మెయన్ ఫీచర్

దేశభక్తి సహిత జాతీయవాదమే మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణాన్ని రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా జాతీయవాదం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ ‘రద్దు’ను వ్యతిరేకించి, జాతీయవాదుల దృష్టిలో దోషిగా నిలబడింది. కాంగ్రెస్ వలే మరికొన్ని పార్టీలు మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినా వాటి ప్రభావం తక్కువ. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్ల అనేక మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కశ్మీర్ అంశంలో దేశాన్ని ఏకతాటిపైకి తేవడంలో బీజేపీ లక్ష్యం నెరవేరింది. ఆసేతు హిమాచలం ‘370 రద్దు’ను ప్రశంసించారు. దీన్ని వ్యతిరేకించేవారు జాతీయవాదులు కారా? వారికి దేశభక్తి లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.
జాతీయవాదం, దేశభక్తి అనేవి ఒకేలా ఉన్నా, వాటి మధ్య సున్నితమైన విభజన ఉంది. గాంధీజీ దేశభక్తి సహిత జాతీయవాదం ద్వారానే స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపిస్తే, కాంగ్రెస్ అధికార దాహంతో తన సుదీర్ఘ పాలనలో ఈ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకు నేడు జాతీయవాదంపై చర్చ జరుగుతోంది. దేశభక్తి అనేది ఎవరికైనా మనసులో ఉంటుంది. వ్యక్తీకరణ ఉండదు. జాతీయవాదులు తమ దేశభక్తిని బయటకు చాటుకుంటారు. జాతీయవాదానికి మాతృక దేశభక్తి. జాతీయవాదం అనేది కంటికి కనపడుతుంది. 370వ అధికరణంపై చర్చ సందర్భంగా పార్లమెంటులో మాట్లాడిన గులాం నబీ ఆజాద్, రంజన్ చౌదరి, మనీష్ తివారీ మాట్లాడిన తీరులో దేశభక్తి ఉంది. ఈ అధికరణను రద్దు చేసే అవకాశం తమకు రాలేదన్న అసూయ వారి మాటల్లో కనపడింది. కాని వీరి ప్రసంగాల్లో జాతీయవాదం కనపడదు. బిల్లును ప్రవేశపెట్టిన హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన తీరులో జాతీయవాదం దర్శనమిస్తుంది.
కొన్ని రాజకీయ పార్టీలు మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, జాతీయవాదం మంచిది కాదని, దేశభక్తి సరిపోతుందని వాదిస్తుంటాయి. అంటే వీరు 370 అధికరణ రద్దును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతుంది. దేశభక్తిపరుడు విమర్శను భరిస్తాడు. దేశభక్తిని విమర్శించే వారిలో సహేతుకమైన వాదన ఏమైనా ఉందా? అని పరిశీలిస్తాడు. కాని జాతీయ వాది విమర్శను సహించడు. జాతీయవాదాన్ని తప్పుబడితే అవమానంగా భావిస్తాడు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దామని జాతీయవాదులనుకుంటారు. దేశభక్తిపరులు లోపాలను గుర్తించి, సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తామంటారు. భాష, చరిత్ర, సంస్కృతికి అతీతంగా ప్రజలను సమష్టిగా ప్రాంతం, మతం కన్నా- దేశ సమగ్రత మిన్న అనే లక్ష్యం వైపు తీసుకెళ్లేందుకు జాతీయవాదం తోడ్పడుతుంది. అదే దేశభక్తిపరులు తమ దేశాన్ని ప్రేమించడం, దానికి విశ్వాసంతో కూడిన విలువలను ఆపాదించుకుంటారు. మన దేశంలో జాతీయవాదం, దేశ భక్తి పెనవేసుకుని పోయి ఉంటాయి. దేశంలో 85 శాతం మంది హిందువులు ఉన్నారు. చరిత్రపరంగా చూస్తే వెయ్యి సంవత్సరాల పాటు విదేశీ దురాక్రమణ దారుల చేతిల్లో భరతమాత బందీ అయింది. జాతీయవాదం, దేశభక్తి ఉద్యమాల వల్ల దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.
స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా 1965లో భార త్-పాక్ యుద్ధం జరిగినపుడు జాతీయవాదం నినాదాలు మిన్నంటాయి. అంతకుముందు 1948లో భారత్,పాక్ యుద్ధం జరిగినా, అప్పుడే దేశానికి స్వాతంత్య్రం రావడం, కాంగ్రెస్ నేతలు పదవులు దక్కించుకోవడంలో తలమునకలై ఉన్నారు. మన దేశాన్ని మనం కాపాడుకుందామనే దేశభక్తి మాత్రం 1965 నాటి యుద్ధంలో ప్రస్ఫుటించింది. 1971లో బంగ్లాదేశ్ అవతరణ సమయంలోనూ జాతీయవాదం కనపడుతుంది. దివంగత మాజీ ప్రధాని వాజపేయి హయాంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా జాతీయవాదం మిన్నంటింది. యుద్ధం జరిగితే తప్ప జాతీయవాదమనేది గతంలో ఎన్నడూ దర్శనమివ్వలేదు. ఎలాంటి యుద్ధం లేకుండానే ఈనెల 5,6 తేదీల్లో దేశవ్యాప్తంగా జాతీయవాదం అంబరాన్ని అంటింది. 2016, 2019ల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై మన సేనలు సర్జికల్ దాడులు చేసినప్పుడు జాతీయవాదం ఆవిష్కృతమైంది.
జాతీయవాదం, దేశభక్తి రెండింటిలో ఏది గొప్పది అంటే దేశభక్తితో కూడుకున్న లౌకిక జాతీయవాదమే మిన్న అని చెప్పవచ్చు. జమ్మూ కశ్మీర్ విషయంలో యుద్ధతంత్రాలను, ప్రతిపక్ష పార్టీల బలహీనతలను, వివిధ దేశాల నేతల లొసుగులను బ్రహ్మాండంగా అంచనా వేసి వాస్తవాలను గ్రహించి, 370 అధికరణను రద్దు చేసిన ఘనత మోదీ, అమిత్ షాలకు దక్కుతుంది. మనకు చాలా భ్రమలు ఉండేవి. కశ్మీర్ జోలికి వెళితే ఏమో అవుతుంది. పాకిస్తాన్‌కు అండగా గల్ఫ్ దేశాలు నిలుస్తాయి. మళ్లీ వెయ్యి సంవత్సరాల క్రితం దురాక్రమణ దారుల పాచికలు పారుతాయి. దేశంలో అల్లకల్లోలమవుతుందనే పర్సనాలిటీ డిజార్డర్ (వ్యక్తిత్వ లోపం) భారతీయులకు ఎక్కువగా ఉండేది. ఊహాజనితమైన భయాలతో ప్రజలు మానసిక వ్యాధిగ్రస్తులుగా మారే పరిస్థితిని కుహనా లౌకికవాద పార్టీలు కల్పించాయి. రానున్న రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉన్నా, పోరాడే స్థైర్యాన్ని ఈ రోజు ప్రజలకు మోదీ, అమిత్ షా ఇచ్చారు. దేశానికి గుదిబండలాంటి 370వ అధికరణను రద్దు చేస్తే ఏమీ కాదని నిరూపించారు. చైనా, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు కుక్కిన పేనులా పడిఉన్నాయి.
జాతీయవాదులు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా, సూటిగా, కఠినంగా తెలియచేస్తారు. దేశభక్తిపరులకు వ్యక్తీకరణ ఉండదు. వీరు మానసికంగా ఆనందం పొందుతారు. జాతీయ గీతం ఆలాపన సమయంలో లేచి నిలబడడం, జాతీయ జెండాను గౌరవించడం లాంటి విధులకు కట్టుబడి ఉంటారు. దేశభక్తి మనసులో ఉండాలే తప్ప ప్రదర్శించడం ఎందుకనే భావనలో ఉంటారు. పుల్వామా ఘటనతో దేశ ప్రజలు కుమిలిపోయారు. దీనికి కారణమైన కశ్మీర్ అంశానికి పరిష్కారం లభించదా? అని రోదించారు.
కాగా, కశ్మీర్ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోరా? అంటూ కాంగ్రెస్ దేశ వ్యతిరేక ప్రశ్నవేసి తన సమాధి తానే తవ్వుకుంది. ఒక దేశంలో మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకుని ఎక్కువ మంది ప్రజలు ఏది కోరుకుంటే ఆ అంశాన్ని రాజ్యాంగానికి లోబడి, పార్లమెంటు ద్వారా ప్రభుత్వం తన విధిని నిర్వహించాల్సి ఉంటుంది. బీజేపీ అజెండాలో 370వ అధికరణ రద్దు అంశం ఉంది. ఇదేమీ రహస్య డాక్యుమెంట్ కాదు. అదే బీజేపీ గత ఏడాది వరకు పీడీపీతో కలిసి కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 370వ అధికరణంపై భాజపా వైఖరి ఏమిటో పీడీపీకి తెలియదా? వరుసగా రెండోసారి ప్రజలు బీజేపీకి పాలించే హక్కు కల్పించారు. బీజేపీ చెబుతున్న జాతీయవాదం, సాంస్కృతిక ఏకీకరణ, 370 అధికరణ రద్దు, కామన్ సివిల్ కోడ్ అమలు, ముమ్మారు తలాక్ రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం, చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఇలా అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ అమలు చేయాలని ప్రజలు సైతం కోరుకున్నారు.
ప్రధాని మోదీ వరుసగా ఆరోసారి నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగిస్తారు. కశ్మీర్ అంశంపై మోదీ ఇటీవల జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తీరు ప్రజలను మంత్ర ముగ్ధులను చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) కూడా భారత్‌లో అంతర్భాగమే. ఇందులో సందేహాలకు తావులేదు. 1994 లో పీవీ నరసింహారావు ప్రభుత్వం ఈ మేరకు తీర్మానం చేసింది. ఎప్పటికైనా పీవోకేను భారత్‌లో విలీనం చేసే దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుందా? అంటే ఆ ప్రశ్నకు సరైన జవాబు లభించదు. కశ్మీర్ అభివృద్ధికి బీజేపీ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేరితే అన్నీ సాధ్యమవుతాయి. జాతీయవాదమంటే సామరస్యంగా జీవిస్తున్న వివిధ మతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టడం కాదు. అందరినీ కలుపుకొని సంఘటితంగా నడిపించాలి.
అనేక కారణాల వల్ల శతాబ్దాల తరబడి ముక్కలై ఉన్న భారత్‌లో ప్రజలు సహజంగా కుటుంబ వాదులు. ముందుగా కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు. భారతీయ సమాజంలో దేశభక్తిని పురిగొల్పాలంటే జాతీయవాదమే బలమైన ఆయుధం. సమాజానికి జాతీయవాదమనేది ఉద్దీపన కలిగించే టానిక్ లాంటిది. నేటి యువతలో చాలామందికి దేశచరిత్ర, సమకాలీన రాజకీయ పరిణామాల గురించి సరైన పరిజ్ఞానం లేదు. ప్రాపంచిక సుఖాల తప్ప మరో ధ్యాస లేని ఆధునిక యువతలో 370వ అధికరణం రద్దు అంశం జాతీయ భావనలను రగిల్చింది. లౌకిక జాతీయవాదాన్ని వ్యాప్తి చేయాలన్న సంకల్పంతో మన జాతీయ,ప్రాంతీయ పార్టీలు దీక్ష బూనాలి. జాతీయవాదం ఒక చోదక శక్తి. యువతలో చైతన్యం కలిగించేందుకు, జాతీయ భావాలను పెంపొదించేందుకు దేశభక్తితో కూడిన లౌకిక జాతీయవాదమే సరైన మార్గం.

-కె.విజయ శైలేంద్ర 98499 98097