మెయన్ ఫీచర్

తడిసి మోపెడవుతున్న విదేశీయాత్రల ఖర్చులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వీలైనంత మేరకు విదేశీ పర్యటనలను తగ్గిస్తాను...’ అంటూ కొత్త సంవత్సరం కానుకగా మోదీ ప్రకటించడం హర్షించతగ్గ విషయమే! ప్రధానమంత్రి పదవి చేపట్టిన మోదీ అతి తక్కువ కాలంలోనే అత్యధికంగా విదేశీ పర్యటనలు చేసిన ప్రధానమంత్రిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఇంతే మోతాదులో ప్రతిపక్షాలనుంచి, స్వపక్షం నుంచి కూడా విమర్శల్ని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా డిసెంబర్ 25న కాబూల్ నుంచి తిరిగి వస్తూ లాహోర్‌లో షరీఫ్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, మనుమరాలు పెళ్ళికి హాజరుకావడం బిజెపి వర్గాలకే మింగుడుపడలేదు. వారంరోజులు గడవక ముందే పఠాన్‌కోట్ ఏర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి వీరి విమర్శలకు మరింతగా బలాన్ని చేకూర్చాయి.
2014లో ప్రధాని పదవిని చేపట్టిన వెంటనే భూటాన్, బ్రెజిల్, నేపాల్, జపాన్, అమెరికా, మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజి దేశాలను పర్యటించడమే కాకుండా, నేపాల్‌ను రెండో దఫా పర్యటించడం గమనించాలి. 2015లో 23 దేశాల్ని గత డిసెంబర్ 23నాటికి పర్యటించగా, ఇందులో కూడా ఫ్రాన్స్, రష్యా, సింగపూర్, అమెరికా దేశాల్ని రెండేసిసార్లు చుట్టి వచ్చారు. దేశాధినేత తిరుగుతేనే గదా పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా వచ్చేది అనే వాదన చేసేవారు వున్నారు. వీరి వాదన లాగానే మొదటి దశలో నెలానెలా విదేశీ మదుపరులు భారీగానే పెట్టుబడులు పెట్టారు. కాని, దేశ రాజకీయాల్లో అనుకున్న మార్పులు కనపడకపోవడం, మోదీ హవా బిహార్‌లో అంతగా లేకపోవడం, కేజ్రీవాల్‌తో సహా, స్వయాన బిజెపి ఎంపి కీర్తిఆజాద్ ఆర్థికశాఖామంత్రి అరుణ్‌జైట్లీపై అవినీతి ఆరోపణలు చేయడంతో 2015 జనవరి నుంచి విదేశీ పోర్ట్‌పోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) పెట్టుబడులను తగ్గిస్తూ వచ్చారు. జనవరిలో రూ.33,688 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా ఏప్రిల్ నాటికి రూ.15,333 కోట్లకు, జులై నాటికి రూ.5,323 కోట్లకు పెట్టుబడు పడిపోయాయ. ఇక మే, జూన్‌లలోనైతే వరుసగా రూ.14,272 కోట్లను, రూ.1,608 కోట్లు ఉపసంహరించడం జరిగింది. దీంతో కనీసం 8.3 శాతంకు పెరుగుతుందని భావించిన ఆర్థికాభివృద్ధి 7.3 శాతానికి మించలేదు.
ఈ విధంగా దేశ అంతర్గత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మోదీ విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలనే ఆలోచనకు కారణం కావచ్చు! మాజీ నావికాదళ అధికారి లోకేష్‌బత్రా జూన్ ’14 నుంచి జూన్’15 దాకా మోదీ పర్యటించిన 20 దేశాల వివరాలు తెలుపమని 4 నెలలపాటు 40సార్లు ఆర్జిపెట్టినా సంబంధిత మంత్రిత్వశాఖ గాని, ఆయా దేశాల రాయబార కార్యాలయాలు గాని స్పందించలేదు. గత సెప్టెంబర్‌లో ప్రజాసమాచార హక్కు జాతీయ కమీషన్ సహాయ కన్వీనర్ వెంకటేష్‌నాయక్ మోదీ జరుపుతున్న విదేశీ యానంపై 7 ప్రశ్నల్ని సంధించారు. ఈయనకు కూడా నేటికి సమాధానం రాలేదు. అలాగే గత మార్చిలో మోదీ పర్యటించిన ఆఫ్రికా ఖండంలోని షీషెల్స్, మారిషస్ పర్యటనలకు సంబంధించిన సమాచారం కావాలంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సలీంబేగ్ అనే కార్యకర్త కోరగా రూ.1.26 కోట్లు, రూ.1.37 కోట్లు ఖర్చుచేసామని మాత్రం చూపారు. ఇలా హక్కుల కార్యకర్తలు అడుగుతున్న వివరాలను 16 దేశాల రాయబార కార్యాలయాలు అసంపూర్తి లెక్కలు చూపగా, శ్రీలంక, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్ దేశాల కార్యాలయాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి.
ప్రధానమంత్రి వెబ్‌సైటు ప్రకారం 1999-2004 మధ్యకాలంలో మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహారి వాజ్‌పాయ్ పర్యటించిన 19 దేశాల విమానయాన ఖర్చులు, 2004-2014 మధ్యకాలంలో మరో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పర్యటించిన 73 దేశాలకు గాను వివరాలు తెలిపిన 68 దేశాల విమానయానం ఖర్చుల్నిచూస్తే నిజంగానే మన గుండె ఆగిపోవాల్సిందే! పైగా 2013 నుంచి ఈ వివరాలు కూడా మంత్రిత్వశాఖ పొందుపర్చడం లేదని హక్కుల కార్యకర్తలు వాపోతున్నారు. మోదీ భూటాన్ పర్యటనకై చార్టర్ ఫ్లైట్‌కు పెట్టిన ఖర్చు రూ.2,45,27,465 మాత్రమేనంటే, మన ప్రజాస్వామ్య రాజులు దేశశ్రేయస్సుకై ఎలా ఖర్చుచేస్తున్నారో తెలుస్తున్నది. ఈ విధంగా అటల్ హయాంలో రూ.79 కోట్ల 90లక్షలు, మన్మోహన్ కాలంలో రూ.106 కోట్ల 34 లక్షలు ఖర్చుచేశారు.
ప్రధానమంత్రుల ఖర్చులు ఈ విధంగా వుంటే కేంద్ర మంత్రుల, ఎంపీల విదేశీ పర్యటనల వివరాలు, ఖర్చులు తెలుసుకుంటే మనం ‘ఏ వ్యవస్థలో బతుకుతున్నామా?’అని అనిపిస్తుంది. ఇక సామంతులు కూడా కాని రాష్ట్రాల స్వతంత్ర ముఖ్యమంత్రుల ఖర్చులు కూడా ఈ మోస్తరులోనే వుంటాయి. వీరి మంత్రుల, ఎంపిల, ఎంఎల్‌ఎల తీరు ఇలాగే వుంటుంది. రాజకీయాల్లోకి రావడమంటేనే సుఖపడడం కదా? ఈ సుఖాల్ని కొలవడానికి మరో కొత్త కొలమానాన్ని కనుగొనాల్సిందే! బహుశ మెగాబైట్లు సరిపోతాయనుకుంటా?
వీరికితోడు కేంద్ర, రాష్ట్ర బ్యూరోక్రాట్లు, సిఇవోలు, పోలీసు బాసులు రకరకాల స్టడీ టూర్ల పేరున, సదస్సుల పేరున, శిక్షణ పేరున, పరిశీలన పేరున, చికిత్సల పేరున పర్యటిస్తూ చేసే ఖర్చులు నాయకుల్ని తలదనే్నలానే వుంటాయి. ఇలా వీరు చేసే ఖర్చులు కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌తో సమానంగా వుంటాయనడంలో అతిశయోక్తిలేదు. రాష్ట్ర విభజన జరగకముందు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన ఓ అధికారి తన సర్వీసు కాలంలో పై కారణాల పేరిట పర్యటించిన దేశాలు 90 మాత్రమే! ఇన్ని దేశాలు తిరిగి వచ్చిన ఈయన, రాష్ట్రానికి కాదు, ఒక్క మున్సిపాలిటీకి చేసిన మార్గదర్శకం ఏంటో తెలియదు. నిజానికి ఇలా పర్యటించిన అధికారులు గాని, ప్రజానాయకులుగాని చూపిన విషయాల్ని, పొందిన అనుభవాల్ని విజిట్ రిపోర్ట్‌గా రాసి సంబంధిత శాఖకు, ప్రభుత్వానికి సమర్పించి, చర్చించి, అవసరమైన విధంగా ఆచరించేలా చూడాలి. ఒక్కరంటే ఒక్కరు ఈవిధంగా పాటించింది లేదు. ఇదే పరిస్థితి రాజీవ్ విద్యా మిషన్‌లో కనిపిస్తుంది. అమెరికా లాంటి దేశాల్లో విద్యారంగ పరిస్థితుల్ని వీక్షించడానికని పెద్దవారిని కాకాలుపట్టి ప్రజాధనంతో కింది స్థాయి అధికారులు పర్యటించారు. పోనీ, వీరు అక్కడ చూసిన విద్యావిధానం గూర్చి, ఆచరించాల్సిన అంశాలగూర్చి ప్రభుత్వానికి ఓ సమగ్ర నివేదికను ఏమైనా ఇచ్చారంటే అదీలేదు. అమెరికాలో ప్రభుత్వ పాఠశాలలు ఉచ్ఛతస్థితిలో వుండడమే కాకుండా, నైబర్‌హుడ్, కామన్ స్కూలు విధానంతోపాటు, అయిదు సంవత్సరాలు నిండిన తర్వాతనే పాఠశాల నమోదు అనే విషయాన్ని ఇక్కడ ఆచరించేలా చూడకపోవడం శోచనీయం కాదా?
తెలంగాణా ఏర్పడిన తర్వాత కూడా దాదాపు(20) మంది రాష్టస్థ్రాయి బ్యూరోక్రాట్లు ఇలాంటి పర్యటనలే చేసారు. ఇక కెటిఆర్, జూపల్లి, పోచారం, నాయని, ఈటెల, జోగురామన్నలతో సహా మరో ఆరుగురు మంత్రులు, ఎంపిలు తరచు విదేశీ పర్యటనలు చేస్తున్నది పత్రికల్లో చూస్తూనే వున్నాం. ఇందులో కెటిఆర్ లాంటి వారైతే అనేకసార్లు వెళుతున్నారు. హైదరాబాద్ నగర కార్పొరేటర్లు ఇలాంటి స్టడీటూర్‌ల పేరున సిమ్లా, గ్యాంగ్‌టక్, డార్జిలింగ్, కాశ్మీర్ లాంటి పట్టణాలను సందర్శించి, అక్కడ పరిపాలనావిధానాల్ని చూడడానికి గత ఐదేళ్ల కాలంలో దాదాపు ఖర్చుచేసింది రూ.14 కోట్లు మాత్రమే! మరో విచిత్రమైన విషయమేమిటంటే, పాత బజాజ్ స్కూటర్ నిర్వహణకై రూ.1.24 లక్షల్ని, ఒక ఆటోరిక్షా నిర్వహణకై రూ.16 లక్షల్ని ఖర్చుచేశారంటే ప్రజలు చెల్లించే పన్నుల్ని జిహెచ్‌ఎంసి ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
ఇదే రాజకీయ నాయకులు, అధికారులు ప్రజలకు పొదుపుచేయాలని, త్యాగాలుచేయాలని, గ్యాస్ సబ్సిడీలను స్వచ్ఛందంగా వదులుకోవాలని సెలవిస్తూ వుంటారు. పైగా భార్యాభర్తలు, ఉద్యోగస్తులై ఒకే ప్రాంతంలో పనిచేస్తూకూడా ఇరువురు ఇంటి అద్దెను పొందుతూ వున్నా, ఏ అధికారికి ఈ విషయం పట్టదు. నాయకులు ఈవైపుగా ఆలోచించరు. నిజానికి ఇద్దరిలో ఒకరు ఇంటి అద్దెను వదులుకుంటే దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలు ఆదాఅవుతాయి. అలాగే ఆదాయపుపన్ను వివరాల్ని ఇద్దరు వేర్వేరుగా, ఇంటికి సంబంధించిన ఖర్చుల్ని చూపడం జరుగుతుంది. ఇలా ఓవైపు ప్రజాధనాన్ని దుర్వినియోగంచేస్తూనే, ప్రజాకర్షణ పథకాలను జనం దృష్టిలో పడేలా చేయడం, ప్రజల నెత్తిన రుద్దడం జరుగుతున్నది.
ఇలా పిల్లి, ఎలుక లాంటి బంధంతో కొనసాగుతున్న ప్రజాస్వామ్యంలో విదేశాల పర్యటన నాయకులకు, అధికారులకు ఓ సరదాగా మారింది. ప్రజలతో గాని, సమస్యలతోగాని, ప్రజా పోరాటాలతో గాని సంబంధం లేకుండా ‘ఓటు’అనే ఆయుధంతో గద్దెనెక్కి ఖజానాకు ఎసరుపెట్టడం మన నాయకులకు, అధికారులకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. తెలుసుకునే స్థితిలో మన జనంలేకపోవడమే, మనవారికి కలిసి వస్తున్నది.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162