మెయిన్ ఫీచర్

‘వెండి’ వెన్నెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండి మాట వినగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చేది పడుచుల అందాల పాదాలపై మెరిసే పట్టీలే. లేత తమలపాకుల్లాంటి అమ్మాయిల అందెల రవళిని బట్టి వారి మనసును అర్థం చేసుకోవచ్చు.
పసితనం నుంచి పెళ్ళయ్యేవరకు పట్టీలుగా, తర్వాత వాటితోపాటు మెట్టెలుగా వెండిని ధరించడం సర్వసాధారణం. సంప్రదాయం కూడా. వెండి ఆభరణాలు ధరించడం, రకరకాల డిజైన్లు తయారీలోనూ భారత్ అగ్రగామి. బంగారం, వెండితో చేసే మీనాకారి ఆభరణాలకు ఆంధ్ర నాట చెప్పలేనంత డిమాండ్. వెండి, బంగారాలను సరిపోల్చవలసి వస్తే.. పసిడి ఖరీదైనది, తక్కువగా లభించేది.
బంగారం, ప్లాటినం, ఇరీడియం, పెల్లాడియం వంటి విలువైన లోహాల్లో అధికంగా లభ్యమయేది వెండి మాత్రమే. ధరలో ఆదరణలో వెండిది ఎప్పుడూ పుత్తడి తరువాతి స్థానం. అయితే బంగారానికి లేని ఎన్నో విశేష గుణాలు వెండికి ఉన్నాయి కనుకే ఆంధ్రుల ఆదరణ పొందింది.
అందం, గట్టితనం, కాంతికి స్పందించే గుణం, తేలికగా వివిధ ఆకృతుల్లోకి మారే తీరు వెండికి మాత్రమే ప్రత్యేకం. ఇతర దేశాల్లో కూడా వెండిని రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. మీకో విషయం తెలుసా?..
మనం నేడు విరివిగా ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్లు, టీవీలు, మైక్రోవేవ్ ఓవెన్‌లు, టెలిఫోన్‌లు, వాషింగ్ మెషీన్లు, కంప్యూటర్లు... అన్నింటిలోనూ వెండిని వినియోగిస్తున్నారు. ఇంకా ఫొటోగ్రఫి, వైద్యం, ఫార్మసీ ఎలక్ట్రికల్.. తదితర రంగాల్లోనూ ఇది ఉంది.
పారిశ్రామికంగా కూడా వెండికి మంచి గిరాకీ ఉంది. చాలామంది వెండిని లాకెట్ రూపంలో మెడలో వేసుకుంటారు. చిన్న పిల్లలపై దుష్టశక్తుల కన్ను పడకుండా ఉండేందుకు నడుముకో, కాలికో, మెడలోనో వెండి ఆభరణాలను ధరిస్తారు. బంగారంలో హాల్‌మార్క్‌లాగే వెండి ప్రామాణికతకు గుర్తు స్టెర్లింగ్ సిల్వర్. ఇందులో 92 శాతం వెండి వుంటే మిగిలింది రాగిలాంటి ఇతర లహమే. స్వచ్ఛమైన వెండి, స్టెర్లింగ్ సిల్వర్‌తో ఆభరణాలు చేయవచ్చు. అయితే మిశ్రమ లోహమైన స్టెర్లింగ్ సిల్వర్‌తో నాజూకైన ఆభరణాలే కాక విగ్రహాలు, టేబుల్‌వేర్, ఫర్నీచర్.. తదితర వస్తువులుగా రూపొందించవచ్చు. సంపన్నులకయితే వెండి ఉపయోగం మరింత ఎక్కువ. సంపన్నుల ఇళ్ళలో నాలుగు వైపులా కుర్చీలు వేసిన డైనింగ్ టేబుల్ భోజన గదిలో కనిపిస్తుంది. మధ్యలో వున్న అద్దంతో సమానంగా మెరిసే సిల్వర్ డ్రెస్సింగ్ మిర్ సోఫా.. లాంటి అందాలతో వెండి పలకరిస్తుంది.
ఇక పూజా మందిరం మొత్తంగా వెండి కాంతులతో మెరిసిపోతుంది. వెంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి.. ఇలా రకరకాల విగ్రహాల నుంచి దీపాలు, పళ్లాలు, పీటలు, పూలసజ్జెలు, కుంకుమ బరిణెలు.. అన్నీ వెండివే. బిందెలు, గ్లాసులు, చెంచాలు, స్పూన్లు.. అందాన్నిచ్చే ఇంటి అలంకారాలెన్నో. ఇంటినిండా వెండి వెనె్నలే. వెండిని ఎక్కువగా చూడటంవల్ల పాజిటివ్ శక్తి ప్రసరించి మనసుకు ప్రశాంతత చేకూరుతుందని, ఆరోగ్యమని పరిశీలకులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో వెండికి మరింత క్రేజ్ పెరిగింది. వెండి కానుకలు లేందే పెళ్లిళ్ళు జరగడంలేదు. వెండితో చేసిన పూజా సామగ్రి, డిన్నర్ సెట్లు కానుకలుగా మారాయి. అత్తారింటికి వెళ్ళేకూతురికి మురిపెంగా వెండి ఆభరణాలు, వెండి పళ్లెం, వస్తువులు అందిస్తేగానీ తృప్తిడని ఆడపడుచులు, తల్లిదండ్రులు ఎందరో!?
అయితే వెండిని ఇంటికి తెచ్చుకోవడమే కాదు, వాటి జిలుగులు తరగకుండా పదికాలాలు వెలుగులు చిందించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. బూడిద లేదా ముగ్గుతో రుద్దితే వెండి వస్తువులు నిగనిగలాడతాయి. రోజూ వాడని వెండి వస్తువులను మఖ్‌మల్ లేదా పట్టు వస్త్రంతో చుట్టి గాలి చొరని డబ్బాల్లో భద్రపరచాలి. ఎలాంటి కవర్ లేకుండా చెక్క డబ్బాల్లో వెండి వస్తువులను పెట్టనే కూడదు.
వెండి పాత్రలను వాడిన వెంటనే కడగాలి. కుంకుడుకాయ రసం లేదా సబ్బునీటిలో కొద్దిసేపు నానబెట్టి బేబి బ్రష్‌తో శుభ్రపర్చాలి. తర్వాత మెత్తటి కాటన్ బట్టతో తుడవాలి. ఎక్కువ డిజైన్ వున్న ఆభరణాలకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది.
స్టీలు పాత్రలను, వెండి గినె్నలను రెండూ ఒకేచోట పెట్టకూడదు. దీనివల్ల వస్తువులు దెబ్బతింటాయి. రంగు మారతాయి. మార్కెట్లలో లభిస్తున్న ‘సిల్వర్ డిష్’, ‘సిల్వర్ పాలిష్’ తదితర సొల్యూషన్ ఉపయోగించి వెండి వస్తువులకు మరింత వనె్న తీసుకురావచ్చు. రసాయనిక చర్యల కారణంగా ఉప్పు, కోడిగుడ్డు వంటివి తగిలితే వెండి గినె్నలు వెంటనే నల్లబడతాయి. విలువైన వెండి ఆభరణాలు, పెద్దపెద్ద వస్తువులను ఏడాదికోసారి వెండి షాపుల్లో పాలిషింగ్‌కి ఇస్తే ఎప్పటికీ వాటి వనె్నలు తగ్గవు. వెండి విలువలు తరగవు. కాబట్టి.. ‘వెండి’ మన జీవన విధానంలో మమేకమైపోయింది.

- తులసి జ్యోతి 83330 66000