మెయిన్ ఫీచర్

మన హీరోలు.. అతిబలవంతులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు కథని -కథలా చెప్తారు. కొందరు -బాగా చెప్పేవాళ్లుంటారు. ఇంకొందరు -గొప్పగా చెప్పేవాళ్లుంటారు. మరికొందరు కళ్లకు కట్టినట్టు చెప్తుంటారు. మన తెలుగు సినిమా దర్శకులే -కళ్లు కుట్టుకునేలా.. మరీ అతిగా చెప్తున్నారేమో అనిపిస్తుంది, ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో. ఇప్పుడొచ్చే చిత్రాల్లో -చేజింగ్‌లు, ఫైటింగ్‌లు చూస్తుంటే ‘అతి’ అనిపిస్తుంది. అతిశయోక్తి చూపిస్తున్నారని అనిపిస్తూనే ఉంటుంది. అనిపించడమే కాదు, నిజంగానే ‘ఓవర్ యాక్షన్’ చేసేస్తున్నారన్న స్పృహ కలుగుతుంది.
-ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటూ టికెట్ కొనుక్కుని థియేటర్‌లోకి కాలుపెట్టాం కనుక తప్పదనుకుంటూ ప్రేక్షకుడు కూడా మనసును కకావికలం చేసే కల్పనా దృశ్యాలను కళ్లప్పగించి మరీ చూసేస్తున్నాడు. అంత హింస అవసరమా? అన్న ప్రశ్న మనసులో మెదిలినా -అలావుంటేనే ‘హీరోయిజం’ ఏమోలే అని సరిపెట్టుకుంటూ సన్నివేశాన్ని దాటేస్తున్నాడు. భారతీయ సినిమా.. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతీయ చిత్రాలు.. మరీ మరీ ముఖ్యంగా తెలుగు స్క్రీన్ మీద దర్శనమిస్తున్న అతి యాక్షన్ సన్నివేశాలను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఈమధ్యే వచ్చిన నాలుగైదు సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాలను పరిశీలిద్దాం.
శ్రీమంతుడు: ఓ కోటీశ్వరుడి కొడుకు తన మూలాలు ఎక్కడున్నాయో తెలుసిన తరువాత -తండ్రి పుట్టి పెరిగిన సొంతూరికి వస్తాడు. అప్పటికే ఆ పల్లె పొలిటికల్ పెత్తందారుల కబంధ హస్తాల్లో నలిగుతుంటుంది. విలన్ల వద్ద ‘పేద్ద’ వస్తాదుల సైన్యమే ఉంటుంది. సిటీ నుంచి బయలుదేరిన దగ్గర్నుంచి విలన్ల ఆట ముగించే వరకూ హీరో -ఆ మహాకాయులను మట్టి కరిపించే సన్నివేశాలు కళ్లముందు కదులుతుంటాయి. ఏనుగుల్లాంటి వస్తాదులను సైతం -తలకిందులుగా పైకెత్తి కుదేసేస్తుంటే మట్టిలోకి సగం కూరుకుపోయే ‘యాక్షన్’ సీన్లు స్క్రీన్‌మీద చూస్తున్నంతసేపూ అద్భుతంగానే తోస్తాయి. హీరోస్థానంలో మనల్ని ఊహించేసుకునేంత గొప్పగానూ అనిపిస్తాయి. తరువాతే.. -నిజంగా హీరోకి అంత సీనుంటుందా? అన్న ప్రాక్టికల్ ప్రశ్న మెదడుకు తట్టినపుడు నవ్వొస్తుంది. అతిశయోక్తి అనిపిస్తుంటుంది.
సరైనోడు: ఊరమాస్ డెఫినిషన్‌ను వైఫైలో కనెక్ట్ చేసి మరీ చూపించిన -చిత్రం సరైనోడు. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు విలన్. మాసు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడుకు -హీరో. ఊరమాసు. మంచి చెడుల మధ్య కథ నడవాలి కనుక -వీళ్లిద్దరి మధ్య వార్. ఆ ‘యాక్షన్’ ఎడిసోడ్స్ ఎంతగొప్పగా ఉంటాయంటే... భయపడి సెటిల్‌మెంట్‌కు వచ్చిన బచ్చా విలన్లకు నగ్నత్వాన్ని చూపించడం -సిఎం కొడుకు విలనిజం. రోడ్డుపై స్వచ్ఛందంగా ‘పరిశుభ్రత’ సేవ చేస్తున్న అందమైన మహిళా ఎమ్మెల్యే వొంపుసొంపుల్ని వర్ణించడం -సిఎస్ కొడుకు హీరోయిజం. ఇవీ ఒకరకంగా ‘యాక్షన్’ సీనే్ల. ఇక ఫైటింగుల విషయంలోనూ -ఎగిరెగిరి కొట్టడాలు, ఎగరేసి కొట్టడాలూ.. మనిషిని మధ్యకు విరిచేయడాలూ మామూలే. చూస్తున్నంత సేపూ ఇవన్నీ గొప్పగానే అనిపిస్తాయి. ఆలోచించిస్తేనే -అబ్బే ‘అతే’ అనిపిస్తాయి. ఏమనిపించినా -ప్రేక్షకులు చూసేశారు. అలవాటులో భాగంగా -ఒకే అనేశారు.
గబ్బర్‌సింగ్: గట్స్‌వున్న మాసు పోలీసాఫీసర్. పైగా అతనికి ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్ -లెక్కగావున్న తిక్క. ఇవి చాలు చెలరేగిపోడానికి. అందుకే గబ్బర్‌సింగ్ చెలరేగిపోయాడు. విలన్లను పరుగులు పెట్టించాడు. ‘మట్టి’ కరిపించాడు. గుద్దితే గునపాలు సైతం వొంగిపోయేంత ‘మార్షల్’ ఆర్ట్స్ ప్రదర్శించాడు. నిజంగా పోలీస్ ఆఫీసర్ అంత బలవంతుడైతే, కాస్త తిక్కున్నవాడైతే, అంతగా భయపెట్టేవాడైతే.. అనుకుంటూనే ఆడియన్స్ సినిమా చూసేశారు. యాక్షన్ డిజైన్స్‌ను ఎంజాయ్ చేసేసి -హిట్టు టాగ్ తగిలించేశారు. తరువాతే తీరిగ్గా సన్నివేశాలను నెమరేసుకుంటూ -అంతా ‘ఓవరాక్షనే’ అనేశారు.
తాజాగా.. మొన్నీమధ్యే వచ్చిన ‘రిపేర్ల’ సినిమా -జనతా గ్యారేజ్. ‘పచ్చని’ బండి రిపేర్‌కొస్తే బోల్ట్ విప్పడం.. ప్రకృతిని రిపేర్‌కు తేవాలనుకునే మనిషి బెండు తీయడం. కానె్సప్ట్ సింపుల్‌గా కనిపించినా -యాక్షన్ ఎపిసోడ్స్‌కి కావాల్సినంత స్పాన్ ఉంది. సో.. సీనియర్ యాక్టర్ మోహన్‌లాల్‌తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ తన స్టామినా చూపించాడు. ఓకే కుటుంబంలోని రెండు తరలా మధ్య ఎమోషన్స్‌ని, రిలేషన్స్‌ని వాడుకుంటూ -ఆ కుటుంబంలోకి ఎంటరైన ‘నేచర్ విలన్’ కథ ముగిస్తారు. ఫైనల్‌గా ‘మొక్క’వోని దీక్షతో -విలన్లను ‘మట్టి’లో కలిపేసే హీరో ‘ఫైట్లే’ చూస్తాం. విసిరి కొట్టడం నుంచి విరిచేసి కొట్టడం వరకూ -గగుర్పాటు కలిగించే దృశ్యాలు స్క్రీన్‌మీద చకచకా నడిచిపోతుంటే -కళ్లప్పగించి చూసేశారు. హీరో బలగాన్ని, మానసిక బలాన్ని చూసి ఎంజాయ్ చేసేశారు. ఆ తరువాతే... -చెప్పక్కర్లేదిక! తెలుగు సినిమా యాక్షన్ సన్నివేశాలను సింగిల్ టాగ్‌లో చెప్పాలంటే -ఎవరెస్ట్ ఎక్కడం నుంచి ఎత్తడం వరకూ వచ్చేసింది.
***
తెలుగు సినిమా అతి’కి అలావాటుపడిపోయిందని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇలాంటి సన్నివేశాలు ఫలానా సినిమాలోనే అని చెప్పలేం. హీరో అనేవాడొకడు ఉన్న -అన్ని సినిమాల్లోనూ ఇలాంటి దృశ్యాలూ చూసేస్తూనే ఉన్నాం. విలన్ శక్తివంతుడు. హీరో శక్తి, యుక్తి ఉన్నవాడు. ఒకరిది పగ. ఇంకొకరిది ప్రతీకారం. ఏ సినిమాలోనైనా -ఇంతకంటే గొప్ప కంటెంట్ ఉండదు, కనిపించదు.
**
గతం సినిమాలనే తీసుకుందాం. సినిమా ఆరంభంలోనే రౌడీల బృందం జైలునుంచి తప్పించుకుంటుంది. కాదూ.. అడవుల్లోంచో, కొండ కోనల్లోంచో వచ్చి ఊళ్లమీద పడుతుంది. అలా వచ్చిన మూకలు -హీరో తల్లిదండ్రులను హింసించి చంపేస్తాయి. లేదూ హీరో అక్కనో చెల్లినో గ్యాంగ్ రేప్ చేస్తుంది. ఉన్నదంతా దోచుకుని -కిరాతంగా చంపేస్తుంది. ఇదంతా చాటునుండి హీరో చూస్తాడు. హింసాకాండను చూసి -కుటుంబీకుల మృతదేహాలపై పడి ఏడుస్తాడు. విలన్లను చిత్రవధకు గురిచేసి చంపుతానని అక్కడే శపథం చేస్తాడు. అక్కడనుండి వెళ్లిపోయి ఎక్కడెక్కతో తిరిగి.. పెరిగి.. పెద్దవాడై హీరో అవుతాడు. విలన్లను వెతుక్కుంటూ వచ్చి క్రూరాతిక్రూరంగా మట్టుబెడతాడు. తెలుగు సినిమా కోసం పేనుకున్న ఫార్ములా ఇది. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా -ఈ ఫార్ములాను ఎంచుకున్న అంశానికి అనువదించి చూపించడమే.
**
ఇక్కడ చెప్పుకునే దేమిటంటే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడా జరిగిన యధార్థ సంఘటనలను, కథా రచయితల ఊహ కల్పననుంచి వచ్చిన కథలను నేటికీ సినిమాలుగా తీస్తున్నారనడం జగమెరిగిన సత్యం. మెయిన్ పాయింట్‌కు వస్తే.. చాలా సినిమాల్లో మనుషుల్ని హింసించి ఘోరాతి ఘోరంగా చంపటం చూస్తుంటే -ఇంత హింస అవసరమా? అనిపిస్తుంది. కలవరానికి గురిచేస్తుంది. బతుకు సమస్యలతో సతమతమవుతూనో, కాస్త కాలక్షేపానికి -రెండు గంటల ఎంటర్‌టైన్‌మెంట్ ఆశించి థియేటర్‌కు వెళ్తే.. అక్కడ చూపించే హింసతో మూడ్ ముక్కలై -పరిపరివిధాలా ఆలోచనలకు గురికావటం ఖయం. అదే -సినిమా కథకు ఇంత రక్తపాతం అవసరమా? అని. ఎందుకంటే -హింసకు ప్రేరేపితులవుతున్న వాళ్లూ లేరని చెప్పలేం. కొద్దికాలం క్రితం వరకూ ఈ సన్నివేశాలు మరో విధంగానూ ఉండేవి. విలన్ మనుషులు ఒక వ్యక్తిని కత్తితో పొడిచి ఆ బాధకు అతడు విలవిల్లాడుతుంటే -అదే కత్తిని మెలిదిప్పుతూ రాక్షసానందం పొందే విలన్ల దృశ్యాలు చూశాం. మరో సినిమాలో -విలన్ల బృందం ఒక వ్యక్తిని గోనె సంచిలో జంతువును మూటగట్టినట్టు కట్టి, అతని నెత్తిమీద పెద్ద శీలలాంటి ఆయుధాన్ని పెట్టి పెద్ద సుత్తితో బలంగామోది దిగేసి చంపేసే సన్నివేశాలూ చూశాం. సినిమాను ఎందుకిలా తీశారని భయపడేంతగా చలించిపోయాయం. ఏం ఆశించి ఇలాంటి భయానక, జుగుప్సాకరమైన సంఘటనలను సినిమాల్లో చేర్చుతున్నారో -ప్రేక్షకుడు ప్రశ్నించుకోని ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఇక బాంబ్ బ్లాస్టింగులు, బ్లాస్టింగ్ ప్రదేశాల్లో తెగిపడిన మానవ అవయవాలు.. ధారలుకట్టిన నెత్తుటి మడుగులు.. కొన ఊపిరితో లబోదిబోమంటున్న పిల్లపాపలు.. ఇంతటి దారుణమైన వయొలెన్స్ దృశ్యాలను తాత్కాలికంగా మర్చిపోయినా.. ఏదోక సందర్భంలో గుర్తుకొచ్చి ‘మూడ్’ను ముక్కలు చేయవా? చిత్ర విచిత్రమైన కత్తులు, గగుర్పాటు కలిగించే వస్తు ఆయుధాలు, మానవ తలల్ని పుచ్చకాయల్లా తెగనరకటాలు.. లీకైన పైపునుంచి ఎగజిమ్మే నీళ్లులా రక్తస్రావ దృశ్యాలు.. ఎంతవరకు అవసరం. ఇలాంటివి రెచ్చిపోయి జొప్పించటం ఎంతవరకు సబబు. ఇంట్లో ఛానల్స్‌లో వచ్చే భయానక సీరియళ్లు, కుటుంబ సభ్యులే ఒకరిపై మరొకరు ఎత్తుపైఎత్తులతో దెబ్బతీసుకునే కుట్రలు చూళ్లేక -మంచి ఆనందం కోసం థియేటర్‌కు వస్తున్న ఆడియన్స్ నెత్తిన ఇలాంటి సినిమాలను రుద్దడం ఎంతవరకు సమంజసం. ఎక్కడో ఏదో మారుమూల ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగి ఉండవచ్చు. వాటిని ఆధారంగా తీసుకొని యధార్థ సంఘటనలంటూ సినిమాలు నిర్మిస్తూ -వయొలెన్స్‌ను ‘4కె’ పిక్సల్స్‌లో స్పష్టంగా చూపించటం దారుణం కాదా?. కాలానుగుణంగా మారుతోన్న సినిమాలో -యాక్షన్‌కు తెలుగు సినిమా దగ్గరై ఉండొచ్చు. కానీ, ఇంత ‘అతి’కి దగ్గరవ్వాల్సిన అవసరం ఉందా? అన్నదే అసలు ప్రశ్న. తెలుగు నేటివిటీకి దగ్గరగా, వ్యక్తిత్వ వికాసానికి ఆలంబనగా వచ్చిన ఎన్నో సినిమాలు దశాబ్దాలు గడుస్తున్నా గుర్తుంటున్నాయంటే -అందలోని ‘యాక్షన్’ ఎడిసోడ్స్ కాదు. వాటిల్లోని హీరోయిజం.. విలనిజం -జీవన విధానానికి దగ్గరగాను, కాస్త నమ్మేట్టుగానూ ఉన్నాయి కనుక. విపరీతమైన వయలెన్స్ జోలికి వెళ్ళకుండా సరైన కథాంశాన్ని తీసుకుని, నేటివిటీకి అనుగుణంగానో, కాస్త వైవిధ్యంగానో మార్చుకుని చిత్రాలు నిర్మిస్తే ఆదరించని ప్రేక్షకులు ఉంటారని అనుకోవాల్సిన పని లేదు. దశాబ్దాలు గడిచినా గుర్తు పెట్టుకోగలిగే, గుర్తు పెట్టుకోవాల్సిన సినిమా సంపద తెలుగు పరిశ్రమకు తక్కువేం కాదు. వాస్తవాన్ని వదిలేసి వైవిధ్యం పేరిట -ఎరువుతెచ్చుకున్న ‘యాక్షన్’ సంస్కృతిని పెంచి పోషించడం ఎప్పటికైనా ప్రమాదమే. హీరోల యాక్షన్ సన్నివేశాలు చూసి ఎగిరి గంతులేసే అభిమానులు సైతం -నిజయితీగా గుండెలపై చేయి వేసుకుని.. మన హీరో ‘అతి’బలవంతుడా? అని ప్రశ్నించుకుంటే
సమాధానం దొరక్కపోదు. ‘వయొలెనే్స యాక్షన్’ అనుకునేవాళ్లను ఎవ్వరూ ఏం చేయలేరు. కానీ, ‘వైవిధ్యాన్ని యాక్షన్’గా నేటివిటీకి దగ్గరగా చూపించేవాళ్లను హీరోలనకుండా ఉండలేరు. ఏమంటారు?

మహాదేవ, గిరివాసు