మెయన్ ఫీచర్

ప్రాంతీయ గళాల్లో జాతీయతా రాగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశచరిత్రలో మూడు సంఘటనలు ప్రధానమైనవి. ఒకటి స్వాతంత్య్రం వచ్చిన రోజు- 1947 ఆగస్టు 15. రెండవది 1950 జనవరి 26- గణతంత్ర దినోత్సవం. మూడవది 2019 ఆగస్టు 5వ తేదీ- జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణం రద్దయిన రోజు. కశ్మీర్‌కు ‘ప్రత్యేక ప్రతిపత్తి’ని కల్పించే ఈ అధికరణం దేశం 72 ఏళ్ల పాటు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. కొన్నివేల మంది సైనికులు, ప్రజల ప్రాణాలు దాయాది దేశంతో జరిగిన యుద్ధంలోను, పాక్ ప్రేరిత ఉగ్రవాదుల దాడిలో హతమయ్యారు. 370వ అధికరణాన్ని రద్దు చేసి, ఏడు దశాబ్దాల నాటి చారిత్రక తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సరిదిద్దింది.
దేశానికి స్వాతంత్య్రం తెచ్చి, పాకిస్తాన్‌పై మూడుసార్లు యుద్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ అంశంపై జాతీయ కోణంలో తన వాదన వినిపించడంలో విఫలమైంది. ఆ పార్టీ ఎంపీల వాదనలు చాలా పేలవంగా సాగాయి. రాజ్యసభలో గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో రంజన్ చౌదరి, మనీష్ తివారీ కాశ్మీర్ అంశంపై చక్కగా మాట్లాడగలిగిన వారే. కాని రంజన్ చౌదరి మాట్లాడిన తీరు భారతీయుల, మన జవాన్ల మనోభావాలను దారుణంగా దెబ్బతీసింది. ఎంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తప్పుదోవ పట్టింది. దేశ విభజన తర్వాత కాంగ్రెస్ పాలనలోనే పాకిస్తాన్‌తో మూడు యుద్ధాలు జరిగాయి. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేసిన ఘనత ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీదే. ఆమెను అప్పటి భారతీయ జన్‌సంఘ్ పార్టీ అగ్రనేత వాజపేయి ‘అపర దుర్గ’ అని అభివర్ణించారు. 1965 యుద్ధంలో అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ ఆదేశాలతో భారత్ సేనలు లాహోర్ సరిహద్దుల వరకు వెళ్లాయి. ఇదంతా చరిత్ర. కాని కాంగ్రెస్ పార్టీలో ఈ విషయాలన్నీ మాట్లాడేందుకు సరైన నేతలు లేరు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ నేతలు పదేళ్లు దేశాన్ని పాలించారనే మాటే కాని, మంచి నాయకత్వాన్ని పార్టీకి ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఏ బిల్లునైనా వ్యతిరేకించే హక్కు ఉంది. కాని తన వాణిని జాతీయ స్ఫూర్తి ఉట్టిపడేలా వినిపించడంలో తప్పటడుగు వేసింది.
కాంగ్రెస్ కంటే టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, వైకాపా నేత విజయ సాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అద్భుతంగా మాట్లాడారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా 370వ అధికరణ రద్దును స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కాశ్మీర్ మూలాలను స్పృశిస్తూ నెహ్రూ విధానాలను తూర్పారబడుతూ, కాంగ్రెస్ అనుసరించే ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్ నేత నామా నాగేశ్వరరావుహిందీ, ఇంగ్లీషు భాషల్లో చెడుగుడు ఆడుతూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని వీరు తమ తమ పార్టీల వైఖరిని కుండబద్దలు కొట్టారు. ప్రాంతీయ పార్టీలైన వైకాపా, టీడీపీ, టీఆర్‌ఎస్‌లు కాశ్మీర్ అంశంపై జాతీయవాదానికి వెనుదన్నుగా నిలిచాయి. తెరాస మాజీ ఎంపీ కవిత బిల్లుకు బాసటగా నిలుస్తూ ప్రకటన చేయడం విశేషం. ఆమె బీజేపీ అభ్యర్థి చేతిలో ఇటీవల ఓటమి చెందినా, జాతీయ భావాలు, దేశభక్తిని చాటారు. ఒడిశాకు బీజేడీ సైతం ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికింది. బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ కూడా కేంద్రం వైఖరిని స్వాగతించారు.
కాశ్మీర్‌లో బడుగువర్గాలకు ఎలాంటి రిజర్వేషన్లు లేవని, అక్కడ ఎస్సీ, ఎస్టీ,బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని బీఎస్పీ సభ్యులు బీజేపీ నిర్ణయానికి బాసటగా నిలిచారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 370వ అధికరణను తీవ్రంగా వ్యతిరేకించారని చరిత్ర చెబుతోంది. మహారాష్టక్రు చెందిన శివసేన ఆనందానికి అవధులు లేవు. భాజపాకు మిత్రపక్షమైనందున శివసేన 370వ అధికరణ రద్దుకు మద్దతు తెలియచేయకుండా ఎలా ఉంటుంది? అస్సాం గణ సంగ్రామ పరిషత్, అన్నా డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు జమ్మూ కశ్మీర్ పునర్ విభజనను సమర్థించారు. కాంగ్రెస్ సహా డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఫెడరలిజం స్ఫూర్తికి భిన్నంగా 370వ అధికరణను రద్దు చేశారని తప్పుబట్టాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆ పార్టీల నేతలు హుందాగా మాట్లాడారు. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కశ్మీర్ అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకుని రాష్ట్రాన్ని విభజించి ఉంటే బాగుండేదని చెప్పాయి. కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటిలానే తమ వైఖరిని కరాఖండీగా చెప్పాయి. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాశ్మీర్ అంశంపై బీజేపీ వైఖరిని విమర్శిస్తూ చక్కగా తన భావాలను వ్యక్తీకరించారు. మిత్రపక్షం అయినప్పటికీ జేడీయూ తటస్థ వైఖరిని అవలంబించింది. ఎన్‌సీపీ పార్టీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే బీజేపీ వైఖరిని సునిశితంగా విమర్శించారు.
కాంగ్రెస్ మాత్రం చారిత్రక తప్పిదాన్ని చేసింది. కేంద్రం వైఖరిని తూర్పారబడుతూనే, తాము గత 72 ఏళ్లుగా చేసిన కృషిని చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ ఎంపీలు ఆషామాషీగా మాట్లాడి అపహాస్యం పాలయ్యారు. కాంగ్రెస్ తన సుదీర్ఘ చరిత్రను చెప్పుకున్నా బా గుండేది. కశ్మీర్‌ను భారత అంతర్గత విషయంగా భావిస్తున్నారా ? ఐక్యరాజ్యసమితి పర్యవేక్షించిందా? అంటూ అర్థం పర్థం లేని అంశాలను ప్రస్తావించి పాకిస్తాన్‌కు ఊతం ఇచ్చే విధంగా, అంతర్గత శత్రువులు మానసిక ఆనందం పొందేలా కాంగ్రెస్ నేతల ప్రసంగాలు కొనసాగాయి. కాంగ్రెస్ వైఖరిని ఆ పార్టీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా, జనార్దన్ ద్వివేది వంటి కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకించారు.
హోం మంత్రి అమిత్ షా వాగ్ధాటి ముందు కాంగ్రెస్ తోకముడిచింది. ప్రస్తుతం బీజేపీలో, ఒకప్పుడు జనసంఘ్, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ సంస్థల్లో గత 72 ఏళ్లుగా కాశ్మీర్ అంశంపై పగలు, రాత్రి అనే తేడా లేకుండా ‘కాషాయదళ నేతలు’ చర్చోపచర్చలు జరిపారు. కశ్మీర్ అంశం ప్రాతిపదికగానే వీరి ఆలోచనలు సాగాయి. ఇటువంటి సంస్థల్లో నుంచి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సంగతి తెలిసి కూడా, చరిత్రను అధ్యయనం చేయకుండా కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటుకు రావడాన్ని ఈ దేశం క్షమించదు. చెప్పుకునేందుకు చాలా ఉన్నా, ఏమీ చెప్పుకోలేక, నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోయింది. లోక్‌సభలో మాట్లాడే సమయంలో రాహుల్ గాంధీ బయటకు వెళ్లి ట్వీట్ ఇవ్వడం ఆయన కుర్రచేష్టగా భావించాలి.
ఇక, జమ్మూ కశ్మీర్‌లో హురియత్ కాన్ఫరెన్సు చరిత్ర ముగిసినట్లే. స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడేందుకు చట్టపరంగా అవకాశాలు లేవు. 370వ అధికరణం రద్దు ఫలితంగా జమ్మూ కశ్మీర్ రెండు ముక్కలు కావచ్చు. స్వయంప్రతిపత్తి డిమాండ్‌కు అవకాశాలు లేకపోవచ్చు. కాని కాశ్మీర్ ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాల్సిన బాధ్యత మోదీ సర్కార్‌పై ఉంది. మతతత్వ కోణాలను పక్కనపెట్టి అందరినీ కలుపుకునిపోయేందుకు కృషి చేయాలి. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంత ప్రజలను అభివృద్థిలో భాగస్వామ్యం చేయాలి. మతతత్వ వాదనలకు స్వస్తి పలకాలి. సైనిక, పోలీసు బలగాలతో ప్రజాస్వామ్య వ్యవస్థలు బలపడవు. కశ్మీర్‌లో మానవ హక్కులకు భంగం కలగకుండా మోదీ సర్కార్ అడుగులు వేయాలి. ఇదే సమయంలో భారత వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097