మెయన్ ఫీచర్

లైంగిక నేరాలకు ఇక ముకుతాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాచార హక్కు చట్టానికి సవరణల రూపంలో తూట్లుపొడిచిన కేంద్రం అదే సమయంలో మరో కఠిన చట్టాన్ని తీసుకువచ్చి ‘శభాష్’ అనిపించుకుంది. ఏదైనా చట్టం చేసినపుడు విపక్షాల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యక్తం కావడం సహజం. కానీ కేంద్రం ‘పోక్సో’ చట్టానికి సవరణలు చేసినపుడు ఒకరిద్దరు మినహా మిగిలిన సభ్యులంతా ఆమోదం తెలపడం చూ స్తుంటే- ఆ చట్టంలో సవరణల అవసరాన్నీ ఆవశ్యకతనూ తెలుపుతూనే ఉంది. నేరాలు జరిగేది చట్టం లేకపోవడం వల్లనో, కఠినంగా లేకపోవడం వల్లనో కాదు. చట్టం పట్ల లెక్కలేనితనం ఎలా ఉంటుందో ట్రాఫిక్ ఉల్లంఘనలు చూస్తే అర్థమవుతుంది. డబ్బు, పలుకుబడి ఉంటే సులభంగా తప్పించుకోవచ్చనే భావనే నేరాలను పెంచుతోంది. నేరం జరిగిన వెంటనే నేరగాళ్లను పట్టుకుని, తగిన సాక్ష్యాలను సేకరించి సాధ్యమైనంత త్వరగా శిక్ష పడగలిగేలా చేస్తే నేరగాళ్ల వెన్నులో చలిపుడుతుంది. నేరాలు చేసేందుకు భయపడతారు. నేరస్థులకు రాజకీయ మద్దతు ఉంటే బాధితులే భయపడే పరిస్థితి వస్తుంది.
బహిరంగ ధూమపానం నేరమని అందరికీ తెలిసినా, బహిరంగంగా పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు ఆగలేదు. మత్తు పదార్థాల రవాణా, స్ర్తిలపై లైంగిక దాడులు, హింస, దొంగతనాలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, హత్యలు.. ఇలా ప్రతి నేరానికీ కఠిన చట్టాలున్నా అఘాయిత్యాలు, అరాచకాలు తగ్గలేదు. చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడిన వారి సంఖ్య 6.20 లక్షల మంది అంటే ఎవరికైనా మనస్సు చివుక్కు మనిపించక తప్పదు. కేంద్ర శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ ఈ విషయాన్ని లోక్‌సభలో చెప్పడమే కాదు, నిందితుల సమాచారాన్ని సేకరించామని వివరించారు.
బాలలపై లైంగిక నేరాలు పెరిగిపోవడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. కేసుల పరిష్కారానికి ఎదురవుతున్న అవరోధాలను తొలగించే దిశగా కేంద్రానికి, రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసింది. బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం కింద వందకు మించి కేసులు నమోదైన చోట- ప్రతి జిల్లాలో కేంద్రప్రభుత్వ నిధులతోనే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది. 60 రోజుల్లోనే కొత్త కోర్టులు ఏర్పాటు కావాలని సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధబోస్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది. వీటికి అవసరమైన నిధులు, వౌలిక వసతులను సమకూర్చడమే కాదు, ప్రిసైడింగ్ అధికారి నియామకం, ఇతర ఉద్యోగులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నియమాక బాధ్యత కూడా చూడాలని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కులను గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1992 డిసెంబర్ 11న ఒక ప్రకటన చేసింది.
మన రాజ్యాంగంలోని అధికరణం 15(3) కింద బాల బాలికలు, స్ర్తిల సమానత్వపు హక్కులను నిర్వచించింది. ఈ అధికరణం కింద స్ర్తిలు, పిల్లలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వం రూపొందించుకోవచ్చు. తద్వారా లైంగిక అత్యాచారాల నేరాల నుండి బాలలకు రక్షణ -2012 కల్పించే చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టంలో 9 చాప్టర్ల కింద 46 సెక్షన్లను రూపొందించారు. తాజాగా ‘పోక్సో’ సవరణ చట్టానికి పార్లమెంటులోని ఉభయ సభలూ ఆమోద ముద్ర వేశాయి. రాష్టప్రతి ఆమోదించిన మరుక్షణం అది అమలులోకి వస్తుంది. తాజా సవరణల్లో సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం పరిగణనలోకి తీసుకున్నారు. ‘పోక్సో’ కేసుల్లో సా క్ష్యం ఇచ్చేందుకు ప్రత్యేక గదులు వంటి వసతులను సంబంధిత కోర్టుల్లో సమకూర్చాలి. బాధిత బాలలకు అ నుకూల వాతావరణం కల్పించాలి. బాలలపై అఘాయిత్యాలను నిరోధించేలా ప్రాసిక్యూషన్ తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా సినిమాహాళ్లు, టీవీ ఛానళ్లలో ప్రత్యేక కార్యక్రమాలను ప్రదర్శించాలని సుప్రీం సూచించింది. చైల్డ్ హెల్ప్‌లైన్‌ను అన్ని స్కూళ్లలో బహిరంగంగా ప్రదర్శించాలని, పోక్సో కేసుల్లో త్వరితగతిన ఫోరెన్సిక్ నివేదికలను ఇవ్వాలని, డిఎన్‌ఏ పరీక్షలకు సౌకర్యం లేని రాష్ట్రాల్లోని శాంపిళ్లను ఇతర ప్రాంతాలకు పంపించాలని పేర్కొంది. లైంగిక నేరగాళ్ల నుండి పిల్లలను కాపాడేందుకు 2012లో తీసుకువచ్చిన ‘పిల్లలపై లైంగిక నేరాల రక్షణ చట్టం (పోక్సో)లో మరిన్ని కఠినతర నిబంధనలను జోడించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్లో తీసుకురావడం బాలల హక్కుల ఉద్యమకారులకు ఊరట కలిగించింది.
ఇంతకాలం పిల్లలపై లైంగికదాడులు ఇరుగుపొరుగువారు చేస్తే ఇటీవల కుటుంబ సభ్యులు సైతం అత్యాచారాలకు పాల్పడటం మామూలైపోయింది. రెండు రోజుల క్రితం సొంత తండ్రి కుమార్తెపై లైంగికదాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. కొన్ని నేరాలైతే అస్సలు ఊహకు కూడా అందడం లేదు. తల్లిదండ్రులు లేని సమయంలో సొంత కుటుంబంలోని వారే బాలికలపై దాడులకు పాల్పడుతున్న దుర్ఘటనలు పెరిగాయి. ఇలాంటి వివరాలు విన్నప్పుడు అసలు వీళ్లు మనుషులేనా? అనే సం దేహం సహజంగానే మెదులుతోంది. గతంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరిగేవి, కానీ వెలుగు చూసేవి కావు. కాని నేడు ప్రజా చైతన్యం, మీడియా విస్తృతి పెరిగి వెంటనే కేసుల వరకూ, జైలు శిక్షల వరకూ వెళ్తున్నాయి. ఇలాంటి సంఘటనలు వెలుగుచూడకుండా నిందితులు రాజీ మార్గం అనుసరిస్తున్నారు. జమ్మూలోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై సాగిన అకృత్యం విన్న వారు దిగ్భ్రమకు గురయ్యారు. సంచార జాతికి చెందిన వారు భయభ్రాంతులకు గురిచేసి, వారిని వెళ్లగొట్టే ఉద్దేశంతో బాలికను అపహరించి, హింసించడంతో పాటు డ్ర గ్స్‌ను ప్రయోగించారు. సా మూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యయుగం నాటి ఆటవిక సంస్కృతి ఒక్క పక్క, ఆధునికత తెస్తున్న విశృంఖల త్వం మరోపక్క పెరగడంతో ఈ తరహా నేరాలు పెరుగుతున్నాయి. 2012లోనే ఇలాంటి నేరాలను అరికట్టేందుకు గట్టి చట్టానే్న తీసుకువచ్చినా కథువా లాంటి సంఘటనలను నిరోధించలేకపోయాయి.
బాల్యంపై సాగే నేరాల ప్రభావం ఎంతగా ఉంటుందో పూలన్‌దేవి లాంటి వ్యక్తులు రుజువు చేశారు. అందరిలా సాధారణ జీవనం సాగించలేక, సమాజం వేసే ప్రశ్నలకు బదులివ్వలేక సూటి పోటి మాటలను తట్టుకోలేక జీవచ్ఛవాలుగా మారి జీవించడమే సవాలుగా మారిపోతుంది. కఠిన చట్టాలను చేస్తే ఇలాంటి అకృత్యాలకు పాల్పడేవారికి భయం కలుగుతుందనే భావంతో చట్ట సవరణలను సమర్ధించడమేకాదు, మరణ శిక్ష విధించడానికి కూడా ఎంపీలు ఆమోదం తెలపడం చూస్తే పరిస్థితి తీవ్రత ఇట్టే అర్థం అవుతుంది. కొత్త చట్టంలో అనేక కఠిన శిక్షలను చేర్చారు. బాలలపై తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణ శిక్ష విధించాలని ప్రతిపాదించారు. పసిపిల్లలతో నీలిచిత్రాలు తీసేవారికి, వాటిని వ్యాప్తి చేసే వారికి విధించే జైలు శిక్ష, జరిమానాలను కూడా భారీగా పెంచారు. ఈ చట్టం అమలులోకి వచ్చిననాటి నుండి నేరగాళ్లకు 20 ఏళ్ల కఠిన శిక్ష మొదలు మరణించే వరకూ జైలులో ఉండేలా జీవిత ఖైదు విధించడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది.
నిజానికి ఇంతకాలం పోక్సో చట్టం కింద శిక్షలు పడింది కేవలం 9 శాతం కేసుల్లో మాత్రమే. ఒక్కో కేసు పరిష్కారానికి పడుతున్న కాలం చూస్తుంటే బాలికలు వృద్ధులుగా మారాల్సిందే. అత్యాచార బాధితుల్లో కేవలం 15 శాతం మందికి మాత్రమే నష్టపరిహారం అందింది. 40 శాతం మందికి చట్టం సాయం కూడా అందడం లేదు. మూడేళ్ల క్రితం పోక్సో చట్టం కింద 36,022 కేసులు నమోదైతే, 12వేల కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ ఏడాది వరకూ కొత్తగా నమోదైన వాటితో కలిపి 33 వేల కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. పోక్సో చట్టం రాకపూర్వం దేశవ్యాప్తంగా దాదాపు 70వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే ఈ చట్టం కింద పరిష్కరించాల్సినవి లక్షకు పైగానే.
మరణశిక్ష వంటి మరీ కఠినమైన శిక్షల వల్ల ఎంత లా భమో, అంత నష్టం కూడా జరుగుతుంది. కుటుంబ సభ్యులే అత్యాచారాలకు పాల్పడినపుడు మరణశిక్ష పడుతుందనే భయంతో అస్సలు ఫిర్యాదు కూడా చేయని సంఘటనలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 1023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు నెలకోల్పేందుకు కొత్త బిల్లు అవకాశం కల్పిస్తోంది. తెలంగాణలో 27 జిల్లాల్లో ఫోక్సో కోర్టులు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెంలో 465, హైదరాబాద్‌లో 390, మహబూబాబాద్‌లో 129, సిద్దిపేటలో 130, నల్గొండలో 263, మంచిర్యాలలో 184, కరీంనగర్‌లో 168, యాదాద్రి జిల్లాలో 132, జగిత్యాలలో 121, రంగారెడ్డిలో 100 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూస్తే చిత్తూరులో 190, కర్నూలులో 163, తూర్పుగోదావరి 129, గుంటూరులో 108 కేసులు నమోదయ్యాయి. విజయనగరం 14, శ్రీకాకుళం 20, నెల్లూరు 45, ప్రకాశం 46 కేసులు రిజిస్టరయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో పోక్సో చట్టం కింద కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి పరిష్కారం ఒక ఎత్తయితే మున్ముందు ఇలాంటి కేసులు నమోదు కాకుండా సమాజాన్ని చైతన్యపరచడం మరో ఎత్తు. ఇందుకు మానవీయ సంస్థలు ముందుకు రావాలి. కేవలం చట్టాలతోనే మార్పు రావాలన్న భావనను అధిగమించాలి, వైజ్ఞానిక సమాజంలో అకృత్యాలకు ముగింపు పలకాలి.

-బీవీ ప్రసాద్ 98499 98090