మెయన్ ఫీచర్

విచిత్రంగా చిక్కుకుపోయిన బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాలు ఒక్కోసారి అనూహ్యమైన రీతిలో చిత్రమైన మలుపులు తిరుగుతుంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా వివాదపు సుడిగుండంలో బిజెపి చిక్కుకోవడం అటువంటిదే. ఆ అంశంపై బిజెపి రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు ఎవరో ఒకరు ఇంచుమించు ప్రతిరోజు సంజాయిషీలు ఇవ్వవలసి వస్తున్నది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అయితే అక్షరాలా సతమతమవుతున్నారు. తనను చూసి ఒక్కోసారి అయ్యోపాపం అనిపిస్తున్నది. వాస్తవానికి ఆయన హోదాగురించి ఇస్తున్న వివరణలో సహేతుకత చాలా ఉంది. గత పార్లమెంటు సమావేశాలలో రాజ్యసభ చర్చలో పాల్గొం టూ అంతకుముందు చెప్పని విషయాలు కొన్ని వెల్లడించారాయన. అంతిమంగా హోదా లభించిందా లేదా అనే మాటను పక్కన ఉంచితే, పరిస్థితులు ఏమిటన్న దానిపై, అనగా హోదా అందుకు వీలుకాదన్న దానిపై ఈ సరికి స్పష్టత వచ్చింది. కేంద్రంలో యుపిఎ, ఎన్‌డిఎ సహా ఎవరు అధికారంలో ఉన్నా హోదా సాధ్యమ్యేది కాదని దాన్ని బట్టి చెప్పవచ్చు. స్వయంగా చంద్రబాబు, జగన్‌మోహన్ రెడ్డి సహా ఆంధ్ర నాయకులు ఎవరు ప్రధానమంత్రి అయి ఉండినా హోదాను ఇచ్చుకోలేకపోయేవారనడంలో సందేహం లేదు.
అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్ర విభజన వివాదంలో నిన్న కాంగ్రెస్‌పార్టీ ఇరుక్కుపోయిన పరిస్థితి ఇప్పుడు హోదా వివాదంలో బిజెపికి ఎదురవుతున్నది. హోదా ఇవ్వగలమని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించడం, ఆమాట ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ చెప్పడం, విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వెంకయ్యనాయుడు అందుకు పట్టుపడుతూ అయిదేళ్లు కాదు పదేళ్లు కావాలనడం అన్నీ నిజమే. ఆవిధంగా బిజెపి ప్రమేయం, బాధ్యత వారు కూడా కాదనలేనివి. కాదనడంలేదు కూడా. కాని అదేసమయంలో అన్ని విషయాలను సాకల్యంగా, సావధానంగా సమీక్షించినట్లయితే, హోదా రాకపోవడం భాజపా ఒక్కటే పూనుకుని బుద్ధిపూర్వకంగా చేసిన పని కాదని అర్థమవుతుంది. హోదా ఇచ్చేందుకు నిజంగా వీలున్నప్పటికీ ఇవ్వకపోవడం కానేకాదది. స్వయంగా చంద్రబాబు, జగన్‌మోహన్ రెడ్డి గాని, లేదా రఘువీరా రెడ్డివంటి ఇతర ప్రతిపక్ష నాయకులు గాని ప్రధానమంత్రి అయినప్పటికీ హోదా ఇవ్వగలిగి ఉండేవారు కాదని అనడం అందువల్లనే. అట్లా కాదంటే, ఏ పద్ధతిలో ఇచ్చి ఉండేవారు తమలో ఎవరైనా వివరంగా చెప్పితే అర్థం చేసుకోవచ్చు. తమను తాము ప్రధానమంత్రిగా ఊహించుకొని వారు ఇదే పద్ధతి అని చెప్పగలరా?
ఈ మాటలు అనేందుకు బిజెపికో, వెంకయ్యనాయుడికో, నరేంద్రమోదీకో మద్దతుదారులు కావలసిన అవసరం లేదు. విషయాన్ని విషయంగా, నిష్పాక్షిక దృష్టితో మదింపు చేసినప్పుడు కనిపించే పరిస్థితి ఇది. చంద్రబాబు, జగన్, రఘువీరాలు ప్రధానులు అయి హోదా ఇవ్వలేకపోయినా సరిగా ఇవే మాటలు అనవలసి వచ్చే వి. దీనంతటి అర్థం ఆంధ్రప్రదేశ్‌కు హోదా అవసరం లేదని చెప్పడం కాదు. రానందువల్ల ఎంతోకొంత నష్టం జరగడం లేదని కూడా కాదు. విషయం హోదా సాధ్యమా? కాదా? బిజెపి వారు సాధ్యమైకూడా ఇవ్వలేదా లేక సాధ్యం కాక ఇవ్వలేదా? ఇస్తామన్నపుడు సాధ్యం అవుతుందని నమ్మి అన్నారా లేక సాధ్యం కాదని తెలిసి కూడా తర్వాత నమ్మక ద్రోహం చేసేందుకు అన్నారా? దీనంతటిలో వెంకయ్యనాయుడు స్థానం ఏమిటి? అన్నవి. వీటిపై స్పష్టత లేకుండా వివాదాన్ని సాగదీయడం కేవలం రాజకీయం అవుతుంది తప్ప అందులో నిజాయతీ ఉండదు. రాష్ట్రం మేలును కోరడం అంతకన్నా ఉండదు. సాధ్యం కాదని ముందే తెలిసి కూడా నమ్మకద్రోహం చేసేందుకు అటువంటి హామీ ఇచ్చారనదలచుకుంటే, అదే నింద యథాతథంగా కాంగ్రెస్‌కు, టిడిపికి, వైఎస్సార్ కాంగ్రెస్‌కు, కమ్యూనిస్టులకు కూడా చుట్టుకుంటుంది. ఎందుకంటే, నిబంధనల ప్రకారం హోదా సాధ్యపడేదీ లేనిదీ అందరూ అర్థం చేసుకోగల విషయమే. అందులో నిగూఢత ఏమీ లేదు. ఈ పార్టీలన్నింటిలోనూ జాతీయ స్థాయి లో తగిన అధ్యయనాలు, అనుభవాలు కలిగినవారున్నారు. కనుక వారు నిగూఢత అని మాట్లాడితే చెల్లుబడి కాదు. వాస్తవం ఏమిటంటే వీరంతా రాజకీయం చేస్తున్నారు. బిజెపి చేసిందనుకుంటే వీరు కూడా ఆ దశలో చేసారు. తర్వాత హోదాను బిజెపి ఇవ్వడం లేదనుకుంటే, అధికారంలో ఉండి ఉన్నట్లయితే వీరు సైతం ఇవ్వగలిగేవారు కాదు.
ఈ చర్చను ఇంతటితో వదిలేస్తే, అసలు మొత్తం రాష్ట్ర విభజన, హోదా వ్యవహారం మొదలైన రాజకీయాలు ఒక వ్యాసుని వంటి రచయిత రాయగలగాలే గాని నిజం గా ఒక మహాభారతం వలె సాగాయి. తక్కి న విషయాలను అట్లుంచితే, విభజనలో కాంగ్రెస్, హోదాలో కాంగ్రెస్‌తో పాటు బిజెపి ఇరుక్కుపోయాయి. ఈ మొత్తం పరిణామాలు గతాన్ని, వర్తమానాన్ని విశే్లషించినట్లయితే మొత్తం అన్ని పార్టీలలో దోషం అంటని వారెవ్వరూ కనిపించరు. ఈ పరిణామాల క్రమం అంతా ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఒక గొప్ప గొలుసుకట్టు వలె సాగుతూ వచ్చింది. ఆ గొలుసుకట్టులో వీరంతా పాత్రధారులే. ఆ గొలుసుకట్టును ఒకదాని నుంచి మరొకదానిని విడదీసి చూడలేము. అందులో అనేక ఉదంతాలు, మలుపులు, కథలు, ఉపకథలు ఉన్నాయి. అందుకే దీనిని మహాభారతమనటం. అందులో చివరకు జరిగిన వాస్తవిక విభజన, ప్రత్యేక హోదా అన్నవి రెండు ఉదంతాలు మాత్రమే. అటువంటి స్థితిలో వీరందరిలో ఎవరు ఎవరిని దేనికోసం నిందించీ తాము మాత్రం బయటపడలేరు.
తక్కిన విషయాలను అట్లుంచి కేవలం విభజన, హోదా అనే అంశాలకు పరిమితమై ఆలోచిస్తే, కొన్ని రాజకీయ విచిత్రాలు కనిపిస్తాయి. విభజన నేరం అంతిమంగా గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పై పడింది. ఆపార్టీ మాత్రమే బలి అయింది. కాని విభజన తమ పార్టీ విధానమని బిజెపి పదేపదే బహిరంగంగా చెప్పలేదా? విభజనకు అనుకూలంగా టిడిపి అప్పటి యుపిఎ ప్రభుత్వానికి లేఖ ఇవ్వలేదా? తెలంగాణ ఏర్పాటుకు తాము మద్దతునిస్తున్నట్టు టిడిపి, బిజెపి రెండూ ఎన్నికల సమయంలో తెలంగాణలో ప్రచారం చేయలేదా? అయినప్పటికీ విభజన దోషం ఆ రెండు పార్టీలనూ అంటక కాంగ్రెస్‌కు మాత్రమే ఎందుకు పరిమితం అయింది? సూటిగా చెప్పాలంటే చతురమైన రాజకీయ మేనేజ్‌మెంట్ వల్ల, ప్రచారం వల్ల. విభజనలో ఎవరి వైఖరి ఏమిటో ప్రజలకు తెలుసు. కాని ఒక హత్య జరిగినపుడు ప్రజలు ఒక విలన్‌కోసం చూస్తారు. అది సైకలాజికల్ అవసరం. అటువంటి అవసరం తీరేవిధంగా, అధికారంలో ఉండడం, అనే సాంకేతిక కారణం వల్ల కాంగ్రెస్ విలన్ అయింది. చంద్రబాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి కూడా, విభజనను ఆపేందుకు ప్రయత్నించారనే భావన ప్రజలకు కలిగించేందుకు చివరి దశలో వివిధ పార్టీల వద్ద లాబీయింగ్ చేసారు. అట్లా లాబీయిం గ్ చేయడం ప్రజల దృష్టికి వచ్చి తను లేఖ ఇవ్వడం వల్ల కలిగిన దోషం పరిహారమై, ఎన్నికలలో కలుగుతుందన్నది ఆయన ద్వంద్వ నీతి ఆలోచన. లేఖను చూపి తెలంగాణలో లాబీయింగ్‌ను చూపి ఆంధ్రలో లాభపడాలి. ఈ వాస్తవాలు ప్రజలకు తెలిసినా చివరకు ఆయనే లాభపడ్డారు. అం దుకు కారణణ అపుడు ప్రజలకు ఒక విలన్ కావాలి. ఢిల్లీలో అధికారంలో ఉండి విభజనలో ఒక పనిముట్టు పాత్ర వహించినందున సహజంగానే కాంగ్రెస్ పార్టీ అటువంటి విలన్ అయింది. దాని దోషం ముం దు ఇతరుల దోషాలు కొట్టుకుపోయాయి. అట్లా జరిగేట్లు చంద్రబాబు చాతుర్యం కలవాడు కనుక మరికొంత మేనేజ్ చేశారు.
సరిగా ఇటువంటి విచిత్రమే ఒకటి ఇప్పుడు హోదా విషయమై జరుగుతున్నది. విభజన బిల్లు తయారవుతుండిన దశలో అప్పటి కేంద్ర ప్రభుత్వం, విభజనకు పరిహారంగా కొత్త ఆంధ్రప్రదేశ్‌కు ఏమి అవసరమో చెప్పవలసిందిగా అన్ని పార్టీలను లిఖిత పూర్వకంగా కోరింది. కాని అందుకు ససేమిరా అని తిరస్కరించిన చంద్రబాబు, సమన్యాయం అనే అస్పష్ట మైన మాటను వాడి దౌత్యనీతి చేసారు తప్ప, ఆ మాటకు అర్థమేమిటో చెప్పలేదు. కొత్త ఆంధ్రప్రదేశ్‌కు నిర్దిష్టంగా ఏమేమి కావాలో రాసివ్వకుండా ఊరుకున్నారు. హోదా అని ఆ తర్వాత యాగీ చేసిన టిడిపి, బిల్లు తయారీ దశలో హోదాను ప్రతిపాదించలేదు. రెండు రకాల నీతితో రెండు రకాల లాభాలు పొంద చూడడం చంద్రబాబు ఎత్తుగడ ఆయనకు విషయాలు విభజన విషయంలో కలిసివచ్చినట్టు హోదా విషయంలోకూడా కలిసివచ్చినట్టు కనిపిస్తున్నది. రెండు సందర్భాలలోను తన ప్రమేయం లేదా దోషం ఉండి కూడా చంద్రబాబు చతురమైన రీతిలో ప్రజల సానుభూతి సంపాదించుకోగలుగుతున్నారు.
ఇంతకూ బిజెపి పడుతున్న ఇబ్బందిని చూసి టిడిపి నాయకత్వానికి తమ మిత్రపక్షం పట్ల సానుభూతి కలుగుతున్నదో లేక, ఈ మరో క్లిష్ట ప్రశ్నపై ఆ పార్టీ విలన్ అయి తనూ తప్పించుకోగలుగుతున్నందుకు సంతోషంగా ఉన్నదో తెలియదు. కారణాలు ఏమైతేనేం. బిజెపి చిక్కుకుపోవడం వాస్తవం. గమ్మత్తు ఏమంటే, హోదా ను బిల్లులో చేర్చని కాంగ్రెస్‌కు సైతం బిజెపిపై రాయి విసిరే అవకాశం దొరికింది.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)