మెయిన్ ఫీచర్

హాస్యానికి అల్లురికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు. రెండక్షరాల్లో రెండుతరాల హాస్యపు జల్లు. కితకితలకే కితకితలు పెట్టగల రామలింగడి హాస్యం -చిరస్మరణీయం. ఓనమాల దగ్గర మొదలుపెట్టి కామెడీ డిక్షనరీగా ఎదిగిన అల్లుకు రెండేళ్లలో వందేళ్ల సంబరం జరగనుంది. చారిత్రక కథల్లో చతురోక్తుల వికటకవిగా విజయనగర ప్రజలను నవ్వించిన రామలింగడు -రాయలతోనే కనుమరుగయ్యాడు. ఆ కొరతను తీర్చి -మనిషి ఆరోగ్యం మీద మమకారంతో నవ్వుల్లో ముంచి ఆయుష్షు పోసేందుకు 1922 అక్టోబర్ 1న కన్ను తెరిచాడు మన రామలింగడు. భూమీదికొచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించి 2004 జూలై 31న కన్ను మూసే వరకూ నవ్వులు పంచుతూనే ఉన్నాడు.అందుకే -రెండేళ్ల దూరంలో వందేళ్ల సంబరాలు చేయడానికి ఆయన కుటుంబం సమాయత్తమవుతోంది. 2021- 22ను అల్లు మధుల స్మృతులతో శతజయంతి జరిపేందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుపుతోంది. ఈ సందర్భంగా ఆనాటి తరం ఔత్సాహిక రచయిత కె శ్రీనివాస రావు -అల్లు’కున్న సమాచార స్మృత్యంజలి ఇది.
*
తెలుగు సినిమాకు కితకితలు పెట్టిన హస్యం రేడు -అల్లు రామలింగడు. వంగర, రేలంగి, రమణారెడ్డిల తర్వాత తెలుగు కామెడీని తన భుజస్కంధాలపై మోసి దాదాపు 50ఏళ్లపాటు నవ్వుల్లో ముంచితేల్చాడు అల్లు. చిత్రమేంటంటే -ఆయన సినిమాల్లోకి వచ్చిన వైనం కూడా కామెడీనే. తండ్రి వ్యవసాయం చేస్తుంటే అల్లు చదువుకుంటూ నాటకాలు వేసేవాడు. నాటకాలు వేసేవాళ్లను ప్రశంసించేవాడు. ఆయన ఉండే ఊళ్లో ఓసారి-
‘్భక్తప్రహ్లాద’ నాటకం పడింది. బృహస్పతి పాత్రధారుడు గైర్హాజరయ్యాడు. అప్పటికే ఆరితేరిన అల్లుతో ఆ పాత్ర వేయించమని -పరిచయమున్న మిత్రుడొకడు నాటకం కాంట్రాక్టర్‌కి రికమెండ్ చేశాడు. అలా బృహస్పతి పాత్ర వేసే అవకాశమొచ్చింది. అయితే ఆ పాత్ర ఇచ్చినందుకు అల్లుని మూడు రూపాయలు లంచం అడిగాడట సదరు కాంట్రాక్టర్.
డీల్ కుదిరింది. నాటకం పూరె్తైంది. అన్నమాట ప్రకారం డబ్బులివ్వాలి. అదీ లంచం. ‘సరే ఈ రూపాయిన్నర ఉంచండి’ అంటూ చల్లగా జారుకున్నాడు అల్లు.
వాస్తవానికి -రామలింగయ్య పేరులోనే హాస్యముంది. అందుకే ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. చారిత్రిక కాలంలో తన కవిత్వంలో పలు ప్రక్రియలు ప్రదర్శించి కవ్వించి, నవ్వించి వికటకవిగా తెనాలి రామలింగడు చరితార్ధుడైతే, ఈనాటి సినీ సీమలో అలాంటి స్థానాన్ని పొందినవాడు -అల్లు రామలింగడు.
పాలకొల్లులో జన్మించిన అల్లు, నాటకాలపట్ల ఆకర్షితుడై అక్కడి సమాజాల నాటకాల్లో పాత్రలు ధరించేవారు. ఒకప్రక్క ప్రజానాట్యమండలి నాటకాల్లోనూ పాత్రలు ధరిస్తూ, హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
అల్లు నాటకాల్లో నటిస్తూనే సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్ళారు. జైల్లోనూ తోటివారిని పోగేసి నాటకాలాడేవారు. మరోవైపు అంటరానితనంపైనా పోరు సలిపారు.
చలనచిత్ర జీవితం
అల్లు నాటకాలు చూసిన గరికిపాటి రాజారావు -తొలిసారిగా 1953లో రాజా ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ‘పుట్టిల్లు’లో కూడు-గుడ్డ శాస్ర్తీ తరహా పాత్ర అల్లుచేత వేయించారు. తర్వాత పరివర్తన, హెచ్‌ఎంరెడ్డి ‘వద్దంటే డబ్బు’లో అవకాశమొచ్చింది. 1952లో కెరీర్ ప్రారంభించి సైకిల్ మీదనే వేషాలకోసం తిరుగుతూ హోమియో వైద్యం కూడా చేసేవారు అల్లు. ‘వద్దంటే డబ్బు’ అల్లుకు మంచి పేరు తెచ్చింది.
పుట్టిల్లు...
స్ర్తి తొలి దశలో తల్లిదండ్రుల చాటున, మలి దశలో భర్తచాటున, చివరి దశలో బిడ్డలమాటున బతకాల్సి ఉంటుందన్నది నానుడి. ఇందుకు భిన్నమైన రీతిలో ఆమెకూ వ్యక్తిత్వముంది. స్వయం నిర్ణయాలతో జీవన గమనం నిర్దేశించుకొనే శక్తి వుంది -అన్న అంశాన్ని అంతర్లీనంగా ప్రభావితం చేస్తూ డాక్టర్ రాజారావు రూపొందించిన కథే ‘పుట్టిల్లు’.
ఒకవిధంగా ఈ కథను ఆ రోజుల్లో తీయటం సాహసమే. అందులోనూ అందరూ కొత్తవారితో తీయటం మరింత సాహసం. రాజారావే నిర్మాత, దర్శకుడు, చిత్ర కథానాయకుడు. కథానాయిక సుశీల పాత్రలో జమునను వెండి తెరకు పరిచయం చేశారు. సహజ సిద్ధమైన నటనతో ఆమె రాణించింది. కథానాయకుడి తల్లి పాత్రలో సురభి కమలాబాయి, వేశ్య జమ్మిగా సూర్యశ్రీ నటించారు. జమున, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకులు టి చలపతిరావు, మోహన్‌దాస్, ప్రజా నాట్య మండలికి చెందిన పెరుమాళ్లు, చదలవాడ కుటుంబరావు, మిక్కిలినేని, ఏపూరి రామకోటి, డ్యాన్స్ డైరెక్టర్ డి వేణుగోపాల్.. వీళ్లందరినీ తొలిసారిగా సినీరంగానికి పరచయం చేశారు. ఎందరినో నటులుగా తీర్చిదిద్దిన రాజారావును, ఎందరికో భవిష్యత్తు కల్పించిన ‘పుట్టిల్లు’ చిత్రాన్ని కళాకారులు మరవలేరు. అనుభవం లేని రాజారావు, దర్శకత్వ బాధ్యతను మరొక ప్రముఖుడికిస్తే రాణించేది. ఆయనే చేపట్టడంతో సినిమా ఫ్లాపైంది. ఎందరికో దారిచూపిన చిత్రమిది. నటుడిగా బొబ్బిలియుద్ధం, ఆరాధన చిత్రాల్లోనూ నటించారు. అనారోగ్యంతో బాధపడి రాజారావు 1963 సెప్టెంబర్ 8న కన్నుమూశారు. పుట్టిల్లు చిత్ర నిర్మాణకాలంలో తన భార్య, నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చారు అల్లు. తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలుపడ్డారు. మరోవైపు హోమియో ఉచిత వైద్య సేవలు అందించేవారు. ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా, మొక్కవోని ధైర్యంతో నిలదొక్కుకున్నారు. అల్లు నటించిన చిత్రాల్లో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయాబజార్, ముత్యాలముగ్గు, మనవూరి పాండవులు, అందాల రాముడు, శంకరాభరణం మొదలైనవి. అల్లు రామలింగయ్య సినిమాల్లో నటించడం ఆయన ఆరోగ్యరీత్యా ఇంట్లోవారికి ఇష్టం లేదు. కానీ సినిమాల్లో నటించడమే ఆయనకి టానిక్. చిత్రాల్లో నటించడమే ఆయన హుషారుకి కారణం. ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకూ నటించాలన్నదే ధ్యేయం. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ (అంజిగాడు) కాలం మొదలు ఈతరం హాస్య నటుల వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటుడు -అల్లు. హాస్య నటుడిగా, విలన్లకు అసిస్టెంట్‌గా హాస్యంతోపాటు విలనిజాన్ని ప్రదర్శించిన నటుడిగా చిత్ర విచిత్ర మేనరిజాలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోయారు. చిత్రరంగంలో ప్రవేశించిన తర్వాత ఆయనకి పోటీగా ఎవరో రావడం, వేషాలు తగ్గడంలాంటి కష్టాలు అల్లుకు తెలీవు. ఎందుకంటే అల్లు అంటే అంత గౌరవం, అభిమానం. ఆయన శైలిని ప్రదర్శించి మరెవ్వరైనా పాత్రలతో మెప్పించడం అసాధ్యం. నటీనటులకు హితుడు, సన్నిహితుడు అల్లు.
ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్‌లో పాల్గొన్న గొప్ప నటుడు అల్లు. ఆయన అభినయించిన చాలా పాటలకు బాలు గళం సరిగ్గా అమరిపోయింది. ‘ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా’ అనే పాట అప్పట్లో హిట్. అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌ని నెలకొల్పి బంట్రోతు భార్య, దేవుడే దిగివస్తే, బంగారు పతకం చిత్రాలను నిర్మించారు. చాలాకాలం తర్వాత అల్లు 1992లో ‘డబ్బు భలే జబ్బు’ చిత్రం తీశారు. అమ్యామ్యా, తీతా, అప్పుం- అప్పుం లాంటి పదాలు వినబడగానే గుర్తుకొస్తూ హాయిగా నవ్వుకునే రూపంతోపాటు వెండితెరపై అల్లుచేసిన చేష్టలు గుర్తొస్తాయి. తొలి దశలో మిగతా హాస్యనటులతో కలిసి, తర్వాత విడివిడిగా తన ప్రతాపం చూపారు. నవ్వులు పండించటంలో సోలో పాత్రలు కమెడియన్‌గా చేస్తూనే కామెడీ విలన్‌గానూ రాణించారు. కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు లేదా విలన్లకు అసిస్టెంట్‌గా వారి మెప్పుపొందే ప్రయత్నం చేస్తూ, వారికి గోతులు తవ్వే ప్రయత్నం చేస్తూ కూడా నవ్వించారు. ముళ్లపూడి, బాపుతోవున్న పరిచయం క్రమక్రమంగా పెరగడంతో, ఆ కాంబినేషన్లో గుర్తుండిపోయే పాత్రలు చాలా చేశారు. హాస్యానికి కొత్త సంగతులు అల్లారు. ముక్కుతో మాట్లాడటం ద్వారా కొన్ని పదాలను నొక్కినొక్కి పలకడం వలన కాళ్లు చేతులు ఆడించడంలో చేసే కొత్తకొత్త ప్రయోగాలద్వారా మంచి హాస్య నటుడిగా అల్లుకుపోయారు.
పురస్కారాలు, సన్మానాలు
యాభై యేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ, యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించిన అల్లును వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులు అసంఖ్యాకమైనవి. అలా గుర్తుండిపోయే నటన ప్రదర్శించినందుకే 1990లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మక అవార్డుగా భావించే రఘుపతి వెంకయ్య అవార్డు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2001లో స్వీకరించారు. అశేష ప్రజల అభిమానం ఆశీస్సులు ఆయన్ని అనారోగ్యంనుంచి కాపాడి పునర్జన్మనిచ్చాయి. ‘నేను మళ్లీ పుట్టాను’ ‘నేనిప్పుడు కుర్రాణ్నే’ అంటూ ఉత్సాహంగా వుండే అల్లు రామలింగయ్య ‘సహస్ర చిత్ర రామలింగడు’గా తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
1972లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించి సినీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. (ప్రస్తుతం ఈ బ్యానర్‌పై ఆయన కుమారుడు, నిర్మాత అల్లు అరవింద్ సినీ నిర్మాణం కొనసాగిస్తున్నారు). అర్థశతాబ్దానికి పైగా సాగించిన నట యాత్రలో ఆయన అందుకున్న అవార్డులు, రివార్డులు కోకొల్లలు. స్వర్గీయ రావుగోపాలరావు, నాగభూషణం, సూర్యకాంతం, రాజ్‌బాబు తదితర నటుల కాంబినేషన్‌లో ఆయన చేసిన చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే రమాప్రభతో జోడిగా నటించి ఆయన ఎంతగానో అలరించారు. పుట్టిల్లు చిత్రంతో సినీరంగం ప్రవేశం చేశారు. ఆ సినిమా మొదలు మరణించేవరకూ దాదాపు 1030 చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో రూపొందించిన ఎన్నో కళాఖండాలు, క్లాసిక్స్‌లో నటించడం ద్వారా ప్రేక్షకుల్లో ఎనలేని గుర్తింపు సంపాదించుకుని, హాస్య నటుడిగా అర్థ శతాబ్దంపాటు కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించటం అల్లుకే చెల్లింది. కామెడీ ఆర్టిస్టుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, సైడ్ విలన్‌గా, కామెడీ విలన్‌గా బాధ్యతగల తండ్రిగా పలురకాలైన పాత్రలను పోషించి తనకుతానే సాటి అనిపించుకున్నారు.
అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడటం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగడం, మనవడు అల్లు అర్జున్ హీరోగా మారటం ఆయన జీవితంలో సంతృప్తినిచ్చిన అంశాలు. అల్లు చివరిసారిగా నటించిన చిత్రం ‘జై’. విశాఖపట్టణంలోని రామకృష్ణా బీచ్‌లో ఆయన శిలా విగ్రహం, పాలకొల్లులో విగ్రహం నెలకొల్పారు. చిరంజీవిని రాజకీయాల్లోకి ప్రవేశించవద్దని పలుమార్లు సలహాలిచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 1922 అక్టోబర్ 1న జన్మించి మరణించే నాటికి తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్యది ప్రత్యేక స్థానం. అతను భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన హాస్యం చిరంజీవిగా మనల్ని అలరిస్తూనే ఉంటుంది.
సుమారు 1030 సినిమాల్లో కామెడీ, విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసారు. 1116 చిత్రాల్లో నటించాలనే ఆయన కోరిక తీరకముందే -అల్లు మనమధ్య నుంచి మాయమయ్యారు.

-కె శ్రీనివాసరావు