మెయిన్ ఫీచర్

కదిలిన న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక బలమైన ప్రజా ప్రతినిధి, తన ఇంటికి సాయం కోసం వచ్చిన బాలికపై అత్యాచారం చేశాడు. న్యాయం కోసం ఆ బాధితురాలు, ఆమె కుటుంబం కోర్టుకెక్కడంతో కేసు వాపసు తీసుకోమని బెదిరించాడు. అధికార బలానికి లొంగని ఆ బాధితురాలి కుటుంబాన్ని నానా యాతనలు పెట్టాడు ఆ బలమైన ప్రజా ప్రతినిధి.. చివరకి అసలు తనపై కేసే లేకుండా చేయడానికి బాధితులురాలు, ఆమె లాయరును కూడా చంపించే ప్రయత్నం చేశాడు.. ఒక పెద్ద ట్రక్కుతో వారు వెళ్తున్న కారుకు యాక్సిడెంట్ చేయించాడు.. ఇదేదో హిట్ సినిమా కథ అనుకుంటున్నారు కదూ.. కానే కాదు.. అంతకంటే గొప్ప మలుపులున్న ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కథ.. హృదయాలను కదిలించే కథ.. అధికారబలం, ధన ప్రాబల్యం, పలుకుబడి, కుట్రలు, హత్యాప్రయత్నాలు.. ఇవేవీ ఆమె సంకల్పాన్ని కదిలించలేకపోయాయి. ఇవన్నీ తెలుసుకున్నారో ఏమో.. న్యాయమూర్తులు సైతం ఆమె వ్యథకు కదిలిపోయి అత్యాచార బాధితురాలి ముంగిట్లోకే న్యాయవ్యవస్థ కదిలివచ్చింది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఇలా బాధితురాలు ఉన్నచోటే తాత్కాలికంగా ప్రత్యేక స్పీడ్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కావడం భారతదేశంలో ఇదే మొదటిసారేమో.. దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ బాధితురాలు చికిత్స పొందుతున్న అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ(ఎయిమ్స్)కు తరలి వచ్చారు. ఈ ప్రాంగణంలో ‘జయప్రకాశ్ నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్’ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక న్యాయస్థానం ఎదుట ప్రధాన నిందితులైన భాజాపా బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్, సహనిందితులు శశిసింగ్‌లను కూడా హాజరు పరిచారు. వీరిని తీహార్ జైలు నుంచి తీసుకువచ్చారు..
ఎయిమ్స్‌లో ఏర్పాటైన తాత్కాలిక న్యాయస్థానంలో మొత్తం రహస్య విచారణే కొనసాగింది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి, యూపీలోనే అయితే కేసు విచారణ ప్రభావితం అయ్యే ప్రమాదం, కేసు స్వభావరీత్యా ఎలాంటి జాప్యానికీ తావు లేకుండా చూడటానికే ‘ఎయిమ్స్’ ప్రాంగణంలో తాత్కాలిక కోర్టును ఏర్పాటు చేశారు. క్రిటికల్‌కేర్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని స్ట్రెచర్‌లో కోర్టుహాలుకు తీసుకువచ్చారు. కేవలం న్యాయమూర్తికి మాత్రమే కనిపించేలా బాధితురాలి స్ట్రెచర్ ఉంచారు. ప్రతివాదులు, ప్రతివాదుల తరపు న్యాయవాదులు ఆమెకు కనిపించకుండా ఉండేలా స్ట్రెచర్‌ను ఉంచారు. బాధితురాలి వెన్నంటే సీనియర్ నర్సు కూడా ఉంది. ఆడియో, వీడియో రికార్డింగులు చేయలేదు. సీసీటీవీ కెమెరాలను స్విచాఫ్ చేసేశారు. నిందితుల తరఫున ఇద్దరు న్యాయవాదులను మాత్రమే అనుమతించారు. ఇటీవలి హైకోర్టు సూచనల ప్రకారం బాధితురాలు, నిందితులు ముఖాముఖి ఒకరికొకరు ఎదురుకాకుండా చర్యలను చేపట్టారు. అందుకే నిందితురాలి స్ట్రెచర్‌ను కేవలం న్యాయమూర్తికి మాత్రమే కనిపించేలా చేశారు.
కేసు-ఘటనలు
* జూన్-4, 2017లో ఉద్యోగం ఇప్పించమని అడగడానికి ఎమ్మెల్యే కులదీప్ సెంగర్ ఇంటికి వెళ్తే ఆయన తనను రేప్ చేశాడని ఒక మైనర్ బాలిక ఆరోపించింది. ఉద్యోగం వచ్చేందుకు సాయం చేయమని అడగడానికి బంధువులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లానని, ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పింది. కానీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో యువతి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తమ ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని బాలిక ఆరోపించింది.
* జూన్-11, 2017లో బాలిక కనిపించకుండా పోయింది. ఆ తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.
* జూన్-20, 2017లో బాధితురాలు ఔరయ్యా గ్రామంలో కనిపించింది. తర్వాత రోజు ఆమెను ఉన్నావ్ తీసుకొచ్చారు.
* జూన్-28, 2017లో బాధితురాలిని కోర్టులో హాజరు పరిచారు. సీఆర్పీసీ సెక్షన్ 164 ప్రకారం ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. పోలీసులు వాంగ్మూలంలో ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగర్ పేరు చెప్పనివ్వలేదని ఆమె ఆరోపించారు.
* జులై-3, 2017లో వాంగ్మూలం నమోదు చేసిన పది రోజుల తరువాత బాధితురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితురాలు దిల్లీ వచ్చి పోలీసులు తనను వేధించారని చెప్పింది. ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగర్, అతడి సోదరుడు అతుల్ సింగ్ సెంగర్ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని బాధితురాలు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను కోరింది.
* ఫిబ్రవరి-24, 2018లో బాధితురాలి తల్లి బయటికొచ్చారు. ఉన్నావ్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరింది.
* ఏప్రిల్-3, 2018లో బాధితురాలి తండ్రికి, కుల్‌దీప్ సింగ్ సెంగర్ సోదరుడు అతుల్ సింగ్ సెంగర్ మధ్య ఘర్షణ జరిగింది.
* ఏప్రిల్-4, 2018లో ఉన్నావ్ పోలీసులు బాలిక తండ్రిని ఆర్మ్స్ యాక్ట్ కేసులో అరెస్ట్ చేశారు.
* ఏప్రిల్-8, 2018లో బాధితురాలు ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సీఎం ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ఆరోపించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తరువాత తమను బెదరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
* ఏప్రిల్-9, 2018లో బాలిక తండ్రి పోలీసు కస్టడీలో మృతి చెందారు. తర్వాత సోషల్ మీడియాలో బాధితురాలి తండ్రి కనిపిస్తున్న వీడియో, ఫొటోలు వైరల్ కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ పరిణామాలను దురదృష్టకరంగా పేర్కొన్నారు. లఖ్‌నవూ ఏడీజీని ఈ కేసును లోతుగా విచారించమని ఆదేశించిన యోగీ, దోషులు ఎంతటి వారైనా, ఏ స్థానంలో ఉన్నవాళ్లయినా సహించబోమన్నారు.
* ఏప్రిల్-10, 2018లో బాధితురాలి తండ్రి పోస్టుమార్టం రిపోర్టులో అతడికి 14 చోట్ల గాయాలు ఉన్న విషయం బటయకు వచ్చింది. ఈ కేసులో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. రెండు నెలల తర్వాత ఈ కేసులో ప్రత్యక్షసాక్షి కూడా మృతి చెందాడు.
* ఏప్రిల్-11, 2018లో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.
* ఏప్రిల్-12, 2018లో మైనర్ రేప్ కేసులో ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగర్‌ను నిందితుడుగా చేర్చారు.. కానీ అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో స్వయంగా జోక్యం చేసుకున్న అలహాబాద్ హైకోర్టు కుల్‌దీప్ సింగ్‌ను అరెస్ట్ చేస్తారా? చేయరా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
* ఏప్రిల్-13, 2018లో ఎమ్మెల్యేను విచారించడానికి సీబీఐ అతడిని అదుపులో తీసుకుంది. తర్వాత అరెస్టు చేసింది. కేసులో కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
* జులై-11, 2018లో సీబీఐ ఈ కేసులో మొదటి చార్జిషీటు దాఖలు చేసింది. అందులో ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ పేరును చేర్చింది.
* జులై-13, 2018లో ఇదే కేసులో రెండో చార్జిషీటు నమోదైంది. ఇందులో బాధితురాలి తండ్రిని తప్పుడు ఆరోపణలతో ఇరికించాడని కులదీప్ సింగ్, అతడి సోదరుడు అతుల్ సింగ్, కొంతమంది పోలీసులను నిందితులుగా చేశారు. బాధితురాలు మైనర్ కావడంతో కులదీప్ సింగ్ పోక్సో యాక్స్ కింద కూడా ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కుల్‌దీప్ సింగ్, అతుల్ సింగ్‌తో సహా ఏడుగురు నిందితులు ఉన్నారు.
* జులై-28, 2019లో బాధితురాలు తన పిన్ని, అత్త, వకీలుతో రాయ్‌బరేలీ వెళ్తున్న సమయంలో.. వారు ప్రయాణిస్తున్న డిజైర్ కారును 12 చక్రాల ట్రక్కు ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో బాధితురాలి పిన్ని, అత్త మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు, ఆమె వకీలుకు లఖ్‌నవూలోని కింగ్ జార్జి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరూ లైఫ్ సపోర్టుపై ఉన్నారు. కారును ఢీకొన్న ట్రక్కు నెంబరు ప్లేటుపై గ్రీజు పూసి నంబరు కనిపించకుండా చేశారు. బాధితురాలికి ప్రభుత్వం సెక్యూరిటీని ఏర్పాటుచేసింది. కానీ ప్రమాదం జరిగిన సమయంలో ఆమెతో ఒక్క రక్షణ సిబ్బంది కూడా లేరు.
* జులై-30, 2019లో మైనర్ బాలికపై అత్యాచారం, తదనంతర పరిణామాలపై ప్రతిపక్షాల విమర్శలతో బీజేపీ పార్టీ నుంచి కులదీప్ సింగ్‌ను సస్పెండ్ చేసింది. అతనిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ చీఫ్ స్వతంత్రదేవ్‌సింగ్ ప్రకటించారు.
* ఆగస్టు-1, 2019.. ఉన్నావ్ రేప్ కేసులో విచారణలో పురోగతిని వివరించేందుకు ఒక సీబీఐ అధికారి మధ్యాహ్నం 12 లోపు కోర్టుకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
* సెప్టెంబర్-11, 2019లో బాధితురాలి కోసం న్యాయస్థానమే కదిలి వచ్చింది.
ఇవీ జరిగిన సంఘటనలు.. ఒక బాలిక తనపై జరిగిన అత్యాచారానికి కుమిలిపోయి, న్యాయం కోసం తనకలాడుతూ.. తండ్రిని కూడా కోల్పోయి.. బాధలన్నింటినీ పంటి బిగువన భరిస్తూంటే.. భరించలేని నిందితులు ఆమెను చంపాలని యాక్సిడెంట్ చేయించి.. చివరకు ఆమెను వెంటిలేటర్‌పై బతికేలా చేశారు. అయినా కూడా ఆమె తనకు న్యాయం జరుగుతుందనే ఆశతో, విశ్వాసంతో శ్వాసను పీలుస్తోంది..

-దేవి