మెయిన్ ఫీచర్

మూకీ మ్యాజిక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూకీలు -మాట్లాడుకున్నంత సులువుగా ప్రాణం పోసుకోలేదు. మూకీ సినిమా జర్నీ మొదలైన తొలినాళ్లలోనే టాకీలూ పురుడు పోసుకోవడంతో -ఎక్కువ కాలం మూకీలు మనగలగలేకపోయాయి. కాకపోతే -అప్పటికే పౌరాణిక, చారిత్రక మూకీ చిత్రాలపై ఎవరి
పిచ్చిమేరకు వాళ్లు ప్రయోగాలు
చేసేశారు. అందుకోసం -ఎంతో
శ్రమకోడ్చారు. ఉనికిని వదిలేసి అదే లోకం చేసుకున్నారు. ఎక్కడెక్కడికోవెళ్లి.. అక్కడ తయారైన మూకీలను మనోళ్లకు చూపించాలని తాపత్రయపడ్డారు. అందుకు ఆస్తులను సైతం కరగబెట్టేశారు. నిజానికి ‘ఇదీ.. సినిమా పిచ్చి’ అన్నంతగా సాగింది ఆ కాలంలో.
బొంబాయిలో తొలినాళ్ల నుంచీ మూకీలు రూపొందిస్తోన్న దర్శకుడు ధీరేన్ గంగూలి. ఆయన హైదరాబాద్ నవాబ్ సహకారంతో మూడు చిత్రాలు రూపొందించాడు. బిజయ్- జశంత్, కాల్‌నాగ్ చిత్రాలు 1923లో వచ్చాయి. మరుసటి ఏడాదే అంటే 1924లో సాంఘిక చిత్రాలు -మున్సిపల్ ఎలక్షన్, శారద అనే చిత్రాలు విడుదలయ్యాయి. సహజంగా ఎన్నికలలో జరిగే పలు అక్రమాలు, మోసాలపై అప్పట్లోనే సెటైరికల్‌గా మున్సిపల్ ఎలక్షన్ సినిమా రూపొందించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ‘శారద’ చిత్రం రూపొందింది. ఈ సినిమా ప్రభావంతోనే ఆ తరువాత ‘శారద’ చట్టాన్ని బ్రిటీష్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఓ కథనం ఇప్పటికీ వినిపిస్తుంది. కన్యావిక్రయ్ కహానిలో మన తెలుగులో వచ్చిన ‘కన్యాశుల్కం’ కథనే చర్చించారు. అయితే కన్యాశుల్కానికి ఈ మూకీకి దగ్గరి పోలికలున్నాయి కానీ కథంతా వేరువేరుగా ఉంటుందని అప్పటి విశే్లషకులు చెబుతున్నారు. దక్షిణాదినుండి ఉత్తరాదికి వెళ్లి హీరోగా మారిన ‘రాజా శాండో’ స్టార్ హీరోగా వెలిగాడు. గుల్-ఏ-బకావళి చిత్రం కూడా అప్పట్లో ప్రజాదరణ పొందింది. కంఝాబాయ్ రాథోడ్ రచించిన ఓ పార్శీ నాటకం ఆధారంగా పృధ్వీ వల్లభ్ దాన్ని రూపొందించారు. అయితే ఇది వౌఖిక సంప్రదాయంలోవున్న కథనంగా పలు ప్రాంతాల్లో విన్పిస్తుంది. ఇదే కథతో ఎన్‌ఏటి సంస్థ తెలుగులో ‘గులేబకావళి కథ’ను ఎన్టీఆర్, జమున జంటగా రూపొందించిన సంగతి తెలిసిందే. బొంబాయినుంచి బాబూరావ్ పెయింటర్ ‘సతీ పద్మిని’, ‘కళ్యాణ్ ఖజీనా’, ‘కాకా-పూనా ముట్టడి’, ‘విక్రమ్ చరిత్ర’, ‘రజియా బేగం’ చిత్రాలు రూపొందించారు. అయితే ఈ రజియా బేగం చిత్రాన్ని బొంబాయినుంచి తీసుకొచ్చి దర్శకుడు ధీరేన్ గంగూలి హైదరాబాద్‌లో ప్రదర్శించారు. బొంబాయిలో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేయడం నిజామ్‌కు ఏమాత్రం నచ్చలేదు. అందుక్కారణం -ఓ నల్లజాతి బానిస యువకుడి ప్రేమలో రజియా బేగం ఎలా మునిగిపోయిందన్న కథనంతో రూపొందిన చిత్రమది. ఈ చిత్రంలోని ప్రధాన ఇతివృత్తం నిజామ్‌కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో ధీరేన్ గంగూలీకి 24 గంటల సమయమిచ్చి -హైదరాబాద్ విడిచిపొమ్మని నవాబు హుకుం జారీ చేశాడట. కట్టుబట్టలతో ధీరేన్ గంగూలి హైదరాబాద్ వదిలి వెళ్లక తప్పలేదు. ఇది అప్పట్లో ఓ సంచలనంగా చెప్పుకున్నారు.
తెలుగు దర్శక నిర్మాత రఘుపతి ప్రకాష్ ఆర్థికంగా చితికిపోవడంతో స్టూడియోను -అమ్మివేశారు. అయినా చిత్రీకరణ ఆపలేదు. చిత్రీకరణకు అవసరమైన పనిముట్లను అద్దెకు తెచ్చుకొని సినిమా నిర్మాణాన్ని కొనసాగించారు. ద్రౌపది భాగ్య, ఉషాస్వప్న, మహాత్మా కబీర్‌దాస్ చిత్రాలు నిర్మించారాయన. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మూకీలు ఉద్దృతంగా రూపొందుతున్నాయి. అన్ని దేశాలనుంచి వైవిధ్యమైన కథ, కథనాలతో సినిమాలు భారతదేశంపై వెల్లువెత్తాయి. అద్భుతమైన కథనాలతో రూపొందిస్తున్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే వున్నారు. కలకత్తానుంచి వచ్చిన ‘ఇంద్రసభ’ చిత్రం కూడా భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించడంతో సూపర్ హిట్టయ్యింది. బొంబాయినుండి షావుకారి పాశ్, వీర్‌బాలా, సినిమా క్వీన్ చిత్రాలు వచ్చాయి. షావుకారి పాశ్ చిత్రంలో ఓ వడ్డీ వ్యాపారి పేద రైతుకు అప్పులిచ్చి వడ్డీ రూపంలో అతని భూములు లాక్కుంటాడు. ఏ దారిలేక ఆ పేద రైతు పట్నంవెళ్లి ఓ మిల్లులో కార్మికుడిగా
బ్రతుకు కొనసాగిస్తాడు. ఇదే చిత్రంలో డబ్బు పెట్టెపై షావుకారు తలపెట్టి గుర్రుకొడుతుంటే, పట్నంలో అయోమయంగా తిరుగుతున్న రైతు షాట్స్‌ను జత చేసి చూపిన సన్నివేశానికి ప్రేక్షకులు ముగ్దులయ్యారు. కులీన్‌కాంతా, లంకా-నీ-లాడి, అంటరానిపిల్ల (ఇదే ఆ తరువాత మాలపిల్లగా రూపొందిందని చెబుతారు) చిత్రాలు వచ్చాయి. ఇదే సమయంలో బాజీరావు మస్తానీ చిత్రం కూడా వచ్చింది. ఇదే కథతో ఇటీవల దీపికా పదుకొనె కథానాయికగా వచ్చిన బాజీరావు మస్తానీ కూడా ఉంది. అయితే పాత చిత్రంలో కథానాయికగా ఓ విదేశీ యువతి నటించింది. ఇద్దరు అంటరానివాళ్లు చిత్రంలో ఓ హరిజన యువతి, ఓ బ్రాహ్మణ యువకుడికి మధ్య జరిగిన ప్రేమగాథను 1925లోనే చర్చించారు. ఇదే కథతో టాకీలలోనూ ఓ చిత్రం వచ్చింది.
దక్షిణాదిన మూకీలను రూపొందించిన దర్శక నిర్మాతలు నష్టపోవడం విచిత్రం. అదే ఉత్తరాన వ్యాపార దక్షతతో వచ్చిన వ్యాపారస్థులు మంచి అభిరుచి, ప్లాన్‌తో చిత్రాలు రూపొందించి లాభాలు గడించారు. సరైన వ్యాపారస్థులు దక్షిణాదిలో ఈ రంగంలోకి రాకపోవడంతో సినిమా పరిశ్రమపై ఓ అపవాదు బయలుదేరింది. సినిమారంగంలో సంపాదించే ధనం అందరికీ అచ్చిరాదన్న అపప్రద ఆ కాలంలో బలంగా వినిపించింది. 1926లోనే లండన్‌లో టెలివిజన్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. సినిమాకి ధీటుగా టెలివిజన్ భవిష్యత్‌లో అభివృద్ధి చెందుతుందని ఆనాడే ఊహించారు. కానీ అది ప్రజలను చేరుకొనేసరికి దాదాపు 60 ఏళ్లు పట్టింది. ఈ 60 ఏళ్లలో మూకీలు, టాకీలు రూపొందించిన కొందరు దర్శక నిర్మాతలు లబ్ధప్రతిష్ఠులు అవ్వడంతోపాటుగా కోటీశ్వలయ్యారు. రఘుపతి ప్రకాష్ మోహినీ అవతారం చిత్రాన్ని రూపొందించగా, దాదా సాహెబ్ ఫాల్కే నీరాను, ఇతర దర్శక నిర్మాతలు టెలిఫోన్ గాళ్, హోమీ మాస్టర్ చిత్రాలను రూపొందించారు. ఈ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సులోచన నటించారు. మూకీలలో ఆమె అద్భుత నటిగా పేరుపొందారు. వందేమాతరం ఆశ్రమంపై అదే పేరుతో రూపొందించిన చిత్రంతోపాటుగా సువర్ణ కమల్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. పౌరాణిక జానపద చిత్రాలు భారతదేశంలోవున్న ప్రేక్షకులకు నచ్చుతాయన్న విషయం రూఢీ అవ్వడంతో పలు విదేశీ దర్శక నిర్మాతలు టాకీలు తీయడానికి ముందుకొచ్చారు. విదేశీ చిత్రాలతో పోలిస్తే, భారతదేశంలో రూపొందిన మూకీల సంఖ్య తక్కువే. అయితే భారతదేశంలో రూపొందించిన మూకీలలో ఉత్తమమైన చిత్రాలూ వున్నాయి. టాకీలు, మూకీలు చూసినవారిని ఓ పది ఉత్తమ చిత్రాలను చెప్పమంటే ఖచ్చితంగా ఓ మూకీ ఉండటం విశేషం. ఇక 1927 సంవత్సరానికల్లా విదేశాలలో టాకీ చిత్రాల ప్రభంజనం ప్రారంభమైంది. దాంతో భారతదేశంలోవున్న దర్శక నిర్మాతలు స్తబ్దుగా వుండిపోయారు. 1927నుండి 1930దాకా టాకీ మూకీల సంధియుగంగా చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అభిరుచి వున్నవాళ్లు టాకీలను, మూకీలను జమిలిగా రూపొందించడం విశేషం. అమెరికాలో ద జాజ్ సింగర్ టాకీ విడుదలై మంచి పేరుపొందింది. అదే సమయంలో రఘుపతి ప్రకాష్ దశావతారం అన్న మూకీని రూపొందించారు. మశ్చ్యావతారం చిత్రాన్ని ఓ విదేశీయుడు భారతీయ ప్రేక్షకుల కోసం రూపొందించారు. బాబూరావ్ పెయింటర్ తీర్చిదిద్దిన కళాకారుడు వి శాంతారాం. ఆయన రూపొందించిన మూకీ నేతాజీ పాల్కార్. టాకీలు వచ్చాక ఒక్కొక్క నటుడు ఒకే సినిమాలో ఐదు పాత్రలు, ఆరు పాత్రలు, తొమ్మిది పాత్రలు వేయడం ఓ రికార్డ్ అని చరిత్ర చెబుతోంది. కానీ అలనాటి స్టార్ హీరోయిన్ సులోచన ‘వైల్డ్ కాట్ ఆఫ్ బాంబే’ చిత్రంలో ఎనిమిది రకాల పాత్రలు వేసి మెప్పించింది. సంధికాలంలో చార్లీచాప్లిన్ రూపొందించిన అనేక చిత్రాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. ఇదే సమయంలో భారతదేశంలోనూ చార్లీచాప్లిన్ చిత్రాలకు విపరీతమైన ఆదరణ లభించింది. టాకీలు వచ్చిన తొలినాళ్లు కనుక చార్లీచాప్లిన్ చేసిన నేపథ్య సంగీతంతో అల్లిన సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బురపర్చి అలరించాయి. భారతదేశానికి టాకీలు రానున్నాయన్న సమయంలోనే కలకత్తానుండి తొలిసారిగా శరత్ నవల దేవదాస్ చిత్రం రూపొందించారు. బొంబాయినుండి ‘లవ్ ఆఫ్ ఎ మొగల్ ప్రిన్స్’, మద్రాస్ నుండి ‘రామదాసు- భక్త కబీరుదాసు’ చిత్రాలు వచ్చాయి. టాకీల శకం ప్రారంభం కానున్నదన్న భవిష్యత్ సత్యాన్ని గమనించిన దర్శకులు మళ్లీ కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలా? వద్దా? అన్న ఆలోచనలో పడిపోయారు. ఇదే సమయంలో రఘుపతి ప్రకాష్ ఓ తమిళ నిర్మాత ఎ నారాయణన్ స్థాపించిన గ్యారంటీ పిక్చర్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగిగా చేరారు. అప్పుడే ధర్మపత్ని, వీరభూషణ, కపాల కుండల, బిచారక్, మాజిక్ ఫ్లూట్, బాజీదేశ్‌పాండే, గోపాలకృష్ణ, షిరాజ్, హాతింతాయ్ చిత్రాలు వచ్చాయి. టాకీల ఉద్ధృతి అలలు భారతదేశానికి తాకుతున్నాయి. ఇక మూకీల పనైపోయిందని అనుకున్నారు. అందుకు తగ్గట్టే 1930లో టాకీలు ప్రవేశించాయి. కానీ ఆ ఏడాదిలోనే 172 మూకీలొచ్చాయి. తరువాత ఏడాదిలో 207 మూకీలు ప్రేక్షకులను అలరించాయి. విశేషమేమిటంటే, 1930 నుంచి టాకీలు కూడా ముక్కలుగానే ప్రదర్శింపబడ్డాయి. గాంధీజీ సత్యాగ్రహ సన్నివేశాలను చిత్రీకరించి ఎంజిఎంగా టాకీగా విడుదల చేశారు. ఓ ఎగ్జిబిషన్ షోలో ఆయన తిరుగాడిన పలు సన్నివేశాలనూ ఈ ముక్క చిత్రాలలో చూపించారు. మాధురీ చిత్రంలో స్టార్ హీరోయిన్ సులోచన నృత్య సన్నివేశాలను శబ్దంతో ప్రదర్శించారు. ఇవన్నీ టాకీ ముక్కలేనని చెబుతారు. టాకీలు ప్రవేశించినా మూకీలు మరో మూడేళ్లపాటు ప్రేక్షకులను అలరించాయి. ఒకే టిక్కెట్టుపై ఓ టాకీ, ఓ మూకీ అన్న ప్రచారంతో సినిమా ప్రదర్శనలు సాగేవి. 1932లో 88మూకీలు, 1933లో 39 మూకీలు, 1934లో 7మూకీలతో వాటి శకం అంతమైంది. మూకీలపై ప్రేమ వున్నవాళ్లు మాత్రం ఆ చిత్రాలను వదులుకోలేకపోయారు. ఎందుకంటే, దర్శక నిర్మాతలకు తక్కువ బడ్జెట్‌లో చిత్రం పూర్తవుతుంది. అన్ని భాషలవారికీ సినిమాను ప్రదర్శించొచ్చు. దానివల్ల లాభాలు ఎక్కువగా ఆర్జించవచ్చు. అదే టాకీ అయితే ఒక భాషవారికి మాత్రమే పరిమితం. ఎక్కువ బడ్జెట్ పెట్టి రూపొందించడం కష్టం. అలా చేసినా ఒక భాషా ప్రేక్షకులకు పరిమితం కనుక పెట్టుబడి రాకపోవచ్చన్న భయం కూడా దర్శక నిర్మాతలను వెన్నాడింది.
ఏదేమైనా.. ప్రేక్షకుడిని తనవైపు తిప్పుకోవడంలో టాకీ ఎంత ప్రభావవంతంగా తన మాజిక్‌ని చూపించిందో, అంతకన్నా ఎక్కువగా మూకీలు కూడా వారిని ఆకట్టుకున్నాయి. ఆ కాలంలో టాకీలను చూడడానికన్నా మూకీలనే ఎక్కువగా ప్రేక్షకులు ఇష్టపడేవారట. కానీ కాలక్రమంలో టాకీలకు అలవాటుపడిపోయారు. కళ మాత్రం తన పంథాను మార్చుకుంది. సరికొత్త హంగులతో ప్రేక్షకుణ్ణి ఆకర్షిస్తూనే వుంది.
*చిత్రాలు.. 1921లో వచ్చిన సురేఖా హరణ్ చిత్రంలోని దృశ్యం
*మూకీ చిత్రాల స్టార్ హీరోయన్ సులోచన

-జి రాజేశ్వర రావు