మెయన్ ఫీచర్

కాంగ్రెస్‌లో ‘కశ్మీర్ కల్లోలం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమే... ఓటమి ఎవరికీ రుచించదు. అది చాలా చేదు గా ఉంటుంది... గొంతు దిగదు... జీర్ణం కాదు... రాహుల్ గాంధీకి అయినా మరొకరికి అయినా ఓటమిని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. అందులోనూ- మొ న్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చవిచూసిన ఓటమి కేవలం రాజకీయ ఓటమి మాత్రమే కాదు. ఘోర పరాభవంతో కూడిన భయనకర ఓటమి. ఓటమి కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు, గతంలోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమిని పలుసార్లు చవి చూసింది. కానీ, ప్రస్తుత ఓటమి లాంటి ఓటమి గతంలో ఎప్పుడు ఎదురుకాలేదు. మరీ ఇంతలా, పార్టీ అస్థిత్వానే్న ప్రశ్నించే స్థాయిలో వరసగా రెండవ సారి ఓడిపోవడం పార్టీని కుదిపేస్తోంది, కుంగదీస్తోంది. అదే సమయంలో ఓటమిని ఎదుర్కునే సమర్ధ నాయకత్వం లేక పోవడం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని ముందెన్నడూ లేని విధంగా దెబ్బతీసింది. ఒక విధంగా చూస్తే మృగరాజు గర్జనకు హడలి పోయిన అరణ్య జీవుల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హడలి పోతున్నారు. తమ రాజకీయ భవిష్యత్ గురించి భయపడుతున్నారు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవం.
అనేకమంది రాజకీయ విశే్లషకులు పేర్కొన్న విధంగా- ఎన్నికల్లో ఓడినా, ఆశించిన విధంగా మెజారిటీ సాధించలేక పోయినా కాంగ్రెస్ బలం కనీసం మూడంకెల సంఖ్యకు చే రుంటే.. అదో రకం. ఆ ఓటమి ఎంతోకొంత గౌరవప్రదంగా ఉండేది, ఎంతోకొంత ఊరట అయినా మిగిలేది. కానీ, దేశ ప్రజలు 2014లో కాంగ్రెస్ పార్టీని ఎంతగా తిరస్కరించారో 2019లోనూ అంతగా ఛీ కొట్టారు. నిజానికి 2014లో కాంగ్రెస్ ఓటమి కొంతవరకు ఉహించిందే, పదేళ్ళ పాటు అధికారంలో ఉండి చేసిన తప్పులకు శిక్షగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని సరిపెట్టుకోవచ్చును. కానీ, 2019లో అలా కాదు, ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రభుత్వంపై పోరా టం చేయడంలో విఫలమై వరసగా రెండవ సారి ప్రజలు తిరస్కరించడం కాంగ్రెస్ పార్టీని తలెత్తుకో లేకుండా చేసింది. ఎవరి విషయం ఎలా ఉన్నా- కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ, ఆయన బృందం, అలాగే కాంగ్రెస్ అనుకూల మీడియా (్భజపా-మోదీ వ్యతిరేక మీడియా అంటే బాగుంటుందేమో!) వారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరీ ఇంతగా ఓడిస్తారని ఉహించలేక పోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తమకు తాము ఉహించుకుని ‘ఉహాజనిత’ వ్యతిరేకతపై ఆశలు పెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆశించారు. ‘చౌకీదార్ చోర్’ లాంటి నినాదాలు శక్తిమంతమైన మంత్రాలుగా పనిచేస్తాయని, ప్రియాంకా వాద్రా బ్రహ్మాస్త్రం అద్భుతాలు సృష్టిస్తుందని ఆశించారు. అయితే, ఆ ఆశలు ఫలించలేదు. ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని విధంగా కాంగ్రెస్ పార్టీని కేవలం 52 సీట్లకే పరిమితం చేశారు. పుండుమీద కారం పూసిన విధంగా సొంత ‘కుటుంబ’ నియోజక వర్గం అమేథిలో రాహుల్ ఓడిపోయారు. కేరళలోని వాయనాడ్ ప్రజలు కరుణించారు కనుక అయన పార్లమెంట్‌లో ఉన్నారు. లేదంటే పార్టీ అధ్యక్ష పదవికి మాత్రమే రాజేనామా చేసిన ఆయన రాజకీయాలకే స్వస్తి చెప్పే వారో లేక ఇంకెలాంటి అఘాయిత్యానికి పాల్పడే వారో.. ఏమో.. ఊహించుకోవచ్చును.
ఎంతటివారికైనా ఇంత పెద్ద ఎదురుదెబ్బ తగిలినప్పుడు కోలుకోవడం అంత సులభం కాదు. అందులోనూ, రాహుల్ గాంధీ లాంటి అదోరకం (మామూలు పరిభాషలో అయితే అపరిపక్వ లేదా జులాయి అంటారేమో) రాజకీయ నాయ కులకు అసలే సాధ్యం కాదు. అందుకే ఆయన సింపుల్‌గా పలాయన మంత్రాన్ని ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ నిస్తేజంలో మునిగి పోయింది. గతంలో అనేక ఆటుపోట్లను చూసిన పార్టీ ఎన్నికల క్రతువు ముగిసి మూడు నెలలు గడిచినా ఇంకా కోలుకోలేక పోతోంది. కిందా మీద అవు తోంది. ఏమి జరిగిందో, ఏమి జరుగుతోందో అర్థం కాక అష్ట్రావక్ర విన్యాసాలు పోతోంది. ప్రజల దృష్టిలో, ప్రపంచం దృష్టిలో మరింతగా పలచనవుతోంది.
కాగా, ఎన్నికల్లో పరాజయానికి నైతిక బాధ్యత సాకుగా చూపి రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రదర్శించిన అత్యు త్సాహం లేదా అతి విశ్వాసం ఫలితాల అనంతరం ఆయనను తలెత్తుకోలేకుండా చేశాయి. అందుకే, ఆ పరాభవానికి రాహుల్ గాంధీ నైతిక బాధ్యతనే ముసుగువేసి పలాయనం చిత్తగించారు. ఏమి ఆశించి రాహుల్ బృందం రాజీనామా డ్రామాను తెరమీదకు తెచ్చిందో గానీ, ‘రాహుల్ రాజీనామా’ డ్రామా ఒక ప్రహసనంగా మారి, పార్టీ ఓటమిని మించిన పరాభవానే్న మిగిల్చింది. సుమారు రెండు నెలలపాటు సాగిన రాజీనామా ప్రహసనం చివరాఖరుకు- కాంగ్రెస్ పార్టీ బలహీనతను బహిర్గతం చేసింది. నెహ్రూ-గాంధీ కుటుంబం చేయి వదిలితే బతకలేమనే బలహీనతను కాంగ్రెస్ నాయకులు బయట పెట్టుకున్నారు. అందుకే, కాంగ్రెస్ కొత్త అధ్యక్ష పదవికి నెహ్రూ-గాంధీ కుటుంబం దూరంగా ఉంటుందని, ఎన్నికల ప్రక్రియకు సైతం దూరంగా ఉంటుందని ఊదరగొట్టి చివరాఖరుకు ‘ఎడమ చేయి తీసి పుర్ర చెయ్యి పెట్టు’ అన్నట్లుగా రాహుల్ గాంధీ స్థానంలో ‘మళ్ళీ’ సోనియా గాంధీ, (తాత్కాలిక ట్యాగ్‌తో) పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారు. చాంతాడంత రాగం తీసి, ఏదో పాట పాడారన్నట్లుగా, సుమారు రెండు నెలల పాటు సాగిన రాహుల్ రాజీనామా ప్రహసనం పార్టీ దౌర్భాగ్య స్థితికి అద్దం పడుతోందని- కాంగ్రెస్ నాయకులే వాపోయారు. ఈ ప్రహసనం ఇంకా కొనసాగిస్తే పార్టీకి క్షేమం కాదని కాంగ్రెస్ నాయకులు బహిరంగ ప్రకటనలు చేశారు. నిజానికి ఎన్నికలలో ఓటమి కంటే, రాహుల్ రాజీనామా ప్రహసనం పార్టీ ప్రతిష్టను మరింతగా పలచన చేసిందని, కోలుకోలేని విధంగా పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసిందని పార్టీ నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
మరో వంక రాజీనామా ప్రహసనం సాగుతున్న సమయంలోనే కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. గోవా లో కాంగ్రెస్ శాసనసభా పార్టీ ఇంచుమించుగా ఖాళీ అయింది. తెలంగాణ విషయం తెలిసిందే. నిజానికి యూపీ నుంచి ఏపీ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి దారులు వారు వెతుక్కుంటున్నారు. కొద్దిమంది కోటరీ మినహా మిగిలిన సీనియర్, జూనియర్ నాయకులకు గాంధీ-నెహ్రూ కుటుంబ నాయకత్వం మీద విశ్వాసం, విధేయత సన్నబడుతున్నాయి. నెహ్రూ-గాంధీ కుటుంబం కాకుండా వేరొక ‘పరాయి’ వ్యక్తి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే పార్టీ చీలిపోతుందని అందుకే మళ్ళీ సోనియా గాంధీ నాయకత్వం అవసరమని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. అయితే, ఇప్పుడు అంతర్గతంగా సాగుతున్న పరిణామాలను గమనిస్తే, కాం గ్రెస్‌లో మరో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది.
ఇవన్నీ ఒకెత్తు అయితే, ఇటీవల ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాంగ్రెస్ పార్టీ నిష్క్రియా పరత్వాన్ని సినిమా స్కోపులో ప్రపంచం ముందుంచాయ. అనేక కీలక బిల్లుల విషయంలో ప్రధాన ప్రతిపక్షం చేష్టలుడిగి చేతులెత్తేసిందనే అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్ళింది. ఒకే ఒక్క సెషన్‌లో 32 బిల్లులు సభ ఆమోదం పొందడం ప్రభుత్వ పరంగా చూస్తే ఒక రికార్డు. కానీ, ప్రతిపక్ష కోణం నుంచి చూస్తే, అది ప్రతిపక్షం వైఫల్యం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎన్నికల ఓటమికి మించిన ఓటమి. లోక్‌సభలో అధికార పార్టీ కి సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపధ్యంలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్షం విఫలమైందంటే కొంతవరకు ఒప్పుకోవచ్చును. కానీ, ప్రభుత్వానికి సంఖ్యా బలం లేని రాజ్యసభలో విపక్షాలు వ్యతిరేకించిన ఆర్టీఐ సవరణ బిల్లు, ముమ్మారు తలాక్ బిల్లుల మొదలు జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణం రద్దు, రాష్ట్ర విభజన లాంటి సంచలన బిల్లులకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందడం ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ చేతకాని తనాన్ని స్పష్టం చేసింది. పార్లమెంట్ ఉభయసభల్లో పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు గమనిస్తే రాహుల్ గాంధీ చూపిన పలాయనవాదం బాటలో కాంగ్రెస్ పరుగులు తీస్తోందన్న అనుమానం బలపడుతోంది.
కొద్దిమంది సోకాల్డ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకుని, స్వార్ధ ప్రయోజనాల పరిరక్షణ కోసం తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని నిర్వీర్యం చేస్తున్నాయని, ఫలితంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నా యకత్వం వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులను ఎలా ఎదుర్కోవాలో కూడా పాలుపోక కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గతంలో పుల్వామా, పఠాన్ కోట్ ఘటనల వ్యవహారంలో ఏవిధంగా అయితే పాకిస్థాన్ అనుకూల వైఖరిని ప్రదర్శించి భంగపడిందో ఇప్పుడు ఆర్టికల్ 370 విషయంలో అదే విధమైన భంగపాటును కాంగ్రెస్ ఎదుర్కుంటోంది. ఎన్నికల ఫలితాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదనిపిస్తోంది. పార్టీలో అసలు ఏమి జరుగుతుందో కూడా తెలియని అయోమయ స్థితిలో కాంగ్రెస్ నాయకత్వం కొట్టుమి ట్టాడుతోంది. జమ్ము కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యతిరేకించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ భువనేశ్వర్ కలితా తమ పదవికి రాజీనామా చేశారు. చిత్రం ఏమంటే, కలితా రాజీనామాను చైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోదించి సభలో ప్రకటించే వరకు రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్‌కు అందుకు సంబంధించిన సమాచారమే లేదు. హర్యానాకు చెందిన సీనియర్ నాయకుడు దీపేంద్ర హూడా, రాహుల్ గాంధీ సన్నిహితుడైన జ్యోతిరాదిత్య సింధియా, మహారాష్ట్ర నేత మిలింద్ డియోరా ఇంకా అనేక మంది నాయకులు కశ్మీర్ విషయంలో పార్టీ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని బహిరంగంగా సమర్ధించారు. పార్టీని తప్పు పట్టారు. నిజానికి నాయకత్వం, దిశా నిర్దేశం, విధానపరమైన స్పష్టత లోపించి కాంగ్రెస్ ఇంతటి కీలక విషయంలో తడబడుతోంది. తప్పటడుగులు వేస్తోంది. పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ ప్రవక్త అభిషేక్ మను సిఘ్వీ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. జమ్ము కశ్మీర్ విషయంలో బీజేపీ రాజకీయంగా పై చేయి సాధించిందని ఆయన అంగీకరించారు.
మరోవంక పార్టీ సీనియర్ నాయకులు చిదంబరం, కపిల్ సిబల్, మనీష్ తివారీ, మణిశంకర అయ్యర్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో ఆపార్టీ నాయకుడు, పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లాంటి వారు ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్ పునర్వవస్థీకరణ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నంలో తప్పులో కాలేసి పార్టీ ప్రతిష్టను మరింతగా పలచన చేస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. నిజానికి 370 రద్దు నిర్ణయం ప్రభుత్వం హఠాత్తుగా తీసుకోలేదు. బీజీపే ఎన్నికల ప్రణాళికలోనే తాము అధికారంలోకి వస్తే 370 రద్దు చేస్తామని ప్రకటించింది. సైన్యాన్ని మోహరించడం, అమరనాథ్ యాత్ర రద్దు తదితర చర్యల ద్వారా ప్రభుత్వం బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా ఆర్టికల్ 370 రద్దు దిశగా అడుగులు వేస్తోందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ భయాందోళనలు వ్యక్తపరిచిందే కానీ స్పందించవలసిన విధంగా స్పందించలేదు. అందుకే, సభలోపల వెలుపల కూడా గందరగోళానికి గురైంది. ఇంతటి కీలక నిర్ణయం మీద రాహుల్ గాంధీ 24 గంటలు వౌనంగా ఉన్నారు. ఆ తర్వాత కూడా ట్విట్టర్‌లో మాత్రమే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
ఇక లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర రంజన్ చౌదరి తన అసందర్భ ప్రసంగంతో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నేట్టివేశారు. సిమ్లా, లాహోర్ ఒప్పందాలను ప్రస్తావిస్తూ ఆర్టికల్ 370 మన దేశం అంతర్గత విషయం ఎలా అవు తుందని ప్రశ్నించి, సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు. ఇదే అదనుగా హోం మంత్రి అమిత్ షా- అధీర రంజన్ వ్యక్తపరిచిన అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ అధికార అభిప్రాయమా? అని ప్రశ్నించే సరికి సభలో ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇతర నాయకులు తెల్లమొహం వేయక తప్పలేదు. ఇదే విషయంపై ప్రసంగించిన మనీష్ తివారీ ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని ‘్ఫఫ్టీ షేడ్స్ అఫ్ గ్రే’ అనే శృంగార నవలతో పోల్చి కాంగ్రెస్ పార్టీని మరింత ఇరకాటంలోకి నేట్టేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఒక్క కశ్మీర్ విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ స్పష్టత లేదు. ముఖ్యంగా ప్రజల నాడిని పట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇంకా విఫలం అవు తూనే ఉంది. ప్రధానంగా దేశ జనాభాలో 80 శాతం ఉన్న మెజారిటీ ప్రజల మనోభావాలను ఉపేక్షించి, వారి అభీష్టానికి వ్యతిరేకంగా రాజకీయ మనుగడ సాధ్యం కాదన్న సత్యాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించలేక పోతోంది. మరోవంక రాహుల్ గాంధీ స్థానంలో సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా పార్టీలో చోటు చేసుకుంటున్న విపరీత పరి ణామాలను చక్కదిద్దే సామర్ధం ఆమె సహా ఎవరికీ లేదని స్పష్టమవుతోంది. సోనియా గాంధీకి హిందీ పాఠాలు నేర్పిన గురువుగా, ఆమెకు అత్యంత సన్నిహితునిగా పేరొందిన జనార్దన్ ద్వివేదీ సైతం కశ్మీర్ విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. రాజ్యసభలో పార్టీ చీఫ్ విప్‌గా సోనియా గాంధీ ఏరికోరి ఎంపిక చేసిన భువనేశ్వర్ కలితా రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేయడమే కాదు, బీజేపీలో చేరిపోయారు. ఇంకా అనేక మంది నాయకులు అదే బాటలో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కశ్మీర్ కల్లోలం సృష్టించిన ప్రకంపనలు చివరికి ఎక్కడికి దారి తీస్తాయో అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

-రాజనాల బాలకృష్ణ 99852 29722