మెయిన్ ఫీచర్
యదార్థ గాథల కథాశిల్పి గోరాశాస్ర్తి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గోరాశాస్ర్తి గా ప్రముఖులయిన గోవిందు రామశాస్ర్తీ (1917-1981) బతికి వుంటే ఇప్పటికి నూట రెండేళ్ళు. కానీ ఆయన తన 64వ ఏట దివంగతులయ్యారు. ఇంగ్లీషు, తెలుగు నుడికారాల మీద సమానమైన అధికారాన్ని సాధించిన ప్రజ్ఞాశీలి. నేటితరం, నిన్నటి తరం రచయితలెందరినో వెలుగులోకి తెచ్చిన స్మరణీయుడు.
గోరాశాస్ర్తి అనగానే తెలుగు స్వతంత్ర, ఆంధ్రభూమి పత్రికలు, ఆయన సంపాదకీయాలు, స్వతంత్ర పత్రికలోని ‘వినాయకుడి వీణ’ అన్న ప్రఖ్యాత కాలమ్ గుర్తొస్తాయి. కాగా ఆధునిక తెలుగు కథ, నాటక రచనా రంగంలో కూడా తనదైన ముద్ర వేసిన సిద్ధహస్తులు గోరా. తెలుగు రేడియో నాటికా రచనకు ఆద్యులు గోరా. ‘ఆశ ఖరీదు అణా’, ‘సెలవుల్లో’, ‘ఆనంద నిలయం’ చాలా గొప్పవి. 1937నుండే గోరా కలం పదును పాఠకులకు, శ్రోతలకు పరిచయం. ఆనాటి నుంచీ వివిధ పత్రికల్లో ప్రచురితమయినా లభించిన కథలు మాత్రం కొనే్న. వాటిలో కొన్ని ఆకాశవాణికోసం రాసినవి. ప్రసిద్ధ పత్రికా సంపాదకునిగా, సాహితీవేత్తగా, శ్రవ్య నాటికా కర్తగా, కథారచయితగా భాసించారు గోరా. రేడియోకి రాసిన కథల్లో ‘ఎదురీత’, ‘నైట్ డ్యూటీ’, ‘మామిడి తోపులో కోర్కెలు’, ‘పారిజాతం’, ‘మట్టికాళ్ళ దేవతలు’ ఎన్నదగినవి.
ఇవి ఆ తర్వాత ఆకాశవాణి సౌజన్యంతో తెలుగు స్వతంత్రలో ప్రచురించారు. ఒక ప్రవచన పరంపరలా సాగేకథ ‘ఎదురీత’. దీన్ని కథ అనే కంటే ‘రచన’ అనడం సబబు. ఉత్తమ పురుషలో నడిచే కథనం ఆదర్శవాదం గురించి వల్లెవేయిస్తుంది. హాస్యానందంతో మొదలై ఆలోచనాత్మకంగా ముగుస్తుంది. ప్రత్యేకించి పాత్రలుండవు. పురాణేతిహాసాల, చారిత్రక సామాజిక జీవన ప్రతినిధులైన వారి పేర్లను ఉదహరించి, తీసుకున్న వస్తువును స్థిరపరిచే కథన చమత్కృతి కనబడుతుంది. మనోవిశే్లషణాత్మక రచన. తెలుగు స్వతంత్రలో (10-6-1953)లో ప్రచురితమైన ‘ఎదురీత’ అంతకు కొన్ని నెలల ముందు రేడియోలో ప్రసారమైంది.
1956 మార్చి 30వ తేదీన స్వతంత్రలోని ఆకాశవాణి ప్రసారిత కథ ‘నైట్ డ్యూటీ’. కథంతా ఒక రాత్రి రైల్వే ప్లాట్‌ఫారం, వచ్చేపోయే రైళ్ళ నేపథ్యంలో టికెట్ కలెక్టర్ కమ్ క్లర్క్ కామేశ్వర్రావు స్వగతంగా నడుస్తుంది. పగలు డ్యూటీ, రాత్రి డ్యూటీల మధ్య తేడాని విపులీకరిస్తుంది అతని ఆలోచనల ‘గని’. అర్ధరాత్రి, అపరాత్రీ ప్రయణీకులకు టిక్కెట్లు అమ్మడం, రైలుదిగి ఊళ్ళోకి వెళ్ళేవాళ్ళ దగ్గర టిక్కెట్లు వసూలుచేయడం ఏనాడూ తప్పించుకోలేని డ్యూటీ. తప్పనిసరిగా రాత్రివేళ పనిచేసే రైల్వేలు, ఆసుపత్రులు, కర్మాగారాలు, పత్రికాఫీసులు అన్నీ ‘నిద్రపట్టని మన నాగరికతకి కురుపుల్లాంటివి’ అంటాడు. రోజూ అదే రాత్రి బండిలో వచ్చే అమ్మాయి ‘టిక్కెట్టు పారేసుకున్నానండీ’ అంటుంది వగలుపోతూ. ‘సరేలే చిట్టితల్లీ శలవుతీసుకో! అంతకంటే ఏం చేయగలం’ కాళరాత్రి కుచముల్ గగుర్పొడిచి మహాదేవా! నిశామారుతమ్ములు వీచే ‘తృతీయ యామంలో రుూ సమస్త సృష్టిమీదా ఎందుకో జాలి కలుగుతుంది, ఒక్కసారిగా అందర్నీ క్షమించేయాలనిపిస్తుంది! అనుకుంటాడు. అదే తత్వచింతనతో చేతనం, అచేతనం ఒకటేననిపించే గీతాకారుడి శ్లోకం ‘లోకం మేలుకున్నప్పుడు యోగి నిద్రపోతాడనీ, లోకం నిద్రపోయినప్పుడు యోగి మేలుకుంటాడనీ జ్ఞాపకం చేసుకుని ‘‘నేను కూడా నైట్ డ్యూటీలో ఉన్న యోగినే అనుకుని తృప్తిపడతాను’ అన్న వాక్యంతో కథ ముగుస్తుంది. కథనంలో భాగంగా మధ్యమధ్య ఉదహరించే సంభాషణలు ఆ పాత్రల సహజరీతి రివాజులకు అద్దం పడతాయి. ప్రేమపెళ్లి, పల్లె-పట్నం, యువజంట మనోభావాల త్రివేణీ సంగమం ‘మామిడి తోపులో కోర్కెలు’ కథ. శీర్షిక రొమాంటిక్‌గా వేరే అర్థం స్ఫురించేలావున్నా ఆ రొమాంటిసిజం పల్లె, పట్నం మధ్య వ్యత్యాసాల పట్ల మనిషికుండే మక్కువను సూచిస్తుంది. కేవలం సుందరి, వెంకటేశ్వర్లు మధ్యే కథ నడుస్తుంది. అతనికున్న పల్లె ప్రేమ, ఆమెకున్న పట్నం మోజుని, చివరికి సుందరి మనసు మార్చుకున్న విధానానికి నేపథ్యంగా గొప్ప వాతావరణాన్ని కల్పించారు రచయిత. మోతాదు మించని సంభాషణలు మురిపిస్తాయి. ఉద్యోగ బదిలీలవల్ల ఎక్కడా వేళ్ళూనుకోక పల్లెనించి వెళ్ళి పట్నాలు తిరిగే వాళ్ళు స్వదేశంలోనే కాందిశీకులు. సెంటు భూమి, గజం ఇల్లు పల్లెలో లేని నిష్పూచీ పట్నవాసం. పండినా పండకపోయినా పొలం, కాసినా కాయకపోయినా మామిడి తోట, ‘మనవి’ అనుకునే సుందరీ వెంకటేశ్వర్ల రాగద్వేషాలు, మమతానురాగాల మధ్య పల్లెటూరి ఘనతను చాటిన మనోవిశే్లషణాత్మక కథనం పఠనాసక్తిని పెంచుతుంది. ‘ఎక్కడికెళ్ళినా మనని మనమే మోసుకెళ్ళడం, మనిషివలెనే భూమిని కూడా లాలించి, ప్రేమించాలి. ఏ జీవిత కథా అంతంకాదు. కథలోంచి మరో కథ ‘జనిస్తుంది’ అని చెబుతుందీ కథ.
‘వివిధ వాసనలు, శబ్దాలూ మన మనస్సులమీద వింతగా పనిచేస్తాయి. ఉల్లాసం, విషాదం, ఏదో అశాంతి, గడచిపోయిన జీవితం స్ఫురణకి రావడం, ఈ విధమైన భావాలకి శబ్దాలూ, వాసనలూ ఉద్దీపన కలిగిస్తాయని’ శాస్తజ్ఞ్రులు అంటారు. అని గుర్తుచేసుకుంటాడు కథానాయకుడు. ఉత్తమ పురుషలో సాగే కథనం మనిషి మనోభావాల్ని సన్నిహితంగా అందిస్తుంది.
మిట్టమధ్యాహ్నం ఒంటి గంట దాటుతున్నవేళ తీక్షణమైన ఎండలో ఆకాశాన్ని కప్పేయడానికి ప్రయత్నించే ఎత్తయిన భవనాలతో నిండిన మహానగరంలో కోయిల కూసింది. ఇంద్రధనుస్సు రంగులతో మోటార్లూ, సరభ సగమనంతో మనుషులూ తిరుగాడుతున్న రోడ్లమీద కోలాహలం మధ్య ఉన్నట్టుండి కోయిల కూత.
ఆ కూత వినగానే శబ్దాల ప్రభావం గురించి శాస్తజ్ఞ్రులు చెప్పినట్లు ‘గడచిపోయిన గత అనుభూతి తాలూకు వివిధ అనుభవాలు స్ఫురణకు వచ్చి ఏదో వేదన కలుగుతుంది’ కథానాయకుడికి. ఒక రైలు ప్రయాణం, ప్లాట్‌ఫారం మీద చెట్లలో ప్రయాణీకుల గోలని మించి కూసే కోయిలల గుంపు, నాగరిక ప్రపంచంలో తీరికలేని జీవిత వేగంలో మనసుమీద ప్రభావం చూపే ప్రకృతి సహజాతత్వాన్ని పరిచయం చేస్తుంది ‘పారిజాతం’ కథా ప్రసూన పరిమళం.
‘మట్టికాళ్ళ దేవతలు’ ఒక నైరూప్య చిత్రం లాంటి కథ. కథలోని తొమ్మండుగురిలోను మూడు జంటల్ని తీసేస్తే మిగిలినవాళ్ళు వసంత్, నిర్మల, వాసుదేవరావు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. కథనం వసంత్ మనోగతం. మనశ్శాంతికోసం అనే్వషణ. ఆర్థిక ఇబ్బందులు. ఇష్టపడిన మగువ గుండెమీద చేసిన గాయం తాలూకు సలుపు. చిన్నప్పటినుంచీ అలవాటైన పని కష్టాల్ని మోయడమే నిత్యజీవితం. ‘కళ్ళకి కనబడే నక్షత్రాల్లాగే స్ర్తిలు కూడా ఎన్నో నిజజశ్రీడన్జిడ కల్పిస్తారు. తన (వసంత్) మనస్సులో ఆలోచనలకీ, ఈ స్ర్తిజాతికీ, నింగిని వేలాడే శత సహస్ర నక్షత్రాలకీ ఎక్కడో ఏ లోకాల్లోనో సంబంధం వుంటుంది కాబోలు!’ అనుకునే వసంత్ పాత్ర చింతన, చిత్రణ. ‘‘ప్రతి విషాద సంఘటన నన్ను జీవితంలో ఓ మెట్టు పైకెక్కిస్తుంది. ఆప్తులు హృదయంలో పొడిచిన ప్రతి పోటూ నా హృదయాన్ని గట్టిపరుస్తుంది’ అన్న వసంత్ భావనలు ఓ పక్క ‘హృదయాలు, ఆలోచనలు, ఆశయాలూ నక్షత్ర లోకం దాటి, స్వర్గద్వారాలు దాటి, ఏవో నిరవధిక స్వప్న భూముల్లో సంచారం చేస్తాయన్న ఆశావహతను, ఇంకోపక్క కాళ్ళు బురదలో ఉన్నప్పుడు హృదయం ఆకాశంలో ఉండడం బుద్ధిహీనం అనే హెచ్చరికను జారీచేయడం గమనార్హం. ఈ కథ 2006 ఆగస్టులో ‘పత్రిక’ అనే మహాపత్రికలో పునర్ముద్రించబడింది. ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక (27-10-1950)లో వచ్చిన కథ మంచు తెరలు. భార్యాభర్తలైన రెండు జంటల కథనం. రాధ, విశ్వనాథం ఒక జంట. వీళ్లకి ఉయ్యాల్లో పడుకునే పసిపిల్లాడు. శారద, సుందరం మరో జంట. పక్కపక్క ఇళ్లల్లో నివాసం. ఇంట్లో షడ్రసోపేతమైన భోజనం వున్నా బైట చిరుతిళ్ళకు మోహపడే మగబుద్ధిని ఎండగట్టారు రచయిత గోరా ఈ కథలో. అలాగే స్ర్తి పురుష సమానత్వం కోణంలో భార్యాభర్తలు ఇంటి పని పంచుకోవాలన్న సంగతిని స్పష్టంగా రాశారు రాధ, విశ్వనాథం సంభాషణల్లో.
సినిమా పత్రికల్లో తారల అంద చందాలను పరికిస్తూ, వంటింటి పని ముగించి మంచంమీదకి రాబోయే భార్యకోసం ఎదురుచూసే విశ్వనాథం, నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడ్చే ఉయ్యాల్లో పిల్లాణ్ణి సముదాయించాలనుకోడు. వాగ్వివాదంలో పనిలో సమానత్వం గురించి చురుకలంటించి, ‘నీలంరాయి ఉంగరం’తో నోరుమూయిస్తుంది రాధ.
పక్కింటి స్నేహితురాలనబడే శారద ‘ఈ మగాళ్ళకు మెళ్ళో కళ్ళాలు తగిలించి నడుపుతూ వుంటేనే? లేకపోతే ముళ్ళ కంచెల్లోకిపోతారు. నా అదృష్టం యేమిటోగాని మావారలాంటివారు కారుసుమా! పైగా నేనంటే ఒళ్ళూ పరుూ మర్చిపోతారు కూడా’ అని గర్వంగా తన అందానికి అహం జోడించి చెప్పింది విని ఒక ఉత్తరం, బంగారు లాకెట్ చూపించి నోరు మూయిస్తుంది రాధ. ఇంతకీ జరిగిందేమిటంటే.. తన వేలి బంగారు ఉంగరం మార్చి నీలంరంగు రాయి వేయించిన కొత్త ఉంగరం శారదకి ప్రేమ కానుకగా ఇస్తాడు విశ్వనాథం. కావాలని కవ్వించిన రాధకోసం బంగారు లాకెట్ కొని, ప్రేమ లేఖతో సహా అందిస్తాడు సుందరం. ఈ ప్రళయాంతక బుద్ధుల్ని కనిపెట్టి, గడ్డిపెట్టేలా రాధచేయడంవల్ల అందరి మనసుల్లోని ‘మంచు తెరలు’ కరిగిపోతాయి. ఎదురింటివారి రేడియోలోంచి ‘‘రాధకెందుకు నవ్వు చెల్లెలా?’’ అన్న కృష్ణశాస్ర్తి గేయం వినబడుతూంది’’ అన్న వాక్యంతో కథ ముగుస్తుంది.
నాటిక లక్షణాలతో రాసిన కథ ‘చదువుల రాణి’- (తెలుగు స్వతంత్ర- జూన్-17-1955). ఒక కాలేజీ విద్యార్థిని స్వగత చిత్రీకరణ ప్రయత్నం ఇది. కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో ఏకపాత్రాభినయం కోసమే ఈ రచన ప్రధానోద్దేశం అన్న మాట ఉపోద్ఘాతంగా చెప్పాడు కథకుడు. చక్కని చిక్కని హాస్యం మేళవించి, నాటకీయత జోడించి, శ్యామసుందరి, నారాయణరావుల ప్రేమ సంభాషణా చమత్కృతితో ఆహ్లాదపరుస్తూ తల్లిదండ్రులకు చదువుకునే ఆడపిల్లల మీద ఉండాల్సిన నమ్మకాన్ని గురించి సుతిమెత్తగా వర్ణించిన కథనం ఎంతో ఆకట్టుకుంటుంది. ‘చివరిదాకా చదివి రుూ కథలోని సాంఘిక ప్రయోజనం ఏమిటా? అని ప్రశ్నిస్తే నేనేమీ చెప్పలేను’ అంటూ మొదలౌతుంది ‘మాణిక్యవీణ’ (1954 మే 7వ తేదీ- తెలుగు స్వతంత్ర) కథ. సంగీతంలోని రాగతాళాలను వ్యక్తి ఆలోచనలకు అనుగుణంగా మలచి రాసిన కథ. కథానాయకి ఆనందలక్ష్మి, మహావైణికుడైన తండ్రే గురువు. సంస్థానం జమీందారు రెండవ భార్యకు పుట్టిన నాలుగో ఆడపిల్ల ఆనందలక్ష్మి. ఆడ పిల్లల్నే కనడం నేరంగా భావించే జమీందారుకి మగపిల్లాడు పుట్టిపోయాడని చెప్పి, పుట్టిన పిల్లను ఆస్థాన వైణికుడిగా అచ్చంగా ఇచ్చేస్తారు. రాణిగారు ఇస్తానన్న డబ్బు వద్దన్నాడు. పిల్లను నేనే పెంచుకుంటానన్నాడు పేదరికంలో వున్న మానధనుడు. కష్టంమీద ఆవిడిచ్చిన బంగారువీణ తీసుకున్నాడు. ఆనంద భర్త డబ్బున్న అనుమాన పిశాచి. వీణ గురించి ఎక్కడిది? బీదవాళ్ళకెలా వచ్చింది? అంటూ ఆనంద ఎవరితో మాట్లాడకుండా ఆంక్షలు. ఫలితం ఆయనకి మనోవేదన, ఆవిడకి నిర్వేదం.... తన వీణాగానాన్ని దేవగానంగా ఆరాధించిన రచయితతో ‘‘నా జీవితం నువ్వూహించిన సుందర స్వప్నం కాదు. దుఃఖ కళికల సంచయనం. మధురాతి మధురంగా నువ్వు పరిగ్రహించిన నా వీణాగానం నా వౌన వేదనలు విశ్వదుఃఖంతో కలిసి శ్రుతి’’. అంటుంది. ‘‘లోకానికి వినిపించే కథలు విషయంలో జాగ్రత్తగా వుండు. నీ పాత్రల హృదయాల్ని గాయపరచకు. ఏదో ఆదర్శాన్ని సృష్టించాలని ప్రయత్నించకు’’ అని హితవు పలుకుతుంది. ఆధునిక తెలుగు కథాసాహిత్యంలో నిలిచి వెలిగే కథలోని ఆనందలక్ష్మి ఆనాటికీ ఈనాటికీ ప్రతిభావంతురాలైన పరాజిత స్ర్తికి ప్రతీక. విప్లవ నినాదాల నేపథ్య జీవితాలమీద వ్యంగ్యాస్త్రం ‘గాడిద పిల్ల కోమలం’ (జూన్ 11-1954- తెలుగు స్వతంత్ర) గల్పిక లాంటి మినీ కథ. గాడిద పిల్ల ‘కోమలం’ అని పేరుపెట్టి వాటినే పాత్రలుగా చేసి నడిపిన కథాకథనం అప్పటికి ఎంతో వినూత్నం.
‘స్వర్ణయుగం’ పెద్ద కథ. దీపావళి ప్రత్యేక సంచిక జ్యోతిలో ప్రచురితం. కథాకాలం 1947నాటిది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చదివితే తప్ప నేటి ప్రొహిబిషన్ కాలంలో తికమకలు పడతారని చెప్తారు రచయిత కథా ప్రారంభంలో. నాటకీయంగా కథలో ముఖ్యపాత్రలు సముద్ర తీరం, కొబ్బరి తోట, వరి పొలం- తదితర పాత్రలు. ఒక రైతు, అతడి అనుచర వర్గం, న్యాయాధికారి, మాధవి అనే కాలేజీ అమ్మాయి, ఒక కార్మిక వర్గపు నాయకుడు చంటి, ఇంకా కొందరు అని పరిచయం చేస్తాడు కథకుడు. నవలకి సరిపోయే వస్తువుగనుక నవలికంత కథ అయింది. తొలిరోజుల్లో పాఠకుల, విమర్శకుల మెప్పుపొందిన కథ ‘హూపీ’. ఒక ఆంగ్ల దొర, ఆయన కుక్కపిల్ల చుట్టూ కథ నడుస్తుంది. జీవితంలో అన్నీ పోగొట్టుకుని, చివరికి కుక్క కూడా చనిపోతే ఆ అభాగ్యుని వేదన వర్ణనాతీతం. కుక్కకి సమాధికట్టి రాత్రిళ్ళు అక్కడే గడుపుతాడు. ఆర్ద్రత నిండిన కథ. గోరాశాస్ర్తీ జర్నలిస్ట్ కాకముందు రైల్వే, నేవీ ఉద్యోగి. తన రైల్వే అనుభవాలను చాలా తెలుగు కథల్లో, రేడియో నాటికల్లో, ‘బాస్కెట్ ఆఫ్ ఆరంజెస్’ అనే ఆంగ్ల కథానికలో కథావస్తువులుగా, నేపథ్యాలుగా, పాత్రలుగా, వాతావరణంగా స్వీకరించి యదార్థ గాథలనిపించేలా రాశారు. తానెరిగిన మధ్యతరగతి జీవితాల్లోని ఘర్షణల్ని కథల్లో ఇతర రచనా ప్రక్రియల్లో చొప్పించారు. దిగువ మధ్యతరగతినుండి వచ్చిన గోరా దాన్నీ గ్లోరిఫై చేశారు. సజీవ వ్యక్తులు, సహజ సంఘటనలే గోరాశాస్ర్తి కథారచనకు ప్రాతిపదికలు.
- కే.బీ.లక్ష్మి
*
(పాత్రికేయురాలు, రచయిత్రి, విమర్శకురాలు కే.బీ.లక్ష్మి
చిట్టచివరి పరిశోధనాత్మక వ్యాసం ఇది. ఆమె మరణానికి
కొద్ది రోజుల ముందు హైదరాబాద్‌లో జరిగిన గోరాశాస్ర్తి
శతజయంతి సదస్సులో ఈ వ్యాసాన్ని సమర్పించారు.)
*
చిత్రం... హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన గోరాశాస్ర్తి శతజయంతి సదస్సులో రచయిత, విమర్శకురాలు కే.బీ.లక్ష్మికి జ్ఞాపికను బహూకరిస్తున్న సీనియర్ పాత్రికేయుడు వరదాచారి