మెయిన్ ఫీచర్

అక్షరాస్యత పెరిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్‌లో వేడుకలు
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని యునెస్కో ప్రతి ఏటా సెప్టెంబర్ 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు పారిస్‌లో వేడుకగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అక్షరాస్యతపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రత్యేకించి పురస్కారాలను అందజేయబోతున్నారు. వచ్చే ఏడాది కాలానికి కార్యాచరణ రూపొందించారు.
చదువు వ్యక్తి వికాసానికే కాదు, దేశాభివృద్ధికీ, పురోగతికీ తోడ్పడుతుంది.
- ఎం వెంకయ్యనాయుడు ఉప రాష్టప్రతి
భారతదేశంలో అక్షరాస్యత రేటులో విస్తృత స్థాయిలో లింగపరమైన అసమానత ఉంది. వయోజనుల అక్షరాస్యత రేటు పురుషుల్లో 76.9 శాతం ఉండగా, మహిళల్లో ఇది 54.5 శాతం మాత్రమే ఉంది. తక్కువ మహిళా అక్షరాస్యత రేటు భారతదేశంలో కుటుంబ నియంత్రణ, జనాభా స్థిరీకరణ చర్యలపై నాటకీయంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రపంచంలో 35 శాతం నిరక్షరాస్య జనాభా భారతదేశంలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత వృద్ధిలో చారిత్రక క్రమాల ఆధారంగా, 2020 నాటికి ప్రపంచంలో అత్యధికమంది నిరక్షరాస్యులు భారతదేశంలోనే ఉంటారని అంచనా వేశారు. వయోజన అక్షరాస్యత 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని సూచిస్తుంది. యువజన అక్షరాస్యత 15-24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిని సూచిస్తుంది.
ఒకవైపు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆడపిల్లలు చదువులో
దూసుకెళుతున్నారు. మరోపక్క పేద దేశాల్లో బాలికలు పాఠశాల మెట్లెక్కడమే అదృష్టంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లల చదువుకి ఏమాత్రం అనుకూలంగా లేని దేశాల జాబితాను ఓ సంస్థ రూపొందించింది. జాబితాలో ఉన్న దేశాల్లో ఎక్కువ శాతం పేదరికం, పౌష్టికాహార లోపం, అనారోగ్య పరిస్థితులు, అంతర్గత యుద్ధాల వంటి సమస్యలతో సతమతమవుతున్నవే.. ఈ పరిణామాలన్నీ కలిసి ఆ దేశాల్లో ఆడపిల్లల చదువుకు పూర్తిగా దూరం చేస్తున్నాయి. అక్కడ బాలికలను పాఠశాల కంటే పనులకు పంపించడానికే తల్లిదండ్రులు ప్రాధాన్యమిస్తున్నారు. ఇంకొందరైతే చిన్న వయస్సులోనే వారికి పెళ్లిళ్లు చేసి చదువుకోవాలన్న వారి కోరికపై నీళ్లు జల్లుతున్నారు. ప్రాథమిక విద్య, హైస్కూల్, కాలేజీల చదువు పూర్తిచేసిన అమ్మాయిలు, ఆడవాళ్ల అక్షరాస్యత శాతం, టీచర్లు, విద్యార్థుల నిష్పత్తి, విద్యారంగంలో పెట్టుబడుల వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆడపిల్లల చదువుకు అనుకూలంగా లేని దేశాల జాబితాను సిద్ధం చేసింది ‘వన్ క్యాంపైన్’ అనే సంస్థ. ఇందులో సిరియా వంటి కొన్ని దేశాలకు ఆ జాబితాలో చేరే అవకాశం ఉన్నా సరిపడా గణాంకాలు లేని కారణంగా వాటిని చేర్చలేదు.
ఆ దేశాలు
సౌత్ సూడాన్/ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్/ నైగర్/ ఆఫ్ఘనిస్థాన్/ చాద్/ మాలి/ గినియా/ బర్కినా ఫాసో/ లైబీరియా/ ఇథియోపియా
ఆడపిల్లలు చదువుకి దూరమయ్యేకొద్దీ ప్రపంచం పేదరికానికి మరింత దగ్గరవుతూనే ఉంటుందన్నది మేధావుల అభిప్రాయం. ఇప్పటికీ 13 కోట్ల మంది ఆడపిల్లలు స్కూళ్లకు దూరంగా ఉన్నారు. ఇకముందు ఈ సంఖ్య తగ్గించడమే కానీ పెరగకుండా చూసుకోవాలి.
భారతదేశంలో అక్షరాస్యత సామాజిక - ఆర్థిక పురోగతికి కీలకంగా ఉంది. తాజా అధ్యయనం ప్రకారం భారత అక్షరాస్యత రేటు, ఐదు రెట్ల కంటే ఎక్కువ వృద్ధి సాధించినప్పటికీ, ప్రపంచ అక్షరాస్యత సగటుతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉంది. ప్రపంచంలో భారతదేశం ప్రస్తుతం అతి పెద్ద నిరక్షరాస్య జనాభా ఉన్న దేశంగా గుర్తించబడుతోంది. అనేక ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ భారతదేశ అక్షరాస్యత శాతం మందకొడిగానే వృద్ధి చెందింది. ఇలాగైతే సంపూర్ణ అక్షరాస్యత స్థాయి సాధించడానికి భారతదేశానికి 2060 వరకు సమయం పడుతుందని సూచించింది ప్రపంచవ్యాప్త నివేదిక.

తెలంగాణ మోడల్ ఓ చరిత్ర
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం మిగిలిన అన్ని రాష్ట్రాలకూ ఒక నమూనా అని చెప్పాలి. కేజీటు పీజీ ఉచిత విద్యను అందించే దిశగా ప్రభుత్వం విద్యాసంస్కరణలు అనేకం చేపట్టింది. ముఖ్యంగా అవినీతిని పారద్రోలేలా అన్ని విభాగాల్లో ఐసీటీ వినియోగం, త్వరితగతిన నిర్ణీత కాల వ్యవధిలోనే అనుమతులు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాం. రాష్ట్రంలో బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు బాలికల కోసం గురుకుల విద్యాలయాలు నెలకొల్పాం. నిరక్షరాస్యత నిర్మూలన కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం, వయోజన విద్య ప్రోత్సాహానికి విద్యార్థుల సేవలు వినియోగించుకుంటున్నాం. యూనివర్శిటీల్లో పరిశోధనలకు పెద్ద పీట వేస్తున్నాం. కస్తూరిబా బాలికా విద్యాలయాలను పటిష్టం చేశాం. పూర్వ విద్యను ప్రారంభించడంతో పాటు స్కూళ్లలో విద్యార్థులు, టీచర్ల హాజరు శాతాన్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాం. కొంత మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా వారికి సైకిళ్ల పంపిణీ కూడా చేశాం. అన్ని ప్రవేశపరీక్షలను సకాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహించాం. దరఖాస్తు మొదలు ప్రవేశపరీక్షలకు సంబంధించి అంతా ఆన్‌లైన్‌లోనే సంపూర్ణంగా నిర్వహిస్తున్నాం. చివరికి సీటు అలాట్‌మెంట్ రిపోర్టింగ్ సైతం ఆన్‌లైన్‌లోనే చేసుకునే సౌలభ్యం కల్పించాం. ఫీజులు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఏ సందర్భంలోనైనా ఫీజులు రిఫండ్ ఇవ్వాల్సి వస్తే చాలా తేలికగా ఆయా బ్యాంకు అకౌంట్లకు పంపించడం జరుగుతోంది. మున్ముందు విలువలతో కూడిన విద్య కోసం మరిన్ని చర్యలను తీసుకోబోతున్నాం.
- ఆర్. జగదీష్‌రెడ్డి. విద్యాశాఖామంత్రి , తెలంగాణ

ప్రపంచ గురు భారత్
ప్రపంచ జ్ఞాన వ్యవస్థలో భారతదేశం చాలా కీలక పాత్ర పోషించబోతోంది. భారత్ ప్రపంచ గురువు కాబోతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సంస్కరణ ‘నిష్టా’ పేరిట 42 లక్షల మంది టీచర్లకు శిక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. విలువలు, ప్రమాణాలతో కూడిన విద్యను అందించే దిశగా అనేక చర్యలను కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ తీసుకుంది, మరిన్ని చర్యలను తీసుకోబోతోంది. నూతన విద్యా విధానంపై భారతీయులు అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలనేదే మా ఉద్దేశం. రాష్ట్రాల విద్యామంత్రులతోనూ, విద్యా శాఖ కార్యదర్శులతోనూ, ముఖ్యమంత్రులతోనూ నూతన విద్యావిధానంపై అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఎన్‌జీవోలు, విద్యారంగంలో గణనీయమైన ప్రగతి సాధించిన వారిని నేరుగా సంప్రదించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాం, ఇక సామన్య ప్రజలు సైతం తమ అభిప్రాయలను తెలిపే వీలు కల్పించాం. ఇందుకు ప్రత్యేకించి ఒక పోర్టల్‌ను ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ ఎటువంటి విద్యా విధానాన్ని కోరుకుంటున్నారనేది తెలియజేయాలని కోరుతున్నాం. ప్రతి సంస్కరణ దేశ పురోభివృద్ధికి బాటలు వేయాలనేదే మా ఉద్దేశం. ఉన్నత విద్య సంస్కరణలు, భాషల అభివృద్ధి, పరిశోధనలకు పెద్ద పీట వేయాలని నూతన విద్యావిధానంలో తలపెట్టాం. ఇందుకు పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి. నిధుల సమీకరణ అనివార్యమే, అపుడే మనం ఆశించే సమగ్ర విద్యావిధానాన్ని అందించగలుగుతాం.
- రమేష్ పోఖ్రియాల్ నిషాంత్, కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి

పాఠశాలల ముఖచిత్రం మారుతోంది
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల ముఖచిత్రం మారుతోంది. అమ్మఒడి పథకంతో స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. అన్ని స్కూళ్లకు ప్రహరీ గోడలు, నిరంతరం తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ, ఐసీటీ సదుపాయాల ఏర్పాటుకు ఈసారి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించని విధంగా విద్యకు ఈసారి బడ్జెట్‌లో 15 శాతం నిధులను కేటాయించడమైంది. వౌలిక సదుపాయాలకే 1500 కోట్లు కేటాయించాం. మరో 25వేల టాయిలెట్లను రెండేళ్లలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గతంలో వివిధ కారణాలతో ఆరువేల పాఠశాలలను మూసివేశారు. వాటిని ఎందుకు మూసివేయాల్సి వచ్చిందో పాఠశాలల వారీ సమీక్షిస్తున్నాం, అవసరమైన చోట వాటిని తిరిగి తెరిపిస్తున్నాం. స్కూళ్లలో బయోటాయిలెట్స్ ఎంత వరకూ సాధ్యమో అధ్యయనం చేయిస్తున్నాం. కాలపరిమితి ముగియగానే పాఠశాల యాజమాన్య కమిటీల నియామకాలకు చర్యలు తీసుకుంటాం. ఈ కమిటీల్లోనూ గత ప్రభుత్వం రాజకీయాలు చేసింది. రాజకీయాలకు అతీతంగా వీటి నియామకాలు చేపడతాం. రాష్ట్రంలో మూడు దశల్లో కేంద్రం అనుమతించిన 164 మోడల్ స్కూళ్లలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. తద్వారా ఆంధ్రప్రదేశ్ మిగిలిన అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.
- ఆదిమూలపు సురేష్. విద్యాశాఖామంత్రి, ఆంధ్రప్రదేశ్