మెయిన్ ఫీచర్

అంతరిక్ష యుగంలోనూ అంతరించని వివక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిరలో ఒక వింత ఆచారం మహిళా వివక్షకి ప్రతిరూపమే అని చెప్పొచ్చు. బాలింతలు, బహిష్టు మహిళలకు గ్రామ బహిష్కరణ విధిస్తారు. మడకశిర నియోజకవర్గంలోనే కాకుండా సమీప కర్ణాటక ప్రాంతాలైన చిత్రదుర్గం, తుమకూరు, కోలార్ జిల్లాల్లోనూ ఈ మూఢాచారం పాతుకుపోయింది. కల్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.

మనదేశం విశాలమయింది. భిన్న సంప్రదాయాలు, భిన్న మతాలూ వాటికున్న ఆచారాలు- ఇవన్నీ భినత్వంలో ఏకత్వంగా ప్రజలని నిలిపి ఉంచుతున్నాయి. కులాలు, మతాలు ఏమైనా వాటిలో వున్న భిన్న కోణాలు ఏవైనా కానీ తమ జాతి ఉనికిని కాపాడుకోవడమే వారి లక్ష్యం. దేశంలోని చాలా ప్రాంతాలలో వున్న ఆచార వ్యవహారాలు చిత్రంగా వుంటాయి. నగరాల్లో నివసించేవారికి అవి వింతగా అనిపించవచ్చునేమోగానీ పల్లెల్లో ఇప్పటికీ అవి పాటిస్తూనే ఉంటారు. ఆ ఆచారాల్ని పాటించడం వెనుక ఒక ప్రత్యేక కారణం వుండి వుండొచ్చు. అది రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ వస్తుంది. అలాంటి కొన్ని వింత సంప్రదాయాల్ని, ఆచారాల్ని చూద్దామా...
మన దేశంలో హిమాచల్ ప్రదేశానికి ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారు. వీరికి పర్యాటకం ద్వారానే ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. ఈ రాష్ట్రంలో గల వీణ అనే గ్రామ ప్రజల జీవనశైలి, ఆచారం వింతగా వుంటుంది. ఇప్పటికీ ఈ గ్రామస్థులు పురాతనకాలం నుండి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఏడాదిలో ఐదు రోజులు భర్తలు తమ భార్యలతో మాట్లాడరు. అంతేకాదు ఈ ఐదు రోజులు ఆ గ్రామస్థులు ఎవరు కూడా మద్యం జోలికివెళ్లరు. మరో వింత ఆచారం ఏమిటి అంటే ఈ ఐదు రోజులు మహిళలు ప్రతి పనినీ దుస్తులు ధరించకుండా చేస్తారు. అలా చేయకపోతే అశుభమని భావిస్తారు. పురాతన కాలంనుంచి వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగించకపోతే గ్రామానికి అరిష్టమని బలంగా నమ్ముతారు. ఈ ఆచారాన్ని పాటించడం వెనుక గల కారణం ఏమిటీ అంటే, గతంలో రాక్షసులు గ్రామంలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారట. ఆ సమయంలో దేవతలు వచ్చి రాక్షసులని మట్టుబెట్టి వీరిని కాపాడారని ప్రతీతి. ఈ కారణంగానే భద్రన్ సంక్రాంతి మాసాన్ని తమకు కీడు జరిగే మాసంగా భావిస్తారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి సాధించినా కూడా ఆచారాల పేరుతో మహిళలు వెనుకబాటుతనానికి గురి అవుతూనే ఉన్నారు. దేశంలో ఇప్పటికీ మహిళలపట్ల వివక్ష కొనసాగుతూనే వుంది. ఆచారాల పేరుతో బానిసత్వంలోకి నెట్టివేయబడుతోంది. కొన్నిచోట్ల వింత ఆచారాలు మహిళ బతుకుని దుర్భరం చేస్తున్నాయి. అలాంటి ఒక ఆచారమే- ఒక మహిళ ఐదుగురు పురుషులని పెళ్లాడటం. ఇది ఏ ఆఫ్రికాలోనో వుంది అనుకుంటే పొరబడినట్టే. ఇది మన దేశంలోనే కొనసాగుతున్న ఒక దురాచారం.
హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో వున్న విచిత్ర ఆచారం వింటున్నపుడు మనం ఎక్కడ వున్నాం అనే ప్రశ్న ఉదయిస్తుంది. చాలాకాలంగా ఇక్కడి జనాలు ఈవింత ఆచారాన్ని పాటిస్తున్నారు. మొదట్లో అమ్మాయి పుడితే పురిటిలోనే అంతంచేసే ఆచారం వుండడంతో నేడు మహిళలు చాలా తక్కువగా ఉన్నారు. కాస్త చేదుగా చెప్పాలంటే ప్రతి మంది మగవారికి కేవలం ఒక మహిళ మాత్రమే వుంది. అందుకే కనీసం ఐదుగురు లేక అంతకుమించి అన్నదమ్ములున్న కుటుంబానికి అమ్మాయిని ఇస్తారు. ఆ కుటుంబంలో వున్న అన్నదమ్ములందరూ ఆ అమ్మాయితో కాపురం చేయాల్సి వుంటుంది. అందర్నీ మనువాడినప్పటికీ అందులో ఎవరైనా చనిపోతే ఆమె శోకించకూడదు. ఇది అక్కడి వింత ఆచారం. అయితే ఇన్ని దురాచారాలమధ్య కూడా ఒక సదాచారం పాటిస్తారు. ఇంటికి ఆ మహిళనే పెద్దగా వ్యవహరిస్తారు. మగవారందరూ ఆమె చెప్పిందే ఫాలో అవుతారు. పురిటిలోనే ఆడపిల్లల్ని అంతం చేసినందుకు ఇపుడు అక్కడి పెద్దలు బాధపడుతున్నారు. ఆడపిల్లలు పెరిగిన తరువాత కూడా ఇలాంటి ఆచారం కొనసాగించడం మంచిదికాదని దీన్ని రద్దుచేయాలనీ చూస్తున్నారు.
మహిళలు ఆచారాలతో ఎంత తీవ్రంగా వివక్షణకి గురి అవుతున్నారో తెలిపేందుకు మరొక వింత ఆచారం- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చంపావట్ జిల్లాలోని కొన్ని గ్రామాలలో ఋతుక్రమం సమయంలో మహిళలు దూరంగా ఉండాలనేది ఆచారంగా ఉంది. జిల్లాలోని మారుమూల గుర్భాం గ్రామంలో అయితే మహిళలు ఇళ్ళలోనే ఉండకూడదంటూ గ్రామ పంచాయితీ తీర్మానం చేసింది. వారికోసం ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ భవనాన్ని ప్రభుత్వ నిధులతో నిర్మించడం గమనార్హం. ఇలా మహిళ ప్రకృతి సిద్ధంగా వచ్చే ఋతుక్రమాన్ని కూడా ఆచారం పేరుతో ఆంక్షలు పెట్టి ఊరి బయట ఉండమడం ఎంత దారుణం.
కొన్ని దశాబ్దాల క్రితంవరకు తెలంగాణాలో దొరల ముందు నిలబడాలంటే ప్రజలు భయపడేవారు. వాళ్ళకి వంగి నమస్కరించేవారు. దొర ముందు నడవాలంటే భయపడేవారు. చెప్పుల్ని తీసి చేతితో పట్టుకొని వొట్టికాళ్ళతో నడిచేవారు. కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు వచ్చినా ఇప్పటికీ ఈ ఆచారం ఇంకా కొనసాగించడం ఆశ్చర్యం. మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రాంతంలో ఇప్పటికీ ఈ వింత ఆచారం ఇంకా కొనసాగుతోంది. అక్కడ పురుషుల ముందు మహిళలు చెప్పులు విడిచి చేతితో పట్టుకొని నడుస్తారు. చంబల్ డివిజన్‌లో అమేట్ అనే గ్రామంలో వున్న మహిళల పరిస్థితి ఇది. అక్కడ మహిళలు ఇప్పటికీ పురుషులు ఎదురైతే చెప్పులు విడిచి చేతితో పట్టుకొని ఉత్తకాళ్ళతో నడుస్తారు. ఎన్నో ఏళ్ళుగా పాటిస్తున్న ఈ ఆచారాన్ని స్వయంగా స్వచ్ఛందంగా మహిళలే పాటిస్తుండటం విశేషం.
మహిళలు వారి అభివృద్ధిని నిరోధించే ఇంకొక ఆచారం కూడా చాలా వింతగా వుంటుంది. ఇది రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని థేరాసర్ అనే గ్రామం వుంది. ఆ గ్రామ జనాభా కేవలం ఆరు వందలు మాత్రమే. కానీ ఆ ఊళ్ళోని వ్యక్తి ఇద్దరు భార్యలను చేసుకోవాల్సిందే. ఈ ఆచారం ఇప్పటిది కాదు ఎప్పటినుంచో వస్తున్నది. అయితే ఈ ఆచారాన్ని ఎందుకు పాటించాలి అంటే దానికొక కారణం చెబుతారు. ఆ ఊరికి చెందిన ఒక వ్యక్తికి పెళ్లి అవుతుంది కానీ మొదటి భార్యకి పిల్లలు పుట్టరు. దీంతో రెండో పెళ్లి చేసుకుంటాడు. రెండో పెళ్లి చేసుకున్న ఆమెకి పిల్లలు పుట్టగానే మొదటి భార్యకి పిల్లలు పుడతారు. మొదటి భార్యని చేసుకొని ఎన్ని రోజులు వేచి చూసినా కూడా పిల్లలు పుట్టరట. రెండో పెళ్లిచేసుకున్నాకే ఆమెకి పిల్లలు కలిగినాక మొదటి భార్యకి పిల్లలు పుడతారని గట్టి నమ్మకం. ఇక ఈ ఆచారం కేవలం ఆ ఒక్క గ్రామానికే. మిగతా గ్రామాలు మామూలుగానే ఉన్నాయి. మొదటి భార్యనే తన భర్తకి దగ్గరుండి రెండో పెళ్లి చేయిస్తుంది. ఇది మరీ దారుణం. మూఢనమ్మకం కాస్త ఆచారంగా మారింది. ఇది వినడానికి చాలా చిత్రంగా లేదూ! అలాగే మడకశిరలో ఒక వింత ఆచారం మహిళా వివక్షకి ప్రతిరూపమే అని చెప్పొచ్చు. బాలింతలు, బహిష్టు మహిళలకు గ్రామ బహిష్కరణ విధిస్తారు. మడకశిర నియోజకవర్గంలోనే కాకుండా సమీప కర్ణాటక ప్రాంతాలైన చిత్రదుర్గం, తుమకూరు, కోలార్ జిల్లాల్లోనూ ఈ మూఢాచారం పాతుకుపోయింది. కల్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. అయినప్పటికీ ఎవరూ వీరిలో చైతన్యం తీసుకురాకపోవడం గమనార్హం. హట్టిగొల్ల సామాజికవర్గంలో మహిళలను ప్రసవానంతరం మూడు నెలలపాటు గ్రామ బహిష్కరణ విధిస్తారు. పసికూన సహా తల్లిని గ్రామానికి దూరంగా ఉంచుతారు. బాలింతకు కుటుంబ సభ్యులు తొమ్మిది రోజులు మాత్రమే భోజనం అందిస్తారు. ఆ తర్వాత వంట సామగ్రి అందిస్తే 51 రోజులపాటు ఆమె స్వయంపాకం చేసుకోవాల్సిందే. వర్షాల్లో, ఎముకలు కొలిచే చలిలో వీరి అవస్థలు వర్ణనాతీతం.
పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలోని ప్రజలు, మహిళలు నైటీలు ధరించకూడదనే వింత ఆచారం మొదలుపెట్టారు. విచిత్రంగా అనిపించినా.. దీన్ని ఉల్లంఘిస్తే జరిమానా కూడా విధిస్తున్నారు అని తెలిస్తే మనం కూడా ఆ శాసనాన్ని గౌరవించాల్సిందే. అయితే మహిళలు ఎవరైనా నైటీ ధరించాలంటే సాయంత్రం 7 గంటల తర్వాతే ధరించాలి. ఉదయం 7 గంటలనుండి సాయంత్రం 7 గంటలవరకు ఎట్టి పరిస్థితుల్లో నైటీ ధరించకూడదు. ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.2 వేలు జరిమానా కట్టాల్సిందే.
అంతరిక్షంలోకి మహిళలు వెళ్తున్నా ఇంకా ఈ మూఢచారాలు మహిళాభివృద్ధిని దిగజారుస్తున్నాయి. స్వచ్ఛంద కార్యకర్తలు, ప్రభుత్వం, ఇంకా మహిళలు స్వయంగా తెలుసుకొని వీటిని పాటించకుండా వుంటే బాగుంటుంది. మహిళల్లో చైతన్యం వచ్చినపుడే ఇలాంటి ఆచారాలకు చెక్‌పెట్టొచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వీటిపై దృష్టిపెట్టి నివారించడం ఎంతైనా అవసరం. ఆ దిశగా కృషి చేస్తేనే కానీ మహిళలు పురోగతి సాధించలేరు.

-పుష్యమీ సాగర్ 9010350317