మెయన్ ఫీచర్

ప్రకృతిని కాటేస్తున్న మైక్రో ఫైబర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా 90 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. ఇవిగాక చేపలు పట్టడానికి ఉపయోగించి, ఆ తర్వాత సముద్రంలో పారేసే ప్లాస్టిక్ వలలు ఏటా 6 లక్షల 40వేల టన్నుల వరకు ఉంటాయి. నౌకలలో ప్రయాణించేవారు పారవేసే ప్లాస్టిక్ వ్యర్థాలకు అంతే లేదు. ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తులు పూర్తి స్థాయలో ఆగని పక్షంలో- 2050 నాటికి సముద్రంలో మత్స్య సంపద కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయి! ప్లాస్టిక్ వ్యర్థాలతో పెరిగిపోతున్న సమస్యలను నివారించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు, ఇతర వస్తువులను ఉత్పత్తిచేయడం ఆపేయాలని పలుచోట్ల ఆందోళనలు మొదలయ్యాయి. సాగర తీరాలలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. హార్బర్లలో ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిలిపివేయాలని ఎంతోమంది కోరుతున్నారు.
ఇటీవలి కాలంలో మైక్రోప్లాస్టిక్ సమస్య పర్యావరణవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. పారిశ్రామిక వ్యర్థజలాలను శుద్ధిచేసేందుకు కొన్నిచోట్ల ఫిల్టర్లను ఉపయోగిస్తుంటారు. ఆ వ్యర్థజలాలలో ఉండే మైక్రో ప్లాస్టిక్ పదార్థాలు ఈ ఫిల్టర్లకు చిక్కవు. ఫిల్టర్లకు చిక్కకుండా జారిపోయిన మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు మురుగునీటితో పాటు సాగర జలాలలో కలుస్తాయి. దీంతో సాగర జీవాలతోపాటు, సముద్ర జలాలలో పెరిగే కొన్ని రకాల నాచు మొక్కల మనుగడ కూడా దెబ్బతింటోంది. ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించే ఫేస్‌వాష్ మొదలైన సౌందర్య సాధనాలలో ప్లాస్టిక్ మైక్రోబీడ్స్ (పూసల వంటి అతి సూక్ష్మ పదార్థాలు) వాడకాన్ని నిషేధిస్తూ 2015లో అమెరికా ‘మైక్రోబీడ్ ఫ్రీ వాటర్స్ యాక్ట్’ను రూపొందించింది. మైక్రో ప్లాస్టిక్‌కి సంబంధించి మరో జటిలమైన సమస్య ఉంది. ఈ సమస్య సముద్ర జలాలలోను, సాగర తీరాలలోను, మనం తినే ఆహారంలోను, తాగేనీటిలోను, పీల్చే గాలిలోను అతి సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్థాలు వ్యాపిస్తున్నాయి. వీటి ద్వారా అవి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్థాలను ‘‘మైక్రోఫైబర్లు’’గా వ్యవహరిస్తున్నారు.
ప్లాస్టిక్ మైక్రోఫైబర్ అంటే?
ప్లాస్టిక్ మైక్రోఫైబర్ అనేది కంటికి కనిపించని పీచులా ఉండే మైక్రో ప్లాస్టిక్ పదార్థం. ఇవి మన శరీరంలోని ఎర్ర రక్తకణాల కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. పూసలుగా ఉండే మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాల (మైక్రోబీడ్స్)కన్నా పీచులా ఉండే మైక్రో ఫైబర్ వ్యర్థాల వల్లే సాగర జీవాలకు ఎక్కువగా ముప్పు వాటిల్లుతోందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. మైక్రోబీడ్స్ కన్నా వీటి పరిమాణం కొంచెం పెద్దది కావడంతో ఇవి ఎక్కువ విషపూరితంగా ఉంటూ సాగర జీవాలకు ఎక్కువ చేటుచేస్తాయి. ప్లాస్టిక్ దారాలతో తయారైన సింథటిక్ వస్త్రాలు, ప్లాస్టిక్ టార్పాలిన్లు , కారు టైర్లు, సింథటిక్ తాళ్ళు, చేపలు పట్టడానికి ఉపయోగించే ప్లాస్టిక్ వలలు మొదలైనవన్నీ మైక్రోఫైబర్ ఉత్పత్తికారకాలు.
2011లో బ్రిటిష్ పర్యావరణవేత్త అయిన మార్క్ ఆంథోనీ బ్రౌనీ- ‘‘ఎక్యూములేషన్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్ ఆన్ షోర్ లైన్స్ వరల్డ్‌వైడ్: సోర్సెస్ అండ్ సిన్క్స్’’అన్న పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో సాగర తీరాలలోనూ, సముద్రం అట్టడుగున ఉండే మడ్డిలో కలిసిపోయిన చాలా సూక్ష్మ పరిమాణంలో ఉండే కృత్రిమ పీచు పదార్థాల గురించి వివరించారు. పారిశ్రామిక వ్యర్థజలాలను సముద్రంలో కలిపేసే ప్రదేశాల్లో ఈ మైక్రోఫైబర్ పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో అధిక శాతం వాషింగ్ మెషిన్లలో బట్టలు ఉతికి విడిచిపెట్టడం ద్వారా వచ్చినవే. ఇలా వచ్చిన వాటిలో 1900 రకాల మైక్రో ఫైబర్ పదార్థాలను నిపుణులు గుర్తించారు. ఆమ్స్టర్‌డామ్‌లోని వి.యు యూనివర్సిటీ వారు 2012లో ఒక అధ్యయనం నిర్వహించారు. వారి అధ్యయనంలో వెల్లడిచేస్తున్న విషయాలు ఇలా ఉన్నాయి: ‘బట్టలు ఉతకడంతో వస్తున్న మురికినీటి ద్వారా ఒక్క ఐరోపాలోనే సెకనుకు రెండువేల కోట్ల సింథటిక్ మైక్రోఫైబర్ వ్యర్థాలు అక్కడి నదులు, ఇతర జలవనరులలో కలుస్తున్నాయి.’’
యూసీ శాంతాబార్బారా అనే పరిశోధన సంస్థ అమెరికాలోని పెటగోనియా ఇన్‌కార్పోరేషన్ అనే వస్తప్రరిశ్రమతో కలసి 2016లో నిర్వహించిన అధ్యయనంలో ఒక ఉన్ని కోటును ఒకసారి ఉతకడంవల్ల రెండు లక్షల యాభై వేల మైక్రోఫైబర్ వ్యర్థాలు విడుదలవుతాయని తేలింది. ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రంలోనే పారిశ్రామిక వ్యర్థజలాలను శుద్ధిచేసే వడపోతకు దొరక్కుండా వేల కోట్ల మైక్రోఫైబర్ వ్యర్థాలు జారిపోతున్నాయని పరిశోధనలో తేలింది. మార్క్ బ్రౌనీ సిడ్నీలోని స్కూల్ ఆఫ్ బయలాజికల్, ఎర్త్ అండ్ ఎన్విరానె్మంటల్ సైనె్సస్‌లో సీనియర్ రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. ఆయన మరికొందరితో కలసి ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాలలో 18 సముద్ర తీరాలనుండి ఇసుక నమూనాలను సేకరించి పరీక్షలు జరిపారు. వారి పరీక్షల్లో తేలిందేమిటంటే ప్రతి సముద్ర తీరం నుండి సేకరించిన ఇసుక నమూనాలలో 80 శాతం పాలిస్టర్, అక్రిలిక్ వస్త్రాలను శుభ్రం చేయగా వదిలిన వ్యర్థాలే ఉన్నాయి. వీరి పరీక్షలలో వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి: ‘‘జనావాసాలు ఉన్న సముద్ర తీరాలలో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా పేరుకుంటున్నాయి. ఇవి వివిధ పద్ధతుల్లో అక్కడ ఆ నివసించేవారి శరీరంలో ప్రవేశించి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మా పరిశోధనల్లో తేలిందేమిటంటే సింథటిక్ ఫైబర్ వస్త్రాలను శుభ్రం చేయడంవల్ల వెలువడిన మైక్రోఫైబర్ వ్యర్థాలే సముద్రం తీరాలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక సింథటిక్ ఫైబర్ వస్త్రాన్ని ఉతికితే 1900 కన్నా ఎక్కువ మైక్రో ఫైబర్ వ్యర్థాలు వెలువడుతాయి. సాగర తీర పట్టణాలలో జనాభా పెరుగుతున్నకొద్దీ అక్కడ మైక్రోఫైబర్ కాలుష్యం కూడా అధికమవుతోంది. జనాభా పెరగడంవల్ల వారికి అవసరమైన సింథటిక్ ఫైబర్ వస్త్రాలను తయారుచేసే పరిశ్రమలనుండి కూడా ఈ వ్యర్థాలు ఎక్కువగా వెలువడుతున్నాయి.’’
‘అసలు మెత్తటి పీచులా ఉండే ఫైబర్ వ్యర్థాలు లేని సాగర తీరాలు ప్రపంచంలో లేనే లేవు. ఎక్కడ చూసినా ఒక కప్పు ఇసుకలో కనీసం రెండు నుండి 31 వరకు సింథటిక్ ఫైబర్ వ్యర్థాలు ఉంటున్నాయి. ఎక్కువ జన సాంద్రత ఉన్న సాగర తీరాలలోనే కలుషితమైన ఇసుక తినె్నలను చూస్తున్నాం’అని సైన్స్ జర్నల్‌లో అక్టోబర్ 21, 2011న ప్రచురితమైన ‘లాండ్రీ లింట్ పోల్యూత్స్ ది వరల్డ్స్ ఒషన్స్’ అన్న వ్యాసం పేర్కొంటోంది.
అంతటా మైక్రోఫైబర్ వ్యర్థాలే!
సముద్ర తీరాలలోను, నదీ తీరాలలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా మైక్రో ఫైబర్ వ్యర్థాలు ఉన్నాయేమోనని పరిశోధకులు అధ్యయనం చేశారు. విస్తృత అధ్యయనంలో మైక్రోఫైబర్ వ్యర్థాలు ఎక్కువగా ఉన్న స్థానాలను గుర్తించారు. అవి:
1. కుళాయి నీళ్ళలో: 2017లో ఓర్బ్ మీడియాతో కలిసి బ్రిటన్‌కి చెందిన డాక్టర్ సామ్‌మేసన్ కుళాయి నీళ్ళలో ఉండే మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాల గురించి అంతర్జాతీయ అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐదు ఖండాల నుంచి 159 కుళాయి నీళ్ళ శాంపిళ్ళను సేకరించి విశే్లషించారు. 83 శాతం శాంపిళ్ళలో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలను గుర్తించగా వాటిలో 99.7 శాతం మైక్రో ఫైబర్ వ్యర్థాలే. ఒక్క అమెరికాలోనే 94 శాతం కుళాయి నీళ్ళు మైక్రో ఫైబర్ వ్యర్థాలను కలిగి ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని ప్రముఖ నగరాలలో ఎంత శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు కుళాయి నీళ్ళలో ఉన్నాయో వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
ప్రపంచంలో కొన్ని ప్రముఖ నగరాలలో కుళాయి నీళ్ళలో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు
నగరం/దేశం శాతం
బెర్లిన్ 94
ఐరోపా 72
జకార్తా 76
కంపాలా 81
అమెరికా 94
న్యూ ఢిల్లీ 82
క్వటో (ఈక్వెడార్) 75
2. బాటిల్ నీళ్లలో: 2017లోనే ఓర్బ్ మీడియాతో కలిసి డా.సామ్‌మేసన్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న మంచినీళ్ళ సీసాలలో ఉండే మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాల గురించి అధ్యయనం చేశారు. తొమ్మిది దేశాలలోని పంతొమ్మిది ప్రాంతాల నుండి 11 బ్రాండ్లకు చెందిన 259 వాటర్ బాటిల్స్ కొని పరిశోధనలు చేశారు. వీరు కొన్న వాటర్ బాటిళ్ళలో 93 శాతం మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. వీరి పరిశోధనలో తేలింది ఏమిటంటే సగటున లీటరు నీళ్ళలో 325 మైక్రో ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయి. వీటి పరిమాణం 6.5 మైక్రోమీటర్ల కన్నా ఎక్కువే. వీరు కొన్న వాటర్ బాటిళ్ళలో నెస్లే కంపెనీకి చెందిన సీసాలలో అత్యధికంగా లీటరుకు 10వేల వరకు మైక్రో ప్లాస్టిక్ పదార్థాలు గుర్తించారు.
అంతర్జాతీయ బ్రాండెడ్ కంపెనీల మినరల్ వాటర్ బాటిళ్లలో
సగటున ఒక లీటరు నీళ్ళలో గల మైక్రోఫైబర్ పదార్థాలు...

కంపెనీ బ్రాండ్ కనిష్ఠ గరిష్ఠ

అక్వా 0 4,713
అక్వాఫినా (పెప్సీ కో) 2 1,295
బిస్‌లరీ 0 5,230
దాసాని (కోకా కోలా) 2 335
ఇపురా 0 2,267
ఇవియన్(జెనీవా) 0 256
గెరోల్‌స్టీనర్(జర్మనీ) 9 5,160
మనీల్బా 0 863
నెస్లే ప్యూర్ లైఫ్ 6 10,390
సన్‌పెల్లీగ్రినో(ఇటలీ) 0 74
వాహాహా (చైనా) 1 731
3. గాలిలో: 2014లో ఫ్రాన్స్ బహిరంగ ప్రదేశాలలోను, గృహములు కార్యాలయములో మొదలైన భవనముల లోపల ఉండే గాలిలో మైక్రోఫైబర్ గురించి అధ్యయనం జరిగింది. అందులో తేలిందేమంటే- భవనాల లోపల సగటున ప్రతి ఘనపు మీటర్‌కి 3-15 మైక్రోఫైబర్ పదార్థాలు ఉన్నాయి. అదే బాహ్య ప్రదేశాలలో ప్రతి ఘనపు మీటర్‌కి 0.2-0.8 మైక్రో ఫైబర్ పదార్థాలున్నాయి. దీనినిబట్టి ఒక్క ఫ్రాన్స్ నగరంలో ప్రతిరోజు గాలిలో సగటున ఒక చదరపు మీటరుకు 29.280 మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు వ్యాపిస్తున్నాయని తేలింది. ఇక సుదూర ప్రాంతంలో గల ఫ్రెంచ్ పైరెనీస్ పర్వతాలలో అయితే ప్రతి చదరపు మీటరులో సగటున 365 మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకున్నాయట. మరి ఇక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కదా!
4. తినే ఉప్పులో : 2018లో మార్కెట్లో సరఫరా అవుతున్న వంట ఉప్పులో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాల గురించి ఇంచియాన్ నేషనల్ యూనివర్సిటీ (గ్రీన్ పీస్ ఈస్ట్ ఆసియా) వారు సంయుక్తంగా అధ్యయనం చేసి ఒక నివేదికను ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా 6 ఖండాలలోని 16 దేశాలకు చెందిన 39 బ్రాండెడ్ కంపెనీలు ఉత్పత్తిచేసిన వంట ఉప్పును సేకరించి పరీక్షలు జరిపారు. సగటున సముద్రపు ఉప్పులో ప్రతి కేజీలో 0-1674 వరకు, రాతి ఉప్పులో ప్రతి కేజీలో 0-148 వరకు, సరస్సుల నుండి ఉత్పత్తిచేసిన ఉప్పులో ప్రతి కేజీలో 28-468 వరకు మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని వీరి అధ్యయనంలో వెల్లడయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక బ్రాండెడ్ కంపెనీ ఉత్పత్తిచేస్తున్న సముద్రపు ఉప్పులో సగటున ప్రతి కేజీలో 13,629 మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని గుర్తించారట.
5. తేనెలో : 2013లో గెర్డ్, ఎలిజబెత్ లెయిబెజీట్ అనే ఇద్దరు రసాయన శాస్తవ్రేత్తలు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, మెక్సికోల నుండి సేకరించిన 19 తేనే శాంపిళ్ళను సేకరించి పరిశోధనలు చేసారు. వారి పరిశోధనలలో తేలిందేమిటంటే ఆ అన్ని తేనే శాంపిళ్ళలోనూ మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలను వారు గుర్తించారు.
6. సముద్రపు చేపలలో: కాలిఫోర్నియా చేపల మార్కెట్‌లో అమ్ముడయ్యే షెల్ ఫిష్, ఫిన్ షిప్ జాతి చేపలలో ఎక్కువ మోతాదులో మైక్రోఫైబర్ వ్యర్థాలు కనుగొన్నట్లు 2015 జరిపిన అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ చేపలను నేరుగా వండి విందులలో వడ్డిస్తారు. అలవాటుగా నిత్యం షెల్ ఫిష్ చేపలను తినేవారి శరీరంలో తెలియకుండానే ఏటా 11వేల మైక్రో ఫైబర్ వ్యర్థాలు చేరుతున్నాయని, ఈ చేపల ఒక్క కండరాన్ని తింటే 178 మైక్రో ఫైబర్ వ్యర్థాలు ఒంట్లోకి చేరతాయని అధ్యయనంలో వెల్లడయ్యింది. సముద్ర చేపలలో పేరుకుంటున్న వ్యర్థాలన్నీ మానవ కారకాలే. అవి తిరిగి మనుషుల ఒంట్లోకి చేరుతున్నాయి. కొద్ది నెలల క్రితం జరిపిన పరిశోధనలో తేలిందేమిటంటే కాలిఫోర్నియాలోని ‘మాంటరీబే’ వద్ద సముద్రపు అట్టడుగున ఉన్న చేపల గుడ్లలో కూడా మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని!
7. బీర్‌లలో : గెర్డ్, ఎలిజబెత్ లెయిబెజీట్‌లు 2014లో జర్మనీకి చెందిన 24 బ్రాండెడ్ బీర్‌లను పరీక్షించారు. వీరు సేకరించిన అన్ని బీర్‌లలోను మైక్రో ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయని నిర్ధారణ అయ్యింది.
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు...
ఎవరికీ తెలియకుండా, దొరక్కుండా సాగర జీవాల శరీరాలలోకి ప్రవేశిస్తున్న మైక్రో ప్లాస్టిక్, మైక్రోఫైబర్ వ్యర్థాలు ఎవరికీ తెలియకుండానే ఆ జీవాలని వండుకు తినే వారి కంచాలలోకి వచ్చి చేరుతున్నాయి. అంటే మన ద్వారా బయటకు వెలువడిన చెత్త తిరిగి మన పొట్టలోకే చేరుతోంది. దీనివల్ల మన శరీరానికి అందవలసిన పోషక పదార్థాలు తగినంతగా అందటం లేదు. మనం తినే ఆహారంలో పోషక విలువలు బాగా తగ్గిపోతున్నాయన్నమాట. మన శరీరాలలో చేరిన ఈ మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు మన దేహాన్ని విషపూరితం చేస్తున్నాయి. భూమిలో కాని, మరో విధంగా కాని ప్రకృతిలో కలిసిపోని రసాయనాలను ‘పెర్సిస్టెంట్ బయో ఎక్యూములేటివ్ అండ్ టాక్సిక్ కెమికల్’ (పీబీటీ) అని వ్యవహరిస్తారు. ఇవి చాలా విష పూరితమైనవి. మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలలో ఇవి 78 శాతం వరకు ఉంటాయి. మైక్రోప్లాస్టిక్ లేదా మైక్రోఫైబర్ వ్యర్థాలుగల సముద్ర జీవాలను తినడం వల్ల అవి మన రక్త నాళాలలోను, రక్తంలోనూ చేరి అలాగే ఉండిపోతాయి. ఇవి మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఊహించుకోవచ్చు.
మైక్రో ప్లాస్టిక్, మైక్రోఫైబర్ వ్యర్థాలవల్ల మన ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, అవి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల తీర ప్రాంత పర్యావరణాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యర్థాల వల్ల సముద్ర తీరాలలో ఉండే ఓయిస్టర్ అనే చేపల, సముద్ర తాబేళ్ళ పునరుత్పత్తి రేటు బాగా పడిపోయింది. ఈ ప్లాస్టిక్ చెత్త పేరుకున్న సముద్ర తీరంలోని ఇసుకలోను, సముద్రం అడుగున ఉండే మడ్డిలోను ఉష్ణోగ్రతలలో బాగా మార్పులు వస్తున్నాయి.
మన ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి కూడా ముప్పుగా పరిణమిస్తున్న మైక్రో ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారం ఉందా? అంటే ‘ఉంది’ అని జవాబు చెప్పవచ్చు. అది ప్లాస్టిక్ వినిమయాన్ని తగ్గించడమే! ఇది వినా వేరే మార్గం లేదు. ‘‘సాగర జలాలలోను, ఇతర జల వనరులలోను మన కంటికి కూడా కనపడకుండా మైక్రో ప్లాస్టిక్, మైక్రోఫైబర్ వ్యర్థాలు పేరుకుపోవడాన్ని నియంత్రించాలంటే మొట్టమొదట మనం చేయాల్సింది ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తిపైన, వినియోగంపైన నియంత్రణ విధించడం. ఇప్పటికే సముద్రం అట్టడుగున పెద్దమొత్తంలో ప్లాస్టిక్ చెత్త పేరుగుపోయింది. దీనిని తొలగించడం దాదాపు అసాధ్యం. కాని ప్లాస్టిక్ ఉత్పత్తులను, వినిమయాన్ని తగ్గించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జలాలలో చేరకుండా కొంతవరకు అడ్డుకట్ట వేయగలం’’ అని మోంటెరే బేఅక్వేరియంలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న కిలే వాన్ హౌస్టన్ అంటున్నారు.

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690