మెయన్ ఫీచర్

తెదేపా నావ ఏ తీరానికి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్షేమ పథకాల వల్లే ఎన్నికల్లో గెలిచి తీరతామని ఏ రాజకీయ పార్టీ భావించినా అది కేవలం భ్రమే! నేతల అనుభవాన్ని, జనాకర్షక కార్యక్రమాలను చూసి ప్రజలు గెలిపించరు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకు పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో తెదేపా కథ ముగిసినట్లేనని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని, మాజీ సీఎం చంద్రబాబుకు గడ్డు పరిస్థితి తప్పదన్న కథనాలు మీడియాలో వెలువడుతున్నాయి. బీజేపీలో కొంతమంది తెదేపా నాయకులు చేరినా ఆ పార్టీ మనుగడకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే నేతలు ‘్ఫ్యషన్ పరేడ్’లో పాల్గొనే తారలు లాంటివారని పేర్కొనవచ్చు. వారికి జనం ఎలా వాతపెడతారో తాజా ఎన్నికల్లో చూశాం. వచ్చే ఐదేళ్లను దృష్టిలో పెట్టుకుని విశే్లషిస్తే టీడీపీకి వచ్చే ఢోకా అంటూ ఏమీ ఉండదు. కానీ, పార్టీ అధినాయకత్వం తన వ్యవహార శైలిని, వర్తమాన రాజకీయాలకు అనుగుణంగా పార్టీని నడిపే పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుంది.
వచ్చే ఐదేళ్లలో ఏపీ రాజకీయాలను అంచనా వేయాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను ప్రస్తావించాల్సి ఉంటుంది. 1956 నుంచి 1983 వరకు కాంగ్రెస్‌కు తిరుగులేదు. 1982లో సినీనటుడు ఎన్టీఆర్ తెదేపాను స్థాపించాక రాజకీయ ముఖచిత్రం మారంది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా టీడీపీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. 1983లో తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టిన ఆ పార్టీ 1989లో ఓటమిని చవిచూసింది. కార్యకర్తలకు ఉత్సాహం ఇచ్చి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపి 1994 ఎన్నికల్లో తిరిగి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత తెదేపాలో సంక్షోభం ఫలితంగా చంద్రబాబు సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. 1996 నుంచి 2004 వరకు టీడీపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ చంద్రబాబు తేదేపాను తన కనుసన్నలలో నడిపించారు.
రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవానికి ప్రజలు పట్టం కట్టారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఒకవేళ పార్టీ ఓటమి చెందినా కనీసం 60 సీట్లు వస్తాయని తేదేపా నేతలు భావించారు. ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలు దూరమైనపుడు ఏ పార్టీకైనా ఓటమి తప్పదు. టీడీపీ ఓటమి చెందాక చంద్రబాబుకు గట్టి మద్దతుదారులైన సీఎం రమేష్, సుజనా చౌదరి తదితర రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ పరిణామాలను చూసి టీడీపీ కథ ముగిసినట్టేనని భావించడానికి వీలులేదు. ఆంధ్ర రాజకీయాల్లో ఇపుడు వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదురొడ్డి నిలబడే రాజకీయ పార్టీ టీడీపీ తప్ప మరొకటి లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతరించింది. ఆ పార్టీ క్యాడర్ అంతా వైకాపాకు వెళ్లిపోయింది. ఇక బీజేపీ బలం పుంజుకుంటుందా? అంటే ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. గత ఐదేళ్లలో రాష్ట్భ్రావృద్ధికి ఎంతో చేశామని, భారీగా నిధులు విడుదల చేశామని భాజపా నేతలు గణాంకాలతో వివరించినా ప్రజలు విశ్వసించడం లేదు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏపీకి ఇతోధికంగా నిధులు ఇచ్చి ఉండవచ్చు. కాని ప్రత్యేక హోదా లేదా దానికి సమానమైన ప్యాకేజీపై బీజేపీ నోరు విప్పడం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు చెబుతుంటే ప్రజలకు పుండు మీద కారం చల్లినట్టు ఉంటోంది. ‘హోదా ఇవ్వలేం, ప్యాకేజీని వెంటనే ప్రకటిస్తామ’ని ప్రధాని మోదీ ప్రకటించవచ్చు. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్యాకేజీ ఊసే లేదు. ఏపీలో బీజేపీ ఎదగాలంటే ఆ పార్టీ బలహీనత బయటపడుతోంది. ఆ లోపాన్ని సరిదిద్దుకుని ప్రజలను సంతృప్తపరిచే ప్రయత్నం చేసే విధంగా ఏమైనా చేశారా అంటే- ఆ దిశగా ఏమీ చేయడం లేదు. ఆకర్షణీయమైన ప్యాకేజీని ప్రకటిస్తే.. కొన్ని వర్గాలు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.
వైకాపాకు బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందని భావించలేం. కాంగ్రెస్ కంటే కొద్దిగా మెరుగైన స్థాయిలో బీజేపీ ఉంటుంది. ఇక సీపీఐ, సీపీఎం కాలక్రమంలో ఉనికిని కోల్పోయాయి. జనసేన పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. అన్నీ వదిలిపెట్టుకుని జనంలో పవన్ కల్యాణ్ తిరుగుతూ ఉంటే జనసేనకు కొంతబలం చేకూరవచ్చు. సైద్ధాంతిక నిబద్ధత, నిర్ణీత లక్ష్యం, అంకితభావం ఉన్న కార్యకర్తలు లేకుండా ఏ పార్టీ కూడా బతికి బట్టకట్టడం దుర్లభం. ఆంధ్ర రాజకీయాల్లో బీఎస్పీ, జనతాదళ్ వంటి పార్టీలకు ఎప్పుడూ స్థానం లేదు.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే సమర్థవంతమైన ప్రతిపక్ష పార్టీగా వచ్చే ఐదేళ్లు తెదేపా పనిచేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ లోపల, వెలుపల ఆ పార్టీనేతలు తమ తీరును మార్చుకోవాల్సి ఉంటుంది. కొత్తతరం ఆకాంక్షలకు తగ్గట్టుగా నేతలు నడుచుకోవాలి. పాతమాటలే మాట్లాడుతూ టీడీపీ నేతలు జనంలోకి వెళితే ఎవరూ పట్టించుకోరు. ఆ పార్టీలో ఓటమిపై పూర్తిస్థాయిలో అంతర్మథనం జరగలేదు. కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరహాలో తెదేపా అధ్యక్ష పదవి నుంచి చంద్రబాబు తప్పుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ పార్టీ అంతా చంద్రబాబే కేంద్ర బిందువుగా పనిచేస్తోంది. ఆయన తర్వాత బలమైన నేతలెవరూ తెదేపాలో లేరు. చంద్రబాబు తనయుడు లోకేష్ రాజకీయంగా మొదటి పరీక్షలోనే విఫలమయ్యారు. లోపాలను సరిదిద్దుకుని ఆయన ముందుకెళతారా? అనేది వచ్చే ఐదేళ్లలో తేలుతుంది. అంతవరకు పార్టీ క్యాడర్‌ను ఆపడం కష్టం. నేతల పనితీరును జనం వివిధ మాధ్యమాల ద్వారా అనుక్షణం అంచనా వేస్తున్నారు. పార్టీ నిర్వహణకు సంబంధించి అన్ని విభాగాల్లో అగ్రగామిగా ఉండే టీడీపీ నాయకత్వం విషయంలో మాత్రం తడబాటుకు లోనవుతోంది. యువకుడైన జగన్‌ను ఢీ కొనాలంటే ఆ స్థాయిలో నాయకత్వం టీడీపీలో ఉండాలి.
టీడీపీలో చంద్రబాబు సహా ఒకరిద్దరిని మినహాయిస్తే పెద్దగా చెప్పుకునే నేతలెవరూలేరు. ప్రతిరోజూ కొంతమంది నాయకులు విలేకరులతో ముచ్చటించడం తప్ప ఆ పార్టీలో కొత్తదనం కనపడడం లేదు. ముందుగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్నిర్మించుకోవాలి. ప్రజలకు తమపై ఎందుకింత ఆగ్రహం కలిగిందనే విషయమై టీడీపీలో ఇంతవరకు ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరగలేదు. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల మాదిరిగా ‘చింతన్ బైఠక్’ అంటే మేధోమథనం లేదు. ఓడిన క్షణం నుంచి వైకాపాపై విమర్శలు, జగన్‌పై ఆరోపణలు చేస్తుంటే వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ ప్రయోగాలు గత ఐదేళ్లు చేసి టీడీపీ చిత్తుగా ఓడింది. జనం సెంటిమెంట్లతో చంద్రబాబు ఆడుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని, జనసేన నేత పవన్ అండతో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు వారిద్దరినీ దూరం చేసుకున్నారు.
రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్‌పై ప్రజలకు విపరీతమైన ద్వేషం ఉంది. ఈ ద్వేషాన్ని పెంచేందుకు నాలుగేళ్లు కాంగ్రెస్‌ను తిట్టి, చివరి సంవత్సరం మళ్లీ కాంగ్రెస్ పంచన చంద్రబాబు చేరారు. తమ మనోభావాలను దెబ్బతీసిన సోనియా,రాహుల్ పక్కన చంద్రబాబు నిలబడి ఫొటోలకు పోజులివ్వడాన్ని జనం క్షమించలేదు. అధికారం వచ్చినా గత ఐదేళ్లలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపలేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఆవిర్భవించింది. మళ్లీ 1956 నవంబర్ 1న మిగులు హైదరాబాద్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. ఏదో ఒక తేదీని ఖరారు చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించలేదు. జూన్ 2వ తేదీన ఒక దీక్ష, ఆ తర్వాత ధర్మపోరాట దీక్షలంటూ చంద్రబాబు ప్రజల సెంటిమెంట్‌ను గాయపరిచారు. ఆంధ్ర రాష్ట్రానికి పుట్టినరోజు వేడుకలు లేకుండా చేశారు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి, ఆ తర్వాత బయటకు వచ్చి అదే పార్టీని ఇష్టం వచ్చినట్లు తిట్టడం, ప్రధాని మోదీపై విమర్శలు చేయడాన్ని ఆంధ్ర ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.
బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ వ్యవహార శైలిపై ప్రజల్లో విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్ష స్థానంలో ఉంటూ సెల్ఫ్‌గోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ప్రజలు జగన్ నాయకత్వాన్ని ఆదరించారు. వైకాపా ప్రభుత్వం పట్ల ప్రజలకు విముఖత కలిగే వరకు ఓపిక పట్టే వైఖరి టీడీపీలో కనపడడం లేదు. తప్పులను సరిదిద్దుకొని, హుందాతనంతో టీడీపీ వ్యవహరిస్తుందనే నమ్మకంతో పార్టీ క్యాడర్ ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటే టీడీపీ మనుగడ ప్రశ్నార్థకమే. రాజకీయంగా బతికేందుకు ఆ పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రాంతీయ పార్టీలకు అధికారమే కేంద్రం. బలమైన నాయకుడు ఉన్నంత వరకు అవి నడుస్తాయి. ఈ పార్టీలలో నాయకత్వ మార్పు జాతీయ పార్టీల మాదిరి ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు సంస్థాగత లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు పోవాల్సి ఉంటుంది. అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుని పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా టీడీపీ ప్రయాణం చేస్తుందా? అనే విషయం తేలాల్సి ఉంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097