మెయిన్ ఫీచర్

సేవచేసే వారికి వేధింపులే బహుమతా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటికే ‘బోర్డింగ్’ మూసేసిన ఎయిర్ ఇం డియా విమానంలోకి ఓ ఎంపీని, ఆయన అనుచరులను అనుమతించనందుకు ఓ ఎయిర్ పోర్ట్ స్టేషన్ మేనేజర్‌ను బాహాటంగా చితక్కొట్టారు. తన పరువుకు భంగం కలిగిందని ఆ ఎంపీగారు ఆగ్రహించి స్టేషన్ మేనేజర్ చెంప మీద కొట్టడం ఇటీవల పెను దుమారాన్ని సృష్టించింది. చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న ఆ స్టేషన్ మేనేజర్ కన్నీంటి పర్యంతం కాగా, జరిగిన దాడికి క్షమాపణలు చెప్పేందుకు ఆ ప్రజాప్రతినిధి మాత్రం ‘ససేమిరా’ అన్నాడు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఆందోళనకు దిగడంతో చివరికి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సహోద్యోగులు, యాజమాన్యం బాసటగా నిలవడంతో స్టేషన్ మేనేజర్‌కు న్యాయం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో రాజకీయ నాయకుల ఒత్తిడి ఫలితంగా- సహోద్యోగుల మద్దతు లేకుంటే బాధితుడి హృదయ వేదన వర్ణణాతీతం.
***
ఓ ఉత్తరాది రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితం ఓ అమాత్యుడు జనం సాక్షిగా ఓ మహిళా పోలీస్ ఆఫీసర్‌పై చిందులు తొక్కాడు. సమావేశం నుంచి ఆ పోలీస్ అధికారిణి బయటకు వెళ్లనందుకు నిరసనగా మంత్రిగారు ఆమెపై దుర్భాషలాడుతూ అక్కడికి నిష్క్రమించి తన నిరసన తెలిపాడు. ‘గెట్ అవుట్’ అంటూ అమాత్యుడు కేకలు వేసినా, బాధ్యత గల అధికారిణిగా ఆమె అక్కడే ఉండిపోయారు. ఆమెకు సమాజంలోని వివిధ వర్గాల నుంచి సానుభూతి లభించినప్పటికీ ప్రభుత్వం మాత్రం మంత్రిగారి అభీష్టాన్ని నెరవేర్చింది. నిజాయితీపరురాలిగా పేరొందిన ఆమెను ఆకస్మికంగా వేరే చోటకు బదిలీ చేసింది.
***
పాలకులు పదవుల్లో ఉండేది కొన్ని సంవత్సరాలైనా, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పదవీ విరమణ చేసేంతవరకూ ప్రజాసేవ కోసం పరితపిస్తారు. ఆడ,మగ అనే తేడా లేకుండా ఉద్యోగులు రాజకీయ నాయకుల ఆగ్రహానికి గురవుతున్న సంఘటనలకు అంతేలేకుండా పోతోంది. నేతలు చెప్పే మాటలకు తలలూపని ఉద్యోగులకు మానసిక వేధింపులే కాదు, భౌతిక దాడులు సైతం తప్పవని పలు ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగినులకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఈ సమస్య ఓ వైపు ఆందోళన కలిగిస్తుండగా, లింగ భేదానికి అతీతంగా ఉద్యోగులపై రాజకీయ నాయకుల పెత్తనం, అసహనం నానాటికీ పెచ్చుమీరుతోంది. నిబంధనల్ని అతిక్రమించాలని, తాము చేసే అక్రమాలను ప్రశ్నించడానికి వీల్లేదని చాలామంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఉద్యోగులపై ఒత్తిడి తేవడం, దారికి రాకుంటే బెదిరించడం, దౌర్జన్యం చేయడం ఇపుడు పరిపాటిగా మారింది.
ఉద్యోగులు వేధింపులకు గురైతే ఆ ప్రభావం వారి పనితనాన్ని కచ్చితంగా దెబ్బతీస్తుంది. మానసిక ఒత్తిడి వల్ల వారి ఆరోగ్యం, మనోధైర్యం, ఆత్మవిశ్వాసం తగ్గుముఖం పడుతుంది. రాజకీయ నాయకులే కాదు, ఉన్నత స్థాయి అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో తమ కింది స్థాయి ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తుంటారు. పనిలో మంచి ఫలితాలను సాధించాలన్న అత్యుత్సాహంతో కొందరు అధికారులు కిందిస్థాయి ఉద్యోగులపై నోరు పారేసుకుంటారు. పనితీరును మెరుగుపర్చేందుకు, సత్ఫలితాలు సాధించేందుకు నియంత్రణ అవసరమే అయినప్పటికీ ఉద్యోగులను వేధించడం, వారిపై మితిమీరిన పెత్తనం చెలాయించడం సరికాదు. ఈ విపరిణామాల వల్లనే సేవ చేసేందుకు ఇష్టపడే ఉద్యోగులు మనోవ్యధకు గురవుతుంటారు.
చట్టాలున్నా ఏం లాభం?
పనిచేసే చోట ఉద్యోగినులపై లైంగిక వేధింపులను నివారించేందుకు 2013లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసినప్పటికీ దాని అమలులో మా త్రం ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. ఆ చట్టాన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ‘పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నివారణ (నియంత్రణ, పరిష్కారాలు) చట్టం- 2013’ ప్రకారం అన్ని కార్యాలయాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ కమిటీల్లో మహిళా ప్రతినిధులకు స్థానం కల్పించి, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. చట్టం అమలులోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ, దేశంలో మూడోవంతు కార్పొరేట్, బహుళజాతి సంస్థల కార్యాలయాల్లో కమిటీలను నియమించిన దాఖలాలు లేవని జాతీయ మహిళా కమిషన్ విమర్శిస్తోంది. ఉద్యోగినుల పట్ల లైంగిక వేధింపులకు సంబంధించి కార్యాలయాల్లో అంతర్గత కమిటీలే లేనపుడు చట్టం ఏ మేరకు అమలవుతుందన్నది ప్రశ్నార్థకమే.
రాజకీయాలదే పైచేయి..
ప్రజాసేవ చేయాలనుకునే ఉద్యోగులు రాజకీయ నేతల వల్లే కాదు, ఉన్నతాధికారుల వల్ల కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. తమకు నచ్చలేదన్న సాకుతో ఉద్యోగులను పదే పదే బదిలీలకు గురిచేయడం, ఆర్థిక ప్రయోజనాలు, పదోన్నతులు నిలిపివేయడం వంటివి నేడు సర్వసాధారణమైంది. అధికారుల వేధింపులతో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ నాయకుల మెప్పు కోసం పాకులాడే కొందరు అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి తమ కిందిస్థాయి ఉద్యోగులను వేధించేందుకు వెనుకాడడం లేదు. కొందరు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులొత్తడం ఆనవాయితీగా మారడంతో నిజాయితీగా పనిచేసే ఉద్యోగులు తగిన గుర్తింపునకు నోచుకోవడం లేదు. రాజకీయ నాయకులు ఎల్లకాలం తమను కాపాడతారన్న భ్రమల్లో కొందరు అధికారులు చేస్తున్న అక్రమాల ఫలితంగా కిందిస్థాయి ఉద్యోగులు వేధింపులను, అవస్థలను ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు తమను సతాయిస్తున్నందునే కొందరు అధికారులు కూడా తమ కింది స్థాయి సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. ఇక, విధి నిర్వహణకు సంబంధించిన నియమావళిని ఉద్యోగులకు వర్తింపజేస్తారే తప్ప ఉన్నతాధికారులకు ఎలాంటి నియామవళి వర్తించని పరిస్థితి కనిపిస్తోంది. ఉన్నతాధికారి దుర్భాష లాడినా, ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేసినా, కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా ఉద్యోగులు ధైర్యంగా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇటీవల బెంగళూరులో 57 ఏళ్ల ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నా, తెలంగాణలో ఓ పోలీసు అధికారి బలవన్మరణానికి పాల్పడినా- వృత్తిపరంగా వారు ఎదుర్కొన్న వేధింపులే కారణం. పనిచేసే చోట సౌకర్యాలు, వసతుల సంగతి ఎలా ఉన్నా లక్ష్యాలు సాధించాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తూనే ఉంటారు. ఉద్యోగులపై ఇతరులెవరైనా ఫిర్యాదులు చేస్తే ఏకపక్షంగా వ్యవహరిస్తూంటారు. మన దేశంలో ఏటా జరుగుతున్న ఆత్మహత్యల తీరును విశే్లషిస్తే- 18 శాతం బలవన్మరణాలకు పని ఒత్తిడే కారణమని తేలింది. ప్రతిభకు బదులు ‘స్వామిభక్తి’కే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. పౌర హక్కులను కాపాడినట్లే ఉద్యోగుల కనీస హక్కులను పరిరక్షించాలని రాజ్యాంగంలో నిర్దేశించినా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదన్నది నిజం. విధి నిర్వహణలో తప్పు చేస్తే ఉద్యోగులపై నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలే తప్ప వారిని వేధించే అధికారం తమకు లేదని ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలి. రాజ్యాంగంలోని 42వ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడికీ అన్ని హక్కులూ కల్పించాలి. ఉద్యోగి కూడా పౌరుడే కనుక ఈ నిబంధనలన్నీ అతడికీ వర్తిస్తాయి. మానసిక వేధింపులకు గురిచేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద నేరంగానే పరిగణించాలి. కాగా, తమకు హక్కులే కాదు.. బాధ్యతలూ ఉన్నాయన్న వాస్తవాన్ని ఉద్యోగులు కూడా గమనించాలి. నిజాయితీగా పనిచేసే వారికి సమాజంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని నిర్వహించినపుడు- తాత్కాలికంగా వేధింపులకు గురైనా అంతిమ విజయం తమదేనన్న భరోసా వారిలో కలుగుతుంది.

-సంజీవని కుసుమ్