మెయిన్ ఫీచర్

పళ్లులేని వృద్ధాప్యం శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తినాల న్నా, కొరకాలన్నా పళ్లు కావాలి. రుచిని ఆస్వాదించాలంటే ఆహారాన్ని నమిలి తినాలి. దానికి పళ్లు కావాలి. పళ్లు లేని వారి జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. ముసలివారిలో పళ్లు లేకపోవడం చూస్తూ వుంటాం. అసలే వయసు పైబడి శక్తి బాగా క్షీణించిన వీరిలో సరైన పోషక ఆహారం ఇచ్చి కొంచెం శక్తి నింపుదాం అంటే అదీ పళ్లు లేకపోవడం మూలాన కుదరదు. గట్టివి తినలేరు, రుచిని ఆస్వాదించలేరు, ఏదైనా సరే తాగాలి. దీనివల్ల ఆహారం మీద మక్కువ తగ్గుతుంది. తినడానికి మహా ఏడిపిస్తారు. ఓసారి ఓ కూతురు వాళ్ల నాన్నగారు పళ్లు లేకపోవడం మూలాన అసలు ఏం తినట్లేదని, దానివల్ల చాలా బరువు తగ్గి శరీరం బాగా క్షీణించుకుపోయి మంచాన పడ్డారని, తనని అలా చూస్తే చాలా బాధేస్తుందని చెప్పి కంటతడి పెట్టింది. ఆ పెద్దాయన వద్దన్నా వినకుండా నేనో మంచి పళ్లసెట్టు తయారుచేసి ఇచ్చాను.
ఆరు నెలల తరువాత ఆ పెద్దాయినే కారు నడిపించుకుంటూ క్లీనిక్‌కి వచ్చాడు. చాలా సుష్ఠుగా ఉన్న తనని చూసి చాలా ఆనందపడ్డా. ‘‘చూడటానికి బానే ఉన్నారు, ఇలా వచ్చేరేంటని అడిగా’’? ‘‘ఈసారి ప్రాబ్లమ్ నాకు కాదు నా కూతురికి. పన్నునొప్పితో చాలా బాధపడుతున్నది. రెండు రోజులుగా ఏం తినట్లేదు. బాగా నీరసించుకుపోయింది. చికిత్స ఇప్పిద్దామని మీ దగ్గరికి తెచ్చా’’ అని అన్నారు.కాలం సందర్భాలని, సన్నివేశాలని ఎలా మార్చేస్తుందో అని ఆశ్చర్యపోయా. శక్తి రావాలంటే తినాలి, తినాలంటే పళ్లు కావాలి. పళ్లు లేక బాధపడుతున్న వృద్ధులకి మనం ఏం చేయగలం అనేది తెలుసుకుందాం.
అసలు పళ్లు ఎందుకు పోతాయి
కొంతమందిలో వంశపారంపర్యంగా ఎముక అరిగి పళ్లు ఊగి అవే ఊడిపోతాయి. ఇది చిన్నవయసులో జరిగే ప్రమాదం కూడా ఉంది. కొంతమందిలో వయసువల్ల కానీ, చిగురు ఇన్‌ఫెక్షన్‌వల్ల కానీ చిగుర్లు బాగా జారిపోయి పళ్లు ఊగడం మొదలవుతుంది. క్రమేపీ ఒక్కొక్కటి పడిపోతాయి. కొంతమందిలో పళ్లకి పుచ్చురావడంవల్ల ఆ పంటిలో నొప్పి వచ్చి సరైన చికిత్స అందకపోవడంవల్ల కానీ డబ్బులు లేకపోవడంవల్ల కానీ ఆ పంటిని తీయించేసుకుంటారు. ఇలా ఒకటి తరువాత ఒకటి తీయించుకోవడం వల్ల ఒక సమయానికి నోట్లో పళ్లు మిగలవు. కొంతమంది పుచ్చు వచ్చినా దానికి చికిత్స చేయకుండా అశ్రద్ధ చేస్తారు. వీరిలో ఆ పుచ్చు పన్నంతటినీ తీనేసి చిన్నముక్కలుగా మారేస్తుంది. అలా అన్ని పళ్లు ముక్కలుగా మారితే వాటికి వేరే ఏ చికిత్స చెయ్యలేం. వాటిని తీసేయవలసి వుంటుంది. దాని కారణం చేత నోట్లో పళ్లు ఉండవు.
అందరు వృద్ధులు ఇలా పళ్లులేకుండా ఉంటారా?
అలా ఉండదు. మొదటినించీ చాలా జాగ్రత్తగా వారి పళ్లని కాపాడుకున్నవారిలో తొంభై ఏళ్లు వచ్చాక కూడా వారి పళ్లు చాలా గట్టిగా ఉంటాయి. అలా శ్రద్ధగా కాపాడుకునేవారు చాలామంది ఉన్నారు. నిర్లక్ష్యం చేసినవారే ముసలితనంతో బాధపడతారు.
వీరికి మనం ఏం చెయ్యగలం
కొన్నిపళ్లు ఉన్నాయా లేక అస్సలు లేవా అన్నది ముందు నిర్థారణ చేసుకోవాలి. కొన్ని పళ్లు ఉన్నవారిలో వాటిని ఉపయోగించుకొని స్థిర పళ్లని పెట్టే ప్రయత్నం చేయచ్చు. కొందరిలో ఎముకలో స్కూృ (డెంటల్ ఇంప్లాంట్) వేసి వాటిని, ఉన్న పళ్లని ఉపయోగించుకొని స్థిర పళ్లు పెట్టే ప్రయత్నం చేయచ్చు. డబ్బులు ఎక్కువగా లేనివారిలో తీసిపెట్టుకునే పళ్లు చేయడానికి వీలు ఉంటుంది. అసలు పళ్లే లేనివారిలో తీసి పెట్టుకునే పళ్ల సెట్ చేయాల్సి ఉంటుంది. అయితే దాని విజయం దవడ ఎముక ఎత్తుమీద ఆధారపడి ఉంటుంది. మంచి ఎతె్తైన దవడ ఎముక ఉన్నవారిలో ఈ పళ్ల సెట్టు చాలా బాగా కూర్చుంటాయి. తినేప్పుడు ఊడిపోవు. ఈ తీసి పెట్టుకునే పళ్లసెట్టు పొద్దున్న పెట్టుకొని రాత్రిళ్లు తీసేయాలి. వీటిని మంచి తాగునీరులో భద్రపరచుకోవాలి. ఇంక రాత్రి ఎట్టిపరిస్థితులలో వీటిని నోట్లో పెట్టుకోకూడదు. అలా చేస్తే చిగురు మీద పుండ్లు అయ్యే ప్రమాదం ఉంది. ఈ తీసి పెట్టుకునే పళ్ల సెట్లవల్ల వచ్చిన సమస్యల్లా ఒక్కటే. వయసువల్ల వచ్చే మరపువల్ల వీటిని ప్రయాణం అప్పుడు, రైల్లో కాని ఇతర ప్రదేశాలకెళ్లినపుడు అక్కడ కాని మరచిపోతుంటారు. మళ్లీ చేయించుకుంటూ ఉంటారు.
కొంతమందిలో దవడ ఎముక ఎత్తుగా ఉండదు. వీరిలో పళ్ల సెట్టు నోట్లో గట్టిగా కూర్చోదు. ఇది చాలామటుకు కింది దవడ ఎముకకుండే సమస్య. వీరిలో స్కూృ (డెంటల్ ఇంప్లాంట్) కింది దవడ ఎముకలో వేసి వాటిమీద ఈ పళ్ల సెట్టు కట్టే ప్రయత్నం చేస్తారు. ఇలా స్కూృ సహాయంతో కూర్చోబెట్టి పళ్లసెట్ల ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి.
నేటి దంత వైద్య శాస్త్రం ఎంత పురోగమించిందంటే అసలు పళ్లే లేనివారికి కూడా స్థిరపళ్లని పెట్టగలం. ‘‘జజ నిశ 6’’ అనే ఫార్ములా ద్వారా పై, క్రింది దవడలో ఆరు, ఆరు స్కూృలని దించి వాటిపై స్థిరపళ్లని పెట్టగలం.
అందరూ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మనం పన్ను తీసేస్తే దాన్ని అంటి ఉండే ఎముక అరిగిపోతుంది. దాని కారణంగా భవిష్యత్తులో దవడ ఎముక ఎత్తు తగ్గిపోతుంది. అందుకే నేటి ఆధునిక సమాజంలో పన్ను తియ్యడం నేరమే కాదు పాపం కూడా. తప్పనిసరి పరిస్థితులలో తప్ప పన్ను తీసే, తీయించుకునే ప్రయత్నం చేయొద్దు.
ఓసారి ఓ ఎనభై ఏళ్ల ముసలతని పైపళ్ల సెట్టు కిందపడి అంచు దగ్గర విరిగింది. విరిగిన ఆ పళ్ల సెట్టు అంచు పదునుగా ఉంది. నోట్లో పెట్టుకున్నపుడల్లా అది చిగురుని గుచ్చేది. దీనివల్ల తనకి విపరీతమైన నొప్పి కలిగేది. తినలేకపోయేవాడు. తన కొడుక్కి కోడలికి ఈ విషయం చెప్పాడు. ‘‘మాటిమాటికీ కింద పడేసుకొని విరగొట్టుకుంటే అంతంత డబ్బు పెట్టి మళ్లీ మళ్లీ చేయించలేం’’ అని ఆ కొడుకు కోడలు కఠినంగా జవాబిచ్చారు. పాపం ఆ పెద్దమనిషి ఆ విరిగిన సెట్టే వాడేడు. కొన్నాళ్లకి ఆ పదునైన అంచు గుచ్చుకొని గుచ్చుకొని అక్కడ చాలా పెద్ద పుండు అయింది. నోరు కూడా తెరవలేకపోయారు. ఇది గమనించి తన ఎనిమిదేళ్ల మనవడు ఇంటర్‌నెట్‌లో టాక్సీ బుక్ చేసి వాళ్ల తాతని నా దగ్గరికి తీసుకొచ్చాడు. జరిగిన కథ చెప్పి తన పిగ్గీ బ్యాంకు నా టేబుల్‌మీద పెట్టి ‘‘ఇందులో చాలా డబ్బులున్నాయి, కావాలంటే చూడండి’’ అని దాన్ని ఊపాడు. లోపల ఉన్న చిల్లర గళ్ గళ్‌మని శబ్దం చేసింది. ‘‘దీన్ని తీసుకొని మా తాతకి వైద్యం చేయండని’’ అమాయకంగా అడిగాడు. వాళ్ల తాతకి తగిన చికిత్స చేసి నేను ఆ పిగ్గి బ్యాంకులో కొంచెం డబ్బు వేసా. ‘‘అదేంటి డబ్బు వద్దా’’ అని అడిగాడా పిల్లాడు. ‘‘మంచి చెయ్యడానికి మనసు కావాలి, డబ్బుకాదు అన్న నీతిని నేర్పావు. అది ఈ డబ్బుకన్నా చాలా విలువైనది. నాకా నీతి చాలు, ఈ డబ్బు వద్దు’’ అని నేనన్నదానికి, ఆ పిల్లవాడు ‘నాకర్థం కాలేదు’ అని అమాయకంగా అన్నాడు.
కొన్నిసార్లు పిల్లలు మనకి నేర్పిస్తారు. అహాన్ని పక్కన పెట్టి నేర్చుకుంటే పురోగతి లేకపోతే అధోగతి. నేడు యవ్వనంలో వున్న మనం రేపొద్దున్న ముసలివారవుతాం. ఇప్పుడు మనం వారితో ఇలానే వుంటే అవి చూసిన మన పిల్లలు రేపొద్దున మనతోను అలానే ఉంటారు.. ఆలోచించండి.

-డా. రమేష్ శ్రీరంగం, సర్జన్, ఫేస్ క్లినిక్స్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్