మెయన్ ఫీచర్

ప్రాంతీయ పార్టీలకు పరీక్షా సమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రాంతీయ పార్టీలు ఎంతగా ‘మహా’ జోరు ప్రదర్శించాయో... ఎంతగా ఆకాశానికి నిచ్చెనలు వేశాయో..! అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదిగో మహా కూటమి అంటే.. అదిగో మరో కూటమి.. అంటూ ప్రాతీయ పార్టీల మహా నాయకులు మహా సందడి చేశారు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ సందడి మరీ ఎక్కువగా కనిపించింది. ఇటు నుంచి తెరాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ దిక్కునుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, మరోవైపు నుంచి మాయావతి ఎవరికి వారు ఎన్నికల అనంతరం కేద్రంలో ఏర్పడే సంకీర్ణంలో చక్రం తిప్పేది తామే అని తెగ సంబరపడి పోయారు. నిజానికి, చాలావరకు రాజకీయ విశే్లషకులు కూడా ఇంచుమించు అదే అభిప్రాయాన్ని వ్యక్తపరించారు. అయితే, రాజకీయ జ్యోతిషుల అంచనా తప్పింది. రాజకీయ పండితుల విశే్లషణలూ తప్పాయి. బీజేపీ సొంత బలం ఏకంగా 303కు చేరింది. మోదీ మళ్ళీ ప్రధాని కారాదని ‘ప్రార్ధనలు’ చేసిన కలల బేహారుల కలలు చెదిరిపోయాయి. మోదీ మళ్లీ ప్రధాని అయ్యారు. అది కూడా తిరుగులేని ఆధిక్యతతో.
సరే, అది అప్పటి మాట, ఇపుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, ప్రాతీయ పార్టీల పరిస్థితి అంతే అద్వానంగా ఉంది. దేశంలో ప్రతిపక్షం నిరాధారంగా దిక్కులు చూస్తోంది. ప్రతిపక్షం కనుమరుగై పోయే ప్రమాదకర పరిస్థితిలోకి జాతీయ రాజకీయాల ప్రస్థానం సాగుతున్నదా? అనే సందేహం బలపడుతోంది. బీజీపీని సంస్థాగతంగా ఎదుర్కొనే పార్టీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. బీజీపీ బలంగా ప్రజల్లోకి తీసుకుపోతున్న హిందూ జా తీయ వాదాన్ని సమర్ధంగా ఎదుర్కొనే మరో ప్రత్యాన్మాయ సిద్దాంతం ఏదీ ప్రతిపక్షాలు ప్రజల ముందుంచ లేకపోతున్నాయి. ఇంతకాలం, కాంగ్రెస్,కమ్యూనిస్టు పార్టీలు సహా వివిధ ప్రాంతీయ, కుటుంబ పార్టీలు బీజేపీని హిందూమతోన్మాద పార్టీగా ముద్ర వేసి, లౌకిక వాదం, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలతో పబ్బం గడుపుకున్నాయ. అయితే, మారిన జాతీయ రాజకీయ కథాకథనం (నేషనల్ పొలిటికల్ నెరటీవ్) కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యం లోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అడుగుజాడల్లో నడిచే నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలొ చ్చాయి.అయితే,ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాగత స్వరూప, స్వభావాలు తెలిసిన ఎవరికైనా, ఇలాంటి ఆలోచనే చాల చాలా అసంబద్ధంగా అనిపిస్తుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అనిపిస్తుంది.
ప్రస్తుత వాస్తవంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ కథ క్లైమాక్స్‌కు చేరింది. పత్రికలు, మీడియాలో వస్తున్న కథలు, కథనాలు, రాజకీయ విశే్లషణలు గమనిస్తే బీజేపీ లక్ష్యం (కాంగ్రెస్ ముక్త భారత్) ఇంకెంతో దూరంలో లేదోమో అనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ఆ పార్టీ మనుగడ రోజురోకుకూ దిగజరిపోతోంది. క్షణక్షణానికీ మసకబారి పోతోంది. ఎక్కడో ఒకటీ అరా రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వం పుణ్యాన కొంత బలంగా ఉన్నా, జాతీయ స్థాయిలో పార్టీ దినదినం దిగజారిపోతోంది. ఆ కారణంగా అంతో ఇంతో బలంగా ఉన్న రా ష్ట్రాలలోనూ, హస్తం పార్టీ ప్రత్యర్ధుల ముందు చేతులెత్తేసే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇందుకు తెలంగాఈలో కాంగ్రెస్ పరిస్థితే ప్రత్యక్ష నిదర్శనం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునాదులు ఎంతో కొంత బలంగానే ఉన్నాయి. ఓట్ల శాతం, సీట్ల సఖ్య ఎలా చూసినా, తెరాస తర్వాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీనే నిలిచింది. అయినా, అధికార తెరాసకు, ‘ప్రధాన ప్రత్యర్ధి’ బీజీపీతో పోటీలో నిలవలేక పోతోంది. మరో వంక జాతీయ నాయకత్వం అండదండలతో కమల దళం ‘తెరాస’కు ప్రధాన ప్రత్యర్ధిగా తెరపైకి దూసుకోస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మీద ప్రజలకే కాదు పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు విశ్వాసం సన్న గిల్లడంతో పార్టీ టిక్కెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు సైతం పార్టీని వదిలిపోతున్నారు. అందుకే, రాష్ట్రంలో తెరాసకు ప్రత్యాన్మాయం బీజేపీ అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. మరోవంక తెరాసలోని అసమ్మతులు (జితేందర్ రెడ్డి మొదలు వినోద్ వరకు) కూడా కమల దళం వైపు కదులుతున్నారే గానీ కాంగ్రెస్ వైపు కనె్నత్తి చూడడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎదిగొచ్చిన నాయకులే సొంత పార్టీని చులకన చేస్తున్నారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన తెలుగు దేశం పార్టీ నాయకులు హస్తానికి ‘హ్యాండి’చ్చి కమల దళంలో చేరి పోతున్నారు. ఒక విధంగా చూస్తే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోందని కాంగ్రెస్ నాయకులే నిరాశకు లోనవుతున్నారు.
అన్నిటినీ మించి తెదేపా నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి పార్టీలో ఏకుమేకై కూర్చున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా అనంతరం కొంత అణిగిమణిగి ఉన్న రేవంత్ రెడ్డి, లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి గెలవడంతో మళ్ళీ దూకుడు పెంచారు. పీసీసీ అధ్యక్ష పీఠంపై కనే్నశారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కుటుంబ సమేతంగా కలిసి, పీసీసి రేసులో తాను ఉన్నానన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అలా రేవంత్ రెడ్డి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి మధ్య వర్గ పోరు సాగుతోంది. పీసీసీ ‘కుర్సీ’ కొట్లాటకు తోడు’హుజూర్ నగర్’ ఉపఎన్నిక అభ్యర్ధి విషయంలో తలెత్తిన విబేధాలు ‘చినికి చినికి గాలివాన’గా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండ రెడ్డి తీవ్రంగా ఖండిచారు. మరవంక నల్గొండ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి హుజూర్ నగర్ ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డి జోక్యాన్ని తప్పు పట్టారు. ఉత్తమ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి అభ్యర్ధిత్వాన్ని సమర్ధించారు. మరో అడుగు ముందుకేసి జిల్లాలో కీలక నేతలు ఉత్తమ కుమార్ రెడ్డి, జానారెడ్డితో గతంలో ఉన్న విభేదాలు ఇప్పుడు లేవని తామంతా కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఈ పరిణామాలను గమనిస్తే, తెరాసలో ఏమో గానీ, కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త నాయకుల మధ్య మరో ‘సంకుల’ సమరానికి తెర లేచినట్లే కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి జోరుకు పగ్గాలు బిగించేందుకు పాత ‘రెడ్లం’తా ఒకటవుతున్నారు అన్న మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ‘కాంగ్రెస్ పార్టీలో పదువులు ఎప్పుడు వస్తాయో, ఎలా పోతాయో ఎవరికీ తెలియదు’ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆ పార్టీలో కొత్త కుంపట్లు రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలలో ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసం అనేది కనుమరుగై పోయింది. సార్వత్రిక ఎన్నికల క్రతువు పూర్తయి ఆరునెలలు కావస్తున్నా ఇంతవరకు పార్టీ కోలుకోలేదు, కనీసం ఎన్నికల ఫలితాలను సమీక్షిచుకుని, దిద్దుబాటు చర్యలు తీసుకునే ప్రయత్నం పూర్తి స్థాయిలో జరగలేదు. మరో వంక పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామాతో తలెత్తిన సంక్షోభానికి ఇంతవరకు ‘తాత్కాలిక ‘ పరిష్కారమే గానీ, శాశ్వత పరిష్కారం చిక్కలేదు. ఎన్నికల్లో ఓటమికంటే నాయకత్వ సంక్షోభం పార్టీ మనుగడను మరింత ప్రశ్నార్ధకం చేసింది. ఇప్పుడు పార్టీ అస్తిత్వ సమస్యను ఎదుర్కుంటోంది. సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు గానీ, ఆ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేక పోతున్నాయి.
నిజానికి కాంగ్రెస్ పార్టీతో పాటుగా జాతీయ స్థాయిలో సమర్ధవంతమైన ప్రతిపక్షం కనుమరుగై పోతోంది. జాతీయ పార్టీలుగా చెలామణి అవుతున్న వామపక్ష పార్టీలు దాదాపు కనుమరుగై పోయాయి. ప్రస్తుత లోక్ సభలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు నామమాత్రపు ప్రాతినిధ్యం మాత్రమే మిగిలింది. పెద్దన్న సిపిఎంకు ముచ్చటగా మూడు సీట్లు మిగిలితే, చిన్న తమ్ముడు సిపిఐకి రెండు సీట్లు మాత్రమే మిగిలాయి. మరోవంక సిపిఐ జాతీయ హోదాను కోల్పోయింది. జాతీయ హోదాను కోల్పోయిన మరో రెండు ‘జాతీయ’ పార్టీలు ఎన్సీపీ, బీఎస్పీలతో పాటుగా సిపిఐ- ఈ సారికి వదిలేయండి, వచ్చే ఎన్నికలనాటికి కష్టపడి జాతీయ హోదాకు అవసరమైన ‘పాస్’ మార్కులు తెచ్చుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘానికి మొర పెట్టుకున్నాయి. ఎన్నికల సంఘం కరుణిస్తే సరి, లేదంటే ‘కంకీకొడవలి’ (సిపిఐ ఎన్నికల చిహ్నం)కనుమరుగై పోతుంది. శరద పవార్ పార్టీ ఎన్సీపీ, మాయావతి పార్టీ బీఎస్పీ మెడపై కూడా కత్తి వేలాడుతోంది.
గత ఎన్నికల ముందు బీజేపీని, మోదీని ఓడించడం ఒక్కటే లక్ష్యంగా దూకుడు ప్రదర్శించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఆత్మరక్షణలో పడ్డారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణం మెడకు చుట్టుకోవడంతో, మోదీ, అమిత్ షాలతో సయోధ్య సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షాలను ప్రత్యేకంగా కలిశారు. అందుకు ఆమె చెప్పే కారణాలు ఏవైనా,సీబీఐ చిక్కుల్లోంచి బయట పడేందుకే ఢిల్లీ వెళారన్నది బహిరంగ రహస్యం. ఇక చంద్రబాబు విషయం అయితే చెప్పనే అక్కర లేదు. కేంద్రంలో చక్రం తిప్పే విషయం ఎలాఉన్నా రాష్టంలో అధికారం, ప్రతిష్ట అన్నీ పోయి, ఏ నిముషానికి ఏమి జరుగుతుందో అన్న భయంతో ఉన్నారు. కేంద్రంతో సయోధ్య కోసం తెర వెనక ప్రయత్నాలు సాగిస్తున్నారు.
నిజానికి కాంగ్రెస్ అస్తమయం కంటే ప్రతిపక్షం నిర్వీర్యం అవుతున్న తీరు మరింత ఆందోళన కలగచేస్తోంది. గతంలో ఎప్పుడూ కూడా ప్రతిపక్షం ఇంత బలహీనంగా ఉన్న సందర్భం లేదనే చెప్పాలి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ 404 సీట్లు గెలుచుకున్న సమయంలో లోక్‌సభలో ప్రతిపక్షం స్పేస్ కుదించుకు పోయింది. బీజీపీ కేవలం రెండు స్థానాలకు పరిమితం అయింది. 1952 నుంచి 1971 వరకు జరిగిన ఐదు లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగానే ఎనికలలో గెలుస్తూ వచ్చింది. 1952 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 489 స్థానాలకుగాను 364 సీట్లను గెలుచుకుంది. ప్రతిపక్షాలకు మిగిలింది ఒక వంతు స్థానాలు మాత్రమే. 1967 ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించింది. అప్పటి పరిస్థితికి, ప్రస్తుత పరిస్థ్తితికి చాలా తేడా ఉందనిపిస్తోంది. ఒక విధంగా చూస్తే, స్వాతంత్య్ర అనంతర దేశ రాజకీయాలు 360 డిగ్రీలు పయనించి, మళ్లీ మొదటికి వచ్చాయి. అయితే, అప్పటికీ ఇప్పటికీ ఒకటే తేడా, అప్పుడు జాతీయ వాదానికి చిరునామాగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఇప్పుడు బీజేపీ ఆక్రమించింది. మరో వంక స్వాతంత్రం తొలి నాళ్లలో ప్రత్యాన్మాయ రాజకీయ ప్రభావం చూపిన కమ్యూనిజం, సోషలిజం సిద్ధాంతాలకు కలం చెల్లింది.ఇప్పడు కావలసింది ప్రతిపక్షం మాత్రమే కాదు, ప్రత్యామ్నాయ సిద్ధాంతం కూడా.

-రాజనాల బాలకృష్ణ 99852 29722