మెయిన్ ఫీచర్

అనుబంధాలను పెంచుకోవాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ, ఇరుగుపొరుగులతోనూ, కొలీగ్స్‌తోనూ అనుబంధాలను పెంచుకోవాలంటే.. వారి అభిమానాన్ని చూరగొనాలంటే.. వారినుండి ఆదరణను పొందాలంటే.. అందుకు తగిన విధంగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతయినా వుంది.
ఎదుటివారి ప్రవర్తనలనుబట్టి మనం ప్రవర్తించాలి. అసూయను, అహంభావాన్నీ, ఆధిక్యతనూ తోటివారి ముందు ప్రదర్శించకూడదు. బడాయి కబుర్లు చెపుతూ ఫాల్స్ ప్రిస్టేజిని ప్రదర్శించకూడదు. మన ప్రవర్తనలో, మాటల్లో నిజాయితీ ఉండాలి. ఇతరులతో పరిచయమవగానే అతి మంచితనాన్ని ప్రదర్శిస్తూ, అనవసరపు వాగ్దానాలను చేయకూడదు.
అలాచేసి తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే అవతల వారిముందు పలుచనయి తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడటమేకాక, మరోసారి ఎదుటివారు వారి మాటను నమ్మరు. ఎవరైనా, అవసరమైన మన సహాయాన్ని ఆశించినపుడు, దాన్ని మనం చేయలేకపోతే నిజాయితీగానూ, సున్నితంగానూ ఆ విషయాన్ని అవతలవారికి తెలియజేయాలి. దానికేముంది, అలాగే అంటూ వారిని మభ్యపెట్టకూడదు. ఆఫీసు చిరాకును ఇంట్లో ప్రదర్శించకూడదు. భర్త, భార్య మీద ఆగ్రహాన్ని ప్రదర్శిస్తే, భార్య పిల్లల మీద విసుక్కుంటే ఎదుటివారి మనస్సు చిన్నబోతుంది, వారి ఆత్మాభిమానం దెబ్బతింటుంది. పిల్లలకూ మనస్సుంటుంది. వారి లేత మనస్సులు పెద్దల ప్రవర్తనవల్ల గాయపడతాయి. ప్రతివారికీ సమస్యలుంటాయి. ఆఫీసులో, ఇంట్లో, ఇరుగుపొరుగులతో. అయితే ఆ సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. తమ సమస్యల చికాకులు, విసుగును ఇతరుల మీద ప్రదర్శించకూడదు. మన సమస్యలను, బాధను ఎదుటివారికి పంచడం, మన నిరుత్సాహాన్ని ప్రదర్శించడంకంటే నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడాలి. అటువంటివారితో తోటివారు చక్కగా కలిసిపోతారు. వారికి చేరువవుతారు.
ఎదుటివారి ప్రవర్తన, పనులు, గుణాలు నచ్చినప్పుడు ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు వారిని మెచ్చుకోవాలి. కుటుంబ సభ్యులు కానీ, తోటివారు కానీ ఏదైనా రంగంలో, పనిలో విజయం సాధించినప్పుడు వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎవరైనా తప్పుచేశారని, వారివల్ల పొరపాటు జరిగిందని తెలిసినప్పుడు, వారిమీద చిందులు తొక్కకుండా, అతిగా విమర్శించకుండా, వారి తప్పువారు గ్రహించేటట్లుగా సున్నితంగా మందలించాలి. ఇతరులనుంచి కానీ, తమ కుటుంబ సభ్యులనుంచి సహాయం పొందినప్పుడు వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒకరి పరోక్షాన మరొకరితో వారిని గురించి తేలికగా మాట్లాడటం, వారిని చులకన చేయడం, విమర్శించడం వారు మనల్ని నమ్మి చెప్పిన ఆంతరంగిక విషయాలను బట్టబయలుచేయడం సభ్యత కాదు. అలాచేస్తే, వారికి ఇతరులు ఎన్నడూ చేరువ కాలేరు.
ఎదుటివారికి తేలికగా ఉచిత సలహాలను ఇవ్వకూడదు. ఎంత స్నేహం ఉన్నప్పటికీ త్వరపడి ఇతరుల స్వవిషయాల్లో జోక్యం కలిగించుకోకూడదు. తోటివారికి తాముచేసిన సహాయాన్ని చాటింపు వేయకూడదు. ఆ విషయాన్ని వెంటనే మరచిపోవాలి. అయితే బాధలో కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్న వారిని, మనకు సహాయం అందిస్తున్న వారినీ జీవితాంతం మరువకూడదు. కుటుంబ సభ్యులతో ప్రేమగా ప్రవర్తించాలి. కుటుంబ సభ్యుల మనస్సును, ఆలోచనలను అర్థం చేసుకోవాలి. వారివల్ల పొరపాటు జరిగితే మందలించి సరిదిద్దినట్లే, వారు చేసిన మంచి పనులకు అభినందించాలి. కుటుంబంలోని పెద్దవారి పట్ల ఆదరణ చూపుతూ, వారిని గౌరవించడం, చిన్న పిల్లలతో ప్రతిరోజూ కొంత సమయం గడిపి వారిని సంతోషపెట్టడంవల్ల కుటుంబ సభ్యులతో అనుబంధం పెంపొందుతుంది. మాటల్లో నిష్ఠూరం, వ్యంగ్యం, హేళన, ఎద్దేవా ధ్వనించకూడదు. మాటల్లో ఆత్మీయత, మృదుత్వం ఉంటే తోటివారు వారికి చేరువవుతారు. బాహ్యసౌందర్యం కంటే, ఆత్మసౌందర్యాన్ని పెంచుకోవాలి. అటువంటి వారికే గుర్తింపు, విలువ, గౌరవం లభిస్తాయి. సమాజంలోని ప్రతి వారికీ నచ్చినట్లుగా ప్రవర్తించడం అసాధ్యం. మన ప్రవర్తనలో నిజాయితీ, మంచితనం వుండి తీరాలి. మనం న్యాయం, ధర్మం వైపు ఉండేలా నడుచుకోవాలి. ధర్మోరక్షతి రక్షితః

- కంచర్ల సుబ్బానాయుడు 94926 66660