకు చేరింది. గోవాలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. అంతకు ముందే తెలంగాణాలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ సీనియర్, జూనియర్ నాయకుల మధ్య కుంపట్లు రాజు కుంటున్నాయి. నిజానికి ఒక రాష్ట్రం అని కాదు, ఇంచుమించు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడూ ఎరగని తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఇందుకు ప్రధాన కారణం రాహుల్ గాంధీ అసమర్ధ నాయకత్వం అని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. ‘అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని గెలిపించలేక పోయారు, ఓటమిలో పార్టీ నాయకులు, కార్యకర్తలలో నైతిక స్థైర్యాన్ని నింపలేక పోయారు’ అని పార్టీవర్గాలు గుసగుసలు పోతున్నాయి.
రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని ఘనంగా ప్రకటించారు. మంచిదే.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ప్రభుత్వం అంత లక్షణంగా పనిచేస్తుంది. నిజానికి నరేంద్ర మోదీ రెండవ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో సంఖ్యాబలాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షానికి సముచిత స్థానం కలిపిస్తామని, కలుపుకు పోతామని చెప్పడంలో ఉద్దేశం కూడా బహుశా అదే కావచ్చును.
అయితే విషయం అది మాత్రమే కాదు. రాహుల్ గాంధీ ప్రభుత్వ విధా నాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని మాత్రమే ప్రకటించి ఉంటే అది ఒక విధంగా ఉండేది. కానీ, అయన అంతటితో ఆగలేదు, మోదీ ప్రభుత్వ విధానాలతో పాటుగా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) భావజాలానికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని చాలా ఆవేశంగా ప్రకటించారు. అంతేకాదు, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటాన్ని మరింత వేగంతో ముందుకు తీసుకుపోతానని కూడా ఆయన భీకర ప్రతిజ్ఞలాంటిది చేశారు. పనిలో పనిగా మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయానికి సైద్ధాంతిక ముసుగువేసే ప్రయత్నం చేశారు.
నిజానికి రాహుల్ గాంధీ డీఎన్‌ఏలో హిందూ జాతీయ వాద వ్యతిరేకతతో పాటుగా, ఆర్‌ఎస్‌ఎస్ భావజాల వ్యతిరేకత కూడా ఉందనేది అందరికీ తెలిసిన వాస్తవం. గాంధీ- నెహ్రూ కుటుంబంలోని ఇతర ‘సుగుణాల’ విషయం ఎలాఉన్నా హిందూ జాతీయవాద వ్యతిరేకత, ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకత అనే రెండు ‘సుగుణాల’ను మాత్రం రాహుల్ గాంధీ తమ తాత, తండ్రుల నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్నారు. రాజకీయ అరంగేట్రం చేసిన క్షణం నుంచి ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యంగా ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. నెహ్రూ నుంచి సోనియా వరకు, సోనియా నుంచి వామపక్ష పార్టీలు, కుటుంబ పార్టీల వరకు ఏ విధంగా అయితే అరఎస్‌ఎస్‌ను బూచిగా చూపే ప్రయత్నం చేశారో- అదే ప్రయత్నం రాహుల్ గాంధీ కూడా కొనసాగించారు. కొనసాగిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అంగీకరించినా అంగీకరించకపోయినా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి ఇతర అంశాలతో పాటుగా, మోదీ- ఆర్‌ఎస్‌ఎస్ పట్ల వ్యతిరేకత ఆధారంగా రాహుల్ గాంధీ సాగించిన హిందూ జాతీయ వాద వ్యతిరేక ప్రచారం కూడా ఒక ప్రధాన కారణం అన్నది కాదనలేని నిజం. దేశ విదేశాల్లో రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యంగా చాలా పెద్ద ఎత్తున విష ప్రచారం సాగించారు. ఎన్నికలకు కొద్ది మాసాల ముందు లండన్, జర్మనీలలో పర్యటించిన రాహుల్ గాంధీ వివిధ వేదికల నుంచి చేసిన ప్రసంగాలలో ఆర్‌ఎస్‌ఎస్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఒక సందర్భంలో అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ను ‘ముస్లిం బ్రదర్ హుడ్’ ఉగ్రవాద సంస్థతో పోల్చారు. ఇంకా అనేక విధాలుగా రంకెలు వేశారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం దేశానికి ప్రమాదకరం అనే విష ప్రచారాన్ని చాలా బలంగా వినిపించారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకత, హిందూ వ్యతిరేక లౌకికవాదం ముసుగులో ప్రతిపక్షాలు ఏకం అవుతాయని కలలు కన్నారు. బీజేపీని ఓడించ గలమని ధీమాను వ్యక్త పరిచారు. ఫలితం ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. అలాగే మహాత్మాగాంధీ హత్యకు సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్’పై నిరాధారమైన ఆరోపణలు చేసి న్యాయపరమైన చిక్కుల్లోనూ రాహుల్ గాంధీ ఇరుకున్నారు. కోర్టుల చుట్టూ తిరుతున్నారు. రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ లక్ష్యంగా చేసిన ఆరోపణకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో సుమారు 20 కేసులు నడుస్తున్నాయి. చిత్రం ఏమిటంటే, నోటి దురుసుతో పరువు నష్టం వ్యాఖ్యలు చేసి కోర్టుల చుట్టూ తిరుగ్తున్న రాహుల్ గాంధీ, ఇది తాను ఆర్‌ఎస్‌ఎస్‌పై చేస్తున్న సైద్ధాంతిక పోరాటంగా పేర్కొంటున్నారు. ఆత్మవంచనలో ఆనందం పొందుతున్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా నెహ్రూ-గాంధీ కుటుంబం ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం రాహుల్ గాంధీతోనే ప్రారంభం కాలేదు. జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ను అణచివేసే, అణగదొక్కే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. గాంధీ హత్యను సాకుగా చూపి నెహ్రూ ప్రభుత్వం 1948లో ఆర్‌ఎస్‌ఎస్ హింసను ప్రోత్స హిస్తోందన్న నిరాధార ఆరోపణలు చేసింది. సంఘ్‌పై నిషేధం విధించింది. అప్పటి ఆర్‌ఎస్‌ఎస్ అధినేత గురు గోల్వాల్కర్’ (గురూజీ)ను అరెస్ట్ చేసింది. ఆరు నెలలపాటు నిర్బంధంలో ఉంచి అనంతరం విడుదల చేసింది. ఈ సదర్భంగా గురూజీ, నెహ్రూ, పటేల్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను గమనిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ను అణచివేసే కుట్రకు అప్పుడే బీజం పడిందనే విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా నెహ్రూ తనచేతికి మట్టి అంటకుండా ఆర్‌ఎస్‌ఎస్ ఎదగకుండా చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.ఆ తర్వాత ఇందిరాగాంధీ అదే బాటలో పయనించారు.
కాంగ్రెస్ పార్టీ 1969లో నిట్ట నిలువునా చీలిపోయింది. ఆ తర్వాత 1971 లోక్ సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ మూడు వందలకు పైగా స్థానాల్లో ఘన విజయం సాధించింది. అయితే, రాయబరేలి (ఉత్తర ప్రదేశ్) స్థానం నుంచి పోటీ చేసిన ఇందిరాగాంధీ అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణను పరిశీలించిన అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12న ఆమె ఎన్నిక చెల్లదని, ఆరు సంవత్సరాల పాటు ఆమె ఎన్నికల్లో పోటీకి అనర్హురాలని తీర్పు చెప్పింది. దీంతో ఇందిరాగాంధీ తనకు, తన పార్టీకి వచ్చిన ముప్పును దేశానికి వచ్చిన ‘అంతరంగిక ముప్పుగా’ చిత్రించి జూన్ 25వ తేదీ అర్ధరాత్రి అంతర్గత అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దేశ చరిత్రలో అదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ రెండవసారి ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించారు. అత్యవసర పరిస్థితి కొన సాగినంత కాలం సుమారు 22 నెలలపాటు ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆ నిషేధం కొనసాగింది. అలాగే, వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం 1992లో మరో మారు ఆర్‌ఎస్‌ఎస్ పై నిషేధం విధించారు.
అయితే, ఇక్కడ తెలుసుకోవల్సిన విషయం- బంతిని ఎంత బలంగా గోడకు కొడితే.. అది అంత బలంగా తిరిగొచ్చి మన ముఖాన్ని పచ్చడి చేస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్ పై నిషేధం విధించిన అన్ని సందర్భాలలోనూ అదే జరిగింది. సంఘ్’ పై తొలి నిషేధం నేపధ్యంగా 1951లో భారతీయ జన సంఘ్ ఆవిర్భవించింది. అత్యవసర పరిస్థతి కాలంలో ఇందిరాగాంధీ విధించిన నిషేధం, తదనంతర రాజకీయ పరిణామాల నేపధ్యంగా 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. అక్కడే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. అత్యవసర పరిస్థితి అనంతరం ఏర్పడిన జనతా ప్రయోగం విఫలం అయినా, ఆ విఫల ప్రయోగం నుంచే జాతీయ వాదం ఆలంబనగా బలమైన సైద్ధాంతిక పునాదులపై బీజీపీ నిర్మాణం జరిగింది. వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం విధించిన మూడో నిషేధం బీజేపీని అధికార పీఠానికి దగ్గర చేసింది. అదే క్రమంలో మొదట 13 రోజులు, ఆతరవాత 13 నెలలు చివరగా 1999లో అటల్ బిహారీ వాజపేయి సారధ్యంలో బీజేపీ నిండా ఐదేళళు సంకీర్ణ ప్రభుత్వానికి సారధ్యం వహించింది. ఇదంతా చరిత్ర. ఇక ఆ తర్వాత ఏమి జరిగిందన్నది కళ్ళముందు కనిపిస్తున్న నడుస్తున్న చరిత్ర.
వరసగా రెండవసారి బీజేపీ సొంతబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేస్థాయికి చేరింది. ఇక్కడ ఒక్కసారి చరిత్రపుటల్లోకి వెళితే, నెహ్రూ కొంచెం చాలా ఆలస్యంగానే అయినా, ఆర్‌ఎస్‌ఎస్ శక్తిని, దేశ భక్తిని గుర్తించారు. 1962 చైనా యుద్ధం సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకులు సరిహద్దుల్లో పోషించిన పాత్రను చూసి, నిషేధం విధించినందుకు ప్రాయశ్చిత్తంగా అన్నట్లు 1963 లో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనమని ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆహ్వానించారు. అలాగే- మహాత్మా గాంధీ సహా పటేల్ వంటి అనేక మంది జాతీయ నాయకులు ఆర్‌ఎస్‌ఎస్’ దేశభక్తికి పెట్టింది పేరుగా అభివర్ణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సర్దార్ పటేల్ దేశ విభజన సమయంలో హింస ప్రజ్వరిల్లిన సందర్భంలో హిందువుల మానప్రాణాల రక్షణలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకకులు పోషించిన పాత్రను శ్లాఘిస్తూ, దేశభక్తిపూరిత ఆర్‌ఎస్‌ఎస్‌ను అణచివేయాలని అనుకోవడం దేశానికి మంచిది కాదని పరోక్షంగా నెహ్రూను హెచ్చరించారు. నిజానికి పటేల్ కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్‌లమధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా కొన్ని విషయాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకించే వారు కూడా సంఘ్ నిబద్ధత, నిజాయతీగా సాగిస్తున్న వ్యక్తి నిర్మాణ కార్యాన్ని అభినందిస్తూనే ఉన్నారు. చివరగా - రాహుల్ గాంధీ.. ‘అద్దం అబద్ధం చెప్పదు’ అన్న సత్యాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచింది.

-రాజనాల బాలకృష్ణ 99852 29722