మెయిన్ ఫీచర్

కైవార కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైవారము

‘‘తుండమున్నంతనే దోమ శుండా దండ
మండితోద్దండ వేదండ మగునె
ఎఱక లున్నంతనే ఈగ ఝంఝా సమీ
రోదగ్ర గండభేరుండ మగునె
కంఠమున్నంతనే కాకి పల్లవ శాఖి
కారూఢ పికరాజ్యకాంతుడగునె
గమనమున్నంతనే గాడిద రమ్య ధా
రామనోహర హయరాజమగునె

జ్ఞాన దీపాంకురము లేని మానవుండు
పొట్టయున్నంత మాత్రాన పెద్దయగునె
గుంజు నలుసంత లేనట్టి ముంజకాయ
మూస తలకాయ రానీది మూర్తిరాజ’’
*
వారి కై వారి వైదుషీ విహృతి వల్లె! వారి కైవారి వైదుషీ విహృతి చొల్లె!! ఎవరాపగలరెవరెవరి తిరుగుడు మరుగుడు? వారికి వారె ఉలుప నించిన కైవడిపెట్టు. ఔనన్న మేలే! కాదన్న ఆవ తాగిన పసరమెట్లో అట్లు. ఇదిట్లు చెప్పుటలో మనకునంటు మాట చొప్పేయొప్పు కాని ఈసు కాదని మనవి. తక్కొండసలే కాదు. కూకటి వక్కణమిదిన వినుడు. ఓరడి కతన విద్దె పెక్కువ యగుట కద్దు. అది ససియే. విద్దెయే యోరడి కగ్గమైనచో అట్టిది కాయిలా. తెలివి యుండుట సాజమనుకొందము గానీ అదెంత తెలివి. ఆదముడి విప్పుకున్నంత. ఇట్టిదందరకు వుండునా? వట్టి కట్టుగాని. పైగా ఆదముడి విప్టన్నది అక్కరములు గిలుకువారి కెక్కడిమాట? ఎవియో ‘తద్భవము’లో ‘తత్సమము’లో ఆరు మూడు నెఱుగుట అబ్బరపు తెఱకువో? ఇట్టిడొకడం బస్తుడగుటయే పుట్టుక దాపురము. దీనికెవరు ఒడయుడు? అబ్బ ననవలె. అనుటకు గుట్టు పట్టొప్పదు. పలుకు విచ్చారచ్చ. ఇట్టి పోకడ లెన్నియైనను పిప్పిగానుగనాడించుటే. కొఱయేమొ సున్న. ప్రకృతమునకొద్దము. వ్యవహరించవలెను గదా! పూసిగొండితనము పెడఱెక్కలు కట్టవలెగదా! స్పర్థ విద్యయైన పృథగ్జనులు అసహ్యమును చర్చిత మొనరించుకుందురు. అది వారి నైజము. కారణమనుట వారి పుట్టువు పురులు. ఉపజీవక వృత్తియందిది పెచ్చు. స్తుతి పాఠకుడు స్తుతి పాత్రుడు కాలేడు. వాని యుపాధి యట్టిది. తెలిసినదానికన్న తెలియనిదే ఎక్కువ. ఐనను తెలుసునన్న అహమికకు అంతుయుండదు. ఈ అల్ప ప్రతిభులు తమ కలములకు కాగితములకు పని కల్పింతురు. ఆ ప్రసవ వేదన ఫలితమే కవితా శిశూదయము. అవయములు వ్యస్తములై యుండును. ఇట్టివాడు వారికొచ్చిన నాల్గు అక్షరములను నలువ తెలివిగా పోతరమెత్తుదురు. ఆపై అసహనము.
తెలుగక్షరములెన్ని? అందు గుణింతములు లేనివి ఏ ఏ అక్షరములు? అవి ఎన్ని? వాటికి లేని గుడింతములు ఏవేవి? అవి ఎన్ని? తెలిసినట్లున్న పదముల అసలర్థము ఏమిటి? పదముల అసాధుత్వమెట్లుండును? సమాసమెట్లు పొసగును? సంధి ఎట్లేర్పడును? ఇవి తెలుసుకొనవలెనన్న అభ్యాసమవసరము. ఇట్టి తెలివియే యున్నచో మనసు కఱచుట కిచ్చగించును. కానిచో అది సూతకమనుకొందము. ఇట్టి కైవారి మూకకు శబ్దముండదు. శబ్ద వ్యుత్పన్నతమూ నుండదు. కనీసము శబ్దమును గూర్చిన జ్ఞానముండదు.
ఆకాశమునందు లేని శబ్దము లేదు. ఆకాశము సృష్టికొరకు బ్రహ్మనుండి వినిర్గమించినది. సృష్టికొరకు ననుట చేత సృష్టికొరకు కావలసినదంతయు దానియందున్నది. ఆ లక్షణములతో నిండియున్న ఆకాశముననే బ్రహ్మమయమైన ప్రజాపతి యొక్క చిత్కళ భాసించియున్నది. కావ్యములు పురాణములు నీవును నేనును మాటాడుకొనుచున్న మాటలు కూడ ఆకాశమునందున్నవి. ఒక జాతినుండి ఒక వ్యక్తినుండి నిన్న కాలములందు ఆ శబ్దమే వెలువడుచున్నది. శబ్దమునెవడు సృష్టించినాడు? అది మనమెట్లు తెలుసుకుంటిమి? అసలు శబ్దము సృష్టించుట ఎట్లు? శబ్దము ఎచటనుండి వచ్చుచున్నది? ఎందుకు వచ్చుచున్నది. పరమాల్పిష్టమైన మానవ శరీర నిర్మాణము పరమ బృంహిష్టమైన మహాశరీరము యొక్క చిహ్నము కదా! ఏ మహాజన్య జనక భావము పట్టి అక్కడ శబ్దముత్పన్నమైనదో ఆ లక్షణమిచ్చటను కనిపించుచునే యున్నది. మనుష్యులలో ఆకాశమున్నది నాభినుండి గాలి పుట్టుచున్నది. శబ్దమునూ అంతియే. ముఖ అవయవము దానికి ఆకారము నిచ్చుచున్నవి. ఈ శబ్దాక్షరముల సంఖ్య ఇంతటితో ఆగిపోవుట యేమి? అనంతాక్షరములు ఎందుకుత్పన్నము కాలేదు? ఎందుకు కావు? సర్వశబ్దములు ఆ యక్షరములనుండియే ఉత్పన్నములగుట యేమి? ప్రతి పదమునుందు ఈ మహాశ్చర్యమున్నది. పరమేశ్వరుడు జ్ఞానమును నిర్మించెను. దానిని మానవునియందు భాసింపజేసెను. అజ్ఞానులనిచట మానవులుగా పరిగణించుట లేదు. కారణము శబ్దమును గూర్చి ఏవిధమైన స్పృహ ఎవరికుండదో వారు జ్ఞానలవదుర్విదగ్ధులు. వారిని పరిహరించుటే న్యాయము. వారి బ్రతుకు వేరు. తీరు వేరు. వారిని వాగ్ములుగానో వాదులుగానో తలచరాదు. కేవలము వాచాలురు.
పైన చెప్పినట్లు మానవుని యందు భాసింపజేసిన జ్ఞానము రెండు విధములు ఆంతరము- బాహిరము. ఈ బాహిరము మాయా సంబంధి. మాయాజనితులైన కొంతమంది మానవులు దీనియందు కొట్టుకొని- అనవసర వ్యాపకమున కఱ్ఱులు చాచియు- అనర్థహేతువులగు అపశబ్దములతో తెల్ల కాగితమును అపరిశుభ్రమొనరించు అయోగ్యులై చిల్లర చిందులు వేయుదురు. ఇట్టివారు ఈ సంఘమున అధికులే.
ఆకాశమునందలి శబ్దమును మనము వినలేము. వస్తుసంఘర్షణ జనిత శబ్దమే వినగలము. మానవ ముఖమునుండి వెలువడు శబ్దమును భాషగా సంగీతముగా విభజించుకొని దానియందు రమించుచున్నాము. ప్రతివాడు భాషావేత్తయగుట లేదు, అటులనే గాయకుడున్నూ యగుటలేదు. ప్రతివాడు కవియగుట లేదు (కవియనగా కొక్కిరి రాతలు వ్రాయువారు కాదని గ్రహించగలరు) ఎందువలన? ఈ దేశము తత్తత్పూర్వ జన్మ సంస్కార విశేషమనుచున్నది. ఈ సంస్కార విశేషమును గురించి వీలు కుదిరినయపుడు మాటాడుకోవచ్చును.
మొదట ఆకాశము సృష్టింపబడునప్పుడే తద్గతమై సర్వనాదముండునట్లు సృష్టింపబడినది. సర్వ భాషలు, సర్వశబ్దములు అచట గలవు. శబ్దములకు రెండే ప్రధాన విషయములు. ఒకటి శబ్ద స్వరూప నిర్ణయము. రెండవది శబ్దార్థ నిర్ణయము. రెండవ పని చేయుటయందు ‘నిరుక్తము’ సమర్థమైనది. ఈ నిరుక్తి ఆ మార్గమునే అనుసరించుచున్నది. దీనియందు ఋషులు సమర్థులు. యాస్కుడు ఋషి. ఋషి యన నాంపల్లి నక్కయో - కొంపల్లి కోతియో కాదు. తొల్లిటి చదువుల యందు ధాతుజములైన శబ్దములే గలవు. దానినే యాస్కుడు ప్రపచించెను. ఆ మార్గమున ఇతరులు చేయవచ్చును. కానీ చేయరాదు. ఎందుచేతననగా ఇతరులు ఋషులు కారు. ఋషులమని అనుకొన్నచో వారొట్టి శుంఠలు. శుంఠలేల చేయుదురు? ఏమి చేయగలరో అది మాత్రమే చేయగలరు. చేసినది గొప్పదనుకొనరాదు. అది కేవలము పుట్ట కూడు యేపరి పని మాత్రము. ఇంత మాత్రమునకు వారి వాక్కున కర్థమునెదుకరాదు. అట్టిదే తప్పదనుకొన్నచో నయాగర వయాగరాగా మ్రోగును. ఇది వారి కైవారము. ఆపై చూడవలసినది వీరి చొల్లుకవిత్వము. అదెట్లు యనగా- ఇదిగో యిట్లు-
కవిత్వం
అక్షరాల పోహణింపు కవిత్వానికి కారణహేతువు. అలా అని అప్రాచ్య భావ పరంపాజుష్టమైనది కవిత్వమనుకుంటే అంతకంటే ఆత్మహత్యా సదృశమైనదేదీ మరొకటి లేదు. పక్షుల గొంతు శబ్దాల గొంతుకంటె గొప్పది. పక్షుల గొంతుకంటె పూల గొంతు గొప్పది. విశ్వాంతర్గతమైన ప్రతి వస్తువులోను దాని ఆత్మ రహస్యపు భాష ఒకటి ఉంటుంది. కాబట్టి విశ్వం భాషల పర్ణశాల. దాన్ని చేరుకోవాలి కవి అన్నవాడు. కవి అని ఎందుకన్నానంటే- కవి ఒక్కడి ప్రక్రియలోనే జ్ఞానము అనుకంప అవినాభావ సంబంధంతో పెనవేసుకుని ఉన్నాయి (ఉంటాయి). దానికి కారణం కవిత్వం అనుభూతి కళ కావడమే; కవిత్వం ఇంద్రియవాదం కావడమే; జీవితం అనుభవించకుండా కవిత్వం ఉద్భవించకపోవడమే. జ్ఞానమూ అనుకంపా మిథునంగా ఉండవలసిన అగత్యం లోకంలో మరే ఇతర ప్రక్రియలోను లేదు. కవి దుఃఖిస్తాడు. విజ్ఞాన శాస్తవ్రేత్త దుఃఖించడు; వేదాంతి కూడా దుఃఖించడు. కవి దుఃఖించకపోతే కావ్యం పుట్టదు. శోకమనే జీవధాతువు చేత కవి మనిషికి అందరికంటే సన్నిహితుడౌతాడు. ఆశ్వాసకుడు; సఖుడు, మార్గదర్శకుడు సమస్తము అవుతాడు. మనిషిమీద ఇంత బాధ్యత తీసుకునేవాడు కవి తప్ప మరొకడుండడు. కవి ఇచ్చిన చైతన్యమే సమాజంలో కార్యానికి (మూలం) నాంది కనుక మానవ సమాజ పరిణామ హేతువు గనుక కవి ఒక్కడే మానవ సమాజానికి ఏకైక నాయకుడు. కవి నాయకత్వాన్ని ఎమర్సన్ ఎంతో సమగ్ర స్ఫూర్తితో చెప్పాడు. చదువొచ్చిన ప్రతి మనిషికి ఆ వివరణ అర్థవౌతుంది. ఆయన చెప్పిన మాటలు ఎలా వున్నాయో చూడండి. ''The breadth of the problem is great; for the poet is the representative. He stands among partial men for the complete man and appraises us not of his wealth but of the commonwealth''
కవి చేసే ఆత్మ విచారం, ఆత్మ కళావిచారం (అభ్యాసం) హృదయ సంవాదం ఇత్యాది నామక ఆత్మీయ ప్రక్రియల మూలంగా కవికి విశ్వసృష్టి సంబంధిత సమగ్ర అవగాహన సిద్ధిస్తుంది. ఇది రుద్రటుడు చెప్పిన ‘మనసి సుసమాధిని విస్ఫురుణ మనేకధాభిధే యస్య అక్లిష్టాని పదాని చ విభాంతి యస్యాం అసౌశక్తిః’ అంటే ఆత్మ విచారణలోంచి వస్తువుల యొక్క నానా విధాలైనవి స్ఫురణ కలుగుతుంది. అక్లిష్టములైన పదములు గోచరిస్తాయి. ఇలాంటి శక్తి ఆత్మ విచారం చేత సిద్ధిస్తుంది. ఆత్మవిచారం లేనివాడిని అచ్చుపోసిన ఆబోతని అంటారు. ఇట్టి ఆబోతులు రచనల గురించిన ప్రస్తావన తేరాదు. ఒకవేళ విదేహ భావంతో పేట్రేగితే ఇలానే కఱ్ఱ కాల్చి వాత పెడతారు. కనుక కవి అన్నవాడు అందరిలో వస్తువుల్ని చూడటం కాక, వస్తువులోంచి చూడటం అనే శక్తిని ఆర్జిస్తాడు. అలా కవి చూపు వస్తువులోకి దూసుకుపోతుందో అపుడు కవికి సృష్టి వాస్తవాలు తెలుస్తాయి. వస్తువుల్లో ప్రతీకలు ప్రత్యక్షమవుతాయి. మాటల్లో ధ్వనులు వినవస్తాయి. బ్రహ్మాండ రహస్య దృశ్యాలు కళ్ళముందు వికసిస్తాయి. మనిషి అసలు ఎవరో - ఏమిటో తెలుస్తుంది. మనం వ్యావహారిక జగద్దృష్టితో చూస్తే కవికి కనిపించేవన్ని మనకు స్వప్నాలవుతాయి. ఈ స్వప్న విద్య నేర్చుకున్నవాడు వైశ్విక సాక్షాత్కారం పొందగలిగితే వాడే కవి అని రుద్రుటుడంటాడు.
దండి తరువాత వచ్చిన ఈ రుద్రటుడు (9వ శతాబ్దపువాడు) తన కావ్యాలంకారంలో చాలా సమంజసంగా, సహేతుకంగా వివరించాడు. యావత్తు భారతీయ అలంకార శాస్త్ర రంగంలోను ఈ విషయంలో రుద్రటుడి మతమే శిరోధార్యంగా కనిపిస్తుంది. సునిష్ఠిత సమాధిగతమైన మనసులో నానా అర్థాలు స్ఫురించటం అవి అక్లిష్ట పదాలతో కలిసి ప్రకాశిస్తూ దొర్లిరావటం శక్తి; అనే తాత్పర్యాన్ని ప్రపంచించాడు. ఆ శక్తే ‘ప్రతిభేద్యప రై రుదితా’ అని అన్నాడు. శక్తి లేదా ప్రతిభ కలిగి ఉండటమనే విశేష విషయం. ఇపుడు ఈ మాటల దరిదాపుల్లోకి కూడా రావటం చేతకానివారు ‘ఈ అలంకార సూత్రాన్ని చెప్పటానికి రుద్రటుడెవరు’ అనే ప్రశ్న వేయటం దాకా వెళ్ళగలరు. కారణం సిగ్గు, అభిమానం అనే మూల ధాతువులు లేని ఒకానొక జాంతవ లక్షణాన్ని జన్మతః కలిగి వుండటం. పైగా రుద్రటుడు అతి ముఖ్యము- అభ్యాస అవసరము వీటిని గురించి ఇలా అంటాడు. ‘‘్ఛందోవ్యాకరణ కళా లోకస్థితి పద పదార్థ విజ్ఞానాత్ యుక్తా యుక్త వివేకో వ్యుత్పత్తిరియం సమాసేన’’- ఛందస్సు వ్యాకరణము- చతుష్షష్ఠి కళలు, లోకజ్ఞత, న్యాయ వైశేషిణాది పదార్థ శాస్త్ర విజ్ఞానమూ వీటి మూలకంగా సిద్ధించిన యుక్తాయుక్త విచక్షణ, వివేక రూప ఔచిత్య స్పృహ ఇవన్నీ కలిసి వ్యుత్పత్తి అనిపించుకుంటుందని చెప్పాడు. వీటిల్లో ఒక్కదానిని గురించి కూడా ఆలోచించే మనస్కత- అక్షరజ్ఞానము లేని బడుద్ధాయులు కవిత్వం రాయటమే ఈ జాతికి పట్టిన పరమ దరిద్రం. ఆ తరువాత వచ్చిన రాజశేఖరుడు రుద్రటుడు చెప్పినదానే్న సమాధి చేత కావ్యోత్పాదన శక్తి సాధించవచ్చుననీ చెప్పాడు. బహుశా ఈ పేర్లేమి వినని అయోగ్యులు డబ్బుతో పుస్తకాలు అచ్చువేసుకునే వసతినందుకున్నారు.
ఇటువంటి భావ సన్యాసయోగుల్ని మాట్లాడనివ్వటం కూడా ప్రజాస్వామ్యపు బలహీనతే. సహృదయులైన పాఠకులిది గ్రహించి కవిత్వం అనే పేరుతో నినాదపరులు వాళ్ళ కవిత్వ క్షామాన్ని అపశబ్దాలతో ఆచ్ఛాదించుకుంటున్నారని తెలుసుకోవాలి. వాళ్ళు తమ కవిత్వం కాని కవిత్వ నామక దుర్గంధ భూయిష్ట పదార్థంతో ఆధునిక కాలానికి ఆముదం పట్టిస్తున్నారు. ఇటువంటి వెఱ్ఱిపోకడల్ని చూసి నాకు ఇలా అనిపించడం ధర్మమే.
కరి భీకర గ్రాహ కంఠ లుంఠనలవేళ
హరి ధరించిన చక్ర ఖరమరీచి
కుంభినీ ధరసము జ్జృంభమాగినన్నాడు
గోత్రాది దాల్చిన కులిశ ధార
పృథివీశనాశనా భీల కాలంబున
భార్గవుండెత్తిన పరశుహేతి
కాలకేయాది రాక్షస ఘోర వధనాడు
గాండీవి తీసిన కఱకు కోల

స్మృతి పథంబుల ఝళిపింప జేయగలదు
వసుధ కవి నామ రాక్షస వర్గ దుర్గ
ఖేదనోదగ్రధాటి గుంభింపగలదు
నాదు అసలైన కవితా శతఘ్ని అగ్ని!!

- సాంధ్యశ్రీ, 8106897404