మెయిన్ ఫీచర్

కుడి ఎడమైతే -పొరపాటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడి ప్రతిభ.. నిర్మాతల కష్టం.. నటీనటుల కృషి.. టెక్నీషియన్ల పనితీరు.. ఇరవై నాలుగు విభాగాల సమ్మేళనంతో కథాబలాన్ని ప్రదర్శించాల్సిన వస్తువు -సినిమా. కానీ -‘అంతకుమించి’ అన్నట్టు వ్యవహరిస్తోంది తెలుగు సినిమా. నిజానికి అంత సీనుందా?

సృజనాత్మక సినిమా -కళా వ్యాపారమే. అంథులో ఎలాంటి సందేహాలు లేవు. ప్రస్తుత సినిమా పరిస్థితులూ అవే చెప్తున్నాయ్. ఇక ఏ వ్యాపారైనా వ్యాపారం చేసేది లాభాపేక్షతోనే. సినీ నిర్మాత ఇందుకు మినహాయింపేం కాదు. ఒక సాధారణ వస్తు తయారీ వ్యాపారం మంచి స్థితిలో నడవాలంటే కొన్ని లక్షణాలు, లక్ష్యాలు, పరిస్థితి (వాతావరణం).. ఇలా చాలా ఉండాలి. అందుల్లోంచి ఒక రెండు విషయాలు. -వస్తు నాణ్యత మొదటిదైతే, దాన్ని ప్రజలకు వివరించి మార్కెట్ చేయడం రెండో విషయం.
సినిమా విషయంలోనూ అంతే. మంచి సినిమా తీసినంత మాత్రాన సరిపోదు. దాన్ని ప్రమోట్ చేయడంపైనే సినిమా భవితవ్యం ఆధారపడివుంది. అందుకే సినిమా ప్రమోషన్‌కు బడ్జెట్‌లో సగభాగాన్నైనా పెడుతున్నాడు -నిర్మాత.

ఒక సినిమా ప్రేక్షకులకు తెలియాలన్నా, దగ్గరవ్వాలన్నా ప్రమోషన్ ప్రాణం. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు. కాకపోతే -కంటెంట్‌కు మించి కానె్సప్ట్‌ను ఎక్కువ ప్రమోట్ చేస్తేనే ఊహించుకున్న సన్నివేశాలు స్క్రీన్‌మీద కనిపించకపోయేసరికి ఆడియన్స్ నిరాశకు గురవుతున్నారు. సినిమాను బలంగా తిప్పికొడుతున్నారు.

అతిగా ప్రమోట్ చేసినందుకు కబాలి బలైపోయాడు. సైలెంట్‌గా వచ్చిన బిచ్చగాడు కోట్లు కొల్లగొట్టాడు.

వైవిధ్యమైన కార్యక్రమాలు, ప్రచారాంశాలతో అంతకుమించి ఎక్కువ శ్రద్ధ పెడుతోంది సినిమా యూనిట్. వాటిలో -్ఫస్ట్‌లుక్, టీజర్ రిలీజ్, ఆడియో ఫంక్షన్, ట్రైలర్ విడుదల లాంటివి చాలామందికి తెలిసినవే. ఆర్భాటంగా ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేసి సినిమాను పరిచయం చేయడం, వచ్చేదెంత గొప్ప సినిమానో ప్రచారం చేసుకోవడం ఒక భాగం. నిజానికి ఈ ప్రక్రియ ఇప్పుడున్న సినిమాకు చాలాచాలా అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా పరుగుకు ఇదొక ‘ఎనర్జీ డ్రింక్’. ప్రమోషన్‌తోనే పక్కాగా వ్యాపారం చేసి విజయాలు అందుకున్న సినిమాలెన్ని? అన్న ప్రశ్నకు లెక్కలేనన్ని అని సమాధానం చెప్పొచ్చు. అయితే -ఈమధ్య ఈ ఎనర్జీ డ్రింక్ కాసింత డోసు ఎక్కువై పాయిజన్ అవుతోంది. సినిమాపై అనుమానాలు రేకెత్తిస్తోంది. అంటే సినిమాను విజయ తీరాలకు చేర్చాల్సిన ట్రైలర్ -సినిమాను వెనక్కి నెట్టుకొచ్చే అలలా వ్యవహరిస్తోంది?. నిజానికి ‘ట్రైలర్’ అనే కానె్సప్ట్‌పై అభియోగం ఏమాత్రం లేదిక్కడ. కాకపోతే ఆ ట్రైలర్‌ను ఉపయోగించే విధానంపైనే. ఇటీవల రిలీజైన సినిమాల్నే ఉదాహరణగా తీసుకుంటే కొద్దిరోజుల క్రితంనాటి ‘కబాలి’ని ప్రస్తావించుకోవచ్చు. నిజానికి ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్, దక్కిన పబ్లిసిటీ మరే సినిమాకూ దక్కలేదు. ఈ ప్రమోషన్ మంచి ఓపెనింగ్స్ సాధించడంలో ఉపయోగపడిందని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. నిజానికి కబాలి ప్రమోషన్‌ను ఆకాశానికి చేర్చింది ‘మలేసియా విమానం’ కాదు, ఆ సినిమా ట్రైలర్. ఒక్క ట్రైలర్‌తో అద్భుతం చేశాడు దర్శకుడు. ఆ ట్రైలర్ చూసిన వాళ్ళంతా సినిమా కథను ఎంతో ఊహించేసుకున్నారు. అందుకు తగ్గట్టే ప్రమోషన్ ఫంక్షన్‌లలో ఈ సినిమా మరో ‘బాషా’ అన్నారు. ఈ మాటలన్నీ మదిలో నిక్షిప్తం చేసుకొని థియేటర్ గుమ్మందాటిన ప్రేక్షకుల అంచనాలన్నీ పటాపంచలై భంగపడ్డారు. నిజానికి సినిమాలో తప్పుపట్టేంత ‘తక్కువదనం’ కూడా ఏమీ లేదు. ఒక సినిమాగా.. తీసినంత వరకూ చక్కగా తీశారు. కానీ తప్పుచేసింది ఎక్కడంటే ‘ట్రైలర్’ విషయంలోనే. ట్రైలర్‌లో, టీజర్‌లో రజనీకాంత్‌ని డాన్‌లా చూపించి, పవర్‌ఫుల్ డైలాగ్‌లు పలికించారు. కథలో హీరో డాన్! ఇది నిజం. కానీ కథనంలో భార్యను వెతుక్కుంటూ అనే్వషించే ఓ అనే్వషి. ఈ విషయంపై క్లారిటీ ఏ ఫంక్షన్‌లోనూ ఇవ్వలేదు. భారీ చేజ్‌లు, విలన్ ఎత్తులకు రజనీ పైఎత్తులు, ఎస్కేపింగ్ సీన్‌లు, డాన్ వర్సటైల్ థింకింగ్ (ప్లాన్స్).. ‘ట్రైలర్’తో ఇంతకుమించి ఊహించేసుకున్న ప్రేక్షకుడు, స్క్రీన్‌పై కనిపించే సన్నివేశాలు చూసి తట్టుకోలేకపోయాడు. ఊహల్లో కథకు, స్క్రీన్‌పై నడుస్తోన్న కథనానికి పొంతనలేక ఇబ్బంది పడ్డాడు. నిరాశకు గురయ్యాడు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో ‘్ఫ్లప్’ ముద్ర వేసేశాడు. అదే ట్రైలర్‌లో రజనీకాంత్ (్భర్య కోసం) అనే్వషణ గురించి ప్రస్తావించో, చూపించో ఉండివుంటే ప్రేక్షకుడి ఆలోచనలు వేరుగా ఉండేవి. ఆ కోణంలోనే రజనీ సినిమా చూసేందుకు మానసికంగా సిద్ధపడి ఉండేవాడు. కానీ అలా చేయలేదు. ఫలితంగా ‘ట్రైలర్ హిట్... సినిమా ఫట్’ అన్నట్టు తయారైంది.
ఇదే కోణంలో -మరో సైలెంట్ కిల్లర్‌ను విశే్లషిద్దాం. అదే సూపర్ హిట్టనిపించుకున్న ‘బిచ్చగాడు’. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ఎక్కడా ఎలాంటి ఆర్భాటాలకు పోలేదు నిర్మాత. తమిళంలో పెద్ద హిట్టైన సినిమాయే అయినా కథకు తగ్గట్టు ‘బిచ్చగాడు’ అనే పేరు పెట్టారు. నిజానికి ఈ సినిమాలో హీరో కొటీశ్వరుడు, కానీ కథలో ఎక్కువ భాగం బిచ్చగాళ్లతోనే ఉంటాడు. అందుకుతగ్గట్టే ‘బిచ్చగాడు’కు ఫిక్సయ్యారు. నిజానికి నిర్మాత, సినిమా యూనిట్ తలచుకుంటే టైటిల్ జస్ట్ఫికేషన్ అయ్యేలా ‘కోటీశ్వరుడు’ అని కూడా పెట్టుకోవచ్చు. అలా చేయకపోవడమే -యూనిట్ చేసిన తెలివైన పని. ‘బిచ్చగాడి’ని చూసేందుకు ప్రేక్షకులను మానసికంగా సిద్ధం చేసి -కోటీశ్వరుడు అలా ఎందుకు మారాల్సి వచ్చిందన్న కథనాన్ని బిగింపుగా చెప్పడంతోనే సినిమాకు కొత్త బలం వచ్చేసింది. నిజానికి వ్యాపార ప్రచారం గురించి బిజినెస్ సైన్స్ ఏం చెప్తోందంటే ‘తయారీదారుడు తాను తయారు చేసిన వస్తువు గురించి జనాలకు నమ్మకం కలిగేలా ఏంచెప్పినా అది ప్రచారమేనని’. అయితే ఇక్కడే ఓ అసలు సమస్య వుంది, అది ఏంటంటే -వస్తువు గురించి ఉన్నదున్నట్టు చెప్తే ఫరవాలేదు. కానీ ఎక్కువ వ్యాపారానికి ఆశపడి -లేనిదాని గురించీ ఎక్కువ చెప్పినప్పుడే వస్తుంది ఆ సమస్య. ఆ సందర్భంలోనే ‘ఉన్నదీ పోయే....’ అన్న తెలుగు సామెతను ప్రస్తావించుకోవాల్సి వస్తుంది.
ఉదాహరణకి నీటిపై (నీటి ఉపరితలంపై) హీరో పరిగెడుతున్నట్టు చూపిస్తే ప్రేక్షకుల్లో చర్చ జరుగుతుంది. నిజానికి అది మంచి విషయమే. అయితే హీరో నీళ్లపై ఎలా పరిగెత్తాడన్న విషయంలో -ప్రేక్షకుడిని కన్విన్స్ చేయగలగాలి. అంతే కానీ అది ఏ పాటలోనో భాగంగా చేసి, దాన్ని యాక్షన్ సన్నివేశంగా ‘ట్రైలర్’లో పెడితే ప్రేక్షకుడు పెదవి విరుస్తాడు. ఎందుకంటే ట్రైలర్ చూసిన ప్రేక్షకుడు -అదేదో సైన్స్ ఫిక్షన్ కథ అనుకుని థియేటర్‌కు రావొచ్చు. తీరా వచ్చాక -అదొక ప్రేమకథలోని పాటలో హీరో నీటిపై పరుగెత్తడాన్ని చూసి తీవ్రంగా ప్రతిస్పందించొచ్చు. ఆ తీవ్ర ప్రతిస్పందనకు ‘్ఫ్లప్’ టాగ్ తగిలించేయొచ్చు. సో.. సినీ నిర్మాతలు కొన్ని విషయాల్లో అతికిపోకుండా -వ్యాపార సూత్రాన్ని అనుసరించడమే ఎంతైనా బెటర్. అంటే -‘సినిమాలో ఉన్నదానే్న కాస్త అఫెక్టివ్‌గా ట్రైలర్‌లో చూపించాలి. భ్రమలకు గురి చేసి వ్యాపారం కానిచ్చేద్దామంటే -్భవిష్యత్ గల్లంతైపోవడం ఖాయం. ట్రైలర్ అనేది కథా పరిధిలోనే ఉండాలి కానీ కథ పరిధి దాటి, హద్దులుమీరి ఉండకూడదు. అలాకాదని చూపిస్తే -ప్రేక్షకుడు కష్టపడతాడు. నిర్మాత నష్టపోతాడు.
నిజజీవితంలో ఈ పరిణామం ఎలా ఉంటుందంటే -్ఫటోషాప్ టెక్నిక్స్‌తో లేని అందాల్ని ఆపాదించుకుని అమ్మాయి/ అబ్బాయి కలుసుకున్నట్టు. ఫొటోలో కనిపించేది అందమే -కానీ తీరా ఎదురుగా కలిసినపుడు వాస్తవం కనిపిస్తుంది. వికర్షణకు దారితీస్తుంది. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని పాడుకునేందుకు బాగుంటుందేమో కానీ కథ, ట్రైలర్ విషయంలో మాత్రం కుడి ఎడమైతే విషమే అవుతుంది, పరమ పొరబాటే అవుతుంది.

-ఎస్‌పి యాసిన్