మెయిన్ ఫీచర్

సౌభాగ్యప్రదం వరలక్ష్మీవ్రతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సూర్యోమరీచి మా దత్తే, సర్వాస్మాద్భువనారధిః తస్యాః పాక విశేషేణ, స్మృతం కాల విశేషణమ్
అన్నదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుని కిరణముల పరిపాక విశేషమువలన రాత్రింబవళ్ళు, దినము, వారము, పక్షము, మాసము, ఋతువులు, ఆయనములు, సంవత్సరము మొదలగు కాల భేదములేర్పడుతున్నాయని యజుర్వేద తైత్తరీయ ఆరణక్యం పేర్కొంది.
ఆ విధంగా ఏర్పడిన కాలభేదములలో వివిధ ఋతుధర్మములతో, ఒక ఋతువు తరువాత మరొక ఋతువు వస్తూ వుంటాయి. అందులో దక్షిణాయణంలో, వేసవి చివరలో వర్షఋతువు ప్రారంభంలో వచ్చేది శ్రావణమాసం. దక్షిణాయణం అంటే, సూర్యుడు కర్కాటకరాశిలో ప్రవేశించినపుడు ప్రారంభమయ్యేది. కర్కాటకరాశికి అధిపతి చంద్రుడు.
రోహిణి, హస్త, శ్రవణం- ఈ మూడు చంద్ర నక్షత్రాలు. చంద్ర నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది శ్రావణమాసం. చంద్రుడు మనస్సుకి అధిపతి. కనుక శ్రావణమాసంలో మనస్సు నిర్మలంగా వుంటుంది, నిశ్చలంగా వుంటుంది. మనోనిశ్చలతను పొందటానికి, శ్రావణమాసంలో కొన్ని నోములు, వ్రతాలు, అర్చనలు చెప్పారు. శ్రావణ మంగళవారములలో మంగళగౌరీ వ్రతములు, శుక్రవారములలో శ్రీమహాలక్ష్మిని, గురువారములలో శ్రీ సూక్త పారాయణ, లక్ష్మీపూజ, శనివారములలో కలియుగ దైవం, సర్వదేవతా స్వరూపుడైన శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆరాధించి సర్వశుభములను పొందుతారు.
శ్రావణ సోమవారములు, పరమశివునికి ప్రీతిపాత్రమైనవి. సోమవారములలో రుద్రాభిషేకములు, అర్చనలు చేస్తే జగన్మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరుల కటాక్షాన్ని పొందుతారని శాస్తవ్రచనం.
శ్రావణ శుక్రవారములలో శ్రీమహాలక్ష్మిని పూజిస్తారని చెప్పుకున్నాం. అందులో ముఖ్యంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం, రెండవ శుక్రవారం, లక్ష్మీదేవిని ‘వరలక్ష్మీదేవి’గా అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ రోజు వరలక్ష్మీదేవిని అర్చిస్తే సిరిసంపదల్ని ఇస్తుంది. అంతకుమించి గుణసంపదల్ని ఇస్తుంది.
చంద్ర సహోదరి శ్రీమహాలక్ష్మి. ఈ విషయం లక్ష్మీ అష్టోత్తరంలో ‘చంద్ర సహోదర్వై నమః’ అనే నామమే చెప్పింది. వరలక్ష్మి మాత వ్రతాచారణతో, లక్ష్మీదేవి సహోదరుడైన చంద్రుని అనుగ్రహం లభిస్తుంది. దానితో సాత్విక సాధన, పవిత్రమైన భావన, నిర్మల హృదయం నిశ్చల మనస్సు ఏర్పడి, జీవనం సుఖ సంతోషాలతో సాగుతుంది. ఇది శ్రావణ శుక్రవారం రోజున అర్చనలందుకొనే శ్రీవరలక్ష్మీదేవి మనకిచ్చే వరం.
కోటి సూర్యకాంతితో, బంగారము వంటి వెలుగుతో ప్రకాశిస్తూ మనకు జ్ఞాన వెలుగును ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి. సేవించేవారిని పాలించే తల్లి, ఆశ్రయించిన వారి హృదయమందలి మాలిన్యాన్ని పోగొట్టి, భక్తులను సులభంగా అనుగ్రహించే జగన్మాత వరలక్ష్మీదేవి.
మంచి పనులకు, మంచి ఆలోచనలకు, మంచి సంకల్పాలకు మహాలక్ష్మీ కటాక్షం, చేయూత ఎప్పుడూ ఉంటుంది. మహాలక్ష్మీదేవి సర్వదా సర్వదా చిరునవ్వు చిందించే ప్రసన్న వదన. పంచమినాటి చంద్రకళలో మహాలక్ష్మీ వైభవం కనపడుతుంది. అలాగే శ్రావణమాసంలో పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారంనాడు జగజ్జనని ‘వెలుగు’ ద్యోతకమవుతుంది. ఐదు సంఖ్య జీవితంలో ప్రాముఖ్యత వహిస్తుంది. అందుకే, శ్రావణ శుక్రవారంనాడు వరలక్ష్మీదేవి పంచహారతులిస్తారు.
‘‘కరాగ్రేవసతే లక్ష్మీః కరమధ్యౌ సరస్వతి కరమూలేతు శర్వాణీ ప్రభాతే కరదర్శనం’- మన చేతి వేళ్ళు ఐదు. ఈ ఐదు వేళ్ళలో పంచబ్రహ్మలు, పంచభూతములు, తన్మాత్రలు, ఇంద్రియములు ప్రతినిహితమై ఉంటాయని చెప్తారు. మహాలక్ష్మి, సరస్వతి, పార్వతి నివసిస్తారని కనుక ఉదయానే్న నిద్రలేవగానే చేతులు చూసుకొని, జగన్మాతను తలచుకొని రెండు చేతులూ కలిపి నమస్కారం చేస్తే- ఆ రోజంతా శుభంగా జరుగుతుందని త్రిమాతలే తమని ప్రభాత సమయంలో కొలిచిన బిడ్డలకు రక్షణ ఇస్తారని పెద్దలు చెపుతారు. ఆ త్రిమాతా స్వరూపమే వరలక్ష్మీదేవి.
మహాలక్ష్మి నమోస్తుతే..
మహాలక్ష్మి చిత్కళ. మనస్సే ఆ తల్లి వాక్కు. జగన్మాత చిదానందమే, ఆమె భక్తులకు ప్రేమామృతంగా భాసిల్లుతుంది. లక్ష్మీదేవి ప్రేమస్వరూపిణి. తల్లి కరుణా కటాక్షంతో అదృష్టం అర్ణవంలాగా పొంగిపోతుంది. సారహీనమైన ప్రపంచాన్ని అర్థవంతం చేసి, అర్థాన్ని కామాన్ని ధర్మంతో ముడిపెట్టి అనుసంధానం చేస్తే, మోక్షాన్ని ప్రసాదించే ముక్తిప్రదాయిని వరలక్ష్మీదేవి.
‘‘్ధనమగ్నిర్థనం వాయుః ధనం సూర్యోధనం వసుః
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే’’ అన్నది శ్రీసూక్తం. అగ్ని, వాయువు, సూర్యుడు, వసువు, బృహస్పతి, వరుణుడు అనే ఏడుగురు ‘్ధన’ శబ్దముచే చెప్పబడ్డారు. ‘్ధన’ శబ్దానికి అధిపతి శ్రీమహాలక్ష్మి. లౌకికమైన ధనముతోపాటు, అగ్ని మొదలగు ఏడుగురి తేజోరూపమయిన ధనాన్ని కూడా ప్రసాదించే శక్తి శ్రీ వరలక్ష్మీ దేవి. ‘ఆయుర్దా’అగ్నే, ‘అగ్నిర్మేవాచిశ్రీతః’ అనే వేదవాక్యమువలన, అగ్ని, ఆయుర్దాయాన్ని, ఐశ్వర్యాన్ని, వాక్కులను (మాటల్ని) అనుగ్రహించేవాడు. ‘వాయుర్మేప్రాణేశ్రీతా’ వాయువు ప్రాణశక్తిని యిస్తాడు. ‘సూర్యోమేచక్షు పి శ్రీతః’ సూర్యుడు దర్శన శక్తిని ప్రసాదిస్తాడు. ‘వసువు’ శారీరక తేజస్సును ఇస్తాడు.
‘ఇంద్రుమే బలే శ్రీతః’- ఇంద్రుడు బలాన్నిస్తాడు. బుద్ధికి అధిపతి- బృహస్పతి. వరుణుడు- జలాధిపతి. శతృసంహారకుడు. కనుక వరుణునిచే జలశక్తి, శతృసంహారశక్తి లభిస్తాయి. ఇక్కడ శత్రువులు అంటే, కామక్రోధాది ఆరు అంతఃశతృవులు. బుద్ధిబలంతో జ్ఞానశక్తిని అనుగ్రహించేవాడు- బృహస్పతి. ఈ అగ్ని, వాయు, సూర్య, వసువు, బృహస్పతి, వరుణుడు, ఇంద్రుడు- అందరూ ఆ మహాలక్ష్మీ స్వరూపులు. కనుక వరలక్ష్మీదేవి కటాక్ష స్థితితో ఇవన్నీ లభిస్తాయి. ఈ దేవతల అనుగ్రహమును పొందినవాడే అసలైన నిజమైన ధనవంతులు. లౌకికమై ధనవంతుణ్ణిగానే కాక అసలైన ధనవంతునిగా చేసేది- వరలక్ష్మీదేవి కటాక్షం.
వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ శుక్రవారములలో చేసికొంటాం. శుక్రమంటే అగ్ని, వీర్యము, తేజస్సు, శక్తి మొదలలగు అర్థాలున్నాయి.
‘‘శుక్రం తేజో రౌతసే చ బీజ వీర్యేంద్రియాణిత’’ అని అమరకోశం చెప్తోంది. పుష్ఠిని, శక్తిని తేజస్సును ఇచ్చి వంశాభివృద్ధిని, సిరిసంపదలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. అందుకే శుక్రవారాలలోను, ముఖ్యంగా శ్రావణ శుక్రవారములలో, అందులో ముఖ్యంగా శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే రెండవ శుక్రవారమునాడు మహాలక్ష్మీదేవిని, వరలక్ష్మీ మాతగా పూజిస్తారు. లలితా సహస్రనామములలో ‘సర్వాయుధ ధరా శుక్తసంస్థితా సర్వతోముఖా’ అన్న నామాలు ఈ విషయాన్ని తెలియజేస్తాయి. (రలయో రభేధః కనుక శ్లుమనగా శుక్రమే)
పూజా విధానం
గృహమందలి ఈశాన్య గదిని గానీ, లేదా ఏ గదికైనా తూర్పు, ఈశాన్యంగాని పూజాస్థలంగా ఎంచుకొని, స్థలాన్ని పరిశుభ్రంగా చేసికొని ముగ్గులతో తీర్చిదిద్దుతారు. అమ్మవారి చిత్రపటాన్ని లేదా కలశాన్ని పెట్టటానికి ఒక పీటను వేసికుంటారు. కొబ్బరికాయకు వారి వారి గృహ ఆచారాన్ని అనుసరించి మహాలక్ష్మీదేవిగా సాకారంగా అలంకరిస్తారు. ముందుగా ఆచమనం చేసి, దీపారాధన చేసి, ‘ఆదౌ పుణ్యోగణాధిపః’ కనుక పసుపుతో విఘ్నేశ్వరుణ్ణి చేసి, పూజించి ఉద్వాసన చెప్తారు. గణనాథునికి పూజ చేసిన పుష్పములను, అక్షతలను శిరస్సున దాలుస్తారు.
వరలక్ష్మీదేవికి షోడశ ఉపచారముల పూజ చేస్తారు. తొమ్మిది తోరములు, ఒక్కొక్క తోరమునకు తొమ్మిది ముడులతో, సిద్ధం చేసుకొని వాటికి ‘తోరపూజ’ చేస్తారు. ‘బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం, పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే’’ అనే శ్లోకాన్ని చదువుతూ, తోరమును కట్టుకుంటారు (కుడిచేతికి).
వాయనదానం యిచ్చేటప్పుడు..
‘‘ఏవం సం పూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః
దాతవ్యం ద్వాదశాపూజం వాయనం హి ద్విజోత్తమమ్’’, ‘ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాతిచ, ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః’ అని యిచ్చేవారు పుచ్చుకునేవారు చెప్తారు.
జ్యోతులు వెలిగించి, అక్షతలు తీసికొని శ్రీవరలక్ష్మీ వ్రత కథను చదువుతారు. కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, స్ర్తిలు సర్వసౌభాగ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించటానికి తగిన వ్రతమును తెలియజేయవలసినదిగా కోరింది. పరమశివుడు ఆనందపడి, స్ర్తిలను ఉద్ధరించే వ్రతం- శ్రీవరలక్ష్మీవ్రతమని చెప్పి, వ్రత విధానాన్ని చెప్పారు. ఆ విషయాలను శౌనకాది మహర్షులకు, సూత మహాముని విశదపరచాడు. మగధ దేశంలో కుండిన నగరంలో, చారుమతి అనే సుగుణవతి, సాత్విక భక్తురాలు, యోగ్యురాలు ఉండేది. వరలక్ష్మీదేవి ఆమెకు కలలో దర్శనమిచ్చి, శ్రావణమాసంలో రెండవ శుక్రవారంనాడు అనగా పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం నాడు తనను అర్చించమని, కోరిన వరాలను, సర్వ సంపదలను, మోక్షాన్ని యిస్తానని చెప్పింది. ఈ విషయాన్ని తన తోటి స్ర్తిలందరకూ చెప్పి, తానొక్కతే వరలక్ష్మీ అనుగ్రహాన్ని పొందటం కాదు, స్ర్తిలందరూ ఆ జగన్మాతా అనుగ్రహాన్ని పొందాలన్న విశాల, స్వార్థరహిత, సమిష్టి ధర్మంతో వారిచేత కూడా ఈ వరలక్ష్మీవ్రతాన్ని ఆచరింపజేసింది. ‘త్యాగేనైకే అమృతత్వ మానసుః’ అన్నదానికి స్ఫూర్తిగా నిలిచేది చారుమతి. స్వార్థరహితంగా, సమాజ శ్రేయస్సును కాంక్షించమని చెప్తుంది వరలక్ష్మీవ్రతం.
కీర్తనలు
శ్రావణమాసం వచ్చిందంటే ప్రతిరోజూ పర్వదినమే. వ్రతాలు, నోములు, పూజలతో, ముంగిట ముగ్గులతో, గడపలకు పచ్చటి పసుపు కుంకుమలతో గృహములన్నీ లక్ష్మీకళతో అలరారుతూ ఉంటాయి. వరలక్ష్మీవ్రతం రోజున నాదయోగి ముత్తుస్వామి దీక్షితులవారు అద్భుతమైన కీర్తన మనకందించారు. ఆ కీర్తనను తప్పక జ్ఞప్తి చేసుకోవాలి. ఎందుకంటే ఆయన, ఆ కీర్తనలో ఎన్నో విశేషాలు చెప్తూ, చారుమతీ వృత్తాంతం కథాభాగాన్ని కూడా పొందుపరిచారు.
‘‘శ్రీవరలక్ష్మీ నమస్త్భ్యుం, వసుప్రదే, శ్రీసారసపదే, రసపదే, సపదే, పదే పదే, భావజ జనక ప్రాణవల్లభే, సువర్ణ్భా భానుకోటి సమానప్రభే, భక్తసులభే, సేవక జన పాలిద్వై, శ్రీత పంకజ మాలిన్యై, కేవల గుణ శాలిన్యై, కేశవ హృత్కేశావ్యై, శ్రావణ పూర్ణిమా పూర్వస్థ శుక్రవారే, చారుమతీ ప్రభృతిభిః పూజితాకారే, దేవాదిమా గురుగుహ సమర్పిత మణి మయ హారే, దీనజన సంరక్షణ నిపుణ కనకధారే, భావనా భేద చతురే, భారతీ సన్నుత వరే, కైవల్య వితరణ పరే, కాంక్షిత ఫలప్రదకరే’’ అని సంపద శుభములను కరుణించే రాగమైన, శ్రీరాములో, సర్వ సౌభాగ్యములను ప్రసాదించే జగన్మాత వరలక్ష్మీదేవికి నమస్కరించాడు.
దీక్షితార్ అందించిన ‘‘వరలక్ష్మీం భజరే మానసు వాంఛితార్థ ఫలప్రదాం, వరదాం వనజ పదాం, చరాచరాత్మక ప్రపంచ జననీం, సౌరాష్ట్ర దేశ పతి నుత ధనినీం, నిరామయ మహావిష్ణు మానినీం, నిరంజనీం, నిఖిలాఘ భంజనీం, సురార్చిత పరాంబుజ వికాసినీం, నిరాలంబ మానసోల్లాసినీం, మురారి వక్షస్థల నివాసినీం, పురారి, గురుగుస చిద్విలాసినీం అన్న సౌరాష్ట్ర రాగ కీర్తన, శ్రీ్భర్గవీ భద్రం మే దిశతు, శ్రీ్భర్గవీ శ్రీరరంగ ధామేశ్వరీ’ అన్న మంగళ కైశికి రాగకీర్తన, వరలక్ష్మీ పూజకు సంపూర్ణ దీప్తినిస్తాయి. ‘శ్రీ్భర్గవీ’ భృగువంశమున జన్మించినది గాన భార్గవి శుక్రవార విశేషం కూడా తెలుపబడింది. శ్రీమహాలక్ష్మి స్వామిని ఆశ్రయించి వుంటుంది. అందుకనే ‘నిత్యానపాయిని’ అని చెప్పింది విష్ణుపురాణం. ఈ విధంగానే ‘హ్రీశ్చతా లక్ష్మీ చ్చే పత్నా’ అని చెప్పింది పురుషసూక్తం.
అర్థాన్ని ధర్మవర్తనతో పొంది మరల ఆ అర్థాన్ని అర్థవంతం చేయటానికి ధర్మంతో కలిపి, లోకకల్యాణార్థం, ధర్మకార్యాచరణం చేసి సమాజాన్ని నిత్నూతనంగా, సర్వమానవ సోదర భావంతో కళ్యాణప్రదంగా ఉంచటానికి కారకులైన ధార్మికులే అసలైన ధనవంతులని, ఆ ధార్మిక శక్తిని పొందటానికి కృషిచేయాలని హెచ్చరిస్తూ, స్వార్థరహితంగా సమాజ శ్రేయస్సు కాంక్షించాలని చెప్తోంది శ్రావణ శుక్రవార వరలక్ష్మీపూజ.

-పసుమర్తి కామేశ్వర శర్మ 9440737464